భమిడిపల్లి నరసింహమూర్తి (బ్నిం)

(బ్నిం - Bnim - B.N. Murthy నుండి దారిమార్పు చెందింది)

భమిడిపల్లి నరసింహమూర్తి, తూర్పు గోదావరి జిల్లా, ఆత్రేయపురం గ్రామంలో, సూర్యనారాయణ మూర్తి, విజయలక్ష్మి దంపతులకు 1957 అక్టోబరు 28న జన్మించారు.[1] వీరి విద్యాభ్యాసం అందరిలా స్కూళ్లలో, కాలేజీల్లో కాకుండా ఇంటి పట్టునే వర్ధిల్లింది. వీరి కుటుంబంలో అందరూ పండితులే! ఇంటిలోని వారి వద్ద సంప్రదాయ సాహిత్యాధ్యయనం చేశారు. పురాణేతిహాసాలు, కావ్యాలు, ప్రబంధాలు, ఆనువంశికంగా వస్తున్న సాహిత్యాన్ని అభ్యసించారు.ఇది వీరి రచనా వ్యాసంగానికి చాలా ఉపయోగపడింది. ఇలా ప్రాచీన సాహిత్యంతో పాటు ఆ ఊరి లైబ్రరీలో ఉన్న నవలు, కథా, కవితా సంకలనాలు, వార, మాస పత్రికలు సంచారగ్రంథాలయం ద్వారా సమకాలీన సాహిత్యాన్నీ అవగాహన చేసుకున్నారు. శారీరక వైకల్యం వల్ల బయట తిరగనప్పటికీ (ఇంటనే) పుస్తకం పఠనం ద్వారా ప్రపంచాన్ని చూడగలిగారు.[2]

బ్నిం
బ్నిం
జననంభమిడిపల్లి నరసింహమూర్తి
అక్టోబర్ 28, 1957
ఆత్రేయపురం, ఆంధ్ర ప్రదేశ్
నివాస ప్రాంతంహైదరాబాద్, తెలంగాణ
ఇతర పేర్లుబ్నిం మూర్తి
వృత్తిచిత్రకారుడు,
కార్టూనిస్ట్,
బ్యాలే రైటర్,
స్టోరీ రైటర్,
స్క్రీన్ ప్లే రైటర్
మతంహిందూ
తండ్రిభమిడిపల్లి సుర్యనారాయణ మూర్తి
తల్లివిజయలక్ష్మి

రాత, గీత

  • వివిధ పత్రికలలో కనిపించే కథా చిత్రాలు, కార్టూన్లు రచనలతో పాటు ‘బ్నిం’ని ఎంతో ఆకర్షించాయి. అలా అలా చిన్న చిన్న కవితలు వ్రాస్తూ బొమ్మలు చూసి సాధన చేస్తూ రెండు రంగాలనూ ఆరాధించసాగారు. వీరి మినీ కవితలు, కార్టూన్లు ఆ రోజుల్లో ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక, స్వాతి మాస పత్రిక, కృష్ణా పత్రిక, ప్రభావ లాంటి పత్రికల్లో అచ్చయినాయి.
  • పత్రికలలో బొమ్మలు చూసి సాధన చేస్తూనే ఆత్రేయపురం హైస్కూల్లో డ్రాయింగ్ మాష్టారు శ్రీ మండపాక సింహాచలం గారి దగ్గర చిత్రలేఖనాభ్యాసం చేశారు.
  • ఛందోబద్ధమైన పద్య రచనతో పాటు లయాత్మకమైన గీత రచన (బుర్రకథ) మొదలైనవి వ్రాయటం అలవడింది.
  • పత్రికలలో వీరి కథలు, కార్టూన్లు అచ్చవటంతో పటు ఆత్రేయపురంలో వుండగానే ఎంతో మంది, కవులతోను, కార్టూనిస్టులతో ‘కలం స్నేహం’ చేశారు. ఆ స్నేహమే “స్నేహలత” అనే కళాసాంస్కృతిక సంస్థ రూపకల్పనకు ప్రేరణనిచ్చింది.
  • ఒక ‘లిఖిత పత్రిక’ ఇంకా ఎన్నో సంగీత సాహిత్య కార్యక్రమాలు నిర్వహించటానికి స్నేహలత ఓ వేదికయ్యింది. దీనివల్లనే బాపు రమణలతో పరిచయమేర్పడింది.
  • ఈ సంస్థ ద్వారానే వీరు బాపు చిత్రప్రదర్శన ఏర్పాటు చేసి బాపు, వారి మిత్రులు ఆశీస్సులు పొందగలిగారు. అభిమానుల ప్రశంసలందుకున్నారు.ఆ సందర్భంగా బాపుగారి ఒరిజినల్ చిత్రాలను చూడటం బ్నింలోని చిత్రకారుడికి మరింత ప్రేరణ కలిగించింది.
  • అదే స్నేహలత సంస్థ తరపున జరిపిన ప్రదర్శనలకు, తాలూకా స్థాయిలో, జిల్లా స్థాయిలో బహుమతులు కూడా లభించాయి.

