మహిళా శిశు అభివృద్ధి శాఖ

భారత ప్రభుత్వ శాఖ

మహిళా, శిశు సమగ్రాభివృద్దికి దోహదం చేయడంకోసం మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖలో భాగంగా మహిళా శిశు అభివృద్ధి శాఖను 1985లో ఏర్పాటుచేశారు. అనంతరం, 30.01.2006 నుంచి ఈ శాఖను స్థాయి పెంచి మంత్రిత్వ శాఖగా రూపొందించారు.[3]

మహిళా శిశు అభివృద్ధి శాఖ
సంస్థ అవలోకనం
అధికార పరిధి Indiaభారతదేశం
ప్రధాన కార్యాలయం మహిళా శిశు అభివృద్ధి శాఖ
వార్ర్షిక బడ్జెట్ 24,700 crore (US$3.1 billion) (2018-19 est.)[1]
Minister responsible స్మృతి ఇరాని, కేంద్రమంత్రి
వెబ్‌సైటు
[2]

మహిళాశిశు సమగ్రాభివృద్ధికి కృషిచేయడం ఈ మంత్రిత్వ శాఖ ప్రధాన కర్తవ్యం. మహిళా శిశు పురోగతికోసం జరిగే కృషిని సమన్వయపరిచే వేదికగా ఈ మంత్రిత్వశాఖ సంబంధిత ప్రణాళికలను, విధానాలను, కార్యక్రమాలను రూపొందిస్తుంది. చట్టాలను చేస్తుంది, సవరిస్తుంది. మహిళా శిశు అభివృద్ధి రంగంలో పనిచేసే ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలకు మార్గదర్శకత్వం వహిస్తుంది, వాటి కృషిని సమన్వయపరుస్తుంది. కేవలం సమన్వయకర్తగా పనిచేయడమే కాకుండా, మహిళలకోసం, శిశువులకోసం కొన్ని వినూత్న కార్యక్రమాలను తానుగా ఈ మంత్రిత్వశాఖ అమలుచేస్తుంది. సంక్షేమ కార్యక్రమాలు, మద్దతు సేవలు, ఉపాధి, ఆదాయాభివృద్ధి శిక్షణ, అవగాహన పెంపుదల, లైంగిక సమానత్వ భావనను పెంపొందించడం మొదలైనవి ఈ కార్యక్రమాలలో ఉన్నాయి. ఆరోగ్యం, విద్య, గ్రామీణాభివృద్ధి మొదలైన రంగాలలో సాధారణంగా చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలను బలపరిచేవిగా, వాటికి అనుబంధంగా కూడా ఈ కార్యక్రమాలు ఉపయోగపడతాయి. మహిళలు ఇటు ఆర్థికంగా, అటు సామాజికంగా సాధికారత పొంది, జాతీయాభివృద్ధి కృషిలో పురుషులతో సమాన భాగస్వాములుగా పాల్గొనడానికి దోహదకారులు కావాలన్నదే ఈ చర్యలన్నిటి ప్రధాన ఆశయం.

విధాన కార్యక్రమాలు మార్చు

సమగ్ర శిశు సంరక్షణలో భాగంగా, మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ సమగ్ర శిశు అభివృద్ధి సేవలు (ఐ సి డి ఎస్) పేరిట మొత్తం ప్రపంచంలోనే ఎంతో భారీస్థాయిలో, చాలా ఎక్కువ మందికి తమ సేవలను అందుబాటులోకితెచ్చే మిక్కిలి విలక్షణమైన కార్యక్రమాన్ని అమలు జరుపుతుంది. ఈ కార్యక్రమం కింద అనుబంధ పోషకాహారం, వ్యాధి నిరోధక టీకాలు, ఆరోగ్య పరీక్షలు, బడిలోవేసే ముందు అందించే అనియత విద్య వంటి బహుళ సేవలను అందిస్తుంది. మహిళా సాధికారతకు సాధనంగా రూపొందించిన స్వయంసిద్ధ అనే సమీకృత పథకాన్ని కూడా ఈ మంత్రిత్వ శాఖ అమలుచేస్తుంది. వివిధ రంగాలకు సంబంధించిన కార్యక్రమాలు చక్కని సమన్వయంతో, తగిన పర్యవేక్షణలో నిర్వహింపబడుతున్నాయి. ఈ మంత్రిత్వశాఖ చేపట్టే కార్యక్రమాల్లో చాలావరకు ప్రభుత్వేతర సంస్థల (ఎన్ జి ఓ ల) భాగస్వామ్యం ఎక్కువగా ఉండేలా మంత్రిత్వశాఖ కృషిచేస్తుంది. ఈ మంత్రిత్వశాఖ ఇటీవలికాలంలో చేపట్టిన ముఖ్యమైన విధానపర కార్యక్రమాలలో, ఐ సి డి ఎస్, కిషోరి శక్తి యోజన పథకాలను అంతటా వర్తింపజేయడం, కిశోర బాలికలకు పోషకాహార కార్యక్రమాన్ని ప్రారంభించడం, బాలల హక్కుల పరిరక్షణకోసం ఒక కమిషన్‌ను ఏర్పాటుచేయడం, మహిళలకు గృహహింస నుంచి రక్షణ కల్పించే చట్టాన్ని తీసుకురావడం ఉన్నాయి. ప్రతి సంవత్సరం నారిశక్తి పురస్కారాలు అందిస్తోంది.[4]

