మండోదరి రామాయణంలో రావణాసురుని భార్య. ఈమె మహా పతివ్రత. మండోదరి విశ్వకర్మ పుత్రుడైన మయబ్రహ్మ కుమార్తె. రావణాసురుడు ఈమెను మోహించి పెళ్ళాడాడు. ఇంద్రజిత్తు ఈమెకు పుట్టిన కుమారుడు. ఈమె దేవకన్యయైన హేమకు మయబ్రహ్మకు గలిగిన పుత్రిక . దైవాంశయైన మండోదరి మయుని పుత్రిక. తల్లి హేమ అనబడే దేవకన్య. మండోదరి తన తండ్రితో కలిసి వనంలో సంచరించే వేళ వేటకై రావణుడు వెళ్లినప్పుడు ఈమెను చూస్తాడు. తాను అవివాహితుణ్ణి కాబట్టి తనకు మండోదరిని ఇచ్చి వివాహం జరిపించమని రావణుడు కోరుకుంటాడు. కాబట్టి తండ్రియైన మయుడు మండోదరిని రావణునికిచ్చి వివాహం జరిపించాడు. అందుచే ఈమె రావణాసురుని పట్టమహిషి. మిక్కిలి సౌందర్యం గలది. కేవలం బాహ్య సౌందర్యరాశి మాత్రమే గాదు మండోదరి అంతస్సౌందర్యం మిక్కిలి కొనియాడదగినది. రావణునిచే వరింపబడింది. నీతిని, ధర్మాన్ని కర్తవ్యాన్ని ప్రభోధం చేయగల మనస్తత్వం గలది. ఆమె వ్యక్తిత్వం మిక్కిలి ప్రశంసాపాత్రం. శ్రీమద్రామయణంలో కొన్ని పాత్రలు మానవత్వాన్ని మరచిపోయి ప్రవర్తిస్తే మరికొన్ని పాత్రలు దానవకులానికి చెందినప్పటికి మనవత్వానికి ప్రతీకలైనాయి. లంకాధినేత రావణుని పట్టమహిషి అయిన ఈ మహారాజ్ఞి అలాంటి తత్వంగల స్త్రీమూర్తి. .

ఆలయములో దానము చేయుచున్నమండోదరి

మండోదరి అంటే రావణ బ్రహ్మ సతీమణిగా తెలుసు. ఆమె పేరు తలచుకుంటే చాలు పాపాలు హరించ బడతాయని పురాణాలు చెబుతున్నాయి. మండోదరి రావణుని భార్యనే కాదు. ఆమె మయబ్రహ్మయను మహా శిల్పి కుమార్తె. మండోదరి అంటే మండనం యస్యస ఉదరం. అంటే సన్నని నడుము గలది అని అర్ధం. తెలుగులో మండోదరి అంటే భూమి వంటి పొట్ట కలది. భూమి వంటి ఉదరము అంటే సంతాన సాఫల్యత గల ఉదరము అని.

మండోదరి అహల్య, తార, సీత, ద్రౌపదితో కలిసి పంచ కన్యగా ప్రసిద్ధి చెందింది. విచిత్ర మేమిటంటే, ఈ అయిదుగురు స్త్రీలు తమ భర్తలతో ఏదో విధంగా సంబంధాలు చెడిన వారే. అహల్యని గౌతమ ఋషివెళ్ళగొట్టాడు (పర పురుష సంబంధం ఉందన్న కారణంగా), తార తన భర్త వాలి చనిపోయిన తరువాత అతని సోదరుడైన సుగ్రీవుడిని వివాహమాడింది, సీత చెప్పుడు మాటలు విన్న రాముడి చేత వెళ్ళ గొట్టబడింది, ఇక ద్రౌపది అయిదుగురు భర్తలు ఆమెను జూదంలో ఒడ్డి, పోగొట్టుకున్నారు. అయితే మండోదరి మాత్రం ఒక అసురుని భార్యగా మాత్రమే తెలుసు.

మండోదరి గురించి అనేక పురాణ కథలు వ్యాప్తిలో ఉన్నాయి. అందులో ఒకటి: మండోదరికి జన్మించిన సంతానం వల్ల తన భర్తకు ప్రాణ హాని ఉందని జోస్యం చెప్పింది. ఒక రోజు ఆమె ఒక కుండలో నీరనుకుని రక్తం తాగుతుంది. ఆ రక్తం రావణుడు వధించిన రుషులది. ఆ కారణంగా ఆమె గర్భం ధరించి, ఒక కుమార్తెకు జన్మనిస్తుంది. జోస్యం తెలిసిన భర్త తన బిడ్డని బతకనివ్వడని, ఆమెను ఒక పెట్టెలో పెట్టి, సముద్రంలో విదిచిపెడుతుంది. సముద్రుడు ఆ పెట్టెను భూదేవికి ఇస్తాడు. భూదేవి దానిని జనకుడికి ఇస్తుంది. ఆ పాపే సీత. రావణుడు సీతను అపహరించి లంకకు తెచ్చినపుడు మండోదరి తన కుమార్తెను గుర్తుపట్టి, రావణుడికి కాలం చెల్లిందని తెలుసుకుంటుంది.

మూలాలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=మండోదరి&oldid=3659173" నుండి వెలికితీశారు