భారత రాజ్యాంగ పీఠిక

దేశానికి మరియు భారత రాజ్యాంగానికి మార్గదర్శకాల సమితి

భారత రాజ్యాంగానికి క్లుప్తమైన ప్రవేశికగా భారత రాజ్యాంగ పీఠికను రూపొందించారు.[1] దీనినే రాజ్యాంగ ప్రవేశిక, ప్రస్తావన, మూలతత్వం, ఉపోద్ఘాతం, పరిచయం, ముందుమాట అని కూడా అంటారు. భారత రాజ్యాంగం ఈ పీఠికతోనే మొదలవుతుంది. భారతదేశ ప్రజలు దేశంపై ఉంచుకున్న ఆకాంక్షలు, ఆశయాలు, కోరికలు ఈ పీఠికలో స్పష్టమైన అక్షరాలలో తెలపబడ్డాయి. భారత రాజ్యాంగానికి ఆత్మగాను, హృదయంగాను పీఠికను పిలుస్తారు. మారుపేర్లలో ఒక పేరు మూలతత్వం, మరొకటి పరిచయం, ఇంకొకటి ఉపోద్ఘాతం - ఈ పదాలు వివరించిన విధంగానే పీఠిక రాజ్యాంగంలోని సర్వస్వానికి ఒక సారాంశంగా చెప్పుకోవచ్చు. 1949 నవంబరు 26 న రాజ్యాంగ సభ పీఠికను ఆమోదించగా, 1950 జనవరి 26న అమలులోకి వచ్చింది.

భారత రాజ్యాంగ పీఠిక ఆంగ్లంలో, 42వ రాజ్యాంగ అధికరణలో జరిగిన మార్పులకు ముందు

చారిత్రక నేపథ్యం

మార్చు

జవహర్‌లాల్ నెహ్రూ రూపొందించి 1946 డిసెంబరు 13న రాజ్యాంగ సభలో ప్రవేశపెట్టగా, సభ ఆమోదం పొందిన ఆశయాల ఆధారంగా పీఠిక రూపొందింది.[2] పీఠిక గురించి అంబేద్కర్ ఆలోచనలు:

ఇది, నిజానికి, స్వాతంత్ర్యాన్ని, సమానత్వాన్ని, సౌహార్ద్ర, సౌభ్రాతృత్వాన్ని జీవితాశయాలుగా, ఒక జీవన విధానంగా గుర్తిస్తున్నది. ఈ లక్షణాలు ఒకదానితో మరొకటి విడదీయలేనివి: స్వాతంత్ర్యం, సమానత్వం రెండూ విడదీయలేనివి; సమానత్వం, స్వాతంత్ర్యం రెండూ సౌభ్రాతృత్వంతో విడదీయలేనివి. సమానత్వం లేని పక్షంలో స్వాతంత్ర్యం అతికొద్ది మంది ఆధిపత్యాన్ని మిగతా వారి మీద రుద్దుతుంది. స్వాతంత్ర్యం లేని సమానత్వం వ్యక్తిగత అభిప్రాయాన్ని తొక్కేస్తుంది; సౌభ్రాతృత్వం లేని సమానత్వం/స్వాతంత్ర్యం సహజ పరిపాలనకు బహుదూరం.[3]

బేరూబారీ కేసు తీర్పులో భారత అత్యున్నత న్యాయస్థానం పీఠికను రాజ్యాంగంలో అంతర్గత భాగంగా గుర్తించరాదని చెప్పింది. అదే న్యాయస్థానం 1973లో కేశవానంద భారతి కేసులో అంతకు ముందు చెప్పిన తీర్పులోని వ్యాఖ్యను వెనక్కి తీసుకుంటూ రాజ్యాంగంలోని అయోమయాన్ని కలిగించే భాగాలలో స్పష్టత కోసం పీఠికను ఆధారం చేసుకోవాలని తీర్పు చెప్పింది. 1995లో భారత ప్రభుత్వం-ఎల్ఐసీ మధ్య నడిచిన కేసు తీర్పులో మరొకసారి, పీఠిక రాజ్యాంగంలో అంతర్గత భాగమని తెలిపింది.

