అధిక రక్తపోటు సమస్య వైద్యచికిత్సలో భాగంగా రక్తపోటు మందులు ఉపయోగిస్తారు.[1] అధిక రక్తపోటు వల్ల ఏర్పడే మయోకార్డియల్ ఇన్ ఫ్రాక్షన్, గుండెపోటు వంటి సమస్యలను నివారించేందుకు అధిక రక్తపోటు చికిత్స ఉద్దేశించబడింది. రక్తపోటును 5 mmHg ప్రమాణం మేరకు తగ్గించగలిగితే గుండె పోటు వచ్చే ప్రమాదం 34శాతం, ఇస్చెమిక్ గుండెజబ్బు ప్రమాదావకాశం 21 శాతం తగ్గుతాయని అధ్యయనాల ద్వారా వెల్లడవుతోంది. అంతేకాక డెమెంటియా, గుండె స్తంభించిపోవడం, ఇతర రక్తప్రసరణ వ్యవస్థ వ్యాధుల వల్ల మరణించే అవకాశాలు గణనీయంగా తగ్గుతున్నట్టు గుర్తించారు. రక్తపోటును తగ్గించేందుకు ఉపయోగించే ఈ రక్తపోటు మందులను వేర్వేరు రకాల పద్ధతుల్లో వర్గీకరించవచ్చు. వాటిలో ప్రపంచవ్యాప్తంగా ప్రముఖంగా ఉపయోగిస్తున్నవి థైయెజైడ్ డైయూరిటిక్స్(Thiazides), ఎ.సి.ఇ. ఇన్హిబిటర్స్(ACE inhibitor), కాల్షియం ఛానెల్ బ్లాకర్స్(calcium channel blockers), బీటా బ్లాకర్స్(beta blockers), యాంజియోటెన్సిన్ 2 రిసెప్టార్ యాంటెగోనిస్ట్స్(angiotensin II receptor inhibitor) అనే వర్గాల రక్తపోటు మందులు.

అధిక రక్తపోటు చికిత్సలో ప్రాథమికంగా ఏ రకమైన మందును ఉపయోగించాలన్న అంశంపై ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున అధ్యయనాలు జరుగుతున్నాయి. వాటి ఫలితంగా పలు దేశాల్లో ఎన్నో మార్గదర్శకాలు (guidelines) రూపుదిద్దుకుంటున్నాయి. రక్తపోటు పెరగడం వల్ల ఏర్పడే ముఖ్యమైన ఆరోగ్యసమస్యలైన గుండె నొప్పి, పోటు, గుండె పనిచేయకపోవడం వంటివాటిని నిరోధించడమే రక్తపోటు చికిత్సకు ప్రాథమిక లక్ష్యం. మందును, మందు మోతాదును నిర్ణయించడంలో రోగి వయసు, రక్తపోటు పెరగడం వల్ల ఏర్పడిన రోగలక్షణాలు, తద్వారా దెబ్బతినే శరీర భాగాలు వంటి అంశాలు పరిగణనలోకి వస్తాయి. వివిధ రక్తపోటు మందుల్లో ప్రభావం చూపే పద్ధతి, రోగంగా పరిణమించడాన్ని (end points) నిరోధించగలిగే సామర్థ్యం, ఖరీదు వంటి వాటిలో తేడావుంటుంది. 2009 వరకూ ఉన్న ఆధారాలు పరిశీలిస్తే థైయాజైడ్ డైయూరెటిక్స్ (thiazide diuretics) అనే వర్గానికి చెందిన మందులు అధిక రక్తపోటు వైద్యచికిత్సలో ప్రథమశ్రేణి వైద్యచికిత్సా విధానంలో భాగంగా నిలుస్తున్నాయి. కానీ వైద్యచికిత్సలో లభించే ఆధారాలను పరిశీలిస్తే అటు సమర్థత కోణంలో కానీ, ఇటు ఖరీదు దృక్కోణంలో కానీ కాల్షియం చానల్ బ్లాకర్స్ (calcium channel blockers), థైయాజైడ్-రకపు డైయూరిటిక్స్ (thiazide-type diuretics) ప్రథమశ్రేణి చికిత్సగా ఎంచవచ్చు.

మూలాలు

మార్చు
  1. Antihypertensive Agents at the US National Library of Medicine Medical Subject Headings