మన్యసీమ (దినపత్రిక)

విన్నపాలు వినవలె…!

గిరిజన జాతుల ప్రగతి, మన్య ప్రజల సమగ్రాభివృద్ధి అనే ఆశయాలు ఆకర్షణీయమైన నినాదాలు గానే మిగిలిపోయాయి. ప్రాచీనమైన గిరిజన సంస్కృతిని పరిరక్షిస్తూనే వారిని పురోగమన పథంలో పయనింప చేస్తామన్న నేతల మాటలు నీటి మీద రాతలనిపించుకుంటున్నాయి. స్వాతంత్ర్యానంతరం ఈ ఆరు దశాబ్దాల కాలంలో శుష్కప్రియాలు, శూన్యహస్తాలు మాత్రం అమాయకులైన వనజన సంతతికి మిగిలిపోయాయి. అభివృద్ధి ఆశించిన రీతిలో లేక, అటు పారంపర్యంగా వస్తున్న వెనుకబాటుతనం జాడలు తరాల తరబడి వీడక గిరిపుత్రులు రెండు విధాలా నష్టపోతున్నారు. ఇక గిరిజన సంస్కృతీ సంరక్షణ గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. ధింసా నృత్యాన్ని తిలకించి పులకించి, గిరిజన వస్తు ప్రదర్శన శాలను ఏర్పాటు చేసి గర్వపడి, ఇదే సంస్కృతీ సంరక్షణ అని ప్రగల్భాలు పలికే నాయకమ్మన్యుల పరివారం పెరిగిపోతోంది. ఈ సంస్కృతి గిరిజన ప్రతినిధుల్లో సైతం అభివృద్ధి చెందడం పొల్లు మాటకు తావీయని ఘనమైన వనసీమలు చేసుకున్న దురదృష్టం.

గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి అసలే లేదని కాదు. అయితే అది అసంగతాభివృద్ధిగానే ఉందన్నది అందరూ అమోదించాల్సిన చేదు నిజం. రిజర్వేషన్లో, రాయితీలో కల్పించినంత మాత్రాన అభివృద్ధి అట్టడుగు స్థాయికి అందుబాటులోకి రాదన్నది ఈ ఆరు దశాబ్దాల చరిత్ర చెప్పే వాస్తవం. చిత్తశుద్ధి లేని కార్యాచరణ పర్యవసానం గిరిజన సీమలో అడుగడుగునా ద్యోతకమవుతుంది. అభివృద్ధి చెందిన వ్యాధులు కొండకోనల్లో కాలనాగుల్లా విలయం సృష్టిస్తున్నాయంటే ఇన్నేళ్ల ప్రగతి గతి ఏమిటో అన్న చింత జనిస్తుంది. పల్లెకో పాఠశాల, ఊరికో విద్యాలయం అంటూ రొమ్ము చరుచుకొనే నేతలు ప్రకటిస్తూ ఉంటే, మన్యవాసులను కమ్ముకున్న నిరక్షరాస్యతా తిమిరం కల్లెదుట సాక్షాస్కరిస్తుంది. అపార సంపదలను సక్రమంగా వినియోగించుకోవాల్సిన నేలలో దుర్భర దారిద్ర్యం, దయనీయమైన జీవన విధానం విశ్వరూపంతో ప్రత్యక్షమై తలవంపులు తీసుకువస్తాయి.

ఆశయాలు గిరిశిఖరాల్లా మహోన్నతంగా ఉంటే వాటి అమలు అధ:పాతాళంలో ఉన్న ఎన్నో దృశ్యాలు గోచరిస్తాయి. ఆ స్థితిగతుల్ని, కొడకోనల్లో వెలుగు, నీడల్ని, గిరిజన జీవనంలో విభిన్న పార్శ్యాల్నీ ప్రత్యేకంగా, ప్రముఖంగా పదిమంది దృష్టికీ తీసుకురావాలన్న సంకల్పంలో నుంచి ఉద్భవించింది మన్యసీమ [1]. అదే సమయంలో గిరిజన సంతతికి చెందిన ఎందరినో సంఘటితపరిచి, వారికి ఘనమైన సంస్కృతీ పరంపరను తెలియజెప్పి, ఆసేతు శీతాచల పర్యంతం విస్తరించి ఉన్న ప్రాచీన విధానంలో వైవిద్యాన్ని, విస్తృతిని వివరించాలన్న సత్సంకల్పం కూడా మన్యసీమ ఉదయించడానికి కారణభూతమయింది.

