మాయాజాలం (1963 సినిమా)

మాయాజాలం జనవరి 26, 1963న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] 1962లో విడుదలైన మాయాజాల్ అనే హిందీ జానపద సినిమా దీనికి మాతృక.

మాయాజాలం
(1963 తెలుగు సినిమా)
దర్శకత్వం బాబూభాయ్ మిస్త్రీ
తారాగణం రంజన్,
చిత్ర,
మనోహర్ దేశాయ్
సంగీతం విజయభాస్కర్
నిర్మాణ సంస్థ ఫిలిం సెంటర్
భాష తెలుగు

నటీనటులు మార్చు

  • రంజన్
  • చిత్ర
  • మనోహర్ దేశాయ్
  • మారుతి
  • రాధిక
  • పాల్‌శర్మ
  • కృష్ణకుమారి

సాంకేతికవర్గం మార్చు

పాటలు మార్చు

ఈ సినిమాలోని పాటలన్నింటినీ శ్రీశ్రీ రచించాడు. విజయ భాస్కర్ సంగీతం సమకూర్చాడు.[2]

క్ర.సం పాట
1 రమ్మా రమ్మా చెలీ చెలీ రమ్మా రయమున రమ్మా చెలీ రమ్మా యిటూ
2 ఓ గిలి గిలి గిలి అమ్మాయి అమ్మాయి అమ్మాయి చెలి చెలి చెలి ఆ గాలినడగాలి
3 రాధాప్రియ నా ఆశాపథాన లాలించు రాగాలే పాడెనో చెలీ
4 మైకమాయె చూడగా ఆహా తూకమై జోడీ
5 కలిసే హృదయాలు మౌనం విడి పాడాలి అలరారెడి పాటలచే చెలి ఊహలే మారాలి
6 జ్ఞానమూ ధ్యానమూ ఆ... ధ్యానమూ ఛూ ఛూ ఛూ మంత్రమూ
7 ఫలియించునోయీ రాజా ఫలియించునోయీ
8 జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరీ విలోల వీచి వల్లరీ విరాజమాన మూర్ధనీ

కథా సంగ్రహం మార్చు

రాజగఢ్‌ను పరిపాలించే మంత్రవేత్త వీరసింహుడు తన తుచ్ఛమైన కోరికలు నెరవేర్చుకునేందుకు భేతాళుని ప్రార్థించి అతడి నుండి ఒక మంత్ర దర్పణం, ఒక మంత్ర గోళం పొందుతాడు. పంచలక్షణాలు కలిగిన కన్యను వివాహం చేసుకుని భూతనాథుని పూజిస్తే అన్ని కోర్కెలు తీరగలవని భేతాళుడు చెబుతాడు.

వీరగఢ్‌ రాజకుమారిని ఒక రోజు వీరసింహుడు అపహరించడానికి ప్రయత్నించగా విజయుడనే వీరుడు ఆమెను రక్షిస్తాడు. మంత్రవేత్త పారిపోతాడు. అనంతరం విజయుడు రాజకుమారికి వీడ్కోలు చెప్పి తన తండ్రిని అన్వేషించడానికి బయలు దేరుతాడు. దారిలో అతనికి వడిసెల విసురుతున్న మంజుల పరిచయమౌతుంది.

ఒక పండుగ రోజున మంజుల, ఆమె తండ్రి, విజయుడు దేవాలయానికి వెళ్ళగా ద్వారం వద్ద రాజసైనికులు అటకాయిస్తారు. విజయుడు సైనికులతో పోరాడుతాడు. మంజుల తండ్రికి గాయం అవుతుంది. అదే సమయంలో అక్కడికి వచ్చిన వీరసింహుడు పూజారిని హెచ్చరించి, మంజుల తండ్రి మీద జాలి పడినట్లు నటించి, చికిత్స చేయించే నెపంతో విజయుణ్ణి చెరలో బంధిస్తాడు. గాయపడిన మంజుల తండ్రి ఆమెతో వీరసింహుడు దుర్మార్గుడనీ, సోదరుని హత్యచేసి రాజ్యం అపహరించాడనీ, అతనిపై పగతీర్చుకోవాలని మంజులకు చెప్పి ప్రాణం విడుస్తాడు.

తర్వాత మంజుల యుక్తి చేసి చెరలో ఉన్న విజయుని కలుసుకుని అతడినీ అక్కడే ఉన్న రాజమాతనీ విడుదల చేస్తుంది. విశ్వాసపాత్రుడైన ఒక సేవకుని ద్వారా విజయుడే రాజమాత పుత్రుడని ఆమెకు తెలిసి ఆనందభరితురాలవుతుంది. ఆ మరునాడు రాజకుమారిని సంధించి విజయుడు మరలి వచ్చే సరికి రాజమాత అపాయస్థితిలో ఉంటుంది. సేవకుడు విజయుడితో మంత్రవాది మంజులను అపహరించాడనీ, ఆమెను రక్షించడానికి వచ్చిన రాజమాతను గాయపరిచాడనీ చెబుతాడు. రాజమాత కుమారుని సమక్షంలో మరణిస్తుంది.

విజయుడు మంజులను వెదికే క్రమంలో ప్రియతమ అనే కన్య కలుస్తుంది. ఆమె ప్రియుడిని కూడా మంత్రవాది అపహరించి గుహలో బంధించినందువల్ల ఇద్దరూ ఆ గుహలోనికి ప్రవేశిస్తారు. ఈలోగా మంత్రవాది రాజకుమారిని కూడా అపహరించి గుహలోనికి తీసుకువస్తాడు. విజయుడినీ, ప్రియతమనూ అక్కడ చూసి మంత్రవాది వారిద్దరినీ సూక్ష్మజీవులుగా మార్చి ఒక చిన్న పంజరంలో బంధిస్తాడు.

తరువాత విజయుడు తన నిజరూపాన్ని ఎలా పొందుతాడు? మంత్రవాదిని సంహరించి రాజకుమారిని, మంజులను, ప్రియతమను అతని ప్రియుణ్ణి ఎలా రక్షిస్తాడు? అనేది మిగిలిన కథ.[2]

మూలాలు మార్చు

  1. వెబ్ మాస్టర్. "Mayajalam (Babubhai Mistri) 1963". indiancine.ma. Retrieved 21 July 2022.
  2. 2.0 2.1 శ్రీశ్రీ (1963). మాయాజాలం పాటల పుస్తకం (1 ed.). మద్రాసు: ఫిలిం సెంటర్. p. 12. Retrieved 21 July 2022.