ముంతాజ్ షేక్ (జననం 1982 నవంబరు 18) భారతదేశానికి చెందిన మహిళా హక్కుల పోరాట కార్యకర్త. ముంబైలో మహిళల కోసం ప్రజా మరుగు దొడ్లు నిర్మించాలని ప్రచార ఉద్యమం నిర్వహించారు ఆమె. ముంతాజ్, ఇతర స్వచ్ఛంద సంస్థల ఒత్తిడి ఫలితంగా ప్రభుత్వం ముంబై మొత్తం మీద మహిళల కోసం 96 ఉచిత మరుగుదొడ్లు నిర్మించింది. ప్రభుత్వం ఆమెకు "డాటర్ ఆఫ్ మహారాష్ట్ర" అనే బిరుదు ఇచ్చింది. స్ఫూర్తిదాయకమైన 100 మంది మహిళల్లో ఒకరుగా 2015 లో బిబిసి ఆమెను ఎంపిక చేసింది.

ముంతాజ్ షేక్

బాల్యం, వివాహం

మార్చు

ముంతాజ్ షేక్ 1981 లో మహారాష్ట్రలోని అహ్మద్ నగర్లో జన్మించింది. ఆమె తండ్రి, అబూ బక్కర్ ఒక డ్రైవరు. ఆయన మలయాళం, తల్లి మదీనా హిందీ భాష మాట్లాడేవారు. ఆమెకు ఒక అన్నయ్య. ఆమె పుట్టిన వెంటనే, కుటుంబం ముంబై శివారు చెంబూర్ లోని వాషి నాకా ప్రాంతం లోకి మారింది.[1] కుటుంబ హింస కారణంగా ముంతాజ్‌ ఆమెను తన మామ వద్దకు పంపించారు. ఆశ్రయం కోసం అక్కడ ఇంటి పనులను చేసేది. కానీ, తరచూ ఖాళీ కడుపుతో ఉండాల్సి వచ్చేది.[2] ఆమె ఐదు సంవత్సరాల వయస్సులో, అన్న ఎనిమిది సంవత్సరాల వయసులోనూ ఉన్నపుడు వారి తండ్రి, వారిని కేరళలోని తన తల్లిదండ్రుల వద్ద వదలి, తాను పనికోసందుబాయ్‌ వెళ్ళాడు. [1] తీవ్రమైన పేదరికం వలన, ముంతాజ్‌ను 9 వ తరగతి తరువాత చదువు మానిపించి ఆమె మామ, పదిహేనేళ్ళ వయసులో ఆమెకు పెళ్ళి చేసాడు. [2] [3] పెళ్ళయ్యాక ఆమె సమస్యలను ఎదుర్కొంది. పదహారేళ్ళ వయసులో కుమార్తె పుట్టిన తర్వాత, రిసోర్స్ ఆర్గనైజేషన్స్ (కొరో) సంఘం నిర్వహించే సామాజిక కుటుంబ హింసకు సంబంధించిన ఉపన్యాసాలకు హాజరయ్యేది. తన భర్త అభ్యంతరాలను పట్టించుకోకుండా ఆమె, ఆ సంస్థకు స్వచ్ఛంద సేవకురాలిగా మారింది. విడాకుల కోసం దాఖలు చేయడానికి తగినంత ఆత్మవిశ్వాసాన్ని త్వరలోనే సాధించుకుంది. [2]