సంస్థాగత వివరాలు మార్చు

మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ కేంద్ర సహాయ మంత్రి శ్రీమతి కృష్ణ తీరథ్ అధ్యక్షతన పనిచేస్తుం ది. శ్రీ డి.కె. సిక్రి కార్యదర్శి, శ్రీ సుధీర్ కుమార్ అదనపు కార్యదర్శి. మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యక్రమాలను ఏడు విభాగాల ద్వారా నిర్వహిస్తున్నారు. ఈ మంత్రిత్వ శాఖలో స్వయంప్రతిపత్తితో పనిచేసే ఆరు సంస్థలు ఉన్నాయి. అవి:

  1. జాతీయ పౌర సహకార, శిశు అభివృద్ధి సంస్థ (ఎన్ ఐ పి సి సి డి)
  2. జాతీయ మహిళా కమిషన్ ( ఎన్ సి డబ్ల్యు)
  3. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంస్థ (ఎన్ సి పి సి ఆర్)
  4. కేంద్ర దత్తత వనరుల సంస్థ (సి ఏ ఆర్ ఎ)
  5. కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డు (సి ఎస్ డబ్ల్యు భి)
  6. రాష్ట్రీయ మహిళా కోశ్ (ఆర్ ఎం కె)

దీనికింద పనిచేసే ఎన్ ఐ పి సి సి డి, ఆర్ ఎం కె సంస్థలు రెండూ సొసైటీల చట్టం-1860 కింద నమోదయ్యాయి. సి ఎస్ డబ్ల్యు బి భారతీయ కంపెనీల చట్టం-1956 కింద నమోదైన దాతృత్వ సంస్థ. ఈ సంస్థలకు మొత్తం నిధులను భారత ప్రభుత్వమే సమకూరుస్తుంది. కొన్ని కార్యక్రమాలు, పథకాల అమలుతో సహా ఈ మంత్రిత్వ శాఖ విధి నిర్వహణలో ఈ సంస్థలు సహకరిస్తాయి. మహిళా హక్కుల పరిరక్షణ, భద్రత కోసం జాతీయ స్థాయిలో చట్టబద్ధమైన అత్యున్నతస్థాయి సంస్థగా జాతీయ మహిళా కమిషన్ ను 1992లో ఏర్పాటుచేశారు. ఇదేవిధంగా, బాలల హక్కుల పరిరక్షణకోసం, అత్యున్నతస్థాయి చట్టబద్ధమైన సంస్థగా జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ను 2007 మార్చిలో ఏర్పాటుచేశారు.[5]