పీఠిక అసలు స్వరూపంలో సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా భారతదేశాన్ని గుర్తిస్తే, ఆ వాక్యానికి లౌకికవాద, సామ్యవాద పదాలు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడ్డాయి.[4]

పీఠిక పుటను, మిగతా రాజ్యాంగంతో సహా, ప్రసిద్ధ చిత్రకారుడు బెవహర్ రామ్మనోహర్ సింహా రూపొందించారు.

రాజ్యాంగ పీఠిక పాఠ్యం

మార్చు
భారత ప్రజలమైన మేము, భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి, పౌరులందరికీ:

సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని;

ఆలోచన, భావప్రకటన, విశ్వాసం, ఆరాధనల స్వాతంత్ర్యాన్ని ;

అంతస్తుల్లోనూ, అవకాశాల్లోనూ, సమానత్వాన్ని చేకూర్చడానికి;, వారందరిలో

వ్యక్తిత్వ గౌరవాన్ని, జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి;

మన ఈ రాజ్యాంగ పరిషత్ లో 1949, నవంబర్ 26వ తేదీన ఎంపిక చేసుకొని, శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము.

సర్వసత్తాక

మార్చు

భారతదేశం ఒక సర్వసత్తాక దేశం అనగా దేశంలోని అన్ని వ్యవహారాలు దేశమే సలుపగలదు, బయటివారెవరూ దేశ వ్యవహారాలను నిర్దేశించలేరు. దేశంలోని అన్ని వ్యవహారాలు అనగా కేంద్ర ప్రభుత్వం లేదా భారత రాజ్యాంగం దేశాన్ని నడిపిస్తుంది అని, అందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, క్షేత్ర ప్రభుత్వాలు, క్షేత్ర స్థాయి న్యాయస్థానాలు, రాష్ట్ర స్థాయి న్యాయస్థానాలు సహకరిస్తాయని అర్ధం. అలానే బయటివారు నిర్దేశించరు అనగా వేరే దేశాల సత్తా మనపై లేదని.

సామ్యవాద

మార్చు

ఈ పదం 42వ రాజ్యాంగ సవరణలో చేర్చినప్పటికీ, రాజ్యాంగంలోని కొన్ని ఆదేశిక సూత్రాల ద్వారా మొదటి నుంచి మన దేశం సామ్యవాద దేశమేనని తెలుస్తున్నది. సామ్యవాదమంటే రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్య సామ్యవాదమని అర్ధం. అనగా సామ్యవాద లక్ష్యాలను ప్రజాస్వామ్య పద్ధతిలో, సహజ పరిణామగతిలో, అహింసాపరంగా సాధించాలి. సామ్యవాద దేశంలో సంపాదనను, సంపదను సమానంగా ప్రజలకు పంచాలి. అతికొద్ది మంది చేతుల్లో డబ్బు, పరపతి, సంపద ఉండిపోకూడదు. భూమి, పరిశ్రమల, పెట్టుబడుల పై ప్రభుత్వం నియంత్రణ చేస్తూ అందరికీ సమాన హక్కు ఉండేలా చూడాలి.

లౌకిక

మార్చు

లౌకిక దేశమనగా ప్రజలకు, ప్రభుత్వానికి గల అనుసంధానం కేవలం రాజ్యాంగం, చట్టం న్యాయం ద్వారా ఉండాలి. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ పదం పీఠికలోకి చేర్చబడింది. ప్రజల మతాల ఆధారంగా ఎక్కువ తక్కువలు ఉండవు. అన్ని మతాలు సమానంగా గౌరవించబడతాయి, దేశానికి అధికార మతమంటూ ఏదీ లేదు. పౌరులందరూ వారికి ఇష్టమున్న మతాన్ని నమ్మి, ఆచరించి, పెంపొందించుకోవచ్చు.

ప్రజాస్వామ్య

మార్చు

భారతదేశంలో ప్రజలే ప్రభువులు (దేశానికి స్వాములు), అందువలన భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశం. ప్రజల నుండే పాలకులు ఎన్నికల విధానం ద్వారా ఎన్నుకోబడతారు. ఒక వ్యక్తి - ఒక వోటు అనే సిద్ధాంతం పై భారత ప్రజాస్వామ్యం ఆధారపడి ఉంది. భారతదేశ పౌరుడై, 18 ఏళ్ళు నిండిన ప్రతి వ్యక్తి, చట్టం ద్వారా నిలుపుదల లేని సందర్భంలో, వోటు వేసే హక్కును పొందుతాడు. ప్రజాస్వామ్యం కేవలం రాజకీయ పరంగానే కాకుండా సామాజిక, ఆర్థిక పరంగా కూడా అన్వయించుకోవాలి.

