మార్టిన్ క్రూజ్ నవల హవానా బే
మార్టిన్ క్రూజ్ నవల హావానా బే. మార్టిన్ క్రూజ్ పది నవలలు రాశారు. నవలా రచయితగా ప్రసిద్ధులు.'హవానా బే' కమునిస్ట్ దేశం క్యూబా రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో, ప్రత్యేకంగా 1996 నాటి క్యూబా దేశపు పరిస్థితుల నేపధ్యంలో రాయబడిన నేరపరిశోధన నవల. క్యూబాలో కమ్యూనిస్ట్ విప్లవం తర్వాత అమెరికా నుంచి ఎదురైన అనేక ఇబ్బందులను, కుట్రలను, కుతంత్రాలను క్యూబా ఎదుర్కోగలిగిందిగాని, రష్యాలో కమునిస్ట్ ప్రభుత్వం పోయిన తర్వాత, రష్యా క్యూబాను గాలికి విడిచిపెట్టి అనాథను చేసింది. క్యూబాలో ఇప్పుడు మరణించిన రష్యన్.కు, సజీవుడైన రష్యన్.కు మధ్య తేడా లేకుండా పోయింది. క్యూబాలో ఒక వెలుగు వెలిగిన రష్యా పాఠశాలలు, నృత్యశాలలు, సాంస్కృతిక సంస్థలు అన్నీ మూతపడతాయి. అమెరికా నుంచి ఎటువంటి సహాయం లేక, అమెరికా విధించిన ఆంక్షలు, నిషేధాలవల్లా క్యూబా ఆర్థికంగా చితికి పోయింది. ఉదయం ఫలహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం కూడా జనానికి లభ్యం కాని దారుణ పరిస్థితి, క్యూబాలో కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న కొంపలు, 1950 నాటి అమెరికా కార్లు- ఇటువంటి విపరీతమైన కరువు వంటి- ఏ వస్తువూ దొరకని పరిస్థితుల్లో ఆ దేశం మనుగడకు ప్రభుత్వం అనేక నియమాలు, నిషేధాలు అమలు చేసింది. ఏమయినా క్యూబా విద్య, వైద్య రంగాల్లో మాత్రం గొప్ప అభివృద్ధి సాధించింది. అమెరికా దేశపు రచయిత మార్టిన్ క్రూజ్ ఈ పరిస్థితులను "గోర్కీ పార్క్, హవానా బే" అనే రెండు నవలల్లో చిత్రించారు. బహుశా క్యూబా వ్యతిరేకుల ప్రచారానికి ఈ నవలలు కూడా పెద్ద ఆయుధాలుగా పనికివచ్చి ఉంటాయి.
450 పుటల నవల హవానా బే చాలా నెమ్మదిగా సాగుతుంది. పైగా పాత్రలపేర్లు, వాతావరణం, స్పానిష్ భాషా పదాలు ఆ జీవితంతో పరిచయంలేని వారిని తరచూ ఇబ్బంది పెడతాయి. క్యూబా చరిత్రతో అంతో ఇంతో పరిచయం ఉంటేనే తప్ప అనేక ఘటనల పూర్వాపర్వాలు చదువరులకు బోధ పడవు.
రష్యా, క్యూబా సంబంధాలు బలహీనపడిన తర్వాత, 1996 ప్రాంతాలలో జరిగిన సంఘటనలు, చరిత్ర ఈ నవలకు నేపధ్యం. ఫిడల్ కేస్ట్రో ఇంకా క్యూబా దేశాధ్యక్షులుగా ఉన్నారు. కథంతా క్యూబా ముఖ్యపట్టణం హవానాలోనే జరుగుతుంది. హవానాలో ఒక రష్యా గూఢచారి ప్రిబ్లుడా శవం "హవానా బే"లో తేలుతూ కనిపిస్తుంది. ఆ సంఘటనను విచారించడానికి రష్యానుంచి కల్నల్ ఆర్కడే అనే గూఢచారి హవానా వస్తాడు. క్యూబా పోలీసులు ఈ మరణాన్ని సాధారణ మరణంగా భావిస్తారుగానీ, ఆర్కడే మాత్రం సీరియస్ గా తీసుకొంటాడు. ఆర్కడే ఎంతో ప్రేమించే భార్య వైద్యుల నిర్లక్ష్యంవల్ల కొద్దికాలం క్రితం మరణించి ఉంటుంది. ఆ వియోగబాధలోనే అతను ఈ హత్యోదంతాన్ని పరిశోధించడానికి హవానాకు వెళ్ళవలసి వస్తుంది. అతను హవానాలో వ్యక్తిగత విషాదాన్ని భరించలేక ఒకసారి ఆత్మహత్యకు ప్రయత్నం చేస్తాడు. క్యూబా ప్రభుత్వ డిటెక్టివ్, ఇద్దరు కుమార్తెల తల్లి ఓఫీలియా పినేరో అనే మహిళ ఈపరిశోధనక్రమంలో ఆర్కడేకు శారీరికంగా దగ్గరవుతుంది.
తనమీద హత్యా ప్రయత్నాలు జరిగినట్లు ఆర్కడేకి అనుమానం కలుగుతుంది. యధాలాపంగా తన విచారణలో ప్రిబ్లుడా మరణానికీ, మిలియన్ల డాలర్ల చక్కెర ఎగుమతుల వ్యాపార ఒప్పందానికీ మధ్య ఏదో సంబంధం ఉన్నట్లు ఆర్కడే గుర్తిస్తాడు. నవల ముగింపులో అతను చిక్కు ముడులన్నీ విప్పి అసలు నేరస్థులను గుర్తిస్తాడు. ఓపికగా చదవ వలసిన నవల. మూలాలు:1.'Havana Bay' is a crime novel by Martin Cruz Smith, set in Cuba. It is the fourth novel to feature Investigator Arkady Renko, and it won the 1999 Hammett Prize.(వికిపీడియా నుంచి.)