మురారిరావు ఘోర్పాడే

(మురారిరావు నుండి దారిమార్పు చెందింది)

మురారిరావుగా పేరొందిన మురారిరావు ఘోర్పాడే మరాఠా సర్దారు, సందూరు సంస్థానపు రాజు, గుత్తి దుర్గాధిపతి. భారతదేశంలో మొగలుల పాలన క్షీణదశకు చేరుకొని దక్షిణాపథంలో మరాఠులు విస్తరిస్తుంటే మరో ప్రక్క ఫ్రెంచ్, బ్రిటీషు సేనలు ఉపఖండంలో పట్టుసాధించడానికి కృషిచేస్తుండగా, మరాఠులు, నిజాంలు, మైసూరు రాజ్యం, ఆధిపత్యంకై పోరాడుతున్న సంక్లిష్టమైన సమయంలో, వాటన్నింటి మధ్య దక్కన్లో పీష్వాలకు నమ్మకమైన సేనానిగా 18వ శతాబ్దపు దక్షిణాపథ చరిత్రలో మురారిరావుకు కీలకమైన స్థానమున్నది.[1] మురారిరావు చాకచక్యమైన భాగస్వామిగా, తన స్వతంత్రతను కోల్పోకుండా మరాఠులతో వ్యవహారాలు సలిపాడు. 1940లో మురారిరావు జీవితాన్ని సమీక్షిస్తూ చరిత్రకారుడు గోవింద్ సఖారామ్ సర్దేశాయి "మరాఠా చరిత్రలో మురారిరావు లాంటి సాహసోపేతమైన రాజకీయ వ్యాసంగాన్ని మరేవ్వరూ కొనసాగించలేదు - ఆయన జీవితం మొత్తం అద్భుతమైన గెలుపులు, అనుకోని ఓటములు, నాటకీయ ఘట్టాలు, ముందుచూపుల్తో నిండిపోయిన ఒక మహోత్కృష్ట పోరాటం" అని తేల్చాడు.[1]

కుటుంబంసవరించు

మురారిరావు 1699 ప్రాంతంలో జన్మించాడు. ఈయన తండ్రి సిద్ధోజి రావు సందూరు రాజ్యాన్ని స్థాపించాడు. సిద్ధోజీ రావు తాత, మల్లోజీ రావు ఘోర్పాడే బీజాపూరు సుల్తాను సేవలో అధికారిగా పనిచేశాడు.[2] మురారి రావు తండ్రి మరణం తర్వాత 1731లో రాజయ్యాడు. 1729 జూన్లో మొదటి భార్య సగుణాబాయిని వివాహం చేసుకున్నాడు. ఈయన రెండవ భార్య పేరు తెలియలేదు. కానీ ఆమె 1791లో, శ్రీరంగపట్నంలో టిప్పూసుల్తాను అదేశంపై చంపబడిందని తెలుస్తున్నది.[3] మురారి రావుకు ఇద్దరు కుమారులు. వారు బాల్యంలోనే మరణించడంతో, చనిపోయేముందు దూరపు బంధువైన యశ్వంతరావు కుమారుడు శివరావు బాపాను దత్తత తీసుకున్నాడు.

తిరుచిరాపల్లి పాలనసవరించు

1740లో రఘూజీ భోంసాలే, ఫతే సింగ్, మురారిరావుల నేతృత్వంలో పెద్ద మరాఠా సైన్యంతో ఆర్కాటుపై దండయాత్ర చేసింది. ఆర్కాటు నవాబు దోస్త్ అలీ ఖాన్‌ను దామలచెరువు కనుమలో హతమార్చి ఆర్కాటు కోటను స్వాధీనం చేసుకొన్నారు. తిరుచ్చి కోటను ముట్టడిచేసి, అక్కడ జరిగిన యుద్ధంలో దోస్త్ అలీఖాన్ అల్లుడు చందా సాహిబ్ ను ఓడించి, బందీగా సతారాకు తీసుకొనివెళ్లారు. తిరుచ్చి కోటను పాలించడానికి మురారిరావును నియమించారు. 1741 జూన్ నుండి 1743 మార్చి వరకు రెండు సంవత్సరాలపాటు మురారిరావు పద్నాలుగు వేల మంది సైనిక బలగాన్ని తిరుచ్చి కోటలో మొహరించి, తిరుచిరాపల్లి ప్రాంతాన్ని పాలించాడు. కర్నాటకంలో వారసత్వపోరును మట్టు పెట్టాలనే కృత నిశ్చయంతో నిజాముల్ ముల్క్ 1743లో పెద్ద సైన్యంతో మరాఠులపై దండయాత్ర బయలుదేరాడు. ఆర్కాట్ కోటను తిరిగి వశం చేసుకొని అక్కడ వారసత్వ తగువుని తీర్చి, తిరుచ్చి కోటపై దాడి చేసి, ఆరు నెలల పాటు ముట్టడి కొనసాగించాడు. బాలాజీ బాజీరావు, రఘూజీ భోంసాలే పరస్పర విరుద్ధం వల్ల మహారాష్ట్ర నుండి సహాయం అందే సూచనలు లేక, చివరికి మురారిరావు నిజాంతో ఒప్పందం కుదుర్చుకొని కోటను వశం చేశాడు. ప్రతిగా నిజాం మురారి రావుకు రెండు లక్షల బహుమానంతో పాటు పెనుగొండ సీమనిచ్చి గుత్తి దుర్గాధిపతిని చేశాడు.[4]

