రజియా సుల్తానా
రజియా అల్-దీన్ (ఆంగ్లం : Razia al-Din) (1205-1240) (పర్షియన్ : / ఉర్దూ : رضیہ سلطانہ), పట్టాభిషక్త పేరు జలాలత్ ఉద్-దీన్ రజియా (Jalâlat ud-Dîn Raziyâ) (పర్షియన్ / ఉర్దూ : جلالۃ الدین رضیہ), సాధారణంగా చరిత్రలో రజియా సుల్తాన్ లేదా రజియా సుల్తానాగా ప్రసిద్ధి. ఈమె ఢిల్లీ సింహాసనంపై సా.శ. 1236 నుండి 1240 వరకు ఆశీనురాలైంది. ఈమె సెల్జుక్ వంశ టర్కిష్ మహిళ, సమకాలీన ముస్లిం యువరాణులలాగా సైనిక విద్య, కవాతు, ఇతర యుద్ధ విద్యలు నేర్చుకున్నది.[1] టర్కిష్ చరిత్రలోనూ, ముస్లింల చరిత్రలోనూ ప్రథమ మహిళా చక్రవర్తి.
రజియా సుల్తానా | |
---|---|
ఢిల్లీ సుల్తాను | |
రజియా సమాధి, ఢిల్లీ లోని తుర్కమాన్ గేటు వద్దగల "బుల్‌బులె-ఖాన్"లో. | |
పరిపాలన | 10 November 1236– 13 October 1240 |
ఇంతకు ముందున్నవారు | షంసుద్దీన్ అల్తమష్ |
Consort to | ఇఖ్తియార్-ఉద్-దిన్ మీర్జా అల్తునియా |
వంశము | మమ్లూక్ |
తండ్రి | షంసుద్దీన్ అల్తమష్ |
ఈమె తండ్రి షంసుద్దీన్ అల్తమష్ ("ఇల్‌టుట్ మిష్"గా గుర్తిస్తారు) తరువాత, ఇతని వారసురాలిగా ఢిల్లీ సల్తనత్ను 1236 లో అధిష్టించింది. అల్తమష్, ఒక మహిళను సుల్తాన్ గా ప్రకటించి చరిత్రలో ఒక క్రొత్త ఒరవడిని సృష్టించిన వాడయ్యాడు. (ఓ కథనం ప్రకారం, అల్తమష్ తన కుమారుణ్ణి పట్టాభిషక్తుణ్ణి గావించాడు, కానీ అతను మరణించాడు). కానీ ముస్లిం నాయకులు ఒక మహిళ సుల్తాన్ గా ప్రకటించబడడం జీర్ణించుకోలేక, రజియా అన్నయైన రుక్నుద్దీన్ ఫిరోజ్ షాను అల్తమష్ మరణం ( 1236 ఏప్రిల్ 29) తరువాత, రాజుగా ప్రకటించారు.
రుక్నుద్దీన్ పరిపాలన చాలా స్వల్పకాలికం. అల్తమష్ భార్యయైన షాహ్ తుక్రాన్, తన కుమారుణ్ణి సింహాసనంపై కూర్చోబెట్టి తానే అధికారాలు చెలాయించేది. రుక్నుద్దీన్ వ్యసనపరుడైనందున ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చింది. 1236 నవంబరు 9 న షాహ్ తుక్రాన్, రుక్నుద్దీన్ వధించబడ్డారు.[2] రుక్నుద్దీన్ కేవలం ఆరునెలల కాలానికి మాత్రమే సుల్తాన్ గా ఉన్నాడు.
రజియాలో గల అర్హతల దృష్ట్యా, ఈమె ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించేదుకు ప్రజానుమతి కలిగినది. రజియా అంతఃపుర స్త్రీలలా వుండేది కాదు. ప్రజలలో ఒకరిగా వుండేది. ప్రజాసంబంధాల కారణంగా మంచి పలుకుబడి కలిగివున్నది. తన తండ్రి కాలంలో తండ్రితోనే వుంటూ రాజవ్యవహారాలను చక్కగా వంటబట్టించుకున్నది. పురుషునివలె దుస్తులు ధరించేది. సైనికుని వలె తిరిగేది. యుద్ధాలలో తానే నాయకత్వం వహిస్తూ వచ్చేది.
రాజతంత్రాలలో ఆరితేరిన రజియా, టర్కిష్ ప్రతినిథులను సామంతులను అవలీలగా నిలువరించగలిగినది. తన వ్యతిరేక వర్గాల మధ్య వ్యతిరేకతను సృష్టించి తన సింహాసనాన్ని భద్రపరచుకో గలిగినది.
