యాజ్ఞసేని నవల ప్రముఖ ఒడియా రచయిత్రి, జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత ప్రతిభా రాయ్ రాసిన ఒడియా నవలకు తెలుగు అనువాదం. ఈ నవల మహాభారతంలోని ద్రౌపది జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని ఇతివృత్తంగా చేసుకుని సాగుతుంది.

రచన నేపథ్యం మార్చు

ప్రముఖ ఒడియా రచయిత్రి, జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత ప్రతిభా రాయ్ ఒడియా భాషలో యాజ్ఞసేని నవలను 1984లో రచించారు. నవలను రచించేందుకు ముఖ్యకారణంగా రచయిత్రి కొన్ని వివరాలను తెలిపారు. రచయిత్రి స్నేహితురాలి చెల్లెలు కృష్ణ భర్త వల్ల వంచితురాలై విడాకులు తీసుకుని రెండో పెళ్ళి చేసుకుందనీ, ఆమెను నిందిస్తూ ఒకరు "పేరే కృష్ణ. రెండో పెళ్ళెందుకు చేసుకోదు. కృష్ణ(ద్రౌపది మరోపేరు) ఐదుగురిని వరించినా కృష్ణునివైపు, కర్ణునివైపు ఆకర్షితురాలైంది" అన్నారనీ ఆమె రాసుకున్నారు. మూల భారతాన్ని గానీ, సరళానువాదాలను గానీ చదవనే చదవకుండా ద్రౌపదినీ, సంస్కృతినీ అవమానించే ఇలాంటి వ్యాఖ్యల వల్ల దుఃఖం కలిగి ఈ నవల రచించానని ఆమె తెలిపారు. జయశ్రీ మోహనరాజ్ తెలుగులోకి యాజ్ఞసేని పేరుతోనే అనువదించారు. ఎమెస్కో బుక్స్ సంస్థ ఈ పుస్తకాన్ని 2008 డిసెంబరులో ప్రచురించారు.[1]

ఇతివృత్తం మార్చు

ద్రౌపది దృక్కోణంలోంచి మహాభారతగాథను ఈ నవలలో చిత్రీకరించారు. పలు సందర్భాల్లో ద్రౌపది అనుభవించిన బాధలను, సంతోషాలను, అవమానాలను, సందిగ్ధాలను ఆమె నరేషన్‌లో వివరిస్తూ ఈ నవలకు ఇతివృత్తాన్ని ఏర్పరిచారు రచయిత్రి. వ్యాస భారతాన్ని ఆధారంగా చేసుకుని ఈ నవలను రచించారు. సరళా భారతం(ఒడియా భారతం) ప్రభావం కూడా కొంతవరకూ కనిపించవచ్చని రచయిత్రి పేర్కొన్నారు. ఈ గ్రంథం ద్రౌపది తన జీవితాన్ని గురించి తాను తలచుకోవడంతో ప్రారంభమౌతుంది. ఆపైన తనకూ కృష్ణునికీ ఉన్న ఆత్మికానుబంధాన్ని గురించి, తనకు తన తండ్రి ద్రుపదుడు స్వయంవరం ప్రకటించడంతో మొదలవుతుంది. పాండవులు ఐదుగురిని పెళ్ళిచేసుకోవడంలో ఆమె అనుభవించిన సంఘర్షణ, ఆపైన వారందరినీ కలిపివుంచే బాధ్యతను స్వీకరించి చేసిన ప్రయత్నాలు వంటివి కొనసాగుతాయి. దుర్యోధన దుశ్శాసనాదుల వల్ల తాను అనుభవించిన ఘోరమైన అవమానం, ఆపై అడవులకు వెళ్ళాల్సిరావడం, అజ్ఞాతంలో ఉండాల్సిరావడం వంటివన్నీ కథను సాగిస్తాయి. చివరకు యుద్ధానికి తానే ముఖ్యకారణం కావడం, కొడుకులను కోల్పోయి చివరకు అశ్వత్థామను వదిలివేయడం కూడా కథలో ద్రౌపది వైపు నుంచి వస్తుంది.

మూలాలు మార్చు

  1. ముందుమాట:ప్రతిభారాయ్:యాజ్ఞసేని:ఎమెస్కో ప్రచురణ