రాంభట్ల కృష్ణమూర్తి 'జనకథ'
రాంభట్ల కృష్ణమూర్తి 'జనకథ.' కృష్ణమూర్తి జననం, 1920,మార్చి,4 వతారీకు,అమలాపురం సమీపంలోని అనాతర అగ్రహారం, మరణం 2001, డిసెంబర్ 7 వ తారీకు. వేదపండితుల కుటుంబంలో పుట్టి, వైదికవిద్యలు నేర్చి, రష్యా విశ్వవిద్యాలయంలో చదివిన మేథావి రాంభట్లకృష్ణమూర్తి. 2వ ఎటనే తండ్రి మరణించడంతో మేనమామలు, చిన్నాన్న సహకారంతో Vform దాకా మాత్రమే స్కూలుకు వెళ్ళి చదివారు, తరవాత స్వయంకృషితో ఇంగ్షీషు, కన్నడ, ఊరుడు, తెలుగులో పాండిత్యం సంపాదిచ్చుకొన్నారు. ఆయన చరిత్ర, ఆంత్రోపాలజి వంటి బహుశాస్త్రాలు అధ్యయనంచేసిన మార్క్సిస్టు మేథావి, ఇండాలజిస్టు, నడిచే గ్రంథాలయం, అనేక గ్రంథాలు రాశారు, అనువాదం చేశారు. తెలుగు జర్నలిజమ్ అధ్యయనకేంద్రం ప్రధాన ఆచార్యులుగా చేశారు. కొన్నేళ్ళు సోవియట్ యూనియన్ రాజధాని మాస్కోలోని ప్రచురణ సంస్థలో పనిచేశారు. తరుణ వయస్సులో ఆర్యసమాజ ప్రభావంలోకి వచ్చి వేదసాహిత్యం మీద మాక్స్ ముల్లరు వంటి పండితుల గ్రంథాలు అన్నీ అధ్యయనం చేశారు, హయదరాబాదులోని మీజాన్ పత్రికలో 1944 ప్రాంతంలో కొంతకాలం పనిచేశారు. శ్రీపాద అమృత డాంగే, జవహర్ లాల్ నెహ్రూ, రాహుల్ సాంకృత్యాయన్ గ్రంథాలు చదివి, మార్క్స్, ఎంగెల్సు ప్రభావంలోకి వచ్చి ఆ సాహిత్యమంతా చదివారు. కన్యాశుల్కం ఆయనకు చాలా ఇస్టమయిన నాటకం.
మన ప్రాచీన ఆచారాల్లో దాగివున్న తాంత్రిక భావనలను గురించి పరిశోధిస్తూ, కేదారగౌరీవ్రతంకథకు సంబంధించిన మూలాలు మన "చరిత్రపూర్వచరిత్ర"లో నుంచి వెలికితీశారు. మానవుడు గణజీవితం గడుపుతున్ననాటి కథ, ఆనాటి విషాద ప్రణయగాథ గ్రీకు పురాణంలో ఉంది. ఆగాథలో యువకుడిపేరు పెరామిస్, యువతిపేరు థెప్సీ. ఇదే మన కేదారగౌరీ వ్రతకథ, ప్రణయ సాఫల్యంకోసం చేసే ప్రయత్నం. మనకథలో పులి, గ్రీకుగాథలో సింహం, మనకు తెల్ల నేరేడుచెట్ట, గ్రీకు కథలో తెల్ల మల్బరీచెట్టు.
వరుణానది ఎగువన మారి అన్న నగరం. ఆ నగర నాయిక ఇసన్న సుక్కమహాదేవి విగ్రహాన్ని బంగారంతో పోతపోయించింది. ఆపనికి చాలా ధనం, జనం అవసరం కనుక ప్రేమలు పెళ్ళిళ్ళను నిషేధించింది. సుక్కమహాదేవి నియంత రాజ్యం.