ఆత్రేయపురం నుండి హైదరాబాద్

1981 డిసెంబర్లో ఆత్రేయపురం నుండి హైదరాబాద్ రావటంతో బ్నిం జీవితం ఎన్నో మలుపులు తిరిగింది. అక్కడ గ్రాఫిక్ డిజైనర్లా పనిచేయటం వల్ల కళలో తనకు ఒక క్రమశిక్షణ ఏర్పడిందని బ్నింగారు ఎన్నో సార్లు చెప్పటం జరిగింది.తరువాత ఆంధ్రభూమి, కృష్ణా పత్రిక, పల్లకి సుప్రభాతం, శ్రీపీఠం... లాంటి ప్రత్రికల్లో స్టాఫ్ గాను, ఫ్రీలాన్సర్గా క్యారికేచరిస్ట్ గా, కాలమిస్ట్ గా, కార్టూనిస్ట్ గా, ఇల్లస్ట్రేటర్ గా, పనిచేశారు.కొన్నియాడ్ ఏజెన్సీలకు తేటతెలుగు కాపీ రైటింగ్ చేసి ఖ్యాతి గడించారు. దాదాపు 150 కథలు, 50కి పైగా వివిధ అంశాల మీద వ్యాసాలు, వేలాది కార్టూన్లు వందలాది బుక్ టైటిల్స్ డిజైన్ చేశారు. వెడ్డింగ్ కార్డులు, సన్మాన పత్రాలు, బ్రోచర్లు లోగోలు చిత్రీకరించారు.[3]

