రాధాగోపాలం కథలు
రాధాగోపాలం కథలు ప్రముఖ హాస్యరచయిత, సినీనిర్మాత, రచయిత ముళ్లపూడి వెంకట రమణ రచించారు. యువ దంపతులైన రాధ, గోపాలం పాత్రలుగా వారి సాంసారిక జీవితంలోని గిల్లికజ్జాలు, కోపతాపాలు, సరసాలు, సరదాలు కథాంశాలుగా రాసిన కథలు ఇవి.
రచన నేపథ్యం
మార్చురాధాగోపాలం కథల్లో ఒక్క కథ తప్ప రమణ అన్నీ 1954-55ల్లో రాశారు. ప్రమాదో ధీమతామపి అను గోపాలోపనిషత్తు కథ మాత్రం 1996లో ఆంధ్రా బ్యాంకు వారి కోరిక మేరకు రాశారు. కుటుంబ జీవితంలోని సొగసులను రమ్యంగా గ్రంథస్థం చేసిన రమణ ఈ కథామాలికను బ్రహ్మచారిగా ఉన్నప్పుడే రాయడం విశేషం.
ఇతివృత్తాలు
మార్చురాధాగోపాలం కథలలోని ఇతివృత్తాలు దాంపత్య జీవితంలోని వివిధ దశలను, మారుతూండే మానసిక తత్త్వాలను ఆధారం చేసుకుని అల్లారు. లహరి కథలో కొత్తగా పెళ్లైన రాధా గోపాలాల మధ్య చీర రంగు గురించి గొడవ రావడం, రాధను వదిలి గోపాలం వేరే రైలుపెట్టె ఎక్కడం వంటివి సాగి చివరకు ఆ మాత్రం విరహాన్నే గోపాలం భరించలేక తప్పొప్పుకోవడం ఇతివృత్తం. రాధమ్మ బాకీలో రాధమ్మ కోసం తాను చేసిన అప్పులు గోపాలం చెప్తే, గోపాలం కోసం రాధమ్మ పడ్డ పాట్లు ఆమె చెప్పడం ముఖ్య కథాంశం. సాధారణంగా అమ్మాయి ప్రేమ కోసం తాపత్రయపడే అబ్బాయిల గురించి చెప్తారు కానీ ఈ కథ దానికి విప్రతిపత్తిగా ఉంటుంది. కుమార సంభవం గోపాలం, రాధల పెళ్ళి ముందు నుంచీ ప్రారంభమౌతుంది. గోపాలం మనసులో వేర్వేరు అమ్మాయిలు దీపాలు వెలిగిస్తూ ఆపై ఎవరెవర్నో చేసుకుని ఆ దీపాలు తమతో తీసుకుపోతున్న నూత్న యౌవనంలో కథ మొదలవుతుంది. అదే సమయంలో అతని బామ్మ గారు, పక్కింటి మామ్మ గారితో ఎవరు ముందు మునిమనవణ్ణి ఎత్తుకుంటే వాళ్లు లక్షవత్తుల నోముఫలం ధారవోసి, కాశీకి తీసుకెళ్లి తీసుకురావాలనే పందెం వేసుకుంటారు. అక్కణ్ణించి మొదలై ఎలా కుమారుడు సంభవించాడనేదే ఇతివృత్తంగా రాశారు. చుట్టాలొచ్చారు కథ రాధ గోపాలాల ఇంటికి వేలువిడిచిన చుట్టాలు తిరపతి వెళ్తూ రావడం ఇతివృత్తంగా ఉంటుంది. తిమింగిలగిలం కథ అప్పులడిగి వడేసి పట్టుకుపోయే అప్పారావు ఉరఫ్ తుకారాన్ని వదిలించుకునేందుకు గోపాలం రాధ చెల్లెలి వరసైన అమ్మాయి సీతనిచ్చి పెళ్ళి చేసే ప