భక్త కన్నప్ప గొప్ప శివ భక్తుడు. పూర్వాశ్రమంలో తిన్నడు అనే బోయవాడు. చరిత్ర ప్రకారం శ్రీకాళహస్తి పరిసర ప్రాంత అడవుల్లో సంచరిస్తూ వేటాడి జీవనం సాగించేవాడు. ఒకనాడు అలా వేటాడుతుండగా అతనికి అడవిలో ఒక చోట శివలింగం కనిపించింది. అప్పటినుంచీ తిన్నడు దానిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ తాను వేటాడి తెచ్చిన మాంసాన్నే నైవేద్యంగా పెడుతుండేవాడు.

ఒక సారి శివుడు తిన్నడి భక్తిని పరీక్షించ దలచి తిన్నడు పూజ చేయడానికి వచ్చినపుడు శివలింగంలోని ఒక కంటినుంచి నీరు కార్చడం మొదలు పెట్టాడు. విగ్రహం కంటిలోనుంచి నీరు కారడం భరించలేని తిన్నడు బాణపు మొనతో తన కంటిని తీసి నీరు కారుతున్న కంటికి అమర్చాడు. వెంటనే విగ్రహం రెండో కంటినుంచి కూడా నీరు కారడం ఆరంభమైంది. కాలి బొటనవేలును గుర్తుగా ఉంచి తన రెండో కంటిని కూడా తీసి విగ్రహానికి అమర్చాడు. తిన్నడి నిష్కల్మష భక్తికి మెచ్చిన శివుడు అతనికి ముక్తిని ప్రసాదించాడు. అందువల్లనే తిన్నడికి కన్నప్ప అనే పేరు వచ్చింది. తిన్నడు పూర్వ జన్మలో అర్జునుడు అనే (కిరాతార్జునీయం) ఒక కథ కూడా ప్రచారంలో ఉంది.

తన కన్నును ఈశ్వరునికర్పించినందులకు తిన్నడు కన్నప్ప అయ్యాడు. కన్నప్పనాయనారు అయ్యాడు. నేత్రేశనాయనారు అనునది సంస్కృతనామము