భలే భలే అందాలు సృష్టించావు

భలే భలే అందాలు సృష్టించావు పాట భక్త తుకారాం (1973) సినిమా లోనిది. దీనిని ఘంటసాల వెంకటేశ్వరరావు మధురంగా గానం చేయగా పి.ఆదినారాయణ రావు సంగీతాన్ని అందించారు. పాట చిత్రీకరణ పశువులు మేతకు పోతున్నప్పుడు పరిసరాల్లోని ప్రకృతి దృష్యాలను చూపించారు. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు నటించారు.

భక్త తుకారాం చిత్రం పోస్టరు

పాట మార్చు

ఉపోద్ఘాతం :

నందనవనముగ ఈ లోకమునే సృష్టించిన ఓ వనమాలి

మరచితివో మానవజాతిని దయమాలి


పల్లవి :

భలే భలే అందాలు సృష్టించావు ఇలా మురిపించావు

అదే ఆనందం అదే అనుబంధం ప్రభో మాకేల ఈయవు


చరణం 1 :

మాటలు రాని మృగాలు సైతం

మంచిగ కలసి జీవించేను

మాటలు నేర్చిన మా నరజాతి

మారణహోమం సాగించేను

మనిషే పెరిగి మనసే తరిగి

మమతే మరచాడు మానవుడు

నీవేల మార్చవు | | భలే భలే అందాలు | |


చరణం 2 :

చల్లగ సాగే సెలయేటి ఓలె

మనసే నిర్మలమై వికసించాలి

గుంపుగ ఎగిరే గువ్వల ఓలె

అందరు ఒక్కటై నివసించాలి

స్వార్ధం మానుకొని సమతే పెంచుకొని

మంచిగ మానవుడే మాధవుడై

మహిలోన నిలవాలి | | భలే భలే అందాలు | |

వివరణ మార్చు

ప్రకృతిని సృష్టించిన దేవుని మనిషిని కూడా సృష్టించి వుంటే బాగుండేదని భావనను ఈ పాట కలిగిస్తుంది.

నందనవనాన్ని తలపిస్తున్న ఈ భూమి మీద మృగాలు, సెలయేర్లు, పక్షులు ఎన్నో సుగుణాల్ని మనకు బోధిస్తుండగా మానవుడు ఎన్నో అకృత్యాలకు పాల్పడుతూ దానవుడిగా మారుతున్నాడు. సత్ప్రవర్తనతో మానవుడు మాధవుడిగా మారవచ్చని అందుకు మనమందరం ప్రయత్నించాలని ప్రబోధిస్తుంది.

బయటి లింకులు మార్చు