బాలీవుడ్ క్లాసిక్స్

1970-80 మధ్యకాలంలో హిందీలో వచ్చిన సినిమాల కథనాలు, వాటి తెరవెనుక కథలు, నిర్మాణంలో ఎదురైన సాధక బాధకాలు, ఉత్తమ చిత్రాలుగా ప్రజల గుండెల్లో నిలవడానికి గల కారణాల విశ్లేషణలతో... 50 బాలీవుడ్ ఉత్తమ చిత్రాలను పరిచయం చేస్తూ సాక్షి ఫ్యామిలీలో మహమ్మద్ ఖదీర్ బాబు రాసిన వ్యాసాల సంకలనం ‘బాలీవుడ్ క్లాసిక్స్’.

60వ దశకం నుండి 80 వ దశకం వరకూ హిందీ చిత్రసీమ నుండి వచ్చిన కొన్ని కళాత్మక చిత్రాలకు సంబంధించి రచయిత శ్రీ ఖదీర్‌బాబు, వారం వారం ఒక ప్రముఖ దినపత్రికలో రాసిన 50వ్యాసాలను `బాలీవుడ్ క్లాసిక్స్` పేరుతో సంకలనంగా ప్రచురించటం జరిగింది. సినీ ప్రేమికులు ఆ చిత్రాలలో కొన్నిటిని చూసివున్నా, రచయిత విశ్లేషణా చాతుర్యం వల్లే చదువుతున్నంత సేపు మళ్లీ ఒకసారి రచయిత దృక్కోణంలో ఆ సినిమా చూస్తున్నంత అనుభూతిని పొందుతారనే ఉద్దేశంతో ఈ పుస్తక పరిచయానికి పూనుకున్నాను.

నాటి సినిమాలలో, ఆయా కాలపరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపించే కథతో సహజపాత్రలతో పాటు చెప్పాలనుకున్న విషయం ప్రేక్షకుడికి రసవత్తరంగా వుండటం కోసం తగుమోతాదులో కొద్దిపాటి మసాలా కూడా జోడించేవారు దర్శకనిర్మాతలు.. మరి నేటి సినిమాలో మసాలా అసలు కూరని డామినేట్ చేస్తూ అసలు కూర తక్కువైపోతుందన్నది విమర్శకుల వాదన. సినిమా అనేది వ్యాపారం. కలల్నీ, కళల్నీ అమ్ముకుని చేసే వ్యాపారం. కాలగమనంలో అన్ని వ్యాపారాల స్వభావస్వరూపాలు మారినట్లే సినిమా కూడా మారటం సహజమే.. మన చిన్నతనంలో మిఠాయిని పేపర్లో పొట్లం కట్టిచ్చేవారు… యిప్పుడు అందమైన అట్టపెట్టెల్లో యిస్తున్నా ఎందుకో చిన్నప్పటి పొట్లం మిఠాయే బాగుందనిపిస్తుంది. అంతమాత్రం చేత ప్యాకెట్లో వొద్దు.. పేపరులోనే కట్టివ్వమనం కదా.. టెక్నిక్ ప్యాకింగ్‌తో యిప్పుడొస్తున్న కోట్లాది రూపాయల సినిమాలకంటే ఆత్మవున్న నాటి సినిమాలు, నగలు లేకపోయినా అందంగా కనిపించే బాపూ బొమ్మాయిల్లా వుంటాయన్నది నిజం.. కానీ మారిన నేటి వ్యాపార సరళిలో థియేటర్ వరకూ వచ్చే సగటు ప్రేక్షకుడ్ని సంతృప్తి పరచి సొమ్ముచేసుకోవాల్సిన అగత్యం సినిమావారిదని అంగీకరించవలసిన నిజం.. అందుకే పాతని పొగడటం కొత్తని తెగడటం మాత్రమే పరమావధిగా భావించనవసరం లేదు. ఆ స్వర్ణయుగంలోని బంగారంతో నేడు సరికొత్త నగలు చేయటానికి ప్రయత్నిస్తే ఆధునిక స్వర్ణయుగం మళ్లీ సాక్ష్యాత్కారం కాకపోదు.

