ఫ్రాంజ్ కాఫ్కా
ఫ్రాంజ్ కాఫ్కా (3 జూలై 1883 – 3 జూన్ 1924) ఇరవయ్యవ శతాబ్దపు అత్యంత ప్రభావవంతమయిన జర్మనీ రచయిత. ఆయన పలు నవలలు, కథలు రాశారు. సాహిత్యం లోని అస్థిత్వవాద శైలి పై ఆయన రచనలు ప్రభావవంతమైనవి. తన జీవితాన్ని సంపూర్ణంగా సాహిత్యానికే వెచ్చించాడు కాఫ్కా. అతనికి సాహిత్య వ్యాసంగం పట్ల విపరీతమయిన వ్యామోహం ఉండేది. అతని సాహిత్యం ఇరవయ్యో శతాబ్దపు సందిగ్ధ మానవుని మనఃచైతన్యానికి ప్రాతినిధ్యం వహించగలిగింది. “డాంటే, షేక్‌స్పియర్, గెథెలకూ వారి వారి కాలాలకూ ఎలాంటి సంబంధం ఉందో, కాఫ్కాకూ మన కాలానికీ అలాంటి సంబంధమే ఉంది” అన్నాడు కవి డబ్ల్యూహెచ్ ఆడెన్. ఈ క్రింది మాటలు అతని సాహిత్య తృష్ణకు నిదర్శనంగా నిలుస్తాయి.
ఫ్రాంజ్ కాఫ్కా | |
---|---|
జననం | |
మరణం | 1924 జూన్ 3 | (వయసు 40)
పౌరసత్వం | ఆస్ట్రియా-హంగరీ, జెకోస్లోవేకియా[1][2] |
విద్యాసంస్థ | జర్మన్ చార్లెస్ ఫెర్డినాండ్ విశ్వవిద్యాలయం |
వృత్తి | నవలా రచయిత, కథా రచయిత, భీమా అధికారి |
గుర్తించదగిన సేవలు |
|
శైలి | ఆధునికవాదం |
తల్లిదండ్రులు | హెర్మన్ కాఫ్కా జూలీ కాఫ్కా (లూవీ) |
సంతకం | |
“నేను సాహిత్యం తప్ప మరేమీ కాను.”
“సాహిత్యం ద్వారానే జీవితాన్ని పట్టుకుని వేలాడుతున్నాను. దాన్ని కోల్పోతే అంతా కోల్పోయినట్టే.”
“రచన చావు కన్నా గాఢమైన నిద్రలాంటిది. శవాల్ని వాటి సమాధుల్లోంచి లాగనట్టే, రాత్రుళ్లు నన్నూ నా డెస్కు నుంచి లాగలేరు.”
“నేను సాహిత్యానికి కనపడని గొలుసుల ద్వారా కట్టివేయబడ్డాను, ఎవరన్నా దగ్గరకొస్తే నా గొలుసులు ముట్టుకుంటున్నారేమో అని అరుస్తాను.”
“నాకు తగ్గ జీవన శైలి ఏమిటంటే, నేను ఒక విశాలమైన సెల్లార్‌లో ఒక మారుమూల గదిలో దీపం ముందు నా రాతసామాగ్రి పెట్టుకుని కూర్చుంటాను. భోజనం తెచ్చేవాళ్లు కూడా నా దగ్గరకు రారు, నా గదికి చాలా దూరంగా సెల్లార్ అవతల ఎక్కడో ఉన్న గుమ్మం దగ్గర పెడతారు. ఈ సెల్లార్ గదుల గూండా ఆ భోజనం దాకా నడచి వెళ్లటమే నా ఏకైక వ్యాయామం. తర్వాత మళ్ళీ రాతబల్ల దగ్గరకు వెళిపోతాను, తాపీగా తింటాను, మళ్లా రాయటం మొదలుపెడతాను. ఎలా రాస్తాననుకున్నావ్! ఎంతెంతటి లోతుల్లోంచి తవ్వి తీస్తాననుకున్నావ్! అదీ శ్రమ లేకుండా! ఎందుకంటే తీక్షణమైన ఏకాగ్రత శ్రమ తెలియనీయదు.”
