మద్రాసు దినోత్సవం

మద్రాసు నగరంలో నిర్వహించే వేడుకల్లోని ఒక దినోత్సవ రోజు మద్రాసు దినోత్సవం, భారతదేశంలోని తమిళనాడు రాష్ట్ర రాజధాని నగరం మద్రాసు. మద్రాస్ డేను ప్రతి సంవత్సరం ఆగస్టు 22 న జరుపుకుంటారు. ఒకప్పటి అచ్చ తెలుగు పట్టణం అయిన చెన్నపట్నం దక్షిణ భారత దేశానికి సింహద్వారం వంటిది. ఈ చెన్నపట్నం వాడుకలో మద్రాసుగా పిలవబడింది, కొన్ని సంవత్సరాల క్రితం మద్రాసుకు చెన్నై అనే పేరును అధికారిక పేరుగా నిర్ణయించారు. ఈ చెన్నపురి పురుడు పోసుకొని ఇప్పటికి (22-08-2023) 384 వసంతాలు పూర్తి చేసుకొంది. 22-08-1639లో ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన ఫ్రాన్సిస్ డే అప్పటి చంద్రగిరి రాజు శ్రీరంగరాయల ఏలుబడిలో శ్రీకాళహస్తి దీవాన్ గా ఉన్న "ముద్దు వెంకటప్ప నాయకుడి" నుంచి ఇప్పటి చెన్నైలోని కూవం నది పక్కన ఉన్న కొంత ప్రాంతాన్ని కప్పం చెల్లించి కొన్నారు. ఈ సందర్భంలో ఈ ప్రాంతంలో నిర్మించబోయే ఊరికి తన తండ్రి "చెన్నప్ప నాయని" పేరు పెట్టాలని బ్రిటిష్ వారిని వెంకటప్ప నాయకుడు కోరారు. అలా ఈ పట్టణం చెన్నపట్టణం పేరుతో ఆవిర్భవించింది. చెన్నపట్నం ఆవిర్భవించిన తర్వాత ఏడాది 1640లో బ్రిటీష్ వారు ఇక్కడ సెయింట్ జార్జి కోటను నిర్మించి తమ ఈస్ట్ ఇండియా కార్యకలాపాలకు ఉపయోగించుకున్నారు. ఆనాటి నుంచి నేటి వరకూ ఈ ప్రాంతం అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూనే ఉంది. ప్రతి సంవత్సరం ఈ వేడకలు మద్రాసులో వారం నుంచి నెల రోజుల పాటు జరుగుతాయి. ఈ సందర్భంగా చెన్నై నగర చరిత్రను తెలియజేసే ఫొటో ప్రదర్శనలు, చారిత్రక ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

చెన్నపట్నానికి సంబంధించి కొన్ని విశేషాలు మార్చు

  • ఆంధ్రప్రదేశ్ లోని చంద్రగిరి కోటలో మద్రాసు ప్రాంతాన్ని బ్రిటీషు పాలకులకు అప్పగించే ఒప్పందం కుదిరింది.
  • 1917లో మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో మద్రాసుపై ఎండెన్ అనే జర్మనీ నౌక బాంబుల వర్షం కురిపించింది.
  • ఆధునిక భారతదేశంలోని తొలి నగరం ఇదే. కోల్‌కతా కన్నా 50 సంవత్సరాల తర్వాత, ముంబై కన్నా 35 సంవత్సరాల తర్వాత మద్రాసు అభివృద్ధి చెందింది.
  • చెన్నై నగరం మొట్టమొదట "చెన్నప్ప నాయకన్"గా అని పిలవబడేదట. ఆ తర్వాత కాలక్రమంలో అది చెన్నపట్నంగా, మద్రాస్‌గా మారి నేడు చెన్నై అనే పేరుతో స్థిరపడింది.
  • 1996లో ఈ నగరం పేరును అధికారికంగా మద్రాసు నుంచి చెన్నైగా మార్చారు.
  • ప్రపంచంలోనే రెండో అతిపొడవైన మెరీనా బీచ్ ఈ చెన్నపట్నంలోనే ఉంది.
  • బాలీవుడ్‌కు దీటైన తమిళ సినీపరిశ్రమ ఇక్కడే ఉంది.

మూలాలు మార్చు

  • ఈనాడు దినపత్రిక - 23-08-2014 - (ఘనంగా చెన్నై 375 వసంతాల వేడుకలు)
  • సాక్షి దినపత్రిక - 23-08-2014 - (చెన్నపట్నానికి 375 ఏళ్లు)