(పురాణరీత్యా) సూర్యుఁడు ఉత్తరాయణ దక్షిణాయన విషువులు అను నామములు కల మాంద్యతీవ్ర సమానగతుల ఆరోహణావరోహణ స్థానములయందు దీర్ఘ హ్రస్వ సమానములుగ చేయుచు ఉండును. మఱియు అతఁడు మేష తులలయందు అహోరాత్రముల సమముగాను వృషభాది పంచమాసములను రాత్రి ఒక్కొకగడియ తక్కువగాను, వృశ్చికాది పంచమాసములను ఒక్కొకగడియ రాత్రి అధికముగాను, దానికి తగినట్లు దినములయందును తిరుగును. ఇవ్విధమున దివసములు ఉత్తరాయణ దక్షిణాయనముల వృద్ధి క్షయములను పొందఁగా ఒక అహోరాత్రమున ఏక పంచాశదుత్తరనవకోటి యోజనముల పరిమాణముగల మానసోత్తర పర్వతమునందు సూర్యుని రథము తిరుగుచు ఉండును. ఆ మానసోత్తర పర్వతమునందు తూర్పున దేవధాని అను ఇంద్రపురమును, దక్షిణమునందు సంయమని అను యమనగరమును, పశ్చిమమునందు నిమ్లోచని అను వరుణ పట్టణమును, ఉత్తరమున విభావరి అను సోముని పుట భేదనమును తేజరిల్లుచు ఉండును. సూర్యుఁడు ఎప్పుడు ఇంద్రనగరమునుండి గమనించునో అదిమొదలు పదియేను గడియలలో రెండుకోట్ల ముప్పది యేడులక్షల డెబ్బదియైదువేల యోజనములు నడుచును. ఇవ్విధమున ఇంద్ర యమ వరుణ పురముల మీఁద చంద్రాది గ్రహ నక్షత్రములను కూడి సంచరించును. పండ్రెండు అంచులును ఆఱు కమ్ములును మూఁడు తొలులును కలిగి సంవత్సరాత్మకమై ఏకచక్రముకల సూర్యుని రథము ముహూర్తమాత్రమున అష్టశతాధిక చతుస్స్త్రింశల్లక్ష యోజనములు సంచరించును. ఆరథమునకు గాయత్రీ ఛందము ఆదిగా సమస్తఛందములును అశ్వములు అయి ఉండును. సూర్యునకు అగ్రభాగమున అరుణుఁడు రథము నడపుచు ఉండును. అంగుష్ఠపర్వమాత్ర శరీరములుగల అఱువదివేల వాలఖిల్యాఖ్యులు అగు ఋషివరులు అతని ముందట సూక్తములచే స్తుతియింప, మఱియును అనేకమునులును గంధర్వ కిన్నర కింపురుష నాగాప్సరః పతంగాదులును, నెలనెలను వరుసచొప్పున సేవింప, తొమ్మిది కోట్ల యేఁబదియొక లక్ష యోజనముల పరిమాణముగల భూమండలమును అంతయు క్షణమునకు రెండువేలు న్నేఁబది యోజనములవంతున ఒక అహోరాత్రముననె సూర్యుఁడు సంచరించును. ఇట్లు అతివేగముగ తిరుగుచు ఉండు కులాల చక్రభ్రమణమునకు వేరై బంతులుసాగి తిరిగెడు పిపీలికాదుల చందమున నక్షత్ర రాసులతో కూడిన కాలచక్రము ధ్రువమేరువులకు ప్రదక్షిణముగ తిరుగునపుడు ఆకాలచక్రమునకు ఎదుట సంచరించు సూర్యాది గ్రహములకు నక్షత్రాంతరముల యందును రాశ్యంతరముల యందును ఉనికి కలుగుటఁజేసి సూర్యాదిగ్రహములకు చక్రగతి స్వగతులవలన గతిద్వయము కలుగుచు ఉండును. సూర్యుఁడు ఆదినారాయణ మూర్తి అగుచు లోకముల యోగక్షేమములకు వేదత్రయాత్మకత్వమును వహించి, కర్మసిద్ధి నిమిత్తము దేవర్షి గణములచే వేదాంతార్థముల అనవరతము వితర్క్యమాణము అగుచున్న తన స్వరూపమును ద్వాదశ విధములుగ విభజించి వసంతాది ఋతువులను ఆయా కాలవిశేషములలో కలుగఁజేయుచు జ్యోతిశ్చక్రాంతర్వర్తియై స్వకీయ తేజఃపుంజదీపితాఖిల జ్యోతిర్గణములు కలవాఁడై ఒక సంవత్సరమున ద్వాదశ రాసులయందును సంచరించుచు ఉండును. అట్టి ఆదిపురుషుని గమన విశేషకాలమును లోకులు అయన, ఋతు, మాస, పక్ష, తిథ్యాది భేదములచే వ్యవహరించుచు ఉందురు. వెండియు అప్పరమపురుషుఁడు ఆరాసులయందు షష్ఠాంశ సంచారమును ఒందిన సమయము ఋతువు అని వ్యవహరింపఁబడును. ఆరాసులయందు అర్ధాంశ సంచారమున రాశిషట్క భోగమును పొందిన కాలము అయనము అని చెప్పఁబడును. సమగ్రముగా రాసులయందు సంచారముచేయు కాలము సంవత్సరము అని నిర్ణయింపఁబడును. ఇట్టి సమగ్ర రాశిసంచారమునందు శీఘ్రగతి, మందగతి, సమగతి అనియెడు త్రివిధగతివిశేషముల వలనను ఏర్పడెడు ఆసంవత్సరమును సంవత్సరము, పరివత్సరము, ఇళావత్సరము, అనువత్సరము, ఇద్వత్సరము అని పంచవిధముగా చెప్పుదురు. చంద్రుఁడును ఈతెఱఁగుననే ఆసూర్యమండలము మీఁద లక్ష యోజనముల నుండి సంవత్సర పక్ష రాశినక్షత్రభుక్తులు పుచ్చుకొనుచు అగ్రచారియై శీఘ్రగతిని చరించును. వృద్ధి క్షయరూపమున పితృగణములకు పూర్వపక్షాపరపక్షములచేత అహోరాత్రములు కలుగ చేయుచు సకల జీవప్రాణమై ఒక్క నక్షత్రము త్రింశన్ముహూర్తములు అనుభవించుచు షోడశకళలు కలిగి మనోమయమును అన్నమయమును అమృతమయమును అగు దేహముతో దేవపితృమనుష్యభూత పశుపక్షిసరీసృపవీరు త్ప్రభృతులకు ప్రాణాప్యాయనశీలుఁడు అగుటచే సర్వసముఁడు అనఁబడి ఉండును.

.............పురాణనామచంద్రిక (యెనమండ్రం వెంకటరామయ్య) 1879

"https://te.wikipedia.org/w/index.php?title=భగోళము&oldid=4010878" నుండి వెలికితీశారు