రచనల గురించీ, పుస్తకాల గురించీ అతనికి నిర్దుష్టమయిన అభిప్రాయాలు ఉండేవి. కౌమారంలోనే గెథె, క్లీస్ట్, నీషే, స్పినోజా, డార్విన్ లను చదువుకున్నాడు. ముఖ్యంగా నీషే ప్రభావం ఎక్కువగా ఉండేది. కాల్పనిక సాహిత్యం కన్నా, రచయితల ఆత్మకథల పైనా, ఉత్తరాలపైనా ఎక్కువ ఆసక్తి చూపించేవాడు. ఒక మిత్రునికి ఇరవయ్యేళ్లప్పుడు రాసిన ఉత్తరంలో ఇలా అంటాడు: “మనల్ని గాయపరిచి, తూట్లు పొడిచే పుస్తకాలే మనం చదవాలి. మన తల మీద మొట్టి నిద్ర లేపకపోతే ఎందుకిక పుస్తకాలు చదవటం? ఆనందం కోసమా! అసలు పుస్తకాలు లేకపోయినా మనం ఆనందంగానే ఉండగలం, ఆనందపెట్టే పుస్తకాలు మనమే చిటికెలో రాయగలం. నిజమైన పుస్తకాలు వేరు. అవి ఒక విపత్తులా, మనకన్నా ఎక్కువగా మనం ప్రేమించిన వారి చావులా, అందరికీ దూరంగా అడవుల్లోకి వెలి వేయబడటంలా, ఒక ఆత్మహత్యలా మనల్ని కదిలించాలి. మనలో గడ్డకట్టుకుపోయిన సముద్రాలకి పుస్తకం ఒక గొడ్డలిపెట్టు కావాలి.” కాఫ్కా పై పుస్తకాలు నిజంగా అలాంటి ప్రభావాన్నే చూపించేవి.
బాల్యం
మార్చుకాఫ్కా ఒక యూదు కుటుంబంలో పుట్టాడు. తండ్రి హెర్మన్, తల్లి జూలీ. సంపాదనే ప్రధానమనే మధ్యతరగతి మనస్తత్వం కలిగిన తండ్రి యొక్క ప్రేమాభిమానాలు పొందలేక కాఫ్కా తీవ్ర నిరాశకు గురయ్యేవాడు. వ్యక్తిగా కాఫ్కా ఎదుగుదలపై తండ్రి హెర్మన్ చాలా ప్రతికూల ప్రభావాన్ని చూపించాడు. తల్లి జూలీకి కొడుకుపై చాలా ప్రేమ ఉంది, కానీ భర్తంటే అంతకు మించిన భయం వల్ల భర్తకీ కొడుక్కీ మధ్య ఏ ఘర్షణ తలెత్తినా ఆమె భర్త పక్షమే వహించేది. కాఫ్కాకు శైశవంలో తల్లిదండ్రుల సాంగత్యం చాలా తక్కువ లభించింది. కాఫ్కా సున్నితస్తుడు, సిగ్గరి, అర్భకుడు, ఆధారపడే మనస్తత్వం కలవాడు. తండ్రి ఈ గుణాల్ని ఎత్తి చూపించి కాఫ్కాని సందు దొరికినప్పుడల్లా కించపరిచే వాడు. కాఫ్కా రచనల పై ఆ ప్రభావం తీవ్రంగా ఉండేది. కాఫ్కాకు ముగ్గురు చెల్లెళ్ళు. ఎల్లి, వల్లి, ఓట్ల అనే ఈ ముగ్గురిలోనూ చిన్న చెల్లి ఓట్ల అంటే కాఫ్కాకు చాలా ఇష్టం. ఆమె ధైర్యమూ, స్వేచ్ఛా కాంక్షా గల యువతిగా ఎదిగింది. పెద్దయ్యే కొద్దీ ఆ ఇంట్లో అన్నయ్య పక్షం వహించేది.
చదువు
మార్చుతండ్రి బలవంతం మీద న్యాయవాద విద్యను అభ్యసించి, ఆ తర్వాత ఒక భీమా సంస్థలో ఉద్యోగం చేస్తూనే తన రచనా వ్యాసంగాన్ని కొనసాగించాడు. జర్మన్ విశ్వవిద్యాలయంలో న్యాయవాద విద్యను అభ్యసిస్తుండగా అతనికి మాక్స్ బ్రాడ్ అనే తోటి యూదు యువకునితో పరిచయమైంది. వీరిద్దరూ జీవితాంతం సన్నిహిత మిత్రులుగా కొనసాగారు. మాక్స్‌బ్రాడ్ కూడా రచయితే. కాఫ్కా రచనా వ్యాసంగంలో ఇతని పాత్ర చాలా ముఖ్యమైంది. స్వీయశంక వల్ల మొదలు పెట్టిన రచనల్ని పూర్తిచేయకుండానే చింపేసే మిత్రుణ్ణి, రాయమంటూ పదే పదే ముందుకు తోశాడు, అవి ప్రచురితమయ్యేలా శ్రద్ధ తీసుకున్నాడు.
