ప్రదక్షిణం

(ప్రదక్షిణాలు నుండి దారిమార్పు చెందింది)

ప్రదక్షిణం లేదా పరిక్రమం అనే పదానికి అర్ధం తిరగడం. హిందువులు దేవాలయంలోని దేవుని చుట్టూ ప్రదక్షిణం చేస్తారు. దైవ ప్రదక్షిణములో మెల్లగా నడచుట, చేతులు జోడించుట, దేవుని ధ్యానించుట అనేవి ముఖ్యమైన భాగాలు. భగవదుపచారాల్లో ప్రదక్షిణ నమస్కారం చివరిది, పరిపూర్ణమైనది. ఏవైనా గ్రహాచారాలు బాగలేకపోయినా, అరిష్టాలేర్పడినా ఆలయాల్లో నియమిత సంఖ్యలతో ప్రదక్షిణ చేస్తే వాటి పరిహారం జరుగుతుందని హిందూ ధర్మ శాస్త్రాలు సూచిస్తాయి.

బోనాలు పండుగ సందర్భంగా ప్రదక్షిణం చేస్తున్న స్త్రీలు

పద్ధతులు

మార్చు

ఆలయాల్లో చేసే ప్రదక్షిణల్లో చాలా రకాలున్నాయి. మామూలుగా ధ్వజస్తంభం నుంచి ప్రారంభించి తిరిగి చివరకు ధ్వజస్తంభం వద్దకు చేరుకుని దైవానికి నమస్కరించడం ఒక ప్రదక్షిణ క్రమం. చండీశ్వరుడున్న శివాలయంలో ప్రదక్షిణ విధానం మరొక పద్ధతిలో ఉంటుంది. దానికి చండీ ప్రదక్షిణం అని పేరు. ఇంట్లో పూజల సందర్భంలో ఆత్మ ప్రదక్షిణ చేయాలి. గుడులలో ఆత్మ ప్రదక్షిణ చేయరాదు.[1]

ఆలయంలో ఉన్న దైవం విశ్వశక్తి కేంద్రబిందువునకు ప్రతీక. ఆయన చుట్టూ ఉన్న ఆలయం అనంత విశ్వానికి సంకేతం. ప్రపంచంలో జరిగే పరిణామాలే ప్రదక్షిణలు. జీవితం అంటే ఒక చుట్టు (ఆవృతం). జననం నుంచి మరణం వరకు ఈ విశ్వంలో మన జీవితమే ఒక ప్రదక్షిణ. ఇలా ఎన్నో జన్మల్లో సంపాదించుకున్న కర్మల ఫలితాన్నే ఈ జన్మలో అనుభవిస్తాం. ప్రదక్షిణ పేరుతో పరమాత్ముని చుట్టూ తిరగడం వలన జన్మల చుట్లలో చేసిన కర్మల దుష్ఫలితాలను తొలగిమ్చుకోగలం. అంతే కాదు. అత్యధిక ప్రదక్షిణలు చేయడం వలన రానున్న జన్మల చుట్లను కూడా అధిగమించవచ్చు. కర్మక్షయమే ప్రదక్షిణలో పరమార్థం. మన మనోవాక్కాయ కర్మలు పరమేశ్వరుని చుట్టూ పరిభ్రమించాలన్నదే ప్రదక్షిణ లోని ప్రధానోద్దేశ్యం.

ప్రదక్షిణంలో రకాలు

మార్చు
 
స్థూపం చుట్టూ ప్రదక్షిణం చేస్తున్న గ్రీకులు (రేఖా చిత్రం)
  • ఆత్మ ప్రదక్షిణం: తనచుట్టూ తానే చేసుకొనే ప్రదక్షిణం.
  • పాద ప్రదక్షిణం: పాదములతో నడుస్తూ ఆచరించే ప్రదక్షిణం.
  • దండ ప్రదక్షిణం: అవ్యగ్ర చిత్తములో దండ ప్రణామాలు చేస్తూ ఆచరించే ప్రదక్షిణం.
  • అంగ ప్రదక్షిణం: సాత్వికావయవాలు నేలకు తగిలేటట్లుగా దొర్లుకుంటూ చేసే ప్రదక్షిణం.
  • గిరి ప్రదక్షిణం: దేవుడు కొలువుండే కొండ చుట్టు చేసే ప్రదక్షిణం.

ఇస్లాంలో ప్రదక్షిణాలు

మార్చు
 
కాబా చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న ముస్లిం సమూహం.
  • హజ్ యాత్రికులు కాబా చుట్టూ ఏడు సార్లు ప్రదక్షిణాలు లేదా తవాఫ్ చేస్తారు.

