మేరీ రీడ్ ఇంగ్లిష్‌ మహిళా సముద్రపు దొంగ. కాల్పనిక కథనాల్లో ఈమెను మార్క్ రీడ్ అన్న పేరుతో వ్యవహరిస్తారు. సముద్రపు దొంగతనానికి స్వర్ణయుగంగా పేరొందిన 18వ శతాబ్దిలో సుప్రసిద్ధులైన మహిళా సముద్రపు దొంగల్లో ఆమె, ఆమె స్నేహితురాలు అన్నే బోనీ ఉంటారు. సాహసోపేతమైన కార్యకలాపాలతో ప్రసిద్ధురాలైన ఈమె గురించి తెలిసిన చారిత్రక సమాచారం తక్కువే.[1]

మేరీ రీడ్ సమకాలీన కుడ్య చిత్రం

మేరీ రీడ్ తొలినాళ్ళ జీవితం గురించి కాల్పనిక కథలు, ఊహాత్మక వర్ణనలే ఎక్కువ ఉన్నాయి. జానపద కథల ప్రకారం వారసత్వపు సొమ్ము కొడుకుకైతే లభిస్తుంది కనుక ఆమె తల్లి చిన్నతనం నుంచే అబ్బాయిలా బట్టలువేసుకోవడం మేరీకి అలవాటు చేసింది.[2] టీనేజిలో బ్రిటిష్ సైన్యంలో చేరాలని ఆశించేది, అందువల్ల మగాడిలా కనిపించేందుకు మగాళ్ళ బట్టలువేసుకోవడం కొనసాగించింది. కొద్దికాలం పాటు బ్రిటిష్ సైన్యంలో చేరి మానేసింది.[1][3]

ఆమెకు వివాహమయ్యాకా చాలా కొద్దికాలానికే భర్త చనిపోయాడు. దానితో మిలటరీ డ్రెస్ వేసుకుని, నెదర్లాండ్స్ సైన్యంలో చేరింది. యుద్ధకాలం కాకపోవడంతో సైన్యంలో ఎదుగుదలకు ఆమెకు పెద్ద అవకాశం దొరకలేదు. దానితో ఆ ఉద్యోగం మానేసి వెస్టిండీస్‌కి వెళ్ళే ఓడ ఎక్కింది. అయితే, ఆమె ఎక్కింది సముద్రపు దొంగల నౌక. బ్రిటిష్ మగాడిగా తనను తాను పరిచయం చేసుకోవడంతో ఆ ముఠాలోని బ్రిటిష్ సముద్రపు దొంగలు ఆమెను చేర్చుకున్నారు.[4]

1720 ప్రాంతంలో కాలికో జాక్ అన్న సుప్రసిద్ధ సముద్రపు దొంగను, అతని రహస్య ప్రియురాలు, మహిళా సముద్రపు దొంగ అన్నే బోనీలను కలుసుకుంది. వాళ్ళిద్దరూ ఈమెను మగాడనే నమ్మారు. ఈ ముగ్గురూ కలిసి నాస్సౌ ఓడరేవు నుంచి విలియమ్ అనే సాయుధ ఒంటిస్తంభపు ఓడ (స్లూప్)ని దొంగతనం చేసి తీసుకుపోయారు.[5][6][7]

ఒక పోరాటంలో ఎదుటిపక్షపు సముద్రపు దొంగను చంపుతున్న మేరీ రీడ్

మేరీ మగాడి వేషంలో సముద్రపు దొంగగా దాడులు, యుద్ధాలు, ఇతర నేరాలు చేసింది. క్రమేపీ అన్నే బోనీ ఈమెని మగాడని నమ్మి ఆకర్షితురాలైంది. తాను అమ్మాయిననీ, మగవేషంలో ఉన్నాననీ, నిన్ను ప్రేమిస్తున్నానీ అన్నే ఈమెతో చెప్పడంతో తాను కూడా అమ్మాయినేనని, మగవేషంలో ఉన్నాననీ మేరీకి చెప్పక తప్పలేదు.[8]

1720 అక్టోబరులో జాక్ ముఠాపై జమైకా గవర్నర్ ఆదేశం మేరకు జొనాథన్ బ్రానెట్ అనే ప్రైవేటీర్ పట్టుకోవడానికి దాడిచేశాడు. ఈ సమయంలో ముఠాలోని మగ సముద్రపు దొంగలంతా తప్పతాగి ఉండడంతో పెద్దగా పోరాడకుండా డెక్ కింద దాక్కుండిపోయారు. మేరీ రీడ్ మాత్రం అన్నే బోనీతో కలసి సాహసోపేతంగా పోరాటం చేసింది. అయినప్పటికీ దాడిచేసినవారి సంఖ్యాబలం వల్ల అన్నే, మేరీలతో సహా జాక్ ముఠా మొత్తం అధికారులకు పట్టుబడ్డారు. వారందరినీ జమైకాకు తీసుకువెళ్ళగా గవర్నర్ లూయిస్ నేరాలను నిర్ధారించి, ఉరిశిక్ష విధించాడు.[9]

