యోగ దర్శనం

(యోగ దర్శనము నుండి దారిమార్పు చెందింది)

షడ్దర్శనాలలో యోగదర్శనం ఒకటి. దీని రచయిత పతంజలి మహర్షి. ఈయన కాలం ఇతమిత్థంగా తెలియకపోయినా, తన కాలం నాటికి వ్యాప్తిలో ఉన్న యోగ విద్యా రహస్యాలను క్రోడీకరించి యోగ సూత్రాలు రచించాడు.

యోగ సూత్రాలు

మార్చు

"అథ: యోగానుశాసనమ్" అని యోగశాస్త్ర గ్రంథం ప్రారంభమవుతుంది. యోగం అంటే చిత్తవృత్తుల నిరోధం. జడమైన ప్రకృతి పురుషుని (జీవాత్మ) సాన్నిధ్యంవల్ల ప్రభావితమై పరిణామం చెందుతుంది. మొదట ప్రకృతినుంచి జడం ఉద్భవిస్తుంది. మహాత్ అంటే బుద్ధి (చిత్తం). చిత్తానికి వృత్తులుంటాయి. వృత్తులంటే వికారాలు, వ్యాపారాలు. అనుక్షణం చిత్తంలో మార్పులు సంభవిస్తూ ఉంటాయి. ఆ మార్పులను, వికారాలను, వృత్తులను నిరోధిస్తే సమాధి స్థితి లభిస్తుంది. ఇదే కైవల్యం. ఈ స్థితికి తోడ్పడేదే యోగం. యోగం అంటే మనోవికారాలను నిరోధించడమే.

చిత్తవృత్తులను నిరోధించినపుడు పురుషుడు స్వస్వరూపం పొందుతాడు. స్వచ్ఛస్ఫటికం వద్ద ఏ రంగు పువ్వును ఉంచితే స్ఫటికంలో ఆ రంగు ప్రతిఫలించి స్ఫటికం ఆ రంగులో కనిపిస్తుంది. పువ్వును తొలగించినపుడు స్ఫతికం తిరిగి స్వచ్ఛంగా ప్రకాశిస్తుంది. అలాగే చిత్త వృత్తులు పురుషునిలో ప్రతిఫలించడంవల్ల ఆ చిత్తవృత్తులే తానని పురుషుడు ఆయా వికారాలకు లోనవుతాడు. చిత్తవృత్తులను నిరోధిస్తే పురుషుడు స్వస్వరూప జ్ఞానం పొందుతాడు.

అభ్యాస వైరాగ్యాల ద్వారా చిత్త వికారాలను నిరోధించాలి. అభ్యాసం అంటే చిత్తాన్ని ఇంద్రియాలద్వారా గ్రహించే బాహ్య వస్తువులనుంచి మళ్ళీ మళ్ళీ మరల్చుతూ దాన్ని అంతర్ముఖం చేసి, ఏకాగ్రతను అభ్యసించి సాధించడం. వైరాగ్యం అంటే బాహ్య విషయాల పట్ల సుఖానుభవాల పట్ల వైముఖ్యాన్ని పెంచుకోవడం. దీనివల్ల పురుషునికి (జీవాత్మ) చిత్తంతో సంబంధం నశిస్తుంది. అట్టి సంబంధం ఉండడం వల్లనే చిత్తం అనుభవించే సుఖదు:ఖాలన్నీ తానే అనుభవిస్తున్నట్టు పురుషుడు భ్రమిస్తున్నాడు. ఆ భ్రమ తొలగితే అదే ముక్తవైకల్య స్థితి. భ్రమ తొలగి దు:ఖం లయించడానికి, ఆనందం సిద్ధించడానికి ఒక ఉపాయంగా ఈశ్వర భక్తి భావాన్ని యోగ దర్శనం పేర్కొంటుంది. ఈశ్వరునియందు భక్తిభావం, సర్వార్పణ భావం కలిగిన శరణాగతివల్ల కైవల్యం సిద్ధిస్తుంది. ఈశ్వరుడంటే ఎవరు అనే ప్రశ్నకు సమాధానంగా సాధారణంగా జీవాత్మ అనుభవించే క్లేశాలను, కర్మ విపాకాన్ని అనుభవించకుండా వాటిచే పరామృష్ఠుడు కాకుండా ఉండే పురుషోత్తముడే ఈశ్వరుడు అని, ఈశ్వర శరణాగతివల్ల శాశ్వతానందం లభిస్తుందని యోగం అంటుంది.

యోగాంగాలు

మార్చు

"యోగాంగానుష్ఠానా దశుద్ధిక్షయే

జ్ఞానదీప్తిరావివేక ఖ్యాతే:"

యోగాంగాలను అనుష్ఠించడం ద్వారా అశుద్ధి తొలగిపోయి జ్ఞాన దీప్తి వివేక ఖ్యాతి కలుగుతాయి. యోగాంగాలను ఈ విధంగా యోగసూత్ర గ్రంథం పేర్కొంటుంది.