పురాణ కథ

మార్చు

"విశ్వమంతా తిరిగి శీఘ్రంగా ప్రదక్షిణ చేసి వచ్చిన వానికే గణాధిపత్యం" అని పార్వతీ పరమేశ్వరులు షరతు విధించినపుడు కుమారస్వామి మయూర వాహనంపైనెక్కి విశ్వాన్ని చుట్టి రావడానికి బయలు దేరాడు. మూషిక వాహనుడైన మహాగణపతి అలా వెళ్ళలేకపోయాడు. కానీ, తెలివిగా పార్వతీ పరమేశ్వరుల చుట్టూ ప్రదక్షిణ చేశాడు. చిత్రంగా సుబ్రహ్మణ్యుడు వెళ్ళిన ప్రతి చోటా అంతకు మునుపే గణపతి వచ్చి వెళ్ళిన జాడలు కనిపించాయి. ముందుగా విశ్వాన్ని చుట్టి వచ్చిన వాడు వినాయకుడేనని నిర్ణయించి- శివుడు, ఇతర దేవతలు అతనికే గణాధిపత్యాన్ని ఇచ్చారు. కుమారస్వామి అలకను తీర్చి పార్వతీ పరమేశ్వరులు బుజ్జగించారు.

అయితే ఈ కథలో కుమారస్వామి, గణపతి లలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాదు. ఉన్నచోటనే ఈశ్వరుని ఆవిష్కరించుకోవాలన్నది గణపతి చాటిన సందేశం. అన్ని చోట్లా ఈశ్వరుని సందర్శించాలన్నది సుబ్రహ్మణ్యుని బోధ.

దైవ ప్రదక్షిణం వలెనే అశ్వత్థ ప్రదక్షిణం, భూప్రదక్షిణం, కులశైల ప్రదక్షిణములు ఒక దాని కంటే ఒకటి దశోత్తరతమమైన ఫలితాన్నిస్తాయి. అలాగే తండ్రికి, గురువుకు, తల్లికి చేసిన ప్రదక్షిణలు ఒకదాని కంటే ఒకటి పది రెట్లు ఫలాన్నిస్తాయి. ఉదయము, సాయంకాలము వేళల్లో సూర్య ప్రదక్షిణము సర్వసిద్ధిప్రథమని చెప్పబడింది.

శ్రీ రమణ మహర్షి 'ప్రదక్షిణం' అన్న పదాన్ని విశ్లేషించారు. 'ప్ర' అనే అక్షరం సమస్త పాపాల వినాశనానికి సూచకం. 'ద' అంటే కోరికలన్నీ తీరడమని భావం. 'క్షి' అన్న వర్ణం రాబోయే జన్మల క్షయాన్ని సూచిస్తుంది. 'న' అంటే అజ్ఞానం నుండి విముక్తి ప్రాప్తి అని చెప్పారు.

గో ప్రదక్షిణ పురాణం

మార్చు

బ్రహ్మ అహల్యను అత్యంత సౌందర్యవతిగా సృష్టించాడు. దేవతలందరూ ఆమెను పరిణయమాడాలనుకున్న వారే. అప్పుడు బ్రహ్మ త్రిలోకాలను ఎవరైతే ముందుగా చుట్టి వస్తారో ఆమెను వివాహమాడడానికి అర్హులని ప్రకటిస్తాడు. ఇంద్రుడు తన శక్తులన్నింటినీ ఉపయోగించి ముల్లోకాలను తిరిగి వచ్చి అహల్యను ఇచ్చి వివాహం జరిపించమని బ్రహ్మను కోరుతాడు. అప్పుడు నారదుడు వచ్చి గౌతముడు ఇంద్రుడికంటే ముందుగా ముల్లోకాలను చుట్టి వచ్చాడని చెపుతాడు. గౌతముడు తన దైనందిన పూజలో భాగంగా గోవు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేశాడని. ఒకరోజు అలా ప్రదక్షిణ చేస్తుండా ఆవు లేగ దూడకు జన్మనిచ్చిందనీ, శాస్త్రాల ప్రకారం శిశువును ప్రసవిస్తున్న ఆవు ముల్లోకాలతో సమానమనీ అందుకే అతనికి ఆ ఫలితం దక్కిందనీ తెలియజేస్తాడు. కాబట్టి అహల్యను గౌతముడికే ఇచ్చి పెళ్ళి చేయమని చెపుతాడు.

మూలాలు

మార్చు
  1. సెప్టెంబర్ 6, ఆదివారం 2009 ఈనాడు దినపత్రిక సామవేదం షణ్ముఖ శర్మ రాసిన అంతర్యామి శీర్షికలో రాసిన ప్రదక్షిణలో పరమార్థం అనే వ్యాసం ఆధారంగా...

వెలుపలి లంకెలు

మార్చు