మట్టిగంప
మట్టిగంప | |
కృతికర్త: | పరిమళ్ |
---|---|
ముఖచిత్ర కళాకారుడు: | పి. బాల జంగయ్య |
దేశం: | భారత దేశం |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | కవిత్వం |
ప్రచురణ: | పాలమూరు ప్రచురణలు |
విడుదల: | జనవరి, 2005 |
పరిచయం
మార్చుమట్టిగంప మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన అభ్యుదయకవి పరిమళ్ రాసిన కవిత్వ సంపుటి. వివిధ పత్రికలలో, అనేక సందర్భాలలో వెలువడిన ప్రత్యేక సంచికలకు పరిమళ్ రాసిన 42 కవితలతో వెలువడిన పుస్తకం ఇది. ఈ పుస్తకానికి వీక్షణం సంపాదకులు ఎన్. వేణుగోపాలు ముందుమాట రాశారు.
రచయిత పరిచయం
మార్చుపరిమళ్ మహబూబ్ నగర్ జిల్లా, బిజినేపల్లి మండలం, మంగనూర్ గ్రామానికి చెందిన కవి. జిల్లాలోని అభ్యుదయ కవులలో ప్రముఖుడు. పాలమూరు అధ్యయన వేదికలో క్రియాశీల కార్యకర్త. వృత్తి రీత్యా తెలుగు ఉపన్యాసకులు.
పుస్తక సమీక్ష
మార్చు'సామాన్యుడి బతుకు జెండాలో అశోక చక్రం " మట్టిగంప"
అనాది నుండి ఈనాటి దాకా కరువుకు చిరునామా పాలమూరే. ఇక్కడ అడుగడుగునా నెర్రెలు బారిన నేలే. ఇక్కడ ఊరూరా బతుకులు కూలిన జాడే. అంతటా ఆకలే. మనుషుల నిండా ఆవేదనే. సూర్యుడు ఉదయించినా, అస్తమించినా సంబంధమేమి లేకుండా మనుషులు అస్తమిస్తూనే ఉండే నేల ఇది. ఈ దుర్భర దారిద్ర్యం, ఇక్కడి ప్రకృతి శాపం చాల మంది సున్నిత హృదయులైన చదువరులను కవులను చేసింది. ఆ ఒరవడిలో ఉదయించిన కవే 'పరిమళ్'. నేటి అభ్యుదయ, విప్లవ కవిత్వంతో పరిచయం ఉండిన ఎవరికైనా పరిచయమైన పేరే. అతను వెలువరించిన కవితా సంకలనమే " మట్టిగంప". ఈ కవి కవితను నెత్తికెత్తుకోని పత్రిక లేదు. ఈ కవి గొంతును వినిపించని విప్లవ కవితా వేదిక లేదు. ప్రతి దుర్మార్గపు, దుశ్చర్యను ఖండిస్తూ నిరసన గళమెత్తిన ప్రతి అభ్యుదయ కవితా సంకలనానికి ఈ కవి కవిత అధనపు బలాన్నిచ్చింది. ఆయుధమైంది. ఒక్క మాటలో చెప్పాలంటే... " పిడికిలి మీద కొత్త స్వప్నాలు పూయించాల"ని కలలు కనే అభ్యుదయవాది. కాబట్టే పాలమూరు కరువు, దళితుల దైన్యం, ప్రపంచీకరణ పైశాచికత్వం, అగ్రరాజ్యపు ఆధిపత్యం, కాషాయపు రంగు నల్ల రంగుకు చేసిన ద్రోహం,...