యువతీ వివాహభాగ్యోదయము
ఐదు అంకాలున్న ఈ సాంఘిక నాటకాన్ని కలుగోడు అశ్వత్థరావు[1] వ్రాశాడు. ఈ నాటక రచనోద్దేశము 'ధర్మక్షీణతను గాంచిగా గలిగిన మనఃక్లేశములవలన జనించిన యుద్రేకమే కారణముగాని నాటకరచనా కుతూహలమేమాత్రము గాద'ని గ్రంథకర్త వ్రాసుకున్నాడు. ప్రౌఢవివాహమును ఖండిచుటయే దీని ప్రధానోద్దేశము.
యువతీ వివాహభాగ్యోదయము | |
కృతికర్త: | కలుగోడు అశ్వత్థరావు |
---|---|
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | నాటకము |
విభాగం (కళా ప్రక్రియ): | తెలుగు సాహిత్యం |
ప్రచురణ: | రాయలసీమ ముద్రాక్షరశాల, బళ్లారి |
విడుదల: | 1931 |
పేజీలు: | 88 |
పాత్రలు
మార్చు- శ్యామల - కథానాయిక
- శ్యామసుందరనాయుడు - శ్యామల ప్రేమికుడు
- ఆనందరావు - శ్యామల భర్త
- రామమోహనరావు - శ్యామల తండ్రి
- సీతమ్మ - శ్యామల తల్లి
- గంగడు - ఆనందరావు సేవకుడు
- సీతారామయ్య - పురోహితుడు
ఇతివృత్తము
మార్చురామమోహనరావు, సీతాంబ అనే బ్రాహ్మణ దంపతులకు ఏకైక పుత్రిక శ్యామలాంబ. రావు సంఘసంస్కరణ ప్రియుడు. అందుకే తన కుమార్తెకు ప్రౌఢవివాహం చేయాలని సంకల్పిస్తాడు. ఆనందరావు అనే విద్యావంతుడైన ఆయన మేనల్లుడికే కూతురునిచ్చి వివాహము చేయాలనుకుంటాడు. కాని శ్యామల తన స్నేహితుడైన శ్యామసుందర నాయుడిని ప్రేమిస్తుంది. అతడు వర్ణాంతమునకు చెందినవాడగుటవలన శ్యామల తన కోరికను పైకి చెప్పుకోలేదు. తన తండ్రి ఆనందరావుతో వివాహము చేయడానికి సిద్ధమవగా విధిలేక ఒప్పుకొంది. శ్యామల తన భర్త పట్ల బాధ్యతగా ఉన్నప్పటికీ శ్యామసుందరునిపై ప్రేమను అణచుకోలేకపోయింది. ఒకనాడు శ్యామసుందరుడు ఆమెను ఏకాంతముగా కలిసి సంభాషించాడు. చిన్ననాటి స్నేహం పెరిగి పెద్దదై పెకిలింపలేనంత ప్రేమ వృక్షంగా పరిణమించిందని ఇరువురు గ్రహిస్తారు. సుందరుడు ఆమె నుండి సౌఖ్యమును కోరగా, ఆమె ప్రేమ తుచ్ఛసుఖముపై ఆధారపడినదికాదని సుందరుడనుకున్న దానికంటే అది గంభీరమైనదని తెలిపి, చిత్తవృత్తిని నిరోధించే నీతిమాటలను తెలిపి వారించి పంపింది.
శ్యామల,శ్యామసుందరులు సమావేశమైన విషయాన్ని గంగడు ఆనందరావుకు తెలియజేస్తాడు. అప్పటి నుండి శ్యామలను ఆనందరావు పరీక్షిస్తుంటాడు. ఇంతలో శ్యామసుందరుడి నుండి శ్యామలకొక ప్రేమలేఖ అందిన విషయాన్ని గంగడు ఆనందరావుకు తెలుపుతాడు. ఆ లేఖను ఆమె చదివి దాచివుంచగా, అది ఆనందరావు గమనిస్తాడు. తన అనుమానం ధృవపడి ఆమెను హత్య చేయడానికి ఉపాయం ఆలోచిస్తాడు. లేఖ విషయము భర్తకు తెలిసిపోయిందని శ్యామల గంగడి ద్వారా గుర్తిస్తుంది. ఆనందరావు విషమిస్తున్నాడని తెలిసినప్పటికి దానిని తాగేందుకు శ్యామల సిద్ధమవుతుంది. ఈ విషయం గంగడి ద్వారా రామమోహనుడు తెలుసుకొని శ్యామలను విషం తాగకుండా నిరోధించి అల్లుడిని దండిస్తాడు. శ్యామలను తన ఇంటికి తీసుకెళతాడు. అవమానము భరించలేక ఆనందరావు ఆ విషాన్నే త్రాగి చనిపోతాడు.