ఈ `బాలీవుడ్ క్లాసిక్స్` విషయానికొస్తే సంబంధిత చిత్రాల కథకథనాలను విశ్లేషిస్తూనే ఆ సినిమాల నిర్మాణం వెనుకవున్న కష్టనష్టాలను కూడా రచయిత తెలియజేయడంతో ఆ సినీ జీవుల పట్ల పాఠకులకు యింకా ఆరాధనా భావం ఎక్కువవుతుంది… స్క్రిప్ట్ తప్ప, ముహూర్తాలూ, టైటిల్ సెంటిమెంటూ, క్లాప్‌సెంటిమెంట్లూ, రిలీజ్‌డేట్ సెంటిమెంట్లూ అన్నీ జాగ్రత్తగా చూసుకుని ఫ్లాప్ తీస్తున్న మనవాళ్లు కొన్ని తెలుసుకోవాలి అంటూ, `షోలే` తొలిరోజు షూటింగ్ భారీ వర్షం వల్ల అసలు జరగనేలేదనీ, మరునాడు తొలిషాట్ తీసింది వితంతువు పాత్రపైన అనీ, ఎంత పెద్ద సినిమా అయినా మొదలు ఆధారపడవలసింది అక్షరం మీదే, తయారుకావలసింది పేపర్ మీదే అని చురకలు అంటించాడు రచయిత.

అలాగే `బాబీ` సినిమా గురించి రాస్తూ రాజ్‌ కపూర్ తనెంతో ప్రేమించి తీసిన `మేరా నామ్ జోకర్`ని ప్రేక్షకులు నిరాదరిస్తే, కసితో డబ్బొచ్చే సినిమా తియ్యాలనే పంతంతో `బాబీ` తీసి విజయం సాధించాడు.. ప్రతిభ కలిగినవాళ్లు పగబడితే చాలా కష్టం.. అని చెబుతూనే… ఏ ఉత్తమ వైద్యుడూ చేతులారా రోగికి విషం యివ్వడు. అందుకే కమర్షియల్ హంగులతో `బాబీ` తీసినా అందులోనూ `రాజ్ కపూర్` తన హృదయాన్ని చూపెట్టాడంటాడు ఖదీర్‌బాబు.

సాదాసీదా దర్శకుడైన `బ్రిజ్` తీసిన సూపర్ హిట్ “విక్టోరియా నెం.203“ గురించి చెబుతూ `ప్రేక్షకులు మెచ్చే మిఠాయి పొట్లాన్ని ఢిల్లీ మిఠాయివాలా మాత్రమే కట్టక్కర్లేదు.. వీధి చివర రంగయ్య అయినాచాలు` అనటం రచయిత చమత్కారం. సినీ ప్రేమికుల్ని అలరించే మరెన్నో విషయాలున్నాయి ఈ పుస్తకంలో…

“ఇలాంటి కథ నాకు తెలుసు అని ప్రేక్షకుడు అనుకునే సినిమాలు నేను తీయను… ఇలాంటి కథ జరిగితే బాగుంటుంది అనుకునే సినిమాలనే తీస్తాను.“ అని చెప్పిన మాస్‌ మసాలా దర్శకుడు `మన్‌మోహన్ దేశయ్` తన కెరీర్‌లో కోట్లుగడించినా మాస్‌పల్స్ తెలియడానికా అన్నట్లు జీవితాంతం ముంబాయ్‌లోని మిడిల్‌క్లాస్ బస్తీలోనే నివాసమున్నాడని తెలిసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. తన ప్రతి సినిమాలోనూ హిందూ, ముస్లీం, క్రిస్టియన్ పాత్రలు పెట్టి వారి మధ్య బ్రదర్‌హుడ్ కోసం ప్రయత్నిచాడట.

తన కొడుకులా మరెవరూ పోలియో బారిన పడకూడదనే ఉద్దేశంతో తన సినిమా ద్వారా ప్రేక్షకులకు వినోధాన్ని అందిస్తూనే `పోలియో`పట్ల ఎడ్యుకేట్ చెయ్యాలని భావించి తన బిడ్డ `మ్యాకీ`నే ప్రధాన పాత్రగా చేసి `కువారా బాప్` చిత్రాన్ని తీసిన `మొహమూద్` గురించి చదువుతుంటే మనసులో ఏదో మూల కలుక్కుమంటుంది.

ఆనాటి సామాజిక పరిస్థితులనే కథాంశాలుగా తీసుకుని చిత్రాలు నిర్మించి విజయవంతమైన మనోజ్‌కుమార్, దేవానంద్, హృషికేష్ ముఖర్జీ, బాసూ చటర్జీలవంటి ఫిల్మ్‌మేకర్స్ గురించి తెలుసుకున్నప్పుడు సమాజం పట్ల వారికున్న నిబద్ధత అర్థం అవుతుంది.

తారుమారయ్యాక పాత్రల స్వభావం మారి హీరో హీరోయిన్ల జీవితాలతో చెలగాటం ఆడటం అనే అనాదిగా వస్తున్న ఫార్ములాను ఒక్కొక్కరూ ఒక్కోలా తీశారు అంటూ కె.వి రెడ్డి ‘మాయాబజార్‌’ను, బాపూ ‘మంత్రిగారి వియ్యంకుడి’నీ, నాసిర్ హుస్సేన్ `హమ్‌ కిసిసే కమ్‌ నహీ` చిత్రాలను రచయిత పోల్చినప్పుడు.. నిజమేకదా.. అన్ని కథాంశాలలోనూ పాయింట్ ఒకటే కదా అనిపిస్తుంది.

