ప్రేరణతో విజయం సాధ్యమే...

ప్రేరణ

మార్చు

ప్రేరణ..నిరాశలో వున్న వ్యక్తిని ఆశావాదపు అంచులదాకా తీసుకెళ్తుంది.అవరోధాల దారులు అధిగమింపజేస్తుంది.సమస్యల వంతెనలు సులువుగా దాటిస్తుంది. ఆత్మన్యూనతా భావాన్ని దూరం చేస్తుంది. ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. లక్ష్యం వైపు నడిపిస్తుంది.విజయాన్ని చేకూరుస్తుంది.అందుకే అవసరమైన చోట ప్రేరణ ప్రాధాన్యతను గుర్తించాలి. కొందరికి వ్యక్తిత్వ వికాస గ్రంథాలు ప్రేరణనిస్తాయి.కొందరికి మహానీయుల జీవిత చరిత్రలు ప్రేరణనిస్తాయి. ఇలా ఏదో ఒక అంశం,ఏదో ఒక పుస్తకం ప్రేరణనిచ్చేదిగా ఉంటుంది. ఆ ప్రేరణే వ్యక్తిని తీర్చిదిద్దుతుంది.

ఆలోచన

మార్చు

ఒక పుస్తకం చదివి వదిలేస్తే,ఫలితం ఉండదు. అందులో మనల్ని ప్రేరేపించే విషయమేదైనా వుందేమో ఒకసారి ఆలోచిస్తే...దానివల్ల ఓ కొత్త ఆలోచన రావచ్చు. కొత్త అవకాశం లభించవచ్చు. సరికొత్త ప్రణాళిక రూపొందవచ్చు. ఒక సినిమా చూస్తారు,కాసేపు రిలాక్సవడానికి మాత్రమే అనుకుంటే... సరిపోదు. అక్కడ మనకు ప్రేరణనిచ్చే సన్నివేశమో, సందర్భమో ఉండవచ్చు. దాన్నిబట్టి ఆలోచిస్తే ఇంకెన్నో ఆలోచనలు తట్టవచ్చు. కాబట్టి మనం ఆ దిశలో ఆలోచించగలగాలి. ఒకరి విజయాన్ని చూసి అసూయ చెందితే,అది బలహీనతగా మారుతుంది. ఒకరి విజయాన్ని చూసి ప్రేరణ పొందితే,అది ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. అందుకే ప్రేరణ పొందే ఏ సందర్భాన్నీ వదులుకోకూడదు. ఆ పని నా వల్ల ఎక్కడవుతుంది. వాళ్ల స్థాయి నాకెక్కడ ఉంది అంటూ ఎవరికి వారు తమను తక్కువగా భావించుకుంటే,తక్కువగా అంచనా వేసుకుంటే ఫలితమూ అలాగే వుంటుంది. ఈ విధమైన ఆత్మన్యూనతా భావం చాలా ప్రమాదం. దానిని వదిలించుకోకపోతే పురోగతి సంగతేమోగానీ తిరోగమనం వైపు నడిచినట్లే. అందుకే తక్షణమే ఆత్మన్యూనతా భావాన్ని వదిలించు కోవడానికి ప్రయత్నించాలి. కొద్దిపాటి పట్టుదల ఉంటే ఇది సాధ్యమే.

వ్యక్తిత్వం

మార్చు

మరొకరిని చూసి స్ఫూర్తినీ, ప్రేరణనూ పొందాలే తప్ప వారిలా చేయలేకపోతున్నామనే ఆందోళన ఎప్పుడూ ఉండకూడదు. ఏ ఇద్దరి వ్యక్తిత్వాలూ, వ్యవహరశైలీ ఒకేలా ఉండవు. క్రికెట్‌ జట్టు మొత్తం టెండూల్కర్‌లానే ఆడదు. ఒక ధోనీ ఉంటాడు. మరో పఠాన్‌ ఉంటాడు. ఇంకెవరో ఉంటారు. ఎవరి శైలి వారిది. ఎవరి స్టయిల్‌ వారిది.ఏదైనా సాధించాలనుకున్నప్పుడు నిజాయితీగా ప్రయత్నించాలి. అప్పుడు విఫలమైనా సరే... మిమ్మల్ని మీరు తప్పుపట్టుకోవాల్సిన అవసరం లేదు. పొరపాట్లను గమనించడం ముఖ్యమే కానీ... చేసిన వాటి గురించి పదేపదే ఆలోచిస్తూ కుంగిపోకూడదు. పొరపాట్లు దొర్లితే అది అవమానంగా భావించకూడదు. పనిలో పొరపాట్లు అత్యంత సహజం. మరోసారి అటువంటివి దొర్లకుండా జాగ్రత్తలు తీసుకుంటే,విజయం తప్పక సొంతమౌతుంది. పొరపాట్లనూ సానుకూల దృక్పథంలో ఆలోచించడం నేర్చుకోవాలి. ప్రముఖ శాస్త్రవేత్త థామస్‌ అల్వా ఎడిసన్‌ విద్యుత్‌ బల్బును ఆవిష్కరించే క్రమంలో ఎన్నోసార్లు ప్రయోగాలు చేసి విఫలమయ్యాయి. ఆ ఫలితం సాధించడానికి అన్ని దశలూ అవసరమయ్యాయి. అని అనుకున్నాడే తప్ప 'అన్నిసార్లు విఫలమయ్యానే' అని ఎన్నడూ కృంగిపోలేదు.