అల్లుడి మృతికి కారణము తెలుసుకొని శ్యామలను రామమోహనరావు దండిస్తాడు. శ్యామసుందరుడు ఒకనాడు ఇంట్లో శ్యామలతో మాట్లాడుతుండగా రామమోహనుడు కోపోద్రిక్తుడై, నిండుచూలాలని చూడకుండా శ్యామలను ఇంటిలో నుంచి వెళ్లగొడతాడు. శ్యామల దగ్గరిలోని అడవికి చేరి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది. శ్యామసుందరుడు అడవికిపోయి వచ్చిన అపకీర్తి రానేవచ్చింది, నా ఇంటికి వచ్చి సుఖముగా ఉండమని బ్రతిమాలుతాడు. కానీ శ్యామల అతనికి బుద్ధి చెప్పి పంపించివేస్తుంది. అక్కడ చెట్టు నీడనే విశ్రమించిన సీతారామయ్య అనే పురోహితుడు ఈ సంభాషణను విని ఆమెను ఊరికి రమ్మని కోరతాడు. అయినా ఆమె వెళ్లదు. శ్యామసుందరుడు అడవి నుండి వెళ్లిన తరువాత తన అనౌచిత్య ప్రవర్తనకు పశ్చాత్తాప పడి రామమోహన రావుకు ఒక లేఖ వ్రాసి మరణిస్తాడు.
సీతారామయ్య, రామమోహనునితో శ్యామల శీలవతి అని ఆమెను ఇంటికి తీసుకురావాలని తెలియజేస్తుండగానే శ్యామసుందరుని జాబు, అతని మరణవార్త రామమోహనరావుకు తెలుస్తుంది. కూతురి నిర్దోషిత్వాన్ని తెలుసుకొని రామమోహనరావు,ఆయన భార్య, సీతారామయ్యలు కలిసి శ్యామల కోసం అడవికి వెళతారు. అప్పటికే శ్యామల అడవిలో కొడుకును కని ఇక తన జీవితమునకు ప్రయోజనము లేదని మగడు త్రాగి మిగిల్చిన విషాన్ని త్రాగి మరణవేదనను అనుభవిస్తుంటుంది. తల్లిదండ్రులు వచ్చి వేడుకొనుచుండగా ఇక తన ప్రాణములు నిలవవని చెప్పి తన నిర్దోషిత్వాన్ని వారు తెలుసుకున్నందుకు ధన్యతగాంచి శ్యామసుందరుడు ఆత్మహత్య చేసుకున్నందుకు జాలిపడుతూ శ్యామల ప్రాణాలు వదిలివేస్తుంది. సంక్షిప్తంగా ఇది నాటక కథాంశం.
పత్రికాభిప్రాయము
మార్చుఈ నాటకాన్ని శ్రీసాధన పత్రిక 1931 నవంబరు 21వ తేదీ సంచికలో సమీక్షిస్తూ దీనిలోని కొన్ని సన్నివేశాల అనౌచిత్యాన్ని, అనవసర సంభాషణలను, కథాంశములో కార్యకారణ సంబంధం లేకపోవడాన్ని విమర్శిస్తూ " ఈ నాటకమునెల్లరు తప్పక చదివితీరవలసినది. ప్రదర్శనార్హముగా గూడా నున్నది. ఇంకనూ ఇతను రచనాశక్తిని వృద్ధిపరచుకొని గొప్ప నాటకములను వ్రాయగలడను ఊహకు ఈ నాటకము అవకాశమిచ్చుచున్నది" అని అభిప్రాయపడింది.
మూలాలు
మార్చు- ↑ సీమ సాహితీస్వరం - శ్రీసాధన పత్రిక - డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి - పుటలు 207-208