ఎలక్ట్రానిక్ మీడియా

టీవీ రంగంలో చిత్రకారునిగా.. టైటిల్స్ వ్రాయడానికి అవకాశం తలుపు తట్టింది.. అలా మొదలైన వీరి ఎలక్ట్రానిక్ మీడియా ప్రయాణం ఎన్నో ఎపిసోడ్స్ గా నడిచింది. సీరియల్స్ గా అల్లుకు పోయింది. దాదాపు 60-70 సింగిల్ ఎపిసోడ్స్, 20కి పైగా సీరియల్స్ ఎన్నో ఇన్ హౌస్ ప్రొడక్షన్స్ ని దూరదర్శన్ కే కాక ఇతర టీవీ ఛానల్స్ కూ రాశారు. కేవలం, స్క్రిప్ట్ వ్రాసి ప్రొడ్యూసర్ కి ఇచ్చి వేయటమే కాకుండా.. షూటింగ్ సమయాల్లో నటీ నటులకు డిక్షన్ లో, డబ్బింగ్ లో తగిన సలహాలు సూచనలు ఇచ్చారు. ఝాన్సీ, పుష్పవంటి ప్రఖ్యాత యాంకర్లు బ్నింగారు చెప్పిన పద్ధతుల్ని పాఠాలుగా భావించారు.అంతేకాక ఆర్ట్ డైరెక్టర్ కి తగిన సలహాలివ్వటం, దర్శకులకు చేదోడు వాదోడుగా వుండటం వీరి సరదా! అలాగే “ఫ్రేమ్” అందంగా కనిపించటానికి తీసుకోవలసిన జాగ్రత్తలు బాపుగారి చిత్రీ కరణ నుంచి గ్రహించారు.6-7 సంవత్సరాల పాటు వారితో షూటింగ్, ఎడిటింగ్, డబ్బింగుల్లో ఆయన చేస్తున్న పనిని అధ్యయనం చేసే అదృష్టం బ్నింకు కలిగింది. దాంతో ‘బ్నిం’కి ఎలక్ట్రానిక్ మీడియా మీద ఇంట్రస్ట్, టేస్ట్ లు పెరిగాయి.ఆ సందర్భంలోనే ముళ్ళపూడి వెంకటరమణ గారి పనితీరు,వారి రచన శైలి వంటివి మరింత దగ్గర నుంచి పరిశీలించే సదవకాశం కలిగింది.బ్నింగారు టీవీ మాధ్యమానికి ‘వర్చస్వి’ లాంటి పౌరాణిక సీరియల్సు, ‘అమరజీవి’ లాంటి చారిత్రాత్మక టెలీఫిలింసు ‘రంగుల కలలు’ లాంటి కామిడీ సీరియల్సు, ‘మరో వసంతం’ లాంటి సీరియస్ ఫ్యామిలీ డ్రామా సీరియల్సు ఇంకా అనేక అనేక సామాజిక ప్రయోజనకర అంశాలతో కూడిన డ్రామాలు, డాక్యో డ్రామాలు కథలు, మాటలు, పాటలు కూడా వ్రాశారు. ఎన్నో సీరియల్స్ కి టైటిల్ సాంగ్ వ్రాశారు. sv భక్తి ఛానెల్ కోసం ‘ఎన్ని జన్మల పుణ్యమో’ పాట ఎంతో ప్రజాధరణ పొదింది. అప్పట్లో గవర్నమెంట్ వారి ప్రభుత్వ పథకాల ప్రచార చిత్రాల రూపకల్పనలో పాల్గొన్నారు. “బ్యాలే బాద్ షా!”

నాట్యరంగస్థలం

చిన్నప్పట్నించే మాత్రా ఛందస్సులో గీతాలు బుర్రకథలు, రాసిన అనుభవంలో బ్నిం నృత్యరూపకాలు 250కి పైగా వ్రాశారు. వీటిల్లో పౌరాణికాలు, చారిత్రాత్మకాలు, సామాజిక అంశాలు, దేశభక్తి ప్రబోధితాలు, జీవన ఇతివృత్తాలు వున్నాయి.వీటిల్లో బహుళ ప్రాచుర్యం పొందిన పసుమర్తి రామలింగ శాస్త్రి గారి కోసం రాసిన శ్రీరామ కథాసారం, డా.మద్దాలి ఉషా గాయత్రి గారికోసం రాసిన మా తెలుగు తల్లికి మల్లెపూదండ” శ్రీమతి స్వాతీ సోమనాథ్ గారి కోసం రాసిన “వాత్సాయన కామసూత్ర”... ఇంకా దేశ విదేశాల్లో ప్రదర్శించబడిన నృత్యరూపకాలున్నాయి.ఒకే కథాంశాన్ని వివిధ కళా సంస్థలకు రాసినప్పటికీ వాటిల్లో వైవిధ్యాన్ని చూపించటం వీరి ప్రత్యేకత. అందుకే వీరు ‘బ్యాలే బాద్ షా’లా కీర్తించబడ్డారు..

