ఫోలిక్ ఆమ్లం (Folic acid) విటమిన్ బి కాంప్లెక్స్ లో ఒకటైన విటమిన్ బి9. మానవుని పెరుగుదలకు, రక్తకణాల ఉత్పత్తికి ఇది అవసరం. దీనిలోపంవల్ల మానవులలో స్ప్రూ, రక్తహీనత అనేవి సంభవిస్తాయి. కాలేయం, తాజా ఆకుకూరలు మొదలైన వాటిలో ఈ విటమిన్ లభిస్తుంది.

ఫోలిక్ ఆసిడ్ బంతి పుల్లల నమూనా

గర్భిణీ స్త్రీలలో ఈ విటమిన్ లోపం వలన పుట్టే పిల్లలలో గ్రహణం మొర్రి అనే అంగ వైకల్యం కలుగుతుందని గుర్తించారు.

Vitamin B9-folic acid , విటమిన్ B9 (ఫోలిక్ ఆమ్లం)

మార్చు

విటమిన్ B9 (ఫోలిక్ ఆమ్లం)--

అమ్మకే కాదు... అందరికీ! 'బి' కాంప్లెక్స్‌ విటమిన్ల సమూహానికి చెందిన ఫోలిక్‌ యాసిడ్‌ మహిళలకు జీవితంలోని ప్రతి దశలో అవసరమే. రక్త హీనతను తగ్గించడానికి ఇనుము అవసరం. ఎముక పుష్టికి క్యాల్షియం కావాలి. మరి పుట్టినప్పటి నుంచి ఎదిగే ప్రతి దశలో కణ నిర్మాణానికీ, ఎర్ర రక్తకణాల తయారీకి ఏ పోషకం అవసరం అంటే, అదే ఫోలిక్‌ యాసిడ్‌. ఇది శరీరంలో తనంతట తానుగా తయారవదు. మాత్రల రూపంలో తీసుకోవాలి. లేదంటే ఫొలేట్‌ కారకాలున్న ఆహార పదార్థాలను తినడం ద్వారా పొందాల్సిందే. నెలసరులు రావడం, గర్భం దాల్చడం, ఓ బిడ్డకు జన్మనివ్వడం, పిల్లలకు పాలివ్వడం... వంటి మార్పులు చోటుచేసుకునే సమయంలో శక్తి సన్నగిల్లకుండా చూడటంలో, ఉదర సంబంధ కణ నిర్మాణంలో ఫొలేట్‌ ఉపయోగపడుతుంది. వెన్నెముక దృఢంగా మారి, ఏ సమస్యలు రాకుండా ఉండటానికీ ఎంతగానో తోడ్పడుతుంది. పిల్లల్లో ఫోలిక్‌ లోపం ఉంటే రక్తహీనత సమస్య బాధిస్తుంది. శారీరక ఎదుగుదల మందగిస్తుంది. దీనినే 'మెగాలో బ్లాస్టిక్‌ ఎనీమియా' అంటారు. నెలసరులు ఆరంభమయ్యాక, టీనేజీలో ఫోలిక్‌ యాసిడ్‌ శాతం తగ్గితే, అదలాగే కొనసాగి భవిష్యత్తులో గర్భధారణ సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువ. బాలింతలూ, ముప్ఫై ఏళ్లు దాటిన వాళ్లలో ఈ లోపం తలెత్తితే ఎముకలు గుల్లబారడం, గుండె జబ్బులూ, జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు ఏర్పడతాయి.

లోపము వలన కలిగే అనర్ధాలు :

మార్చు

రక్తహీనత, అతిసారము, తెల్ల రక్త కణాలు నష్ట పోవటము--ఫోలిక్‌ యాసిడ్‌ లోపం ఉన్నవాళ్లకు ఆకలి వేయదు. ముఖం పాలిపోయి, బరువు తగ్గిపోతుంటారు. త్వరగా అలసిపోవడం, బాగా నీరసంగా అనిపించడం, మగత వంటి లక్షణాలు కనిపిస్తాయి. పాసివ్‌ స్మోకింగ్‌ ప్రభావానికి లోనయ్యే మహిళల్లో కూడా ఫోలిక్‌ యాసిడ్‌ లోపం ఎక్కువగా ఉన్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.

