మనుస్మృతి (పుస్తకం)


మనుస్మృతి ఒక ప్రాచీన ధర్మశాస్త్రం. దీనిని మనుధర్మశాస్త్రమని పిలుస్తారు. ఈ పుస్తక ప్రచురణకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు.

ఈ గ్రంథంలో పన్నెండు అధ్యాయాలున్నాయి. ప్రతి అధ్యాయం చివరా భృగుమహర్షి చెప్పిన మానవధర్మశాస్త్రమనే సంహితలో ఇన్నో అధ్యాయం సంపూర్ణమయిందని కనిపిస్తుంది. మనువు నేరుగా చెప్పింది కాదుగాని ఆయన బ్రహ్మదేవుడి నుండి మౌఖికంగా తెలుగుకొని మరీచి మొదలైన మహర్షులకు ఉపదేసించగా ఆ వివరాలను భృగువు చెప్పిన తీరున ఈ గ్రంథం రూపుకల్పించింది. మూల శ్లోకాలను నరసింహాచార్యులవారు తెలుగులో తాత్పర్యం రాశారు. దీని ప్రకారం మనుధర్మశాస్త్రం కృతయుగం లోనూ, గౌతమస్మృతి త్రేతాయుగం లోనూ, శంఖలిఖితుల రచన ద్వాపరయుగంలోను ప్రామాణికం కాగా ఈ కలియుగంలో పారాశరస్మృతికే ప్రాధాన్యముంది. అయినా బ్రిటిష్ వారు పౌరస్మృతి శిక్షాస్మృతుల రచనలో మనుస్మృతిని ఒక ఆధార గ్రంథంగా పరిగణించారు.

ఇందులోని మొదటి ఆరు అధ్యాయాల్లో కులాచారాదుల ప్రస్తావన ఉండగా సప్తమాధ్యాయం పాలకుల విధులను, అష్టమం వ్యవహార పద్ధతులను, దశమం ఆపద్ధర్మాలను, ఏకాదశం ప్రాయశ్చిత్తాదులను, చివరిది శుఖాశుభకర్మలను తత్వాన్ని వివరిస్తుంది. కన్యాశుల్కం తీసుకోరాదని నిషేధించిన ఈ గ్రంథం అంతకన్నా తీవ్రభాషలో మేనరికాన్ని నిషేధిస్తున్నది. ఇందులోని విధివిధానాలు వర్తమాన సమాజాలకు ఎంతవరకు వర్తిస్తాయో గ్రంథం చదివి తర్కించడం మంచిది. ధర్మసూక్ష్మ నిర్ణయానికి ఎటువంటి పరిషత్తు పనికివస్తుందో చివరి అధ్యాయంలో చర్చించింది.

మూలాలు మార్చు

  • మనుస్మృతి (తెలుగు తాత్పర్యముతో) డా. ఎన్.ఎల్.నరసింహాచార్య, పేజీలు: 349, వెల 160 రూ. 2001.