సమాజ సేవలో

మార్చు

2000 లో ముంతాజ్ CORO లో కోర్ టీం సభ్యురాలిగా మారి 2005 లో లీడర్స్ క్వెస్ట్ ఫెలోషిప్‌కు ఎంపికైంది. తన సమాజంలోని ఇతర మహిళలకు మార్గదర్శకత్వం ఇవ్వడం ప్రారంభించింది. [2] [4] తరువాతి దశాబ్దంలో సంస్థలో క్రమేణా ఎదుగుతూ, కోరో జాయింట్ సెక్రటరీ అయింది. 2006 లో తిరిగి వివాహం చేసుకుంది. CORO మహిళా మండలిని ఏర్పాటు చేసినప్పుడు, ముంతాజ్‌ను దానికి ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా నియమించారు. [5] [4] CORO శానిటరీ ప్రోగ్రామ్‌లలో భాగంగా, ముంతాజ్ 2011 లో పబ్లిక్ టాయిలెట్ల సమస్యలను పరిష్కరించడం ప్రారంభించింది. 2012 లో బాత్రూమ్‌ల వద్ద భద్రతను, అక్కడి పరిస్థితులనూ అంచనా వేసే ఒక సర్వేకు నాయకత్వం వహించింది. [4] 2013 లో, ముంబైలో మరుగుదొడ్డి సౌకర్యాలు సమానంగా అందుబాటులో ఉండకపోవడాన్ని లక్ష్యంగా చేసుకుని ఆమె ఒక ప్రచారాన్ని ప్రారంభించింది. చైనాకు చెందిన పురుషుల టాయిలెట్‌ను ఆక్రమించుకోండి వంటి ప్రచారం లాగా, 32 ప్రభుత్వేతర సంస్థలతో కలిసి మహిళలకు మరుగుదొడ్లు ఉచితంగా అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాన్ని ప్రారంభించేందుకు ఒక రోజు సెమినార్‌ను ఏర్పాటు చేసింది. [6] రైట్ టు పీ ప్రచారానికి ముంతాజ్ ప్రతినిధి అయింది. పట్టణ ప్రాంతాల్లో 50 శాతం శ్రామికశక్తికి మహిళలు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ, డబ్బులు కడితే తప్ప వారికి మరుగుదొడ్లు అందుబాటులో ఉండవు. ముంబైలో 2012 లో ప్రభుత్వం పురుషులకు 5,993 పబ్లిక్ టాయిలెట్లు, 2,466 యూరినల్స్ ఏర్పాటు చెయ్యగా, మహిళలకు 3,536 సౌకర్యాలు మాత్రమే ఉన్నాయి. [7] రైలు స్టేషన్లలో పరిస్థితి ఇంకా అధ్వాన్నంగా ఉండేది. సెంట్రల్, హార్బర్ రైల్ లైన్స్‌లో ఉన్న 69 స్టేషన్లలో మూత్రశాలలు, మరుగుదొడ్లు 100 లోపే ఉన్నాయి. [5] యూరినల్ వాడటానికి పురుషులు ఏమీ చెల్లించనక్కర్లేదు, కాని మహిళలు మాత్రం టాయిలెట్ వాడటానికి డబ్బులు కట్టాల్సి వచ్చేది. వారు మూత్ర విసర్జన చేసే అవసరాన్ని తగ్గించుకునేందుకు, మహిళలు సరిపడినంత మంచినీరు తాగరు. అందువల్ల ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. [7]

ఆమె చేపట్టిన ప్రచారం సర్వత్రా అమోదం పొందింది. ముంబై అంతటా ప్రతి 20 కిలోమీటర్లకు, మహిళలకు మరుగుదొడ్లు నిర్మించాలని ప్రభుత్వం ఆదేశించింది. [2] ఒక సంవత్సరంలోనే, మహిళా సంస్థల ఒత్తిడి వల్ల ముంబైలో 96 కొత్త మరుగుదొడ్డి సౌకర్యాలను ఎంసిజిఎం ప్రకటించింది. [8] పూణే లోని నారీ సమతా మంచ్ ముంతాజ్‌కు "మహారాష్ట్ర ఆడపడుచు" అని గౌరవించింది. [2] 2015 లో బిబిసి వారి 100 మంది మహిళల జాబితాలో చోటు పొందింది. [8] రెండవ బిడ్డ పుట్టిన తరువాత, రాజకీయాలను అధ్యయనం చేసే అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులో చేరింది. [4] 2016 లో, ముంతాజ్ ప్రభుత్వ మరుగుదొడ్ల వద్ద మహిళల భద్రత, సరైన సౌకర్యాలు లేకపోవడం, ప్రభుత్వ నిష్క్రియాత్మకత వలన కలిగే ఆరోగ్య సమస్యలపై పనిచేస్తూనే ఉంది. [9] [10] వివిధ ప్రాంతాల స్థానిక అవసరాలను అధ్యయనం చేస్తూ మహారాష్ట్ర రాష్ట్రమంతటా ఈ కార్యక్రమాన్ని విస్తరించే ప్రణాళికలను ఆమె ప్రారంభించింది. [11]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 Sangameshwaran 2016.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 Sirohi 2015.
  3. The Hindu 2015.
  4. 4.0 4.1 4.2 4.3 The Hindu 2015.
  5. 5.0 5.1 Pinto 2014.
  6. Andhale 2013.
  7. 7.0 7.1 Yardley 2012.
  8. 8.0 8.1 Shaikh 2015.
  9. The Hindustan Times 2016.
  10. Purandare 2016.
  11. Andhale 2016.

గ్రంథ సూచీ

మార్చు