మొదలగు నేపథ్యాలతో, 42 కవితలతో ఈ మట్టిగంపను రూపొందించాడు. మరీ ముఖ్యంగా పాలమూరు మట్టి మనుషుల గురించి, వారి కష్టాల గురించి, కన్నీళ్ళ గురించి,... వారి బతుకు గోసకు అక్షరాలు అద్ది ఈ మట్టిగంపను " సామాన్యుడి బతుకు జెండాలో అశోక చక్రం"గా నిలిపాడు. ఇందులో ఉన్న ఒక్కో కవిత మనల్ని ఒక్కో కుదుపు కుదిపి ఆలోచనల్లోకి నెట్టివేస్తుంది. రెండు నదులు, లెక్కలేనన్ని వాగులు, వంకలు ఉన్నా పాలమూరు ఎందుకు ఎడారిగా మారిందో ఎవరికీ అర్థం కాని ధైన్యం. అందుకే కవి ... " నీళ్ళు పక్కనే ఉన్న మనిషికి నీడ లేదు మెతుక్కోసం దూరాలకు వేళ్ళాడ్డం" " రక్త సంబంధాలని నిత్యం కన్నీళ్ళ మీద గుర్తుచేసుకోవడం" ఇక్కడ నిత్య కృత్యమైందని వాపోతాడు. పాలమూరు కరువుకు పరాకాష్ట ప్రతీకనేమో అనేవిధంగా చెప్పిన కవిత 'కరువూరు'. ఈ కవితలోని ఓ మూడు పాదాల్లో రెండు దుఃఖపు దృశ్యాలు ఏక కాలంలో మన కళ్ళ ముందు కదలాదుతాయి. ఆ రెండు ఒక దానితో ఒకటి ముడిపడినవే. ఒకటి ఇక్కడి నేల దౌర్భాగ్యాన్ని గుర్తు చేస్తే , మరోటి ఆ నేల మీద ఆధారపడిన బడుగు జీవుల కన్నీటి గాథను గుర్తు చేస్తుంది. చూడండి... " ఇక్కడ వాన ఆకాశంలోంచి ఎప్పుడైనా కురిసిందా ? కన్నుల్లోంచే ..." ఈ మాటలు పొడిబారిన మన కళ్ళను, తడారిన మన గుండెను మెలిపెట్టకుండా వదిలేస్తాయా? " ఓ ఊరి గూటిలో దీపం వెలగాలంటే ఈ ఊళ్ళో గాజులు పగలాలి" ఈ చారిత్రిక సత్యం -పాలమూరు వలస జీవి శ్రామిక త్యాగం ఎంత గొప్పదో గుర్తు చేయటం లేదూ? ఈ కవి ఛాయా చిత్ర కవిత్వంలో ఒక చోట స్వీయ పరిచయమేమో అనిపించే ' కలల దారి' కవిత ఈ కవి కవిత్వం నిండా భావ చిత్రాలెందుకు ఉన్నాయో సమాధానం చెబుతుంది. " పిచ్చివాళ్ళను, కుక్క పిల్లలను/ ఎవరైనా బాధిస్తే / కన్నీటి చుక్కలై రాలేవాణ్ణి" అని అనటం ద్వారా ఈ కవిత్వానికి ఇంతటి హృద్యతా, ఆర్ద్రత ఎలా అంటుకుందో కూడా మనకు తెలిసిపోతుంది. దళితుల అణచివేతను, అవమానాల్ని, ధీనత్వాన్ని చిత్రించిన కవితలకు ఇందులో కొదువే లేదు. మచ్చుకు ... " మనుషులమే కాని మలినపరుచబడ్డాం తరతరాలుగా కుట్రల గొలుసులతో ఊరి బయట బంధించబడ్డాం" అని బాధ పడుతూనే, అందుకు కారణమైన వర్ణ ధర్మాన్ని - "పాదాలు లేకుంటే నడకెక్కడిది? మీ బతుకులకు ఆ హొయలెక్కడివి ?" అని ఘాటుగానే ప్రశ్నిస్తాడు. అంతే కాదు దళితులూ, మైనార్టీలు వేరు కాదని, ఒకే కొమ్మకు పూసిన రెండు పువ్వులని, ఉమ్మడి శత్రువు మీదికి దూయవలసిన ఒకే ఒరలోని రెండు కత్తులన్నది ఈ కవి భావం. వృత్తిని