కానీ రజియా తన సలహాదారులలో ఒకడైన జమాలుద్దీన్ యాకూత్, ఒక అబిసీనియన్ దాసుడు[3] పరస్పర ఆకర్షణా మూలంగా, ఇతర ప్రతినిధుల కోపాన్ని చవిచూడవలసివచ్చింది. ఒక హబష్ (అబిసీనియన్) దాసుడికి రజియా దాసురాలవడం జీర్ణించుకోలేక పోయారు. రజియాకు వ్యతిరేకంగా కార్యకలాపాలు ఆరంభమయ్యాయి. రజియా చిన్ననాటి స్నేహితుడు, భటిండా గవర్నరు అయిన మాలిక్ ఇక్తియారుద్దీన్ అల్తూనియా, ఈ వ్యతిరేక వర్గాలతో చేయి కలిపాడు. రజియా, అల్తూనియాల మధ్య జరిగిన యుద్ధంలో యాకూత్ చంపబడ్డాడు, రజియా చెరసాల పరమయింది. ఆఖరుకు రజియా అల్తూనియాను వివాహమాడింది. ఈ మధ్య రజియా అన్నయైన ముయిజుద్దీన్ బహ్రామ్ షాహ్, అల్తూనియాపై యుద్ధం ప్రకటించాడు. ఈ యుద్ధంలో అల్తూనియా, రజియా 1240 అక్టోబరు 14 న, ప్రాణాలు కోల్పోయారు. బహ్రామ్ షా ఢిల్లీ సింహాసనం అధిష్ఠించాడు.
రజియా, సుల్తానుగా ముస్లిమేతరులపై పన్నులను తొలగించింది, ఈవిషయం ఇతర ముస్లిం ప్రతినిధులను కోపాన్ని తెప్పించింది. ఇందుకు సమాధానంగా, రజియా, ముస్లింల భావాలకన్నా ఇస్లాం సూత్రాలు ముఖ్యమనీ ముహమ్మద్ ప్రవక్త ప్రవచనాలను ఉటంకించింది,
“ | ముస్లిమేతరులపై భారాలను మోపకండి : ముహమ్మద్ ప్రవక్త | ” |
ఇంకో సందర్భంలో రజియా, క్రొత్తగా ఇస్లాంను స్వీకరించిన ఒకరిని ఉన్నత స్థానంగల హోదానిచ్చింది, దీనినీ టర్కిష్ నోబుల్స్ వ్యతిరేకతను ప్రదర్శించారు.
రజియా తన రాజ్యంపట్ల తన ప్రజలపట్ల అమిత శ్రద్ధాశక్తులు చూపేది. ప్రజాక్షేమం మొదటి విషయంగా చూసేది. ఇతర రాజులమాదిరి, ప్రజలనుండి దూరంగా వుండక, ప్రజలలోనే ఒకరిగా తిరుగుతూవుండేది. పరమత సహనం ఈమె ఆభరణముగా మారింది. హిందూమతావలంబీకుల పట్ల చూపించే అభిమానం పట్లనూ సమకాలీన ముస్లిం చరిత్రకారులు వ్యతిరేకత వ్యక్తపరిచారు.
రజియా, పాఠశాలను, విద్యాసంస్థలను, పరిశోధనా కేంద్రాలను, ప్రజా-గ్రంధాలయాను స్థాపించింది. ఈ సంస్థలలో, ప్రాచీన తత్వవేత్తల పై, ఖురాన్ పై, హదీసులపై పరిశోధనలు సాగేవి. హిందు ధర్మశాస్త్రాలు, తత్వము, ఖగోళశాస్త్రము, సాహిత్యమునూ ఈ పాఠశాలలు, కళాశాలలో అధ్యయనా విషయాలుగా వుండేవి. రజియాను ఎవరైనా "సుల్తానా" అని సంబోధిస్తే, నిరాకరించేది. సుల్తానా అనగా 'సుల్తాన్ గారి భార్య' అని అర్థం స్ఫురిస్తుంది. తననెప్పుడూ "సుల్తాన్" అని పిలువాలని కోరేది.
ఇవీ చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "Gloria Steinem (Introduction), Herstory: Women Who Changed the World, eds. Deborah G. Ohrn and Ruth Ashby, Viking, (1995) p. 34-36. ISBN 978-0sex670854349". Archived from the original on 2006-06-19. Retrieved 2009-02-07.
- ↑ Satish Chandra, History of Medieval India(800-1700), New Delhi, Orient Longman, (2007), p.100. ISBN 81-250-3226-6
- ↑ "Dr. Richard Pankhurst, "Ethiopia Across the Red Sea and Indian Ocean", Addis Ababa, Addis Tribune, (21 May 1999)". Archived from the original on 13 మే 2008. Retrieved 9 జనవరి 2020.
సాహిత్యం
మార్చు- Jamila Brijbhushan, Sultan Raziya, Her Life and Times: A Reappraisal, South Asia Books (1990) ISBN 81-85425-09-4
- Rafiq Zakaria, Razia, Queen of India, Oxford University Press (1966)