బీద బ్రతుకు (పుస్తకం)
యలమంచలి వెంకటప్పయ్య గారు1985 లో తన స్వీయ జీవిత చరిత్రను 'బీద బ్రతుకు" అనే పేరుతో రాసారు. ఈ పుస్తకం వెంకటప్పయ్య గారి జీవిత చరిత్రతో పాటు ఆనాటి గ్రామీణ సమాజిక జీవన పరిస్థుతులను, స్వాతంత్ర్య పోరాటం గురించి మనకు పరిచయం చేస్తుంది.
బీద బ్రతుకు | |
కృతికర్త: | యలమంచిలి వెంకటప్పయ్య |
---|---|
దేశం: | భారత దేశం |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | తెలుగు సాహిత్యం |
విభాగం (కళా ప్రక్రియ): | ఆత్మ కథ |
ప్రచురణ: | యలమంచలి వెంకటప్పయ్య సంస్మరణ వేదిక |
విడుదల: | 1985, 2009 |
పేజీలు: | 75 |
చదువుకు, ఎదుగుదలకు బీదరికం అడ్డుకోలేదని,పట్టుదలవుంటే దేనినైనా సాధించుకోగలరనే సందేశం ఇస్తుంది.
పుస్తకంలోని కొన్ని భాగాలు మచ్చుకు
మార్చుజైలులోని కొందరు ఖైదీలు తోటి ఖైదీలకు మంగలి పని చేసేవారు. వారికి పీపా ఇనుప రేకులను సాన పట్టించి ఇచ్చి వాటితో క్షౌరం చేయమనే వారు. రాజకీయ ఖైదీలమైన మేము ఆ పీపా రేకులతో క్షౌరం చేయించుకొనే వారము కాదు. గడ్డాలు, మీసాలు పెంచుకొని తిరిగే వారము. క్షౌరం చేయించు కోనందుకు జైలు సూపరింటెండెంటు మాకాళ్ళకు బేడీలు వేసి శిక్ష విధించే వారు. మేము శిక్ష అనుభవించడానికి ఒప్పుకునే వాళ్ళమే కాని పీపా రేకు కత్తులతో గడ్డాలు చేయించు కోడానికి సమ్మతించే వాళ్ళం కాదు.
నెల్లూరులో హిందీ చదువు తున్నందుకు నెలకు నాలుగు రూఫాయలు ఉపకార వేతనం ఇచ్చే వారు. ఆ రోజుల్లో నెల్లూరులో భోజన హోటల్ల ల్లో రెండు పూటలకు భోజనానినికి నెలకు 7 రూపాయలు తీసుకునే వారు. నావద్ద నాలుగు రూపాయలు తప్ప అదనంగా ఒక్క దమ్మిడీ కూడ లేదు. అందుచేత ఒక బ్రాహ్మణ హోటల్ యజమాను రాలిని బ్రతిమాలుకొని ఉదయం 12 గంటలకు ఒక్క పూట భోజనానికి నెలకు మూడున్నర రూపాయలిస్తానని అంగీక రింప జేసి మిగిలిన అర్థ రూపాయితో రాత్రికి భోజనానికి బదులు ఒక కాణీకి వేయించిన శెనగ పప్పు బెల్లము తిని నీళ్ళు తాగి పడుకునే వాణ్ణి. కాని రెండు నెలల తర్వాత ఆ హోటల్ యజమానురాలి కొడుకు తల్లికి నేను ఒకేసారి రెండు పూటలా సరిపడే అన్నం తింటున్నానని చెప్పి నన్ను మానిపించాడు. (పుట. 47)
మహాత్మా గాంధీజీ హరిజన దేవాలయ ప్రవేశ ఉద్యమ సందర్భ పర్యటనలో ఆంధ్ర ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక రాత్రి అయితా నగర్ లో మకాం చేశారు. అప్పుడు మహాత్మా గాంధీ గారికి సేవ చేయడానికి, వారితో కొద్ది సేపు మాట్లాడడానికి, వారి హిందీ ఉపన్యాసాన్ని తెలుగులోనికి అనువదించ డానికి నాకు అవకాశం లభించింది. ఆ సందర్బంలో అయితా నగర్ రామాలయములోనికి హరిజనుల ప్రవేశం జరిగింది. (పుట.50)
ఆరోజుల్లో... వడ్ల బస్తా ఖరీదు రెండున్నర రూపాయల నుండి మూడు రూపాయలుండేది. బియ్యం బస్తా ఖరీదు ఏడున్నర నుంచి ఎనిమిది రూపాయల వరకుండేది. పాత చిన్న మోటరు కారు 400–500 రూపాయలకు, క్రొత్తది 3-- 4 వేల రూపాలయలే వచ్చేవి. బియ్యం రూపాయకు 15 కిలోలు వచ్చేవి. .... (పుట. 58)
శ్రీ యలమంచలి వెంకటప్పయ్య గారు 98 సంవత్సరాలు నిండు జీవితాన్ని గాందేయ మార్గంలో, సామాజిక స్పృహతో గడిపి చని పోయిన తర్వాత కూడా తన శరీరాన్ని ఏదైనా ఒక వైద్య కళాశాలకు దానమివ్వ వలసినదిగా ప్రమాణ పత్రాన్ని వ్రాసారు. దానిని ఈ పుస్తకంలో ప్రచురించారు.
దానిని అనుసరించి విజయ వాడలోని సిద్దార్థ వైద్య కళాశాలకు వీరి భౌతిక శరీరాన్ని దానం చేసారు.వారి కళ్ళను ఇద్దరు అందులకిచ్చి వారికి నేత్ర దానం చేయ గలిగారు.