భారతదేశం లోకి ప్రవేశం ఆర్డినెన్సు, 1914
1914 సెప్టెంబరులో, మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమౌతున్న సమయంలో, బ్రిటిషు ప్రభుత్వం జారి చేసిన చట్టం, భారతదేశం లోకి ప్రవేశం ఆర్డినెన్సు, 1914. విదేశాల నుండి భారతదేశానికి తిరిగి వచ్చే భారతీయ వ్యక్తుల కదలికను పర్యవేక్షించడానికి, నిర్బంధించడానికి, నియంత్రించడానికీ ఈ చట్టం భారత ప్రభుత్వానికి వీలు కలిగించింది. [1][2]
భారతదేశం లోకి ప్రవేశం ఆర్డినెన్సు, 1914 | |
---|---|
స్థితి: రద్దైంది |
ఇంపీరియల్ జర్మనీ సహాయంతో భారతదేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు ప్రారంభించడానికి గద్దర్ పార్టీ వేసిన ప్రణాళికలకు అనుగుణంగా కెనడా, అమెరికాల నుండి తిరిగి వచ్చే సిక్కు వలసదారులను నిర్బంధించడం, కట్టడి చేయడం ఈ చట్టపు ప్రధాన లక్ష్యం. [3][4] మొదటిగా దీన్ని కొమగట మారు ఓడలో కలకత్తా వచ్చిన ప్రయాణికులపై అమలు చేసారు.తర్వాత ఇతర రేవుల ద్వారా భారత్ లోకి వచ్చేందుకు ప్రయత్నించిన గదరీయులపై కూడ వర్తింపజేసారు. ఎక్కడో దూరంగా షాంఘై వంటి చోట్ల ఉన్న గదరీయులను కూడా బంధించి వాళ్ల వాళ్ళ గ్రామాలకు పంపించడానికి కూడా ఈ ఆర్డినెన్సును ఉపయోగించారు. [5]
WC హాప్కిన్సన్ నేతృత్వంలో ఉత్తర అమెరికాలో ఉన్న బ్రిటిషు నిఘా వర్గాలతో సమన్వయం చేసుకుంటూ, భారతదేశంలోని అధికారులు ఉత్తర అమెరికా నుండి భారతదేశానికి ప్రయాణించిన అనుమానిత గదరీయుల జాబితాలను సంకలనం చేయగలిగారు. భారతీయ ఓడరేవుల వద్ద దిగే ప్రయాణీకులపై ఈ ఆర్డినెన్సును అమలు చెసారు. [6] ఈ చట్తం ప్రకారం ఉత్తర అమెరికాతో పాటు హాంకాంగ్, షాంఘై, మనీలా నుండి వలస వచ్చిన వారిపై కూడా దీన్ని అమలు చేసారు. [7]
డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1915 తో పాటు , భారతదేశంలో విప్లవోద్యమం నుండి వచ్చే ముప్పును నివారించడానికి ఈ ఆర్డినెన్సును యుద్ధ కాలమంతటా పెద్ద ఎత్తున వర్తింపజేసారు. [8] దీనికి ముందు కూడా ఇదే విధమైన ఆర్డినెన్సు - ఫారినర్స్ ఆర్డినెన్స్ - బ్రిటిషు ఇండియాలోకి ప్రవేశించడానికి ప్రయత్నించే విదేశీయుల స్వేచ్ఛను కట్టడి చేసింది.
రౌలట్ కమిటీ అంచనా ప్రకారం 1914 - 1917 మధ్య కాలంలో దాదాపు మూడు వందల మందిని బంధించడానికి ఈ ఆర్డినెన్సును ఉపయోగించారు. అయితే మరో రెండు వేల రెండు వందల మందిని వారివారి గ్రామాలను దాటకుండా - ప్రధానంగా పంజాబ్‌లో - కట్టడి చేసారు. [9]