మచ్చ వేంకటకవి
మచ్చ వేంకటకవి (1856-1903) 19 వ శతాబ్దిలోని విద్వత్కవులలో ఒకడు. అతను ప్రబంధాలు, శతకాలు, పద్య కావ్యాలు, కొన్ని కీర్తనలను రచించాడు. అతని కవితాశైలి మిక్కిలి ప్రశస్తము.[1] అతని సాహిత్య వివాదములు ఆనాటి ఆంధ్రభాషాసంజీవని, హిందూజన సంస్కారిణి (చెన్నపురి) బుధవిధేయి మొదలైన పత్రికలలో ప్రచురించబడినవి.
జీవిత విశేషాలు
మార్చుమచ్చా వెంకటకవి 1856 రాక్షసనామ సంవత్సరంలో శ్రీకాకుళం జిల్లా నైజాము మండలములోని జల్నా గ్రామంలో జన్మించాడు. అతని తండ్రి గంగయ్య.[1] ఈ కవి పూర్వీకులు అప్పటికి 200 సంవత్సరాల క్రితం బందరు నుండి విశాఖపట్నం మండలంలో ఉన్న శ్రీకాకుళంనకు పోయి మహమ్మదీయ ప్రభువుల సైన్యములో సర్దార్లుగా ఉద్యోగం చేసిరి. అతని తండ్రి సైనిక పటాలములో పనిచేయుచుండగా శ్రీకాకుళం జిల్లా లోని జమ్నాపురికి వచ్చిరి. అక్కడ నివసించు సమయంలో వేంకటకవి జన్మించెను. గంగయ్యకు తెలుగు సాహిత్యంలో కొంత ప్రవేశం ఉంది. అతను బ్రౌన్ దొరకు సమకాలీనుడు. ఆ కాలంలో బ్రౌన్ దొర రాజమహేంద్రవరం నకు జిల్లా జడ్జిగా ఉండే సమయంలో అతనితో గంగయ్య స్నేహం చేసి మన్ననలు పొందెను. ఈ విషయమును వేంకటకవి తన వైదర్భీపరిణయ కావ్యమున పద్య రూపంలో తెలిపెను.
శా.సీ.పీ.బ్రౌన్ దొరగారు మండలపు జడ్జినుప్రమేయంబునం
దేపారం జని గంగయాహ్వయుడు హాయింగాంచి తానాంధ్ర వి
ద్యాపాండిత్యము మేటి గ్రంధపఠనాద్యస్తోక నైపుణ్యమున్
జూపెన్ రాజమహేంధ్ర పట్టణమునన్ సూర్యుత్తముల్ మేలనన్.
వేంకటకవి మూడేండ్ల వయసులో "జాల్నా" లో దొంగ మిఠాయి పొట్లం తినజూపి అతనిని ఎత్తుకొని పోయి శరీరంపై నున్న బంగారమంతా దొంగిలించి పాడుపడిన నూతిలో పడవైనెనట. అతని తండ్రి సైనికోద్యోగి అయినందున నాలుగు మూలలా వెదుకగా పాడుపడిన నూతిలో దొరికెనట. ఆ పిల్లవానిని బుజ్జగించి బాటసారులు అతని తండ్రికి అప్పగించిరి. ఆ పిల్లవాని చెవుల కమ్మలను దొంగలు త్రెంచినందున చెవితమ్ములు వేంకటకవికి మరి కలియలేదు.
ఉద్యోగ జీవితం
మార్చుఅతను తన తండ్రి వద్ద తెలువు సాహిత్యాన్ని మొదట నేర్చుకొనెను. సంస్కృత భాషను తెలికిచెర్ల శివరామశాస్త్రి వద్ద నేర్చుకొనెను. శ్రీకాకుళం హైస్కూలులో ఆంగ్ల భాషను నేర్చుకొనెను. గంజాం మండలంలోని పురుషోత్తమపురం లో సబ్‌రిజిస్టారు ఉద్యోగంలో చేరెను. అతనికి భాషపై గల మక్కువతో పర్లాకిమిడి కళాశాలలో పండిత పదవిని చేపట్టెను. అతని రచనలు ప్రధానముగా నాటి అముద్రిత గ్రంధ చింతామణి (నెల్లూరు), పురుషార్ధ ప్రదాయని (బందరు) పత్రికలలో ప్రచురితమైనవి.
