మాకినీడి సూర్య భాస్కర్

కవితా చిత్రకారుడు మాకినీడి

మాకినీడి సూర్య భాస్కర్ పేరెన్నిక గల కవి, విమర్శకుదు, చిత్రకారుడు. ఈయన 1962, ఆగస్టు 17న కాకినాడలో మాకినీడి శ్రీరంగనాయకులు, సరస్వతి దంపతులకు జన్మించాడు. తొమ్మిదవ తరగతి చదువుతున్న కాలం లోనే 'సుమ కవితాంజలి ' అనే ఖండ కావ్యాన్ని వ్రాశాడు. తరువాతి కాలంలో దీనిని తిరుమల తిరుపతి దేవస్థానం వారు పుస్తక రూపేణా అచ్చు వేయించారు. జీవిత భాగస్వామి మనసెరిగి మసలుకునే అనుకూలవతి సుభద్ర.

ఈయన వృత్తి అధ్యాపకత్వం. ఆంగ్ల ఉపాధ్యాయుడు. ప్రవృత్తి సాహిత్యం, చిత్రలేఖనం. అంటే కలం పట్టుకుని ఒక వైపు భావ చిత్రాలు రచిస్తూనే, మరో ప్రక్క కుంచెతో విన్యాసాలు చేసే సత్తా ఉన్న కళాకారునిగా మనకు కనిపిస్తాడు. ఈయన యాభై జలవర్ణ చిత్రాలు, ఇరవై మినీయేచర్లు గీయడమే కాకుండా కళా విమర్శక వ్యాసాల సంపుటి 'కళాతోరణం' (తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ) కూడా వెలువరించారు.