కులంగా, కులాన్ని మతంగా మార్చేసి తన జాతికి అవమానాల్ని అంటగట్టినప్పుడు - " నా కనులు తుడిచింది నా గుండెను చిగురింపజేసింది చల్లని కిరణాల నెలవంకనే" అన్న చారిత్రిక వాస్తవాన్ని గుర్తు చేయడంలోని ఔచిత్యం, వారితో సఖ్యతను కోరుకోవటమే. వర్తమాన దేశాల మీద అగ్ర రాజ్యపు పెత్తనాన్ని నిరసిస్తూ... " భూగోళం మీద ప్రతివాడూ పడమటి గాలినే పీల్చాలా? అని ప్రశ్నిస్తాడు. అయితే ఇదే గొంతుక " ఒక పడమటి రుతు పవనం కరుణ జల్లుకు నా మేధస్సు వేయి హరిత శాఖలైంది". అని అన్నప్పుడు కొంత ఆశ్చర్యంగానూ, వింతగానూ అనిపించవచ్చు. కాని- " అక్షరాలు శిరస్సు నుండి పాదాల దాకా చెమట పాదాల నుండి శిరస్సు దాకా ప్రవహించడం నిషేధించిన" ఆర్యుల ద్రోహం గురించి విడమరిచి చెప్పిన తరువాత మనకిక ఔననక తప్పని పరిస్థితే. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నైనా చెప్పవచ్చు. అసలు ఈ పుస్తకం ఏ సమీక్షకుడికైనా ఒక సవాలే. ఎందుకంటే ఏ పుస్తకంలోనైనా ఓ గొప్ప పాదం ఎక్కడుందని వెతుక్కోవాలి-ఉటంకించడానికి. కాని ఈ పుస్తకంలో దేన్ని వదిలేయాలో అర్థంకాని పరిస్థితి. ఇది మరీ అతిశయోక్తిలా అనిపించినా, అక్షర సత్యం. ఇంకా ఈ సంకలనంలో మతం, అది చిమ్ముతున్న విషం, విత్తుల్లోకి చొచ్చుక వస్తున్న కల్మష విప్లవం, క్యాసెట్లలో బంధీ అయిపోయినా జానపదాల ధైన్యం, మాల మాదిగల మధ్య రగులుతున్న అంతర్యుద్ధం ఒకటేమిటి ఎన్నెన్నో ఇతని కలంలో కవితలుగా ప్రాణం పోసుకున్నాయి. ఇక ఈ సంపుటిలో నూతన పదబంధాలకైతే కొదువేలేదు. నేలసింహాసనం, నోట్లహంసలు, దుమ్ముదయ్యం, నూనెపాయసం లాంటి అనేక పదబంధాలు దర్శనమిస్తాయి. వీటితో చిన్న సైజు నిఘంటువును తయారు చేయవచ్చేమోనన్పిస్తుంది. మొత్తం మీద చెప్పొచ్చేదేమంటే కవిత్వం రాయాలని కుతూహలపడే నవతరానికి నిస్సందేహంగా ఈ పుస్తకమొక పెద్ద బాలశిక్షే. ఇదంతా చూసి ఈ కవెవరో కవిత్వంలో, వయసులో తలపండిన కురువృద్దుడనుకుంటే పొరపాటే. ఈ పుస్తకం వెలువడే నాటికి (2005) ఈ కవి బహుశా మూడు పదులైనా దాటి ఉండక పోవచ్చు. ఈ వయసు నాటికే ఇంత పరిణితి చెందిన, ప్రతీకాత్మకమైన, ఘాడమైన కవిత్వాన్ని వెలువరించిన ఈ కవి నుండి మరో పది, పదిహేను సంవత్సరాల తరువాత ఎలాంటి కవిత్వం రాగలదో ఊహిస్తేనే, మనుసు ఉప్పొంగకుండా ఊరుకోదు. బహుశా ఇదంతా పాలమూరు మట్టి మహిమే కావొచ్చు.