గిరిజన సంతతికి చెందిన వారు వేరువేరు జీవన రంగాలలో స్థిరపడుతున్నారు. ఎందరో నిర్ణయాత్మక స్థాయికి చేరుకుంటున్నారు. వారందరికీ తమ సంస్కృతీ విశిష్టతను చాటి చెబుతూ, వారిలో ఆత్మగౌరవ ఉద్ధీపనకు దోహదపడాలన్నది ఈ చిరు ప్రయత్నం ధ్యేయం. ఈ అసంఖ్యాక జనావళికి సంబంధించిన సమాచారాన్నే కాకుండా గిరిజనులకు ఉపయోగపడే అంశాలను సమగ్రంగా అందించాలన్నది మా కరదీపిక (పత్రిక) లక్ష్యం. ఇంతవరకు వివిధ రీతుల్లో ఇటువంటి సమాచారం కొంతవరకూ వస్తూ ఉండవచ్చు. అయితే పూర్తిగా గిరిసీమలో మమేకమై, ఆ జీవన విధానంతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్న వారి చేతుల మీదుగా వెలువడుతూ ఉండడమే మన మన్యసీమ [2] విలక్షణ లక్షణం.

ఆరేళ్ల ప్రస్థానంలో… మన్యసీమ [3] ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే అనూహ్య ఫలితాలను చూడడం తొలి విజయమైతే, మెరుగైన పాఠకులను సొంతంచేసుకోవడం మేము సాధించిన మలి విజయంగా చెప్పవచ్చు. పక్షపత్రికగా 2007 సెప్టెంబర్ 1న విశాఖ కేంద్రంగా ప్రారంభమైన మన్యసీమ తొలుత నిర్ణయించుకున్న లక్ష్యాన్ని కంటే ముందుగానే దినపత్రికనూ తన ఖాతాలో చేర్చుకుంది. 2008 అక్టోబర్ 9న (విజయదశమి నాడు) మన్యసీమ దినపత్రిక తొలికాపీ మార్కెట్లోకి వచ్చింది. అప్పటి నుంచి మన్యసీమ పరుగు నిర్విఘ్నంగా కొనసాగుతూనే ఉంది. లాభాల కోసం కాకుండా మన్య ప్రజలకు చేరువకావాలన్న ఏకైక లక్ష్యంతో వార్తల ప్రచురణ, సర్క్యులేషన్ విషయాలలో గిరిజన ప్రాంతాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుండడం జరుగుతోంది. ఇక తాజాగా దినపత్రిక విస్తరణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న పక్షపత్రికను 2009 మే 1 నుంచి మాసపత్రికగా మార్చడం జరిగింది.

అంతర్జాలంలోనూ… మన్యసీమను కేవలం పరిమిత పాఠకులకే అందుబాటులో ఉండే ప్రింట్ ఎడిషన్ గానే కాకుండా అంతర్జాలంలో (ఇంటర్నెట్లో) కూడా అందుబాటులో ఉంచాలన్న ఆలోచనే ఈ వెబ్‌సైట్. మొదట్లో ‘వర్డ్‌ప్రెస్’ సహకారంతో 2008 నవంబర్ 9 నుంచి రోజువారీ వార్తలను, ఛాయాచిత్రాలను నెట్ పాఠకులకు అందిస్తూ వచ్చిన మన్యసీమ తర్వాత సొంత వెబ్‌సైట్ ఏర్పాటుచేసుకుంది. దీనికి తోడు రోజూ ప్రచురితమవుతున్న దినపత్రికను, ప్రతి నెల రోజులకు ఒకసారి ప్రచురితమయ్యే మాసపత్రికను పి.డి.ఎఫ్. ఫార్మెట్లో అందిస్తుండడం అదనపు ఆకర్షణ.

ఉజ్వల కాంతిని వ్యాపింప చేయాలన్న సంకల్పంతో వెలిగించిన ఈ చిరుదీపాన్ని తిలకించి మా ప్రయత్నానికి మీ సహాయ సహకారాలు అందిస్తారన్నది ఆకాంక్ష. మీ అమూల్య సలహాలు, సూచనలు, ప్రతిస్పందనలే మన్యసీమకు శ్రీరామరక్ష.

మీ,
పైడి లక్ష్మణరావు
ఎడిటర్ & పబ్లిషర్,
మన్యసీమ [4]
మొబైల్: 09390556171, 09440114786,
ఇ-మెయిల్: editor@manyaseema.com