ప్రబుద్ధాంధ్ర
ప్రబుద్ధాంధ్ర 20 వ శతాబ్దంలో రాజమహేంద్రవరం నుండి ప్రచురితమైన తెలుగు పత్రిక. తొలుత పక్ష పత్రికగా మొదలై రెండవ సంవత్సరం నుండి మాస పత్రికగా మారింది. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి ఈ పత్రిక స్థాపకుడూ, సంపాదకుడూనూ.
సంపాదకులు | శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి |
---|---|
వర్గాలు | సాహిత్యం, రాజకీయాలు |
తరచుదనం | మాస పత్రిక |
స్థాపించిన సంవత్సరం | 1921 |
ఆఖరి సంచిక | 1939 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
చరిత్ర
మార్చుప్రబుద్ధాంధ్ర పత్రికను శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి 1921 లో రాయవరం గ్రామం నుండి కళాభివర్ధనీ పరిషత్తు సంస్థ తరఫున ప్రచురించడం ప్రారంభించాడు. దానికి ఆయనే సంపాదకుడు. కళాభివర్ధినీ పరిషత్తు సంస్థ స్థాపకుడు కూడా ఆయనే. పత్రికను రాయవరం లోని శ్రీ మేరీ ముద్రణాలయంలో ముద్రించేవారు. దాని అధిపతి మల్లిడి సత్తిరెడ్డి రెడ్డిరాణి అనే పత్రికను ప్రచురించేవాడు. అయన ప్రబుద్ధాంధ్రకు కూడా సహాయం చేసాడు.[1] తొలుత పక్ష పత్రికగా మొదలైన ప్రబుద్ధాంధ్ర, ఒక సంవత్సరం తరువాత మాస పత్రికగా మారింది. 1924 నవంబరులో కళాభివర్ధినీ పరిషత్తు సంస్థతో పాటు పత్రిక ప్రచురణను కూడా రాజమహేంద్రవరానికి తరలించారు.
1925 వరకు వెలువడిన తరువాత, సుబ్రహ్మణ్యశాస్త్రి అనారోగ్య కారణాల వలన పత్రిక ప్రచురణ ఆగిపోయింది. అప్పట్లో పత్రికకు 3000 మంది చందాదారులుండేవారని పత్రిక ప్రకటించింది.[2] "ప్రబుద్ధాంధ్ర చందాదారుల సంఖ్య 2700. నేడు 'వినోదిని' తప్ప అంతమంది చందాదారులు గల మాస పత్రిక మరి యొకటి లేదు...” అంటూ 1934 ఫిబ్రవరి ఆంధ్రభూమి సంచికలో ప్రకటించారు.[3]
మళ్ళీ 1934 లో రాజమహేంద్రవరం నుండి ప్రచురణ మొదలైంది.[4] మళ్ళీ 1938 జూలైలో ఆగిపోయి, 1939 ఫిబ్రవరిలో తిరిగి ప్రచురణ మొదలైంది.[5] రెండు సందర్భాల్లోనూ సరస్వతీ పవర్ ప్రెస్సుకు చెందిన అద్దేపల్లి లక్ష్మణస్వామి నాయుడు సహకరించాడని పత్రికలో ప్రకటించారు. సుమారు 1939 చివరిలో దీని ప్రచురణ ఆగిపోయింది.
రచనలు
మార్చుమొదట్లో తెలుగు సంస్కృత భాషల్లో రచనలు ఉండేవి. తరువాత తెలుగు రచనలను మాత్రమే వేసేవారు. పద్య గద్యాలు రెండూ ఉండేవి. కథలు, సాహితీ వ్యాసాలు ప్రధానంగా ఉండేవి. రాజకీయ వ్యాసాలు కూడా ఉండేవి. రచనలు వాడుకభాష లోనే ఉండేవి. శేషాద్రి రమణ కవులు, మల్లాది రామకృష్ణశాస్త్రి, చింతా దీక్షితులు, చిలుకూరి నారాయణరావు, టేకుమళ్ళ కామేశ్వరరావు, కొడవటిగంటి కుటుంబరావు వంటి ప్రసిద్ధుల రచనలను ప్రచురించేవారు.
ఆంధ వాఙ్మయానికీ ఆంధ్ర జాతీయతకూ, ఆంధ్రదేశానికీ, ఆంధ్రోద్యమానికీ, ఆంధ్రరాష్ట్రప్రయత్నాలకూ సంబంధించిన రచనలకు ప్రాముఖ్యతనిస్తాము అని పత్ర్రికలో ప్రకటించారు. ఆంధ్ర జాతీయతావాదం పట్ల ప్రబుద్ధాంధ్రకు ప్రత్యేక శ్రద్ధ ఉండేది. కాంగ్రెసు సంస్థ కింద జాతీయోద్యమంలో పాల్గొనడం కంటే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం, తెలుగు భాష, ఆంధ్రలో గ్రంథాలయోద్యమం వంటి ముఖ్యమని పత్రిక భావించేది. రచనలు కూడా అందుకనుగుణంగానే ఉండేవి.
