ప్రపంచ చరిత్ర అనేది మానవ మనుగడ మొదలు నేటి వరకు జరిగిన యథార్థాల అధ్యయనం. ఈ అధ్యయనం పురాతత్వశాస్త్రం, మానవ పరిణామ శాస్త్రం, జన్యుశాస్త్రం, భాషాశాస్త్రం, ఇతర సంబంధిత శాస్త్రాల ఆధారంగా జరుగుతుంది. చరిత్రలో మానవుడు వ్రాత పద్ధతిని కనిపెట్టిన మొదలు, గౌణ వనరుల ఆధారంగా, అధ్యయనాల ఆధారంగా, ప్రపంచ చరిత్రను నిర్వచించగలము.[1] మానవుడు వ్రాత విధానాన్ని కనిపెట్టక ముందు ప్రాక్ చరిత్ర తొలి రాతి యుగంతో మొదలై కొత్త రాతి యుగం (నియోలిథిక్, నియో - కొత్త, లిథిక్ - రాయి) వరకు జరిగింది. కొత్త రాతి యుగంలో క్రీ.పూ. 8000 నుండి క్రీ.పూ. 5000 మధ్య వ్యవసాయ విప్లవం మొదలయింది. వ్యవసాయం మానవ చరిత్రలో ఒక పెద్ద ఘట్టం. అప్పటి దాకా సంచారులై తిరుగుతున్న మనుషులు ఒక చోట స్థిరపడి పంట పండించుకొని తినడం మొదలుపెట్టారు. వ్యవసాయానికి పనికొచ్చే మొక్కలను, చెట్లను, జంతువులను మనిషి తనకనువుగా మచ్చిక చేసుకోవటం మొదలుపెట్టాడు. వ్యవసాయం మెరుగు అయ్యేకొద్ది మనిషి సంచారజీవితాన్ని వదిలేసి స్థిరనివాసాలను ఏర్పాటు చేసుకోవడం మొదలుపెట్టాడు. ఎక్కువ ప్రయాస లేకుండా ఆహారం అందుబాటులోకి రావటం, వ్యవసాయ మెరుగుదలతో పెరిగిన రాబడి వలన మనిషి స్థిర నివాసాలు విస్తరించాయి. రవాణా వ్యవస్థ వికాసం వలన మరింత మెరుగయ్యాయి.

ప్రపంచ జనాభా పెరుగుదల క్రీ.పూ. 10000 నుండి సా.శ. 2000 వరకు

ప్రాక్చరిత్రలో, చారిత్రక యుగంలో మనిషి స్థిర నివాసం తాగునీటి వసతి అందుబాటులో ఉన్న స్థానాలలోనే ఎప్పుడూ జరిగింది. క్రీ.పూ. 3000 సంవత్సరానికే నగరాలు నదీతీరాన వెలిసాయి. ఇవి మెసొపోటామియాలో, నైలు నది తీర ఈజిప్టులో, సింధునది లోయలో, చైనా దేశపు నదుల తీరాన వెలిసాయి. వ్యవసాయం మరింత మెరుగయ్యాక ధాన్యపు సాగులో మెళకువలు వచ్చాయి. ధాన్యాన్ని నిల్వ ఉంచేందుకు కాయకష్టం వ్యవసాయం ధాన్యాగారాల మధ్య విభజించబడింది. ధాన్యాగారాల వద్ద పని చేసే కూలీల తరగతి ఒకటి ఏర్పడటంతో నాటి సమాజంలో ధనికులకూ ఒక వర్గం ఏర్పడింది. నగరాలు కూడా ఈ విధంగా అభివృద్ధిలోకి వచ్చాయి. ఇలా విపరీతంగా పెరుగుతున్న మానవ సమాజంలో ధనవ్యయసంపాదనలను లెక్కించడానికి వ్రాత విధానం, లెక్కలపొద్దు విధానం అవసరమయ్యాయి.

నాగరికతలు పెరిగడంతో పాటుగా, ప్రాచీన చరిత్ర కాలంలో ఎన్నో రాజ్యాలు పతాక స్థాయికి చేరి పతనమయ్యాయి. మధ్య యుగాల ప్రపంచ చరిత్రలో మనకు క్రైస్తవం, ఇస్లాం, మతాల పుట్టుక వ్యాప్తి కనిపిస్తాయి. సా.శ. 13వ శతాబ్దికి ఇటలీ మొదలు పునరుజ్జీవన విప్లవం ఐరోపాలో కనిపిస్తుంది. తొలి ఆధునిక యుగం, యురోపియన్ యుగంలో ఖండాల కనుగోలు, ముద్రణ, ఆధునిక యంత్రాలకు నాంది వేసిన మరెన్నో తొలినాటి యంత్రాల రూపకల్పన మనకు కనిపిస్తాయి. ఇవే విజ్ఞాన క్రాంతికి బీజాలు వేసాయి. తరువాతి కాలంలో పద్దెనిమదవ శతాబ్దానికి విజ్ఞానం, సాంకేతికశాస్త్రం మరింత అభివృద్ధిచెంది సమాచార ప్రసరణ అంతకు ముందు తెలీనంత వేగంగా జరగ సాగింది. మలి ఆధునిక యుగం పద్దెనిమదవ శతాబ్ది ఆఖరు నుండి ప్రస్తుతం వరకు అని నిర్ధారించబడింది.