రేడియో మీడియా

రేడియో కోసం దాదాపు డజనుకు పైగా కథలు రాసి చదివారు. కొన్ని ఇంటర్వ్యూలు చేశారు.

సంపాదకత్వం

జడపజ్యాలు, మిథునం(తనికెళ్ళ భరణి సినిమాపై ప్రత్యేక కథనం), మన కార్టూనిస్టులు రూపు రేఖలు (సత్తిరాజు శంకర్ నారాయణగారి చిత్ర సంకలనం) ఇంకా ఎన్నో ప్రత్యేక సంకలనాలు.

సత్కారాలు, సన్మానాలు

  1. ఎపి గవర్నమెంటు ‘ఉగాది పురస్కారం’ కళారత్న (హంస) అవార్డు
  2. వంశీ ఇంటర్నేషనల్ వారి వెంకట్ అవార్డు
  3. నోరి నరసింహశాస్త్రి ట్రస్ట్ వారి తలిశెట్టి రామారావు అవార్డు
  4. కిన్నెర ఆర్ట్ థియేటర్ కళానిలయం
  5. ఆరాధన
  6. లయన్స్ క్లబ్
  7. జేసీస్ క్లబ్
  8. అన్నమాచార్య
  9. భావనా వాహిని
  10. సంస్కృతీ సమాఖ్య పొన్నాడ వారి పున్నాగ వనం

వంటి సంస్థలెన్నో వీరిని సత్కరించాయి.

ప్రభుత్వం తరపున గౌరవ బాధ్యతలు

రాష్ట్ర చలన చిత్ర టీవీ రంగస్థల పరిశ్రమాభివృద్ధి సంస్థ నిర్వహించే చలనచిత్ర నంది అవార్డు కమిటీ జ్యూరీ మెంబర్ గా, ఆంధ్రప్రదేశ్ చలన చిత్ర టీవీ, రంగస్థల పరిశ్రమాభివృద్ధి సంస్థ నిర్వహించిన నంది నాటకోత్సవాల జ్యూరీ మెంబర్ గా, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే రిపబ్లిక్ డే పెరేడ్ శకటాలు బహుమతి నిర్ణేతగా వ్యవహరించారు. డిశంబర్ 2023 న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అడ్వయిజరీ ప్యానల్ మెంబర్ గా నియమించబడ్డారు.

ఇంటర్యూలు

మీడియా ఇంటర్యూ

ఆంధ్రప్రభ, ఆంధ్ర భూమి, ఈనాడు, చిత్ర, 64 కళలు.కాం కొత్త సమాచారం, హాస్యానందం, సిటిజన్స్ ఈవినింగ్, హాన్స్ ఇండియా.

ఎలక్ట్రానిక్ మీడియా ఇంటర్యూ

దూరదర్శన్, మాటీవీ, వనితటీవీ, జయజయ శంకర, భారత్ టు డే .... ఛానల్స్ వీరిని ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసాయి. వీరు చిత్రించిన ‘మరపురాని మాణిక్యాలు’ బొమ్మలు యూట్యూబ్ కోసం యానిమేషన్ చిత్రంగా రూపొందింది.

పుస్తకరూపంలో వచ్చిన కొన్ని రచనలు

  1. మిసెస్ అండర్ స్టాండింగ్,
  2. అనగనగా బ్నిం కథలు
  3. అనగనగా మరికొన్ని కథలు
  4. అనగనగా మరిన్ని కొత్త కథలు
  5. మరపురాని మాణిక్యాలు,
  6. చీరపద్యాలు
  7. చిల్డ్రన్ అండర్ స్టాండింగ్

మూలాలు

  1. "కథానిలయం - View Writer". kathanilayam.com. Retrieved 2022-03-04.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2021-04-23. Retrieved 2022-03-04.
  3. "ఆత్రేయపురం కుర్రాడు". Sakshi. 2018-10-27. Retrieved 2022-03-04.

వెలుపలి లంకెలు