మరుత్తులు అనగా వాయువులు. దితి ఇంద్రుని చంపునట్టి కొడుకు కావలయును అని కశ్యపుని ప్రార్థింపగా అతఁడు అనుగ్రహించి గర్భమును కలుగచేసి 'నూఱేండ్లు ఈగర్భమును నియమముతో కాపాడుకొంటివేని అట్టి బిడ్డడు నీకు పుట్టును' అని చెప్పెను. ఆమె అట్లే అతి నియమముతో ఉండి నూఱేండ్లు నిండుటకు కొంతకాలము మిగిలి ఉండగా ఏమఱి అనిష్ఠను ఇసుమంత తప్పెను. అంత సమయము చూచుచు ఉండిన దేవేంద్రుఁడు ఆమె గర్భమునందు ప్రవేశించి ఆశిశువును తన వజ్రాయుధముతో ఏడు తునియలుగా నఱకెను. అప్పుడు ఆశిశువు తుండెములై రోదన చేయుతఱి దితి 'మారుద మారుద' అని చెప్పెను. కనుక వీరు మరుత్తులు అనబడిరి. అంత ఇంద్రుడు దితిగర్భమున ఉండి వెలువడివచ్చి 'తల్లీ నీవు అశుచివై ఉండినందున ఇంతపని చేయ చాలితిని' అని ఆమెను మంచిమాటలచే సమాధానపఱిచి ఆమె కోరినట్లు ఆ ఏడుపిండములకు దీర్ఘాయువును ఒసగి సప్తలోకములయందును వాయురూపముగా తిరుగునట్లు అనుగ్రహంచి వెడలిపోయెను. అది కారణముగ మరుత్తులును, దేవతలును కూడి ఉందురు.