రచనలు
మార్చుకాఫ్కా రచనా ప్రక్రియ మన కలలను పోలి ఉంటుంది. మన కలలు ఏ విధంగానయితే మన భాధలను, సంతోషాలను చిత్ర విచిత్రమయిన దృశ్యాల ద్వారా ప్రతిబింబిస్తాయో కాఫ్కా రచనలు కూడా అలాగే ఉంటాయి. ఉదాహరణగా ఒక పల్లెటూరి వైద్యుడు తన వృత్తి జీవితంలో ఎదుర్కొనే సంక్లిష్ట సంఘటనలను అతనికి వచ్చే ఒక కలలా చెప్పిన A Country Doctor, ఒక సామాన్యుడు న్యాయం కోసం జీవితాంతం ఎదురు చూసే విషయాన్ని ఆవిష్కరించే Before The Law అనే కథలను చెప్పుకోవచ్చు. కాఫ్కా బ్రతికుండగా Contemplation, A Country Doctor లాంటి కథా సంకలనాలు, కొన్ని కథలూ మాత్రమే కొన్ని సాహిత్య పత్రికలలో ప్రచురితమయ్యాయి. ఆయన రచనలు చాలావరకూ మరణానంతరం మాత్రమే వెలుగులోనికి వచ్చాయి. A Hunger Artist అనే కథా సంకలనం కూడా ఆయన మరణానంతరమే ప్రచురితమయ్యింది. తను చనిపోయాక తన రచనలన్నీ కాల్చివేయవలసిందిగా కాఫ్కా తన స్నేహితుడు మాక్స్ బ్రాడ్ ను కోరాడు. కానీ ఆ కోరికను పక్కన పెట్టి, కాఫ్కా అసంపూర్ణ నవలలు Der Process, Das Schloss, Amerika లతో పాటు ఆయన రచనలన్నీ ప్రచురితమయ్యేలా శ్రధ్ధ తీసుకుని ఒక సరికొత్త రచనా విధానాన్ని ప్రపంచనికి పరిచయం చేశాడు. కాఫ్కా రాసిన "Letter To Father" అనే వంద పేజీల పైగా ఉత్తరం సాహిత్య చరిత్రలో ఒక గొప్ప మానసిక విశ్లేషణా వ్యాసంగా మిగిలిపోయింది. పిల్లల పట్ల తల్లిదండ్రుల కర్తవ్యాన్ని ఇందులో వివరంగా విశ్లేషించాడు. ఇది కూడా కాఫ్కా మరణాంతరమే ప్రచురితమయ్యింది. "Die Verwandlung" ("The Metamorphosis"), Der Process (The Trial), "Das Urteil" ("The Judgment"), Das Schloss (The Castle), Betrachtung (Contemplation), Ein Hungerkünstler (A Hunger Artist), Briefe an Felice (Letters to Felice) మొదలయినవి కాఫ్కా యొక్క ప్రముఖ రచనలు. కాఫ్కా రచనలు ఆల్బర్ట్ కామూ, జీన్ పాల్ సార్త్రా, గాబ్రియల్ గార్సియా మార్క్వెజ్ లాంటి రచయితలను విశేషంగా ప్రభావితం చేశాయి.
కాఫ్కా ప్రసిధ్ధ నవల “మెటమార్ఫసిస్”. “గ్రెగర్ జమ్జా ఒక ఉదయం కలత కలల్నించి నిద్ర లేచే సరికి, తన మంచంపై తాను ఒక పెద్ద కీటకంగా మారిపోయి ఉండటాన్ని చూసుకున్నాడు” అనే వాక్యంతో మొదలవుతుంది. ఇక అక్కణ్ణించి గ్రెగర్ జమ్‌జా ఈ కొత్త రూపంలో తన రోజువారీ జీవితం గడిపేందుకు ఉద్యుక్తుడవటాన్నీ, అందులో ఎదురయ్యే ఇబ్బందుల్నీ భీతి గొలిపే స్పష్టతతో చూపిస్తుంది. ఈ రచనతో సాహిత్యంలో మోడర్నిటీ ఆరంభమైందటారు. ఈ రచన మొదటి వాక్యంలో కనిపించే సృజనాత్మక ధైర్యం ఎందరో రచయితల్ని ప్రేరేపించింది. ఎందరో అప్పటిదాకా తమ కాళ్ళను కట్టి పడేసిన వాస్తవికతా శృంఖలాల్ని తొలగించుకుని, తమ అంతర్లోకాల్ని స్వాప్నిక పక్షాలపై సృజనాకాశంలోకి స్వేచ్ఛగా ఎగరవేశారు. కాగితం మీద ఏదైనా సాధ్యమేననే ఎరుక వల్ల కలిగిన స్వేచ్ఛా భావమది.