జంజీర్ గురించి రాసిన వ్యాసంలొ “టైటానిక్ ” మునిగిపోయింది.. అయితే దానిని ఉత్తినే ముంచకుండా ప్రేమను జతచేశాడు దర్శకుడు. `యాదోంకి బారాత్`లొ పగ తీర్చుకోవడం వుంది. ఆయితే ఆ పగను అలాగే వుంచకుండా దానికి ప్రేమను, పాటను కలిపాడు దర్శకుడు. ’జంజీర్’లో కూడా పగే వుంది. ఆయితే దానిని అలాగే చూపకుందా వర్తమాన పరిస్థితులను జతచేశాడు దర్శకుడు అంటూ సక్సెస్ ఫార్ములా కిటుకును వివరించాడు రచయిత. చెప్పే కథాశం ప్రేక్షకుడికి చేదు మాత్రలా ఘాటుగా వుండకుండా షుగర్‌కోటెడ్‌ పిల్‌లా వుండేలా అవసరమైన సరుకును కూడా కథలొ చేర్చాలనేది దీని సారాంశం . .

‘బావర్చీ’ చిత్రం గురించి చెబుతూ మన పని మనం ఎలాగూ చెసుకుంటూం .. ఎదుటివారి పని చేయడంలో వుండే ఆనందం అనుభవిస్తే తప్ప అర్దంకాదు..తల్లితండ్రులు, తోబుట్టువులు కొత్తగా రారు. మనసుకు నచ్చిన స్నేహితులు వెంట వెంటనే దొరకరు… మన బంధాలు పరిమితం.. అపురూపమైన ఈ మనుషులను, వారితో కలిసి పొందాల్సిన సంతోషాలను మిస్‌ కాకండి అని చెప్పడం ఎంతో బాగుంది.

ఎప్పుడూ గతం తాలూకు విషాదంలో, భవిష్యత్తు తాలూకు బెంగలో వుంటూ ఈ క్షణంలో వున్న ఆనందాల్ని, సౌందర్యాల్ని నిర్లక్ష్యంచేసి… చెప్పాపెట్టకుండా మృత్యువు ప్రత్యక్షం అయినప్పుడు.. అరె…! యింత కాలం ఎలా వృధా చేశాను అని తల బాదుకున్నా సమయం వెనక్కిరాదు అనే సత్యాన్ని ఆవిష్కరించిన `హ్నషికేష్ ముఖర్జీ` `ఆనంద్`ని గుర్తుచేసుకున్నప్పుడు ఒక్కసారి మనల్ని మనం తడుముకుంటాము. ప్రతి క్షణాన్నీ మనస్పూర్తిగా జీవిస్తూ సాటిమనుషులకు ప్రేమను పంచుతూ వారి నుండి ప్రేమను పొందడమే జీవితం… ఈ క్షణం పోతే మళ్లీ రాదు అని చెప్పే `ఆనంద్` లాంటి పాత్ర మళ్లీ వెండి తెరపైకి వొస్తుందా..?

మూగ, చెవుడు, గుడ్డి మనుషులు వారి మనసులతోనే కమ్యూనికేషన్ ఏర్పరచుకొని తమ మధ్య స్నేహబంధాన్ని సృష్టించుకుంటుంటే అన్నీ వున్న మనం మాత్రం మన భాషని, మాటని, ఎప్పుడూ శత్రువులను తయారుచేసుకోవడానికే ఉపయోగించుకుంటున్నాం అని చర్చించే `గుల్జార్` `కోషిష్` చిత్రంపై ఖదీర్‌బాబు విశ్లేషణ అద్భుతం. ఆ మాటకొస్తే అన్ని విశ్లేషణలూ వ్యాసాలూ హృదయాన్ని తాకుతాయి. ఎందుకంటే యిందులో ప్రస్తావించిన సినిమాలన్నీ హృదయమున్న సినిమాలే కాబట్టి. అందుకే వెంటనే పుస్తకంకొని చదవండి. ఆ కళాఖండాలను వీక్షించమని మీ మనసే మిమ్మల్ని తొందరపెడుతుంది. అన్నిటికన్నా ఈ పుస్తకం వెనుక అట్టమీద వున్న నాలుగులైన్లు ఆకర్షించాయి నన్ను అవి.. “ సినిమాకు భాష అడ్డుగోడకాదు. అడ్డుగోడల మీద సినిమా వారధి కావాలన్నది ఆలోచన. నిజానికి ప్రపంచాన్ని ఒక్కతాటిపైకి తెచ్చే గొప్ప ప్రక్రియ సినిమా“.