ప్రకృతి శాస్త్రం

ప్రకృతి శాస్త్రం లేదా ప్రకృతి విజ్ఞాన శాస్త్రం అనే విజ్ఞానశాస్త్ర విభాగం పరిశీలనల ద్వారా, శాస్త్రీయమైన ఆధారాల ద్వారా ప్రకృతిలో సహజంగా జరిగే పరిణామాలను వివరించడానికి, అర్థం చేసుకోవడానికి, ముందుగా జరగబోయే వాటిని ఊహించడానికి ఉపకరించే శాస్త్రం. ఈ శాస్త్రంలో ఒకే విధమైన ఫలితాలు మళ్ళీ మళ్ళీ రాబట్టడం, ఇతర శాస్త్రవేత్తలతో ఫలితాలు సరిచూసుకోవడం ద్వారా ప్రగతిని ప్రామాణికంగా నిర్ధారిస్తారు.

ప్రకృతి శాస్త్రాన్ని జీవ శాస్త్రాలు, భౌతిక విజ్ఞాన శాస్త్రాలు అని రెండు ప్రధాన వర్గాలుగా విభజించవచ్చు. భౌతిక విజ్ఞాన శాస్త్రాలను ఇంకా భౌతిక శాస్త్రం, ఖగోళ శాస్త్రం, రసాయన శాస్త్రం, భూగోళ శాస్త్రాలుగా విభజించవచ్చు. వాటిని మళ్ళీ ఉపవిభాగాలుగా, ప్రత్యేక విభాగాలుగా విభజించుకుంటూ పోవచ్చు.

పాశ్చాత్య దేశాల్లో అనుసరించే విశ్లేషణాత్మక సాంప్రదాయంలో ప్రయోగ పూర్వకమైన శాస్త్రాలను వివరించడానికి సాంప్రదాయ శాస్త్రాల ఉపకరణాలైన గణిత సమీకరణాలు, తర్కం మొదలైనవి వాడుకుని ప్రకృతిని గురించిన సమాచారాన్ని శాస్త్ర నియమాల రూపంలో పొందుపరుస్తారు. సమాజ విజ్ఞాన శాస్త్రాలు కూడా ఇలాంటి పద్ధతులను అనుసరిస్తాయి కానీ అవి గుణాత్మక పరిశీలనా పద్ధతులను ఎక్కువగా ఉపయోగిస్తాయి కాబట్టి వాటిని సాఫ్ట్ సైన్సు అనవచ్చు. కానీ ప్రకృతి శాస్త్రాలు కొలవదగిన లేదా లెక్కించదగిన, పరీక్షించదగిన, శాస్త్రీయ పద్ధతుల్లో నిర్ధారించదగిన అంశాలను మాత్రమే పరిగణన లోకి తీసుకుంటాయి కాబట్టి వాటిని హార్డ్ సైన్సు అనవచ్చు.[1]

ఆధునిక ప్రకృతి శాస్త్రాలు చాలావరకు పురాతన గ్రీకు శాస్త్రవేత్తలు ప్రతిపాదించిన ప్రకృతి తత్వశాస్త్రాలను ఆధారంగా ఏర్పడ్డవే. గెలీలియో, డెకార్ట్, ఫ్రాన్సిస్ బేకాన్, న్యూటన్ లాంటి శాస్త్రవేత్తలు శాస్త్రపరిశోధనకు గణిత శాస్త్ర నియమాలు, ప్రయోగాలు లాంటి పద్ధతులు వాడటం ద్వారా ఎక్కువ ప్రయోజనాలున్నాయని వాదించారు. కానీ ఇప్పటికీ తత్వశాస్త్రానికి సంబంధించిన కొన్ని సూత్రాలు, పూర్వభావనలు కూడా శాస్త్ర పరిశోధనకు అవసరమవుతున్నాయి.[2] 16 వ శతాబ్దంలో ప్రకృతి చరిత్రలో భాగంగా ప్రారంభమైన జంతువుల, వృక్షాల, ఖనిజాల మొదలైన వాటి వర్గీకరణ నెమ్మదిగా డిస్కవరీ సైన్సు గా రూపుదిద్దుకుంది.[3]

సూచనలు

మార్చు
  1. Lagemaat 2006, p. 283.
  2. Hugh G Gauch Jr, Scientific Method in Practice (Cambridge: Cambridge University Press, 2003), pp 71–73.
  3. Oglivie 2008, pp. 1–2.

మూలాలు

మార్చు
  • Lagemaat, Richard van de (2006). Theory of Knowledge for the IB Diploma. Cambridge: Cambridge University Press. ISBN 978-0-521-54298-2.{{cite book}}: CS1 maint: ref duplicates default (link)
  • Oglivie, Brian W. (2008). The Science of Describing: Natural History in Renaissance Europe. Chicago: University of Chicago Press. ISBN 978-0-226-62088-6.{{cite book}}: CS1 maint: ref duplicates default (link)