కేదారుడు, గౌరి ఇరుగు పొరుగులు. ప్రేమించుకొంటారు.పెళ్ళికి నియంత శాసనం అడ్డమవుతుంది. ప్రేమికులు కలుసుకున్నా నేరం. ఇద్దరూ ఒక చిటికెల భాష కనిపెట్టి సంకేతాల రూపంలో సంభాషించుకొనేవారు. ఊరిబయట పాడుబడిన గుడిలో పెళ్ళి చేసుకోవాలనుకున్నారు. గౌరి ఒంటరిగా బయల్దేరింది. వరుణానది అనేచిన్న వాగుదాటాలి.అక్కడ ఉన్న తెల్ల నేరేడుచెట్టు వద్ద సంకేత స్థలంలో కలుసుకోవాలి. ఇంతలో అక్కడ పెద్దపులి ప్రత్యక్ష మైంది. గౌరి తత్తరపాటులో పొదమాటున దాక్కుంది. ఆమె వోణీ ఆ గత్తరలో జారిపోయింది. పులి నెత్తురు పంజాతో వోణీని కదిపిచూసి వెళ్ళిపోయింది. ఆలస్యంగా అక్కడికి చేరిన కేదారుడు ఆ నెత్తురు మరకల వోణీని చూచి అమెను పులి చంపితిన్నదని భావించి, నేరేడుచెట్టు మొదట్లో కూర్చుని బాకుతో పొడుచుకుని చనిపోయాడు. చీకటిలో అతణ్ణి చూచి ఆమె కూడా ఆబాకుతోనే పొడుచుకుని ప్రాణాలు విడిచిపెట్టింది.
ఆ ప్రేమికుల వేడి నెత్తురుతో చెట్టు మొదలు తడిసిపోయింది. నేరేడు పళ్ళలోకి నెత్తురు చేరి తెల్ల నేరేడుపళ్ళు కాస్తా అల్లోనేరేడు పళ్ళయ్యాయి.
ఈ దృశ్యాన్ని చూచి జనం తిరగబడ్డారు. సుక్క మహాదేవి విగ్రహాన్ని ధ్వంసంచేసి, దంచి పొడిచేసి వరుణానది ఇసుకలో కలిపారు. తిరుగుబాటుదారులు మనదేశంలో ప్రవేశించారు. వెంటవచ్చినవారు తమను తాము ఆది జాంబవులమని చెప్పుకొన్నారు. ఈగాథకు ఆధారం నేరేడు చెట్టు కనుక ఈభూమికి జంబుద్వీపమని, నేరేడు చెట్టు కింది ఇసకంతా బంగారమేకనుక బంగారానికి జాంబూనదం అని పేర్లు. ఈ పేర్లు సంస్కృత పురాణాలకెక్కినా, కేదారగౌరీ వ్రతగాథ జానపదుల్లో మిగిలి పోయింది. మన పెళ్ళిళ్ళలో నేరేడు మండ తెచ్చి పెట్టుకొనే ఆచారం ఇంకా కొనసాగుతూనే ఉంది.
ఇటువంటి అనేక నూతన విషయాలను మహా విద్వాంసులుగా పేరుపొందిన రాంభట్ల కృష్ణమూర్తి "జనకథ"లో గ్రంథస్తం చేశారు. అంతేకాదు, 'జనకథ'లో వందల ప్రాచీన పదాల పుట్టుక మీద కొత్త వ్యాఖ్యలు, వివరణలు చేర్చారు. అయన ఆత్మ కథ ' సొంత కథ', 'వేదభూమి' వంటి అనేక రచనలు చేశారు. మూలాలు: 1. జనకథ, వేదభూమి, నాకథ, నవచేతన ప్రచురణ, హయిదరాబాదు. 2. సకలం.కాం లో శిష్యగణమే పెన్నిధి, వ్యాసం 2000,డిసెంబర్, 7 వ తారీకు. 3. ఆదర్శిని.కాం, సీనియర్ జర్నలిస్ట్ శ్రీ గోవిందరాజుల చక్రధర్ వ్యాసం. 4.2020, ఫిబ్రవరి 20సాక్షి పత్రికలో శ్రీ మందలపర్తి కిశోర్ రాసిన వ్యాసం.