ప్రముఖ స్పానిష్ రచయిత గాబ్రియెల్ గార్సియా మార్కెజ్ తనపై మెటమార్ఫసిస్ ప్రభావాన్ని ఇలా చెప్తాడు: “నా పదిహేడేళ్ళపుడు ‘మెటమార్ఫసిస్’ చదివాకా అనిపించింది, నేను రచయితను కాగలనని. ఆ రచనలో గ్రెగర్ జమ్జా ఒక ఉదయం నిద్ర లేచి భారీ కీటకంగా మారిపోయాడన్నది చదివాకా, నాలో నేను అనుకున్నాను, ‘ఇలా రాసే వీలుందని నాకు తెలీదే, ఉన్నట్టయితే, నేను ఖచ్చితంగా కలం పట్టాల్సిందే.’ ” మార్కెజ్ ప్రసిద్ధ రచన “ఒన్ హండ్రడ్ ఇయర్స్ ఆఫ్ సొలిట్యూడ్”లో వాస్తవికత నుంచి విముక్తి పొందిన ఇలాంటి స్వేచ్ఛే కనిపిస్తుంది.
వ్యక్తిగత జీవితం
మార్చుకాఫ్కా పలువురు స్త్రీలతో సన్నిహితంగా మెలిగినప్పటికీ ఫెలిస్ ను వివాహం చేసుకోవాలనుకున్నాడు కానీ, అప్పటికి తనకి క్షయ వ్యాధి ఉందని తెలిసి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు.
మరణం
మార్చుక్షయ వ్యాధితో భాధింపబడిన కాఫ్కా నలభైయ్యేళ్ళ వయసులోనే 1924 జూన్ 3 న కన్ను మూశాడు. కాఫ్కా చనిపోయిన మూడు రోజులకు, అతని పాత ప్రేయసి మిలెనా రాసిన నివాళి ఒక పత్రికలో వచ్చింది. కాఫ్కాను ఆమె ఎంత లోతుగా అర్థం చేసుకుందో ఈ నివాళి చెప్తుంది. అందులో ఒక భాగం: “అతను సిగ్గరి, భయస్తుడు, సున్నితమనస్కుడు, మంచివాడు, కానీ అతను రాసిన పుస్తకాలు మాత్రం క్రూరమైనవీ, బాధపెట్టేవీను. అతను ప్రపంచాన్ని అదృశ్య భూతాలతో నిండినది గానూ, అవి ఎల్లపుడూ నిస్సహాయమానవులపై విరుచుకుపడి, వారిని నాశనం చేయటానికి ప్రయత్నిస్తున్నట్టుగానూ చూశాడు. అతను నిశిత దృష్టిగలవాడు; జీవించలేనంత విజ్ఞుడూ, పోరాడలేనంత బలహీనుడూను. కానీ ఇది స్వచ్ఛమైన మనుషులకు ఉండే బలహీనత; భయాలకూ, అపార్థాలకూ, నిర్దయకూ, అసత్యాలకూ ఎదురెళ్లలేని బలహీనత. వారు తమ బలహీనతల్ని మొదటే ఒప్పేసుకుని, లొంగిపోయి, తద్వారా విజేతలే సిగ్గుపడేలా పరిస్థితి కల్పిస్తారు. అతను తోటి మనుషుల్ని అర్థం చేసుకున్న తీరు ఒంటరిగా జీవించే వాళ్ళకి మాత్రమే సాధ్యం, అలాంటి వాళ్ళ గ్రహణ ఎంత సున్నితంగా శృతి చేయబడి ఉంటుందంటే, క్షణమాత్ర భంగిమల విన్యాసాన్ని బట్టి వారు అవతలి మనిషిని ఆమూలాగ్రం చదివేయగలరు. ప్రపంచం గురించి అతని జ్ఞానం విస్తారమైనదీ లోతైనదీను, అసలు అతనే ఒక విస్తారమైన లోతైన ప్రపంచం.”
కాఫ్కా మరణించిన కొన్నాళ్ళకి హిట్లర్ నేతృత్వంలోని నాజీల దురాగతాల్లో అతని చెల్లెళ్ళూ, ఇతర కుటుంబ సభ్యులూ కాన్సన్‌ట్రేషన్ కాంపుల్లో చనిపోయారు.
బయటి లింకులు
మార్చుశ్రీశ్రీ అనువాదం చేసిన కాఫ్కా కథ వింత జంతువు
A Country Doctor తెలుగు అనువాదం పల్లెటూరి డాక్టరు
కాఫ్కా కథ తెలుగు అనువాదం రాబందు
కాఫ్కా కథ Before The Law తెలుగు అనువాదం చట్టం ముందు
కాఫ్కా గురించి కినిగె మాస పత్రికలో సవివర వ్యాసం శిలువ మోసిన రచయిత
మూలాలు
మార్చు- ↑ Koelb 2010, p. 12.
- ↑ Czech Embassy 2012.