వేంకటకవికి సమస్యా పూరణములపై ఆసక్తి ఎక్కువ. "వార్తాలహరి" యను పత్రికలో త్రిపురాన తమ్మయకవి (ఆంధ్ర దేవీభాగవతగ్రంధ కర్త) ఇచ్చిన "ప్రద్యుమ్నాగారమందు భానుడు వొలిచెన్" అను సమస్యకు వేంకటకవి వ్రాసిన పూరణములు ఎంతో మధుర ధోరణిలో నున్నవి. వీటిని అతను ఏకారణముననో తనశిష్యుని పేర వెలువరించెను.
క. మద్యమ్ము ద్రావినవో
విద్యున్నేతల గుఱించి వెత జెందితివో
విద్యావిహీన! యెక్కడి
ప్రద్యుమ్నాగారమందు భానుడు వొలిచెన్!
క. విధ్యానిధి నిటు డొకసతి
జోద్యమ్ముగ గూడునెడ రజోగుణ మిషచే
హృద్యమ్మగు నక్కోమలి
ప్రద్యుమ్నాగారమందు భానుడువొలిచెన్.
క.విద్యాధరార్చితా! యర
పద్యమ్మున నీసమస్య పరగ ముంగితున్
హృద్యమ్మగు ప్రాగ్గిరి దీ
ప్రద్యుమ్నాగారమందు భానుడు వొలిచెన్.
రచనలు
మార్చు9. ముఖలింగేశ్వరోదాహరణము, 10. జావళీలు, 11. హరిభజన కృతులు.
ప్రబంధాలు
మార్చు- శుద్ధాంధ్ర నిర్వచన నిరోష్ఠ్య కుశచరిత్ర
- వైదర్భీ పరిణయము
- చెన్నకేశవ రామాయణము (రామాయణ సంగ్రహ శతకము),
శతకాలు
మార్చు- రుక్మిణీ నాటకము
- రామాయణ సంగ్రహ శతకమ
- ఛాయాపుత్ర శతకము (శనిస్తవము)
పద్య కావ్యాలు
మార్చు- ద్రౌపదీ వస్ర్తాపహరణము
- మయూరధ్వజోపాఖ్యానము
- అంబరీషోపాఖ్యానము
- ముఖలింగేశ్వరోదాహరణము
ఇవి కాక జావళీలు, హరిభజన కృతులు రచించాడు.
ఇతర విశేషాలు
మార్చుపర్లాకిమిడి రాజావారి కళాశాలలో కొంతకాలము తెలుగు పండితులుగా ఉండేవాడు. విక్టోరియా మహారాణి మరణించినపుడు ఆ కళాశాలలో జరిగిన పరామర్శ సభలో అతను కొన్ని పద్యములు రాసి చదువనారంభించెను. అప్పుడు రాజుగారి కార్యదర్శి చింతలపాటి హనుమంతరావుపంతులు తొందరపాటున లేచి దేశభాషాపండితులకు వర్తమానగౌరవాచార ఫక్కి తెలియదనియు, నిట్టి వారిని వేదిక నెక్కింపరాదనియు నొక్కిసభలో జెప్పెను.
అంతట వేంకటకవి యేదో బదులు పలుకుచుండగా, ఆకళాశాలలో నపుడు ప్రధమ సహాయోపాధ్యాయులుగా నున్న గిడుగు రామమూర్తి పంతులు లేచి యిట్లు పలికెను. "వేంకటకవి సామాన్యకవిగాకాడు. ఆంధ్ర మండలములో నితనివంటి కవులు చాల తక్కువగానున్నారు. ఇతని కవిత్వ పటుత్వము నేటివారిలో గొందఱకేగాని లేదు. ఇట్టివానికి స్వేచ్ఛ నీయవలయును."
అతను 1903 జనవరి 9 న మరణించిరి.
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "ఆంధ్ర రచయితలు/మచ్చా వేంకటకవి - వికీసోర్స్". te.wikisource.org. Archived from the original on 2020-06-21. Retrieved 2020-06-20.