గణతంత్రం/లోకతంత్రం

మార్చు

గణతంత్ర ప్రభుత్వంలో, దేశాధినేతను ప్రజలే ఎన్నుకుంటారు, వారసత్వ రాచరికంగానో, నియంత నియంత్రణలోనో ఉండదు. ఈ పదం చెప్పేదేమిటంటే ప్రభుత్వం ఏ ఒక్కరి సొత్తు కాదు. ఒక పరిమిత కాలం వరకు ప్రజల ద్వారా నేరుగా గానీ, పరోక్షంగా గానీ, దేశాధినేత ఎన్నుకోబడతాడు.

న్యాయం

మార్చు

భారతదేశం తన పౌరులకు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించేందుకు నిరంతరం పాటు పడుతుంది.

(i) సామాజిక న్యాయం:

సామాజిక న్యాయమనగా సమాజంలో ఎలాంటి పై తరగతి వర్గాలు ఉండకపోవటమే. కుల, సంప్రదాయ, మత, వర్ణ, లింగ, స్థాన భేదాల ఆధారంగా ఎవరినీ ఎక్కువ తక్కువ చేసి చూడకూడదు. సమాజంలోని అన్ని రకాల దోపిడీలను నిర్మూలించడమే భారతదేశ పంథా.

(ii) ఆర్థిక న్యాయం:

ఆర్ధిక న్యాయమనగా జీతం, ఆస్తులు, ఆర్థిక హోదా ఆధారంగా స్త్రీ పురుషుల మధ్య ఎలాంటి వ్యత్యాసాన్ని చూపకపోవడం. అందరికీ సమానంగా సంపద పంచుతూ, ఆర్థిక సమానత్వం తెస్తూ, వస్తువుల తయారీ-పంపిణీలలో ఏకాధిపత్యాన్ని నిర్మూలిస్తూ, ఆర్థిక వనరులను వికేంద్రీకరిస్తూ, అందరికీ ఆర్థికంగా బాగుపడేందుకు సమాన అవకాశాలను అందివ్వడమే భారత ప్రభుత్వ లక్ష్యం. తద్వారా అందరికీ గౌరవంగా జీవనోపాధి సంపాదించుకునేందుకు అవకాశాలివ్వాలి.

(iii) రాజకీయ న్యాయం:

రాజకీయ న్యాయమనగా సమానంగా, స్వేచ్ఛగా, న్యాయంగా అవకాశాలు ప్రజలకు కల్పిస్తూ వారిని రాజకీయాలలో పాల్గొనేలా చేయడం. ఎలాంటి పక్షపాతం లేకుండా అందరికీ సమానంగా రాజకీయ హక్కులు ప్రదానం చేయటమే లక్ష్యం. భారత రాజ్యాంగం భారత పౌరులందరికీ రాజకీయాల్లో పాల్గొనే హక్కును, స్వేచ్ఛను అందించే ఉదార ప్రజాస్వామ్యాన్ని అందిస్తున్నది.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. బరువా, అపరిజిత (2007). ప్రియంబుల్ ఆఫ్ ది కాన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా: ఎన్ ఇన్‌సైట్ అండ్ కంపారిజన్ విత్ అదర్ కాన్‌స్టిట్యూషన్స్. కొత్త ఢిల్లీ: దీప్ & దీప్. p. 177. ISBN 81-7629-996-0. Retrieved 12 November 2015.
  2. ఎం లక్ష్మీకాంత్ (2013-07-24). "4". ఇండియన్ పాలిటీ (4th ed.). మెక్‌గ్రా హిల్ ఎడ్యుకేషన్. p. 4.5. ISBN 978-1-25-906412-8.
  3. "ఫండమెంటల్ రైట్స్ ఇన్ ది ప్రియంబుల్, ఫ్రీ లా స్టడీ మెటీరియల్, ఐఏఎస్ లా నోట్స్". www.civilserviceindia.com. Archived from the original on 2015-09-23. Retrieved 2015-10-11.
  4. "The Constitution (Forty-Second Amendment) Act, 1976". Government of India. Retrieved 1 December 2010.