"యమ నియమాసన ప్రాణాయామ

ప్రత్యాహార ధారణాధ్యాస సమాధయోష్ఠాంగాని"

యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి...ఇవే యోగాంగాలు. ఈ అష్టాంగాన్నే రాజయోగం అని కూడా అంటారు.

1. యమం:

అహింస - త్రికరణ శుద్ధిగా (మనోవాక్కర్మలతో) ఏ ప్రాణికి ఏ కొంచెమైనా బాధ కలగకుండా ప్రవర్తించడం. శారీరక హింస, వచోహింస, మనోహింస ఈ మూడూ త్యజించాలి.

సత్యం - త్రికరణ శుద్ధిగా సత్యమైన దాన్నే చెప్పడం, చేయడం, ఆలోచించడం. కపటం, వంచన లేశమైనా లేని మంచి నడవడి.

అస్తేయం - త్రికరణ శుద్ధిగా తనదికాని వస్తువును తాకకపోవడం. అంటే దొంగిలించకపోవడం.

బ్రహ్మచర్యం - స్త్రీ సాంగత్యానికి దూరముగా ఉండటం.

అపరిగ్రహం - తనకు ప్రాణం నిలుపుకొనడానికి, తన విధులు తాను నిర్వర్తించుకోడానికి, ఇతరులకు సహాయకారిగా ఉండటానికి అవసరమైనంత మాత్రమే సంపాదించడం.ఒకవేళ సంపాదించినా, దాన్ని ఇతరులకు త్యాగం చేయడం.

2.నియమం:

శౌచం - శుచిగా, శుభ్రంగా ఉండటం. మనస్సునుకూడా శుచిగా చెడు ఆలోచనలకు దూరంగా ఉంచడం.

సంతోషం - తన విధిని తాను నిర్వర్తిస్తూ దానివల్ల ఎంత ఫలం లభిస్తే దానితోనే తృప్తిచెందడం. అత్యాశకు పోకుండా సంతోషంగా ఉండటం.

తపస్సు - విధి నిర్వహణలో కలిగే శరీరక కష్టనిష్ఠురాలను, శీతోష్ణాలను సహించి, ఒక ఉన్నత ధ్యేయంకోసం ఏకాగ్రతతో, దీక్షతో ప్రయత్నించడం.

స్వాధ్యాయం - మానవ జీవిత లక్ష్యం ఏమిటి? మానవునికి ఏది కర్తవ్యం, వెనకటివారు ఈ విషయమై ఏం చెప్పారు, ఏం చేసారు అనేది తెలుసుకోటానికి ఉపనిషత్తులు, భగవద్గీత, గొప్పవారి జీవిత చరిత్రలు మొదలైన ఉత్తమ గ్రంథాలను సదా పఠించడం, నామ మంత్ర జపాలు చేయడం.

ఈశ్వరప్రణిధానం - సమస్తాన్ని ఈశ్వరార్పణంచేసి భగవచ్ఛరణాగతి పొందటం.

3.ఆసనం

స్థిరసుఖమాసనమ్‌ - స్థిరంగా సుఖంగా ఉండేదే ఆసనం. యోగ సాధనకి ఇటువంటి సుఖాసనం అవసరమని అర్థం.

4.ప్రాణాయామం

ఆసనం సిద్ధించిన తర్వాత ఉచ్ఛ్వాసనిశ్వాసాల గతి నిరోధమైన ప్రాణాయామం కూడా సిద్ధిస్తుంది. సమస్త విశ్వంలోని సాముదాయక శక్తే ప్రాణం. ఈ శక్తి ప్రతి ప్రాణి శరీరంలో చలనాన్ని కలిగించి ఉచ్ఛ్వాసనిశ్వాసాలని కలిగిస్తుంది. అలాంటి ప్రాణశక్తి వశం కావాలంటే ప్రాణాయామంద్వారా శ్వాసను వశంచేసుకోవాలి.

5.ప్రత్యాహారం

ఇంద్రియాలు తమ విషయాలను విసర్జించి చిత్తస్వరూపాన్ని పొందడమే ప్రత్యాహారం. అంటే చిత్తాన్ని ఇంద్రియ విషయ సంగ్రహం నుండి నిగ్రహించడమే ప్రత్యాహారం.

6.ధారణ

చిత్తాన్ని ఒకచోట నిలపడమే ధారణ. శరీరంలోగాని, బయటగాని ఒకచోట మనసు నిలబడితే అది ధారణ.

7.ధ్యానము

ఏ లక్ష్యంమీద ధారణ చేస్తున్నామో - అనగా దేనిమీద మనసు నిలబడిందో దానిమీద కొంతకాలం చిత్తాన్ని నిలిపి ఉంచగలగడమే ధ్యానం.

8. సమాధి

ఎప్పుడైతే ధ్యానంలో రూపాలు నశించి అర్థం మాత్రమే భాసిస్తుందో అది సమాధి. ధ్యానంలో ధ్యేయవస్తువు రూపం మాయమై, భావం మాత్రమే కనిపిస్తే సమాధి స్థితి.