అనుకున్న ఉద్యోగం రాకపోయినా చింతించకూడదు. ఒక ఉద్యోగంలో ఎంపిక కాలేదంటే మీలో సామర్థ్యం లేదని మాత్రం కాదు. ఆ ఉద్యోగానికి మీరు సరిపోరని మాత్రమే అర్థం. మీ సామర్థ్యాలు మరో కొలువుకు సరిపోవచ్చు. ప్రముఖ హిందీ కథానాయకుడు అమితాబ్‌ బచ్చన్‌ తొలుత సైనికాధికారి ఉద్యోగానికి ప్రయత్నించారు. ఎంపిక కాలేదు. కానీ ఆయన ఆ తర్వాత చిత్రసీమలోకి అడుగుపెట్టి తిరుగులేని కథానాయకుడిగా ఎదిగారు.చుట్టూ సానుకూల వాతావరణం ఉండేలా చూసుకోవాలి. ప్రతికూలంగా ఆలోచించే వారుంటే ఆ ఆలోచనలు మీపై కూడా ప్రభావం చూపిస్తాయి. ప్రతి చిన్న విషయాన్నీ ప్రతికూల దృక్పథంలో ఆలోచించడం అలవాటవుతుంది... ప్రతి వ్యక్తిలోనూ బలాలూ, బలహీనతలూ ఉంటాయి. ఉన్న బలాలను ఎలా సమర్థంగా ఉపయోగించుకోవాలో ఆలోచించాలి. కానీ, బలహీనతల గురించి బాధపడుతూ కూర్చోకూడదు.

ఆత్మవిశ్వాసం

మార్చు

మీకున్న సామర్థ్యాలపై లోటుపాట్లపై అవగాహన లేకపోతే సన్నిహితులను అడిగి తెలుసుకోవడంలోనూ తప్పులేదు. ఒక్కోసారి అవతలివారికే మీ గురించి బాగా తెలుస్తుంటుంది. మీరు గమనించని, మీలోని బలాలను వారు గుర్తు చేస్తే మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.నలుగురితో కలుపుగోలుగా ఉండడం అలవర్చుకుంటే అదే ఆత్మన్యూనతా భావానికి మంచి విరుగుడు. అవతలి వారికి అవసరమైన విషయాల్లో సాయం అందించడం వల్ల సంబంధాలు మెరుగవుతాయి. దీంతో మీకు అవసరమైనప్పుడు వెన్నుదన్నుగా నిలవడానికి ముందుకొచ్చేవారూ ఉంటారు.ఉద్యోగం వేరు, నచ్చిన పని వేరు వ్యక్తిగతంగా చాలా ఆసక్తులుండొచ్చు. వాటికి దూరమవడం వల్ల కూడా ఉద్యోగ జీవితంపై ప్రభావం పడుతుంది. నచ్చిన పనికి కొంత సమయం కేటాయించుకోవడం వల్ల ఉత్సాహం మళ్లీ మీ సొంతమవుతుంది. ఏదైనా సాధించగలరన్న ప్రేరణ కలుగుతుంది. ప్రవర్తనలో, మాటలో, హావభావాల్లో, అవకాశాల్లో ఎక్కడైనా సరే ఏదో ఒక ప్రేరణాంశం ఉంటుంది. అది గుర్తిస్తేనే విజయం సాధ్యమౌతుంది.