ఆ సమయానికే మేరీ రీడ్, అన్నే బోనీ గర్భవతులుగా ఉన్నామని, గర్భంలో పిల్లల కదలికలు తెలిసే దశలో ఉన్నామని ఉరితీయవద్దని అభ్యర్థిస్తూ క్షమాభిక్ష కోరారు. దీన్ని "ప్లీడింగ్ ద బెల్లీ" అంటారు. ఈ కారణంగా వారి ఉరిశిక్షల విషయంలో తాత్కాలిక నిలుపుదల సంపాదించుకోగలిగారు. తుదకు 1721 ఏప్రిల్ 28న జైల్లో తీవ్రమైన జ్వరం కారణంగా మేరీ రీడ్ చనిపోయింది. జమైకాలోని సెయింట్ కేథరీన్స్ చర్చికి అనుబంధంగా ఉన్న శ్మశాన వాటికలో ఆమెను పాతిపెట్టినట్టు రికార్డులు చెప్తున్నాయి. ఆమె ప్రసూతి సమస్యల కారణంగా చనిపోయి ఉండొచ్చన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. కానీ, ఆమె బిడ్డను పాతిపెట్టినట్టు, జన్మించినట్టు రికార్డులేమీ లేకపోవడంతో గర్భవతిగానే ఆమె చనిపోయి ఉండొచ్చని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు.[10]

అలెన్ & గింటర్ సిగరెట్ల కోసం రూపొందించిన పైరేట్స్ ఆఫ్ ద స్పానిష్ ప్రధాన సీరీస్లో ద్వంద్వ యుద్ధం చేస్తున్న మేరీ రీడ్

వీడియో గేమ్స్, టీవీ షోలు, సీరీస్లు, సినిమాలు, యానిమేషన్ చిత్రాలు, పాటలు, నవలలు వంటి అనేక మాధ్యమాల్లో మేరీ రీడ్ పాత్ర కనిపించింది.[11][12][13] వీటిలో కొన్ని చారిత్రకాంశాల ఆధారంగా రూపొందినవి కాగా మిగిలిన కాల్పనిక కథలు. 2020లో ఇంగ్లండ్‌లో బోనీ, రీడ్ల విగ్రహాలని కూడా ఏర్పాటుచేశారు. అయితే, శాశ్వతంగా పబ్లిక్ ప్రదేశంలో ప్రతిష్టించడానికి "సముద్రపు దొంగతనాన్ని గ్లామరైజ్ చేస్తున్నారన్న" ఆరోపణలు అడ్డుతగిలాయి. తర్వాత ఇంగ్లండ్‌కి చెందిన లూయిస్ ఫుట్‌బాల్ క్లబ్ ఈ విగ్రహాలను తీసుకుంది.[14][15][16]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 https://worldcat.org/en/title/225292570
  2. Daniel, Defoe; Johnson, Charles (1724). "Chapter VII: Of Captain John Rackham and His Crew". A General History of Pyrates. Lodon: Ch. Rivington, J. Lacy, and J. Stone. Finding her Burthen grew, in order to conceal her Shame, she takes a formal Leave of her Husband's Relations, giving out, that she went to live with some Friends of her own, in the Country: Accordingly she went away, and carry'd with her her young Son, at this Time, not a Year old: Soon after her departure her Son died, but Providence in Return, was pleased to give her a Girl in his Room, of which she was safely delivered, in her Retreat, and this was our Mary Read.
  3. Cordingly, David (1996). Under the Black Flag: The Romance and the Reality of Life Among the Pirates. New York: Random House. p. 61.
  4. Druett, Joan (2005) [2000]. She captains : heroines and hellions of the sea. New York: Barnes & Noble Books. ISBN 0760766916. OCLC 70236194.
  5. Woodard, Colin. "Mary Read Biography". Archived from the original on 4 January 2020. Retrieved 20 August 2014.
  6. Cordingly, David (2006). Under the Black Flag. New York: Random House. pp. 57–58. ISBN 978-0812977226.
  7. Rogers, Woodes (10 October 1720). "A proclamation". The Boston Gazette.
  8. Johnson, Charles (1724). A General History of the Pyrates. London: T. Warner. p. 162. […] this Intimacy so disturb'd Captain Rackam, who was the Lover and Gallant of Anne Bonny, that he grew furiously jealous, so that he told Anne Bonny, he would cut her new Lover's Throat, therefore, to quiet him, she let him into the Secret also.
  9. Zettle, LuAnn. "Anne Bonny The Last Pirate". Archived from the original on 22 May 2019.
  10. Woodard, Colin. "Mary Read Biography". Archived from the original on 4 January 2020. Retrieved 20 August 2014.
  11. McIntee, David (20 January 2016). Fortune and Glory: A Treasure Hunter's Handbook. Bloomsbury Publishing. p. 79. ISBN 9781472807861.
  12. Kain, Erik (10 December 2013). "The Surprisingly Beautiful Ending Of 'Assassin's Creed IV: Black Flag'". Forbes. Retrieved 24 December 2017.
  13. Schei, Kelley (2 January 2007). Zarker, Karen (ed.). "True Caribbean Pirates". PopMatters. Retrieved 26 March 2018.
  14. Lewis, Samantha (18 March 2023). "Introducing Lewes FC, the world's only gender-equal football club, and the Australians who play there". ABC News. 18 March 2023. Archived from the original on 14 October 2023. Retrieved 6 October 2023.
  15. "Female pirate lovers whose story was ignored by male historians immortalised with statue". The Independent. 18 November 2020. Archived from the original on 7 May 2022.
  16. "Burgh Island female pirates statue plans withdrawn". BBC News. 30 March 2021. 30 March 2021. Archived from the original on 14 October 2023. Retrieved 6 October 2023.
"https://te.wikipedia.org/w/index.php?title=మేరీ_రీడ్&oldid=4154448" నుండి వెలికితీశారు