మన భూమి పుట్టి 4 500 000 000 సంవత్సరాల చిల్లర అయింది. భూమి పుట్టిన దగ్గరనుండి భూగర్భం లోనుండి నిరంతరం వేడి అలా బయటకి వస్తూనే ఉంది. అగ్ని పర్వతాలు పగిలినప్పుడు, భూగర్భం నుండి వేడి ఊటలు బయటకి ఉబికి వచ్చినప్పుడు, లోపల వేడి ఉందని దాఖలా అవుతోంది కదా. ఇలా వేడి బయటకి వచ్చేస్తూ ఉంటే భూమి కొంత కాకపోయినా కొంతైనా చల్లారాలి కదా. భూమి నుండి సతతం వేడి బయటకి ప్రసారమవుతూనే ఉంటుందనే సత్యం విజ్ఞాన శాస్త్రపు విద్యార్ధులకి ఎరుకే. నాలుగు వందల ఏభై కోట్ల సంవత్సరాలనుండి ఇలా చల్లారుతూన్న భూమి ఈపాటికి పూర్తిగా చల్లారి పోయి ఉండొద్దూ? ఇంకా లోపల ఎందుకీ కుతకుతలు?

ముందస్తుగా అగ్ని పర్వతాలు మనం అనుకున్నంతగా పేలడం లేదు. పేలెనుపో, పేలిన అగ్ని పర్వతాలవల్ల భూమి చల్లారేది బహు కొద్దిగా. రెండు. రోదసిలోకి ప్రసారితమయే వేడి కన్న భూగర్భంలో రేడియో ధార్మిక మూలకాల విచ్చిత్తి వల్ల పుట్టే వేడి చాల ఎక్కువ. ఆఖరుగా మరొక్క ముఖ్య విషయం. పార్కు లోని పచ్చిక మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటూన్న మనకి భూగర్భంలో ఉన్న 1760 సెల్సియస్‌ డిగ్రీల వేడి యొక్క ధాటి ఏమాత్రం తెలియడం లేదంటే దానికి కారణం భూమి పైపెచ్చు. ఇది ఎంతో సమర్ధవంతంగా లోపల వేడిని బయటకి పోకుండా ఆపుతోంది.

నిజానికి మన అదృష్టం బాగుండబట్టి భూమి పుట్టి నాలుగున్నర బిలియను సంవత్సరాలైనా బహు కొద్దిగానే చల్లారింది. ఈపాటికి భూమి పూర్తిగా చల్లారిపోయి ఉండుంటే మన పుట్టి ములిగి ఉండేది. భూమి పూర్తిగా చల్లారిపోతే మరింక భూకంపాలు రావు. అగ్ని పర్వతాలు పేలవు. సముద్ర గర్భంలో భూమి ఉపరితలం మీద ఉన్న ఫలకాలు విస్తరణ చెందవు. భూఫలకాల పయనాలు ఆగిపోతాయి. తద్రూపేణా సరికొత్త పర్వతాలు పుట్టవు. ఉన్న పర్వతాలు ఎదగవు. అంటే భూమిలో చైతన్యం పూర్తిగా చల్లారి పోతుందన్న మాట.

అగ్ని పర్వతాలు పేలక పోతేనూ, భూకంపాలు రాక పోతేనూ వచ్చిన నష్టం ఏమిటని మీరు అడగొచ్చు. జ్వరం వస్తే కస్టమని కాళ్ళూ, చేతులూ చల్లబడి పోవాలని కోరుకుంటామా? భూమిలో చైతన్యం చచ్చిపోతే ఏమిటవుతుందో ఒక్క నిమిషం ఆలోచించండి. ఇంకొక పది కోట్ల సంవత్సరాలలో మన పర్వతాలన్ని గాలి పోటుకీ వర్షపు ధాటికీ అరిగిపోతాయి. ఎత్తు పల్లాలన్నీ చదునుగా అయిపోతాయి. అప్పుడు సముద్రం నెమ్మదిగా భూభాగాన్ని కప్పెస్తుంది. అప్పుడు మన మనుగడకే ముప్పు.

"https://te.wikipedia.org/w/index.php?title=భూగర్భం&oldid=3588280" నుండి వెలికితీశారు