మహాంధ్ర సామ్రాజ్య పతనము

మహాంధ్ర సామ్రాజ్య పతనం అన్న గ్రంథం కాకతీయ సామ్రాజ్యం పతనం చెందిన వివరాలను ఇతివృత్తంగా స్వీకరించిన చారిత్రిక నవల. ఈ నవలను డాక్టర్.త్రిపురనేని వెంకటేశ్వరావు రచించారు. ఓరుగల్లు కోటను అంతర్గత కుమ్ములాటలను ఉపయోగించుకుని ఢిల్లీ సుల్తాను సైన్యం పట్టుకుని, ప్రతాపరుద్రుని ఢిల్లీకి బందీగా తీసుకుపోగా మహా సామ్రాజ్యం పతనమైపోయిన వైనాన్ని రచించారు.

రచన నేపథ్యం మార్చు

1975లో ఈ చారిత్రిక నవలను కవిరాజ సాహిత్య విహారమనే సంస్థ ద్వారా తొలి ప్రచురణ చేశారు. రచయిత డా.త్రిపురనేని వెంకటేశ్వరరావు వృత్తిరీత్యా వైద్యుడు, ప్రవృత్తి రీత్యా సాహిత్యకారుడు. ఆయన ఆంధ్రప్రాదేశ్ సాహిత్య అకాదెమీకి సభ్యునిగా వ్యవహరించారు. తణుకు వాస్తవ్యుడు, నరేంద్ర గ్రంథమాల ద్వారా పలు పుస్తకాలు ప్రచురణ చేసిన వ్యక్తి ఐన ముళ్ళపూడి తిమ్మరాజుకు ఈ గ్రంథాన్ని అంకితమిచ్చారు. చారిత్రిక వివరాలను సాహిత్యరచనలో పరిగణించక మొత్తం చరిత్రనే మరుగుపరుస్తున్నారని ఆరోపిస్తూ, అందుకే ఈ చారిత్రిక నవలను హేతువాదం, ప్రామాణిక చరిత్రల ఆధారంగా రచించానని రచయిత పేర్కొన్నారు.[1]

ఇతివృత్తం మార్చు

మహాంధ్ర సామ్రాజ్యమన్న పదాన్ని ఈ నవలలో కాకతీయుల పరిపాలనకు ప్రతిగా ప్రయోగించారు. కాకతీయ వంశము ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రాంతమును క్రీ. శ. 1083 నుండి క్రీ. శ. 1323 వరకు పరిపాలించిన రాజవంశము. క్రీ. శ. 9వ శతాబ్దము ప్రాంతములో రాష్ట్రకూటుల సేనానులుగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన కాకతీయులు ఆంధ్రదేశాన్ని అంతటిని ఒకే త్రాటిపైకి తెచ్చి పరిపాలించారు. శాతవాహనుల అనంతరం ఆంధ్రదేశాన్ని, జాతినీ సమైక్యం చేసి, ఏకచ్ఛత్రాధిత్యం క్రిందికి తెచ్చిన హైందవ రాజవంశీయులు కాకతీయులొక్కరే. కాకతీయుల కాలంలోనే ఆంధ్ర, త్రిలింగ పదాలు సమానార్థకాలై, దేశపరంగా, జాతిపరంగా ప్రచారం పొందాయి. వీరు ఆంధ్రదేశాధీశ్వర బిరుదు ధరించారు. కాకతీయ సామ్రాజ్యంలో ఆఖరి రాజైన ప్రతాప రుద్రుడిని మహాసైన్యముతో వచ్చిన ఉలుఘ్ ఖాన్ ఓడించాడు. కాకతీయ నాయకులలో తలెత్తిన అనైక్యత, ఈర్ష్యాద్వేషాలు కూడా ఓటమికి కారణాలని చరిత్రకారుల అభిప్రాయం. కాకతీయ సామ్రాజ్యంలోని పలువురు సైన్యాధిపతులతో సహా ప్రతాప రుద్రుని బంధించి ఢిల్లీ తీసుకువెళ్తూండగా నర్మదా నదీ తీరంలో ఆయన మరణించారు. ఇది కాకతీయ సామ్రాజ్య పతన గాథ. దీనినే ఈ నవలలో చిత్రీకరించారు.

బయటి లింకులు మార్చు

మూలాలు మార్చు

  1. మహాంధ్ర సామ్రాజ్య పతనము:త్రిపురనేని వెంకటేశ్వరరావు:1975:పేజీ.xxxi