బేతాళ ప్రశ్నలు పుస్తకాన్ని ప్రముఖ నవలా రచయిత, వ్యక్తిత్వ వికాస గ్రంథకర్త యండమూరి వీరేంద్రనాథ్ రచించారు.

బేతాళ ప్రశ్నలు
కృతికర్త: యండమూరి వీరేంద్రనాథ్
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: వ్యక్తిత్వ వికాసం
ప్రచురణ: నవసాహితి పబ్లికేషన్స్
విడుదల: 2009

రచనా నేపథ్యం

మార్చు

సాక్షి దినపత్రిక ఆదివారం సంచిక(ఫన్ డే)లలో ధారావాహికగా ప్రచురితమైన కాలమ్ బేతాళ ప్రశ్నలు పుస్తకంగా ప్రచురించారు. 2009 అక్టోబర్ లో నవసాహితి పబ్లికేషన్స్ ద్వారా తొలి ముద్రణ పొందింది. పిల్లల్లోనూ, పెద్దల్లోనూ చురుకుదనం, మేధోశక్తి, తెలివి వంటివి పెంచేందుకు ఉద్దేశించిన ఈ కథలు ఫన్ డేలో ధారావాహికగా ప్రచురించినపుడు ప్రశ్నలను పాఠకులు సమాధానం చెప్పవచ్చనీ, దానికి బహుమతులు లభిస్తాయనీ ప్రకటించారు. ఆ సవాలును ఎదుర్కొని చాలామంది సమాధానాలు పంపగా, వాటిలో సరైనవిగా నిర్ణయించి బహుమతులు పొందిన సమాధానాలు పంపిన పాఠకులు కొందరు ఉన్నారు. వారు పి.శ్రవణ్ కుమార్ (మియాపూర్), పామర్తి నిర్మల (చల్లపల్లి), వెత్సా సాహితీ సౌందర్య (హైదరాబాద్), వి.ఎస్.కె.చైతన్య (కొత్తపల్లి), మేడూరి రవికుమార్ (సికిందరాబాద్), రత్నా రమేష్ (కాకినాడ), గారపాటి ఈశ్వర్(అమలాపురం), రఘునాథ్ చౌదరి(హైదరాబాద్), ఎం.అప్పలరాజు (విశాఖపట్టణం), ఎస్.మధుకర్ (కర్నూలు).[1] పుస్తకాన్ని యండమూరి వీరేంద్రనాథ్ పెద్దయ్యాక కుంభకర్ణులు నిద్రలేస్తారు. తాము ఎప్పుడో చనిపోయామని తెలుసుకోవడానికి. పిల్లల్ని కుంభకర్ణుల్ని చేయకుండా పెంచే తల్లిదండ్రులకి ఈ పుస్తకం అంకితం అంటూ అంకితం చేశారు.[2]

రచయిత గురించి

మార్చు

ప్రధానవ్యాసం: యండమూరి వీరేంద్రనాథ్
యండమూరి వీరేంద్రనాథ్ తెలుగులో అత్యంత ప్రాచుర్యం పొందిన రచయితల్లో ఒకరు. ఆయన నవలలు 1970-90 దశకాల్లో సంచలన విజయాలు సాధించి పలు పునర్ముద్రణలు పొందాయి. వీరేంద్రనాథ్ రాసిన కొన్ని నవలలను సినిమాలు, టీవీ సీరియల్స్ గా మలచారు. సినిమా కథల, మాటల రచయితగా ఎన్నో విజయవంతమైన చిత్రాల రూపకల్పనలో పాలుపంచుకున్నారు. అనంతర కాలంలో వ్యక్తిత్వ వికాస నిపుణునిగా రూపాంతరం చెంది పలు వ్యక్తిత్వ వికాస గ్రంథాలు రచించారు. వ్యక్తిత్వ వికాస గ్రంథాలు కూడా విజయవంతమయ్యాయి. కాకినాడ సమీపంలో సరస్వతీ విద్యాపీఠాన్ని నెలకొల్పి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారు.[3]

ప్రధానాంశం

మార్చు

ఈ పుస్తకంలో బేతాళ కథల మూసలో కథను చెప్పి దాన్ని ప్రశ్న రూపంలో ముగించారు. ఒక్కో కథలోనూ చివర వేసే ప్రశ్నలు ఆలోచనాత్మకంగా, సమాధానాలు వెతికే క్రమంలో మెదడుకు పదును పెట్టి చురుకుదనం, మేధస్సు పెంచేలా రూపొందించారు. చదువుకునే పిల్లలకు ప్రతిస్పందించడంలో అలసత్వం, విశ్లేషణలో అలసత్వం, దృక్పథంలో అలసత్వం వంటివి లెక్కలు, విజ్ఞానశాస్త్రం వంటివి నేర్చుకోవడంలో అవరోధాలుగా నిలుస్తాయనీ, ఈ పుస్తకంలో పజిల్స్ వంటివి పూర్తిచేయడం వల్ల ఆ సమస్యలు తగ్గుతాయని గ్రంథకర్త పేర్కొన్నారు. రకరకాలైన నేపథ్యాల్లోని కథలను ఎంచుకుని, వైవిధ్యభరితమైన చిక్కుప్రశ్నలతో ఈ పుస్తకాన్ని రూపొందించారు.

మూలాలు

మార్చు
  1. బేతాళ ప్రశ్నలు పుస్తకంలో యండమూరి వీరేంద్రనాథ్ రాసిన ఉపోద్ఘాతం
  2. బేతాళ ప్రశ్నలు పుస్తకంలో అంకితం శీర్షికన రచయిత రాసిన నోట్
  3. బేతాళ ప్రశ్నలు పుస్తకానికి బి.వి.పట్టాభిరాం ఆప్త వాక్యం శీర్షికన రాసిన ముందుమాట