తల్లికీ, బిడ్డకూ రక్షణ...

మార్చు

నెల తప్పిన శుభవార్త తెలిసినప్పటి నుంచీ ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రలని వాడమని డాక్టర్లు కచ్చితంగా చెబుతారు. చాలామంది వాడతారు. ఎందుకంటే? గర్భం ధరించిన తొలి రోజుల్లో గర్భస్థ శిశువు ఎదుగుదలలో కొన్ని కీలకమైన మార్పులు జరుగుతాయి. వెన్నెముక, నరాలు ఏర్పడే ఆ దశలో తగినంత ఫొలేట్‌ అందకపోతే వెన్నెముకకు సంబంధించిన 'న్యూరల్‌ ట్యూబ్‌ డిఫెక్ట్‌' వచ్చే ఆస్కారం ఉంది. అంటే బిడ్డ వెన్ను సరిగ్గా అభివృద్ధి చెందదన్న మాట. అంతేకాదు, పాపాయి డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏల రూపకల్పనలో... పిల్లల్లో 'ఆటిజం' వంటి సమస్యలు రాకుండా చూడటంలో ఫొలేట్‌లు ఎంతో కీలకం. అందుకే గర్భం ధరించాలన్న ఆలోచన వచ్చింది మొదలు ఫోలేట్‌ యాసిడ్‌ ఉన్న ఆహార పదార్థాలను ఎక్కువగా తినాలి. వైద్యుల సలహా ప్రకారం సప్లిమెంట్లు తీసుకోవాలి. తొలి పన్నెండు వారాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి. తగినంత ఫోలిక్‌ యాసిడ్‌ లేకపోతే నెలలు నిండకుండానే ప్రసవమయ్యే అవకాశముంది. కొన్నిసార్లు అవాంఛిత గర్భస్రావాలు జరగడానికీ ఆస్కారముంది. ఒకవేళ ఏ సమస్యల్లేకుండా ప్రసవమైనా పిల్లలు తగినంత బరువుతో పుట్టరు.

పెద్ద వయసు వారిలో వచ్చే సమస్యలనగానే మతిమరుపూ, కంటి చూపు తగ్గడం వంటివి గుర్తుకొస్తాయి. ఈ రెంటినీ అదుపు చేయడానికి ఫొలేట్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. వృద్ధాప్య లక్షణాలు త్వరగా దరిచేరవు. ముఖ్యంగా మహిళలని వేధించే సర్వైకల్‌ క్యాన్సర్‌ రాకుండా నియంత్రించడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. ఎముకలు గుల్లబారడం (ఆస్టియోపొరోసిస్‌), నిద్రలేమి, ఆరు పదులు దాటిన వారికి గుండె జబ్బులు రాకుండా ఉండేందుకు నిపుణులు ఇప్పుడు ఫోలిక్‌ మాత్రలు వాడమని సూచిస్తున్నారు.

పెళ్లయ్యాక మరింత శ్రద్ధగా: పురుషులతో పోలిస్తే మహిళలకిది ఎంతో అవసరమైన పోషకం. అందుకే పదకొండేళ్లు దాటిన అమ్మాయిలు పెళ్లయ్యేంత వరకూ రోజూ ఫొలేట్‌ ఉండే పదార్థాలను ఎక్కువగా తినాలి. ఇక పెళ్లయిన వారు, వీరినే పొటెన్షియల్‌ మదర్స్‌ అంటారు. గర్భం ధరించడానికి సిద్ధంగా ఉండే వీళ్లు సప్లిమెంట్లూ, ఆహార పదార్థాల రూపంలో 400 మైక్రో గ్రాముల వరకూ ఫొలేట్‌ తీసుకోవాలి. గర్భం ధరించిన తొలి పన్నెండు వారాల్లో 500 మైక్రో గ్రాములూ, పాలిచ్చే సమయంలో 300 మైక్రో గ్రాములు తీసుకోవాలి. గర్భిణులు తప్పించి, మిగిలిన వారంతా మాత్రల రూపంలో కాక నేరుగా ఆహార పదార్థాల నుంచి ఫొలేట్‌ కారకాలను పొందడం మంచిది.

