యిటర్బీ అనేది స్వీడన్ దేశం, స్టాక్‌హోమ్ ద్వీపసమూహంలోని రెసారో ద్వీపం లోని గ్రామం. గ్రామం పేరుకు "బయటి గ్రామం" అని అర్థం. [1] యిటర్బీ బహుశా ప్రపంచం లోనే అత్యధికంగా రసాయనిక మూలకాలను కనుగొన్న ప్రదేశం. రసాయన మూలకాలు యిట్రియం (Y), టెర్బియం (Tb), ఎర్బియం (Er), యిటర్బియం (Yb) లు అన్నిటికీ వాటి పేర్లు యిటర్బీ గ్రామం పేరిటనే పెట్టారు. ఇవి కాక, మరో నాలుగు మూలకాలను కూడా అక్కడే కనుగొన్నారు.

యిటర్బీ క్వారీ
యిటర్బీ గని ప్రవేశద్వారం వద్ద ASM ఇంటర్నేషనల్ సొసైటీ వారి ఫలకం

రసాయనిక ఆవిష్కరణలు మార్చు

1787లో లెఫ్టినెంట్ కార్ల్ ఆక్సెల్ అర్హేనియస్ అంతకు మునుపు తెలియని ఓ నల్లటి ఖనిజాన్ని కనుగొన్నప్పుడు ఇక్కడి మూలకాల గనుల చరిత్ర ప్రారంభమైంది. గతంలో అక్కడ ఉన్న ఓ కోట కోసం అతను ఈ ప్రాంతాన్ని అన్వేషించాడు. [2] రసాయన శాస్త్రంలో అతనికి గల అభిరుచి వలన అసాధారణంగా బరువుగా ఉన్న ఆ నల్లటి రాతిపై దృష్టి పెట్టాడు. 1794 లో ఫిన్నిష్ రసాయన శాస్త్రవేత్త జోహన్ గాడోలిన్ ఆ ఖనిజాన్ని పూర్తిగా విశ్లేషించి, దానిలో 38% కొత్త మూలకం ఏదో ఉందని కనుగొన్నాడు. ఆ మరుసటి సంవత్సరం స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త ఆండర్స్ గుస్టాఫ్ ఎకెబెర్గ్ దాన్ని ధృవీకరించాడు. ఆ ఖనిజానికి గాడోలినైట్ అనే పేరు, ఆ మూలకానికి యిట్రియా అని పేరు పెట్టాడు.

గాడోలినైట్‌ ఖనిజంలో అనేక అరుదైన-భూ మూలకాలను (రేర్ ఎర్త్ ఎలిమెంట్స్) గమనించారు. చివరికి దాని నుండి ఏడు కొత్త మూలకాలను కనుగొన్నారు. ఆ మూలకాలకు కొన్నిటికి ఆ ఖనిజం పేరు, మరి కొన్నిటికి ఆ ప్రాంతం పేరూ పెట్టారు. ఈ మూలకాలలో యిట్రియం (Y), ఎర్బియం (Er), టెర్బియం (Tb) యిటర్బియం (Yb) [3] ల గురించి 1794, 1843, 1843, 1878 లలో వివరించారు. వీటన్నిటికీ యిటర్బీ గ్రామం పేరే పెట్టారు. 1989లో ASM ఇంటర్నేషనల్ సొసైటీ ఆ గని ప్రవేశ ద్వారం వద్ద ఒక ఫలకాన్ని ఏర్పాటు చేసి, గనిని ఒక చారిత్రక మైలురాయిగా గుర్తించింది. [4]

పై మూలకాలతో పాటు, స్కాండియం (Sc), హోల్మియం (Ho, స్టాక్‌హోమ్ పేరు మీదుగా), థూలియం (Tm, స్కాండినేవియాకు ఉన్న థులే అనే పౌరాణిక పేరు మీదుగా), గాడోలినియం (Gd, రసాయన శాస్త్రవేత్త జోహాన్ గాడోలిన్ పేరిట) లను కూడా అదే క్వారీలో కనుగొన్నారు. [5]

యూరోపియన్ కెమికల్ సొసైటీ వారు ఈ యిటర్బీ గనికి, క్రీట్, గ్రీస్ దేశం, క్రీట్ లోని ABEA పారిశ్రామిక సముదాయానికీ 2018 లో హిస్టారికల్ ల్యాండ్‌మార్క్స్ అవార్డులు ఇచ్చింది. [6]

మూలాలు మార్చు

  1. Emsley, John (2001). Nature's Building Blocks. Oxford University Press. p. 496. ISBN 0-19-850341-5.
  2. Knutson Udd, Lena; Leek, Tommy (2012). "Ytterby gruva" (PDF) (in స్వీడిష్). Fortifikationsverket. Archived from the original (PDF) on 7 January 2018. Retrieved 6 January 2018.
  3. Emsley, John (2001). Nature's Building Blocks. Oxford University Press. p. 496. ISBN 0-19-850341-5.
  4. Blom, Carl-Hugo (18 June 2006). "Ytterby gruva" (in స్వీడిష్). Stockholms läns hembygdsförbund. Archived from the original on 12 February 2007. Retrieved 9 June 2007.{{cite web}}: CS1 maint: unfit URL (link)
  5. Kean, Sam (16 July 2010). "Ytterby: The Tiny Swedish Island That Gave the Periodic Table Four Different Elements". Slate. Retrieved 14 November 2016.
  6. "EuChemS Historical Landmarks". EuChemS (in ఇంగ్లీష్). Retrieved 15 September 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=యిటర్బీ&oldid=3708608" నుండి వెలికితీశారు