మంత్రిత్వ శాఖకు కేటాయించిన అంశాలు మార్చు

  1. కుటుంబ సంక్షేమం
  2. మహిళా శిశు సంక్షేమం. ఈ విషయానికి సంబంధించి ఇతర మంత్రిత్వ శాఖల, సంస్థల కార్యక్రమాలను సమన్వయపరచడం.
  3. స్త్రీల, బాలల అక్రమ రవాణా విషయంలో ఐక్యరాజ్య సమితి సంస్థలనుంచి సమాచారాన్ని పొందడం
  4. ప్రాథమిక విద్యాభ్యాసానికంటె ముందుగా, ముందస్తు పాఠశాలలకు (ప్రి స్కూల్ ) వెళ్ళే బాలల సంరక్షణ
  5. జాతీయ పౌష్టికాహార విధానం, జాతీయ పోషకాహార కార్యాచరణ ప్రణాళిక, జాతీయ పౌష్టికాహార మిషన్ వ్యవహారాలు
  6. ఈ మంత్రిత్వ శాఖకు కేటాయించిన అంశాలకు సంబంధించి దాతృత్వ, మతపరమైన ధార్మిక సంస్థల వ్యవహారాలు
  7. ఈ మంత్రిత్వ శాఖకు కేటాయించిన అంశాలకు సంబంధించి స్వచ్ఛంద సేవల ప్రోత్సాహం, అభివృద్ధి
  8. ఈ క్రింది చట్టాల అమలు :
  • స్త్రీల, బాలికల అక్రమ రవాణా చట్టం-1956 (1986 వరకు సవరించిన విధంగా)
  • మహిళలను అసభ్యంగా ప్రదర్శించడాన్ని (నిరోధించే) చట్టం-1986 (60-1986)
  • వరకట్న నిషేధ చట్టం -1961 (28-1961)
  • సతీ సహగమన నిషేధ చట్టం-1987 (3-1987)

(ఈ చట్టాల పరిధిలోకి వచ్చే నేరాల విషయంలో న్యాయపరమైన క్రిమినల్ చర్యలు చేపట్టడం మినహా)

  1. శిశువులకు తల్లిపాల ప్రత్యామ్నాయ పదార్థాలు, పాల సీసాలు, శిశు పౌష్టికాహార (ఉత్పత్తి, సరఫరా, పంపిణీ క్రమబద్ధీకరణ) చట్టం-1992 (41-1992) అమలు
  2. కేర్ (ప్రతి చోటా సహాయ, పునరావాస సహకారం) కార్యక్రమాల సమన్వయం
  3. మహిళా, శిశు సంక్షేమానికి, అభివృద్ధికి సంబంధించిన (లైంగిక సమాన ప్రతిపత్తి పై అవగాహనను పెంపొందించే సమాచార వేదికను రూపొందించడంతో సహా ) ప్రణాళిక, పరిశోధన, మదింపు, పర్యవేక్షణ, పథకాల రూపకల్పన, గణాంకాలు, శిక్షణ వ్యవహారాల నిర్వహణ
  4. ఐక్యరాజ్య సమితి బాలల నిధి (యునిసెఫ్)
  5. కేంద్ర సామాజిక సంక్షేమ బోర్డు (సి ఎస్ డబ్ల్యు బి)
  6. జాతీయ పౌర సహకారం, శిశు అభివృద్ధి సంస్థ (ఎన్ సి పి సి సి డి)
  7. ఆహారం, పౌష్టికాహార బోర్డు (ఎఫ్ ఎన్ బి)
  8. అనుబంధ ఆహార, సంరక్షక ఆహార పదార్థాల తయారీ, ప్రాచుర్యం
  9. పౌష్టికాహార, విస్తరణ
  10. మహిళా సాధికారత, లైంగిక సమానత్వం
  11. జాతీయ మహిళా కమిషన్
  12. రాష్ట్రీయ మహిళా కోశ్ (ఆర్ ఎం కె)
  13. బాలల న్యాయ (బాలల పట్ల శ్రద్ధ, సంరక్షించడం) చట్టం-2000 (56-2000)
  14. బాల నేరస్తుల పర్యవేక్షణ
  15. దత్తతకు సంబంధించిన సమస్యలు; కేంద్ర దత్తత వ్యవహారాల సంస్థ, బాలల వివరాల సహాయ వేదిక (చైల్డ్ హెల్ప్ లైన్)
  16. బాలల చట్టం -1960 (60-1960)
  17. బాల్య వివాహాల నిరోధక చట్టం-1929 (19-1929)[6]

వనరులు మార్చు

  1. "DEMAND NO. 98 : Ministry of Women and Child Development" (PDF). Indiabudget.gov.in. Archived from the original (PDF) on 4 ఫిబ్రవరి 2018. Retrieved 15 September 2018.
  2. "Meet the Minister of State - Ministry of Women & Child Development - GoI". WCD.access-date=15 September 2018.
  3. "Homepage : Ministry of Women & Child Development". Wcd.nic.in. Retrieved 15 September 2018.
  4. "Stree Shakti Puraskar" (PDF). Ministry of Women and Child Development. Retrieved 2014-03-14.
  5. "Homepage : Ministry of Women & Child Development". Wcd.nic.in. Retrieved 15 September 2018.
  6. "Homepage : Ministry of Women & Child Development". Wcd.nic.in. Retrieved 15 September 2018.