ప్రాక్చరిత్ర

మార్చు

తొలి మానవుడు

మార్చు

జన్యుపరంగా చేసిన కొన్ని పరిశోధనల ప్రకారం మనిషి కోతి జాతి నుండి వచ్చాడు. మనిషికి అతి దగ్గర బంధువులు చింపాన్జీలు, బొనొబోలు. మనుషులకు, ఈ చింపాంజీలకు ఒకే తలిదండ్రులు 46 నుండి 62 లక్షల సంవత్సరాల పూర్వం భూమిపై మనుగడలో ఉండి ఉండవచ్చు. మానవ శరీర ఆకృతి-అవయవాలతో నేటి మనిషి దాదాపు 2 లక్షల సంవత్సరాల క్రితం అఫ్రికాలో పుట్టి ఉండవచ్చు.[2], బుద్ధి, కుశలత పరంగా 50,000 ఏళ్ళ కింద మనిషి అభివృద్ధి చెంది ఉండవచ్చు.[3]

 
భింబేట్కా గుహలలో ఆదిమానవుడి చిత్రాలు
 
"వీనస్", ఆస్ట్రియా, క్రీ.పూ. 26,500

ఆధునిక మనిషి ఆఫ్రికా నుండి 60,000 ఏళ్ళ క్రితం చాలా వేగంగా ఐరోపా ఆసియా ఖండాల్లోని మంచులేని ప్రాంతాలకు తరలి వచ్చారు.[4] గత మంచు యుగం ఆఖరున, ప్రస్తుత సమశీతోష్ణ ప్రాంతాలు బతకడానికి కష్టమైన వాతావరణంలో ఉన్నందువలన, ఆధునిక మనిషి ఉత్తర అమెరికా, పసిఫిక్ మహాసముద్ర ద్వీపాల్లోకి చేరాడు. మంచు యుగం ముగిసే నాటికి అనగా 12 వేల సంవత్సరాల క్రితం మనిషి దాదాపుగా మంచులేని భూభాగాన్నంత తన నివాస స్థావరంగా మార్చుకున్నాడు. హోమో ఎరక్టస్ లాంటి ఆధునిక మనిషికి దగ్గర పోలికలున్న జీవజాతులు రాతి-చెక్క పనిముట్లను వాడటం మొదలుపెట్టాయి, ఈ పనిముట్లు కాలక్రమంలో మరింత మెరుగయ్యాయి.

బహుశా 18 లక్షల సంవత్సరాలకు ముందు, కచ్చితంగా 5 లక్షల సంవత్సరాల క్రితం, మనిషి అగ్నిని వాడటం ద్వారా వేడిని పొందటం, ఆహారాన్ని ఉడికించటం మొదలుపెట్టాడు. ఇదే కాలంలో భాష కూడా ఉనికిని పొందింది. ఈ కాలంలో ఒక పద్ధతి ప్రకారం చనిపోయిన వారిని ఖననం చేయటం లాంటివి మొదలయ్యాయి. గుహాచిత్రాల రూపంలో, రాతి-ఏనుగుదంతం-వెముకలు ఇత్యాదులతో చేసిన బొమ్మలతో మనిషి అప్పుడపుడే దైవమనే అంశాన్ని తెలుసుకుని జంతువులకు దైవత్వాన్ని ఆపాదించడం మొదలుపెట్టాడని తెలుస్తోంది. ఈ కాలంలో మనుషులు వేటవృత్తిలో ఉంటూ సంచారులుగా ఉండేవారు. ఈ కాలపు మనుషులు దట్టమైన అడవుల్లో కాకుండా ఎత్తైన ప్రాంతాలలో, నీటికి దగ్గరగా జీవించారని తెలుస్తోంది.[5]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. ప్రపంచ చరిత్ర, కె.బి.వి.కె. ప్రసాద్, 1959 ప్రచురణ
  2. "హోమో సేపియన్స్". ది స్మిత్సోనియన్ ఇన్‌స్టిట్యూషన్స్ హ్యూమన్ ఆరిజిన్స్ ప్రోగ్రాం. స్మిత్సోనియన్ సంస్థ. 8 February 2016. Retrieved 21 May 2017.
  3. క్లీన్, రిచర్డ్ జి. (June 1995). "Anatomy, Behavior, and Modern Human Origins". జర్నల్ ఆఫ్ వల్డ్ ప్రూహిస్టరీ. 9 (2): 167–98. doi:10.1007/BF02221838.
  4. స్ట్రింగర్, C. (2012). "Evolution: What Makes a Modern Human". Nature. 485 (7396): 33–35. Bibcode:2012Natur.485...33S. doi:10.1038/485033a. PMID 22552077.
  5. Gavashelishvili, A.; Tarkhnishvili, D. (2016). "Biomes and human distribution during the last ice age". Global Ecology and Biogeography. 25 (5): 563–74. doi:10.1111/geb.12437.