ఏ పదార్ధాలలో దొరుకుతుంది?.

మార్చు

కాలేయము, మాంసము, గుడ్లు, పాలు, ఫలాలు, ధాన్యాలు, ఆకు కూరలు --- పాలకూరలో పుష్కలం: ముదురాకుపచ్చని ఆకు కూరలు ఫొలేట్‌కి పెట్టింది పేరు. ముఖ్యంగా పాలకూర గురించి చెప్పుకోవాలి. ఒక కప్పు పాలకూర నుంచి అత్యధికంగా 260 మైక్రో గ్రాములని పొందవచ్చు. పాలకూరతో పాటు తోటకూర, చుక్కకూరల్లోనూ ఈ విటమిన్‌ పుష్కలంగా ఉంటుంది. వీటిని మరీ ఎక్కువ మంట మీద వండితే అవి ఫోలేట్‌లని కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే కుక్కర్‌లో ఉడికించాలి. బీన్స్‌, చిక్కుడు జాతి గింజలూ, పప్పు ధాన్యాలూ ఫొలేట్‌ని ఎక్కువగా అందిస్తాయి. ఒక కప్పు బీన్స్‌ నుంచి 180 మైక్రో గ్రాముల ఫొలేట్‌ అందుతుంది. ఇది నీటిలో కరిగే 'బి' కాంప్లెక్స్‌ విటమిన్‌. చిక్కుడు వంటి గింజలని కూడా వేయించడం కాకుండా ఉడికించడం ద్వారా ఎక్కువ పోషకాలని పొందవచ్చు.

నారింజ రసం తాగితే: నిమ్మజాతి పండ్లలో సహజంగానే ఫొలేట్‌ పోషకాలు ఎక్కువ. అలాగే కప్పు నారింజ రసాన్ని తాగితే, ఒక రోజుకి అవసరమైన దానిలో ఐదో వంతు అందుతుంది. టొమాటో రసం నుంచీ పొందవచ్చు. మాంసాహారం తినేవారు లివర్‌ని తినడం వల్ల బి9 రూపంలో ఫోలిక్‌ యాసిడ్‌ లభిస్తుంది. బజారులో దొరికే హోల్‌వీట్‌ బ్రెడ్‌, వైట్‌ బ్రెడ్‌ తిన్నా మంచిదే.

బీట్‌రూట్‌తో ప్రయోజనాలు : వేయించి తినే పొద్దు తిరుగుడు విత్తనాల వల్ల బోలెడు ప్రయోజనాలున్నాయి. వీటి నుంచి రోజువారీ అవసరాలకు కావాల్సిన ఫోలిక్‌ యాసిడ్‌ అరవై శాతం దొరుకుతుంది. వేరుసెనగ పప్పు, పుట్ట గొడుగులూ, బొప్పాయీ, క్యారెట్‌, బీట్‌రూట్‌, పచ్చి బఠాణీ, చేపలూ, పాలూ, అన్నం, అరటిపండు, అనాస, మొక్కజొన్న, క్యాబేజీ టోఫులు కూడా ఫోలిక్‌ యాసిడ్‌ను అందించేవే. బంగాళాదుంపలూ, చిలగడదుంపలూ, గోధుమపిండితో చేసిన పదార్థాల నుంచి ఫొలేట్‌ని పొందవచ్చు.