ఫ్రెంచివారితో ఒప్పందంసవరించు

1752 నవంబరులో ఫ్రెంచి వారితో ఒప్పందం కుదుర్చుకుని, వారితో పాటు బ్రిటీషు వారిపై యుద్ధం చేశాడు. మురారిరావు తిరుచిరాపల్లి ముట్టడిలో ఫ్రెంచి వారికి సహాయం చేశాడు. ఆ సహాయానికి గానూ ఫ్రెంచివారు మురారిరావుకు పద్నాలుగు లక్షలు బాకీ పడ్డారు. కానీ కర్నాటకంలో కలిసిరాక, వర్తకం దెబ్బతిని మురారిరావు బాకీ చెల్లించలేకపోయారు.1754లో తన రాజధానిని గుత్తికి మార్చి అక్కడ స్థిరనివాసమేర్పరచుకున్నాడు.

సావనూరు యుద్ధంసవరించు

1756లో గుత్తి దుర్గాన్ని పాలిస్తూ మురారిరావు, తనకు రాజ్యం నేరుగా ఛత్రపతి వల్ల సంక్రమించింది, పీష్వా వల్ల కాదని, బాలాజీ బాజీరావుకు కప్పం కట్టడానికి నిరాకరించాడు. అదే సమయంలో నిజాంకు కప్పం కట్టకుండా ఎదురు తిరిగిన సావనూరు నవాబు అబ్దుల్ హకీం ఖాన్ ఆఫ్ఘానీతో పరస్పర సహకార ఒప్పందం కుదుర్చుకున్నాడు. సావనూరు కోటలో తన సేనలను మొహరించి నిజాం, పీష్వా సేనలనుండి కాపాడతానని హామీ ఇచ్చాడు.[5]

పీష్వా తన సేనలతో పాటు, మరాఠా నాయకులైన మల్హర్ రావు హోళ్కర్, మధోజీ హోళ్కర్ల సేనలతో పాటు 1756 మార్చి ప్రారంభంలో సావనూరు చేరుకున్నాడు. 1756 ప్రారంభంలోనే పీష్వాకంటే ముందే బీదరు నుండి బయలుదేరిన నిజాం సేనలు అప్పటికింకా సావనూరు చేరలేదు. షానవాజ్ ఖాన్ అదే అదనుగా భావించి ఫ్రెంచి వారిపై పీష్వాకు ముభావం కలిగేలా, నిజాం సేనల ఆలస్యంగా రావటానికి ఫ్రెంచివారే కారణమని పితూరీ చేశారు. ఫ్రెంచి వారు తమ పాత సయోధ్యుడైన మురారిరావుపై యుద్ధం చేయటానికి సిద్ధంగాలేరని షానవాజ్ ఖాన్ భావించడానికి కారణం లేకపోలేదు. తొలుత పీష్వాకు మురారిరావుకు మధ్య విభేదాలలో బుస్సీ, తమ బకాయిలను మాఫీ చేస్తాడనే ఆశతో మురారిరావు పక్షం వహించాడు. కానీ మురారిరావు, సావనూరు నవాబుతో చేతులు కలిపి నవాబు అధికారాన్ని కూడా ధిక్కరించడంతో, సలాబత్ జంగుకు విపక్షం వహించలేని బుస్సీ, చేసేదేమీ లేక మురారిరావుపై నిజాం, పీష్వాలతో సహా యుద్ధానికి సిద్ధమయ్యాడు.