స్వాతంత్ర్యోద్యమ కాలంలో ప్రసిద్ధి గాంచిన గాంధీ, హిందీ, ఖద్దరు - ఈ మూడింటికీ వ్యతిరేకిస్తూ పత్రికలో వ్యాసాలు వచ్చేవి.[6] వ్యాఖ్యానములు అనే శీర్షిక కింద రాజకీయ వ్యాసాలను ప్రచురించేవారు. పత్రికలు-గ్రంథములు అనే శీర్షికన అప్పట్లో ప్రచురితమైన పత్రికలు, పుస్తకాలను సమీక్షించేవారు.
1934 లో పత్రిక ప్రచురణను మళ్ళీ మొదలుపెట్టినపుడు, ఇకపై పత్రికలో పద్యాలను ప్రచురించమనీ, వచన రచనలనే ప్రచురిస్తామనీ ప్రకటిస్తూ, పత్రికలకు పద్యాలను పంపవద్దు అని రచయితలను కోరారు. దానిపై ఎక్కువమంది సానుకూలంగా స్పందించగా కొద్దిమంది వ్యతిరేకించారు. శేషాద్రి రమణ కవులలో ఒకరైన దూపాటి వేంకటరమణాచార్యులు పద్యాలను నిషేధించినందున "నా లేఖినికి నిరాశ కలిగింది" అని రాసాడు. చింతా దీక్షితులు, ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి మొదలైనవారు హర్షం వెలిబుచ్చారు. పద్యాలను ప్రచురించకపోవడంపై పురిపండా అప్పలస్వామి వివరణ కోరగా, "ప్రబుద్ధాంధ్రలో పద్యవ్యాసాలు ప్రకటించబడవు. ఎంచేతా? ప్రతీ భాషలోనూ అపారంగా వుండవలసిన వచన వాజ్మయం తెనుగులో బొత్తిగా లేదు. కనక దేశీయులకు ఈ-విషయంలో శ్రద్ధ వహించాలనే సంగతి స్ఫురించడానికి. ఇదీ మా వుద్దేశం" అని సమాధానం ప్రచురించారు.[3]
కొన్ని విశేషాలు
మార్చు- పత్రికను ప్రచురించే సంస్థయైన కళాభివర్ధనీ పరిషత్తు పేరును, కలాభివర్ధనీ పరిషత్తు అని రాసేవారు.
- పత్రికలో తెలుగు అంకెలే వాడేవారు.
- రెండవ ప్రపంచ యుద్ధం మొదలైనపుడు ప్రబుద్ధాంధ్ర, "మన ఆంధ్రుల శక్తిసామర్థ్యాలన్నీ ఈ తరుణంలో బ్రిటిషువారికి బాసటగా వున్నాయని జార్జి చక్రవర్తికి మేము విన్నవించుతూ ఉన్నాము. మేము జార్జి చక్రవర్తికి దిగ్విజయం కోరుతున్నాము" అని ప్రకటించింది.[7]
- రాజమహేంద్రవరం లోని అజంతా కంపెనీ తయారుచేసే దువ్వెనల గురించి రాస్తూ, "తల దువ్వుకొనే దువ్వెనలు ఖండాంతరాలనుంచే కాదు, ఇతర ప్రాంతాలనుంచి తెప్పించుకోడం కూడా మనకి సిగ్గుచేటు. ఇలాంటి చిన్న విషయాలు కూడా మనం మరిచిపోతే వాస్తవంగా మనకంటే ఆత్మ గౌరవహీనులు మరివొక రుండరు" అని రాసింది.[8]
మూలాలు
మార్చు- ↑ ప్రబుద్ధాంధ్ర. రాయవరం: కళాభివర్ధనీ పరిషత్తు. 1925. p. 1.
- ↑ శ్రీపాద, సుబ్రహ్మణ్యశాస్త్రి (1925). ప్రబుద్ధాంధ్ర. రాజమహేంద్రవరం: కళాభివర్ధనీ పరిషత్తు.
- ↑ 3.0 3.1 వేదగిరి, రాంబాబు (2012). తెలుగులో వార, మాస పత్రికలు. తెలుగు అకాడమి. p. 40.
- ↑ శ్రీపాద, సుబ్రహ్మణ్యశాస్త్రి (1934). ప్రబుద్ధాంధ్ర. రాజమహేంద్రవరం: కళాభివర్ధనీ పరిషత్తు. p. 1.
- ↑ శ్రీపాద, సుబ్రహ్మణ్యశాస్త్రి (1939). ప్రబుద్ధాంధ్ర. రాజమహేంద్రవరం: కళాభివర్ధనీ పరిషత్తు. p. 1.
- ↑ మధునాపంతుల, సత్యనారాయణ శాస్త్రి (1950). ఆంధ్ర రచయితలు-ప్రథమ భాగము (1806 - 1901). రాజమహేంద్రవరం: సరస్వతీ పవర్ ప్రెస్సు. pp. 517, 518.
- ↑ ప్రబుద్ధాంధ్ర. రాజమహేంద్రవరం: కళాభివర్ధనీ పరిషత్తు. 1939. p. 154.
- ↑ ప్రబుద్ధాంధ్ర. రాజమహేంద్రవరం: కళాభివర్ధనీ పరిషత్తు. 1934. p. 88.