మనిసన్నాకా కూసింత కలాపోసన ఉండాల

మనిసన్నాకా కూసింత కలాపోసన ఉండాల (లేక మడిసన్నాకా కాసింత కలాపోసన ఉండాల లేక మనిషన్నాకా కూసింత కళాపోషణ ఉండాలి) అన్నది ముత్యాలముగ్గు సినిమాలో ముళ్ళపూడి వెంకటరమణ రాయగా కాంట్రాక్టరు పాత్రలో రావు గోపాలరావు పలికిన డైలాగు. ఈ సినిమా డైలాగు విపరీతమైన ప్రజాదరణ పొందడంతో క్రమేపీ రోజూవారీ సంభాషణల్లోనూ, పత్రికా రచనలోనూ, ప్రసంగాల్లోనూ జనం సరదాగా వాడే నానుడిగా నిలిచిపోయింది.

మూలం మార్చు

ముత్యాలముగ్గు సినిమాలో కాంట్రాక్టర్ అన్న ప్రతినాయక పాత్ర తెర మీద కనిపించగానే వచ్చే సంభాషణల్లో ఇది భాగం. ఈ సంభాషణలు ముళ్ళపూడి వెంకటరమణ రాయగా, కాంట్రాక్టరు పాత్ర ధరించిన రావు గోపాలరావు చెప్పాడు. కాంట్రాక్టరు పాత్ర కనిపిస్తూనే ఆకాశంలో సూర్యోదయాన్ని చూస్తూ ఉంటుంది. అప్పుడు అతని సెక్రటరీతో మాట్లాడే సంభాషణల్లో ఈ డైలాగు ఉంటుంది.[1]

కంట్రాక్టరు: "అబ్బా సెగట్రీ ఎప్పుడూ పనులు బిగినెస్సేనా, ఆఁ! పరగడుపునే కాసింత పచ్చిగాలి పీల్చి, ఆ పెత్యక్ష నారాయణుడి సేవ చేసుకోవద్దూ!"

సెక్రటరీ: "యస్సర్"

కంట్రా: "యస్సర్ గాదు. కళ్ళెట్టుకు సూడు. పైనేదో మర్డర్ జరిగినట్టు లేదూ ఆకాశంలో? సూర్యుడు నెత్తుటి గడ్డలా లేడూ?"

సెక్ర: "అద్భుతం సార్"

కంట్రా: "ఆఁ మడిసన్నాకా కాసింత కలాపోసన ఉండాలయ్యా. ఉత్తికే తిని తొంగుంటే మడిసికీ గొడ్డుకీ తేడా ఏటుంటదీ!"

ప్రాచుర్యం, ప్రయోగం మార్చు

1975లో విడుదలైన ముత్యాలముగ్గు సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఆ విజయంలో రావుగోపాలరావు డైలాగులకు, అతని నటనకు చెప్పుకోదగ్గ వాటా ఉందని చాలామంది విమర్శకులు, ప్రేక్షకులు పరిగణిస్తారు.[2][3] ఇందులో రావుగోపాలరావు డైలాగుల ప్రాచుర్యం వల్ల అవి ప్రత్యేకంగా రికార్డులుగానూ, క్యాసెట్లుగానూ వెలువడి ఎంతగానో అమ్ముడుపోయాయి.[4][5] వ్యంగ్యంతో నిండిన ముళ్ళపూడి వెంకటరమణ డైలాగులు, వాటిని రావుగోపాలరావు గోదావరి యాసలో, తాపీగా, విలక్షణమైన శైలితో చెప్పడమూ కలగలిసి ఈ డైలాగులకు ప్రత్యేకత తెచ్చిపెట్టాయి. అందులోనూ "మడిసన్నాకా కాసింత కలాపోసన ఉండాలయ్యా" అన్న డైలాగు సినిమా పరిధి దాటి బయట కూడా ప్రాచుర్యం చెందింది. సీరియస్ సందర్భాల్లో జీవితంలో ప్రవృత్తి, సరదాల అవసరం గురించి చెప్తూ కానీ, వ్యంగ్యంగా రాజకీయాల నుంచి పలు విషయాలను వెక్కిరిస్తూ కానీ కూడా ఈ డైలాగును కొటేషన్‌గా వార్తల్లో, వ్యాసాల్లో విరివిగా వాడుతూ ఉంటారు.[6][7][8]

మూలాలు మార్చు

  1. Rao Gopal Rao Comedy Scenes | మడిసన్నాక కాసింత కలాపోసనుండాలయ్యా రావు గోపాలరావు | TeluguOne, retrieved 2023-12-24
  2. Balu (2023-04-26). "Rao Gopala Rao : 'నీది ఒక గొంతేనా అని హేళన చేసారు'.. చివరకి స్టార్ విలన్ గా ఎలా ఎదిగారు…". Retrieved 2023-12-24. కథ కథనాల పరంగా ముత్యాల ముగ్గు ఎన్ని మార్కులు కొట్టేసిందో, రావు గోపాలరావు డైలాగ్స్ కారణంగా అన్ని మార్కులను సొంతం చేసుకుంది.
  3. "విలక్షణ విలనిజం – TeluguMalli". telugumalli.com. Retrieved 2023-12-24.
  4. సినీ రమణీయం-2కు సంపాదకుడు యమ్బీయస్ ప్రసాద్ రాసిన "రమణ కురుక్షేత్రం జీవనరంగమే!" అన్న వ్యాసం
  5. "తెలుగు సినిమా విలనిజానికి పెట్టింది పేరు రావు గోపాల్ రావు." indiaherald.com. Retrieved 2023-12-24.
  6. Telugu, TV9 (2023-01-30). "Engagement Ceremony: ఓరి నీ యేషాలు.. ఇదా మీ రింగులో యవ్వారం.! వైరల్ వాడుతున్న వీడియో." TV9 Telugu. Retrieved 2023-12-24. మనిషన్నాకా కూసింత కళాపోషణ ఉండాలని అనుకున్నారో ఏమో తెలియదు కానీ కొంతమంది మాత్రం తమ ఎంగేజ్మెంట్, పెళ్లి వేడుకలను వెరైటీగా ప్లాన్ చేసుకుంటున్నారు.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  7. Desk, HT Telugu. "Monday Motivation | లైఫ్​ అంటే కలర్​ఫుల్ గా.. బ్యూటీఫుల్ ​గా ఉండాలి." Hindustantimes Telugu. Retrieved 2023-12-24. మనిషన్నాకా కాసింత కళాపోషణ ఉండాలి అని ఓ సినిమాలో రావుగోపాలరావు చెప్తారు. అలాగే లైఫ్ అన్నాక దానిలో కొన్నైనా రంగులు ఉండాలి. {{cite web}}: zero width space character in |title= at position 25 (help)
  8. "Political Satire: తెలంగాణ లీడ‌ర్ల 'రాజీ'కీయం.. స‌భ‌ల‌లో స‌వాళ్లు, ప్రైవేట్‌గా దోస్తానా!". Prabha News (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-08-07. Retrieved 2023-12-25.