సావనూరు కోటను మురారిరావు సమర్ధవంతంగా కాపాడటంతో కోట ముట్టడి ఏప్రిల్ నెలంతా కొనసాగింది. నిర్భంధంలో పెట్టిన వారిపట్ల అవలభించవలసిన వైఖరిపై పీష్వాల స్థావరంలోనూ, నిజాం స్థావరంలోనూ భిన్నాభిప్రాయాలున్నాయి. మురారిరావును ఎలాగైనా కాపాడాలని మల్హర్ రావు అభిమతమైతే, నిజాం సైన్యంలోని పఠానులు సావనూరు నవాబుపై సానుభూతి వెలిబుచ్చారు. ఈ విషయాలని గ్రహించిన బుస్సీ మురారిరావు తరఫున బాలాజీ బాజీరావుతో సంధి ప్రయత్నాలు చేశాడు. ముట్టడి ఇంకా అలాగే కొనసాగింది. మురారిరావును కాపాడటానికి బుస్సీ కావాలనే తాత్సారము చేస్తున్నాడని, ఇదివరకు ఉత్తర సర్కారు (తీరాంధ్ర) లకు ఫౌజుదారులుగా ఉన్న షానవాజ్ ఖాన్, జాఫర్ అలీలు ఆరోపించారు. బుస్సీ నిందను బాపుకోవడానికి తన ఫిరంగి దళాన్ని కోటపై దాడి చేయమని ఆజ్ఞ ఇచ్చాడు. ఏప్రిల్ 25న సావనూరు లొంగిపోయింది.

బుస్సీ మధ్యవర్తిత్వంతో అని పక్షాలు ఒక అంగీకారానికి వచ్చాయి. సావనూరు నవాబు, సలాబత్ జంగు ఆధిపత్యాన్ని తిరిగి శిరసావహించాడు. మురారిరావు పీష్వాకు చౌత్ చెల్లించడానికి ఒప్పుకున్నాడు. పీష్వా మురారిరావును తిరిగి తన సేవలోకి తీసుకున్నాడు. తనకోసం బుస్సీ పడిన శ్రమకు కృతజ్ఞతతో మురారిరావు ఫ్రెంచి ఈస్టిండియా కంపెనీ తనకు ఇవ్వవలసిన ఋణాన్ని మాఫీ చేశాడు.

మైసూరుతో యుద్ధాలుసవరించు

మరాఠులు పొరుగురాజ్యమైన మైసూరుతో ఎప్పుడూ యుద్ధం చేస్తూనే ఉన్నారు. హైదర్ అలీ ప్రాబల్యం పెరిగిపోతుందని గ్రహించిన పీష్వా మాధవరావు మురారిరావు సహాయంతో మైసూరుపై దండెత్తాడు. ఈ దండయాత్ర 1764 నుండి 1765 జూన్ వరకు కొనసాగింది. యుద్ధంలో గెలవలేక హైదర్‌అలీ పీష్వాతో సంధి చేసుకోని 28లక్షలు కప్పం చెల్లించాడు. తిరిగి 1770లో మాధవరావు శ్రీరంగపట్నానికి చేరుకున్నప్పుడు 40 లక్షలు కప్పం చెల్లిస్తానని సంధి చేసుకున్నాడు.

1775 డిసెంబరులో హైదర్ అలీ బళ్ళారిని కైవసం చేసుకొని గుత్తిపై ముట్టడి చేశాడు. 1776, జనవరి 10న గుత్తి దుర్గంపై దండెత్తి మురారి రావును బంధించి తొలుత శ్రీరంగపట్నంలోనూ, ఆ తర్వాత కబ్బాలదుర్గ్‌లో బందీగా ఉంచాడు.[6] ఆ తర్వాత కొన్నాళ్ళకే మురారిరావు కారాగారంలో 70 యేళ్లు పైబడిన వయసులో మరణించాడు. గుత్తితో పాటు సందూరు రాజ్యాన్ని మొత్తం హైదర్ అలీ తన సామ్రాజ్యంలో కలుపుకొన్నాడు.[7]

వ్యక్తిత్వంసవరించు

మురారిరావు ముక్కుసూటి మనిషి. డబ్బు విషయాలలో నిక్కచ్చిగా ఉండేవాడని, చేయించుకున్న పనికి జీతం తప్ప ఆపైనా ఒక్క ఫణం కూడా ఎక్కువ ఇవ్వడని, కొల్లగొట్టిన ధనాన్నంతా స్వయంగా అనుభవించేవాడని, తనకు రావలసినవి వసూలు చేసుకోవటానికి ఎంతటి పనులకైనా ఉపక్రమించగలడని సమకాలీన ఫ్రెంచివారి దుబాశీ ఆనందరంగ పిళ్లై డైరీల వల్ల తెలుస్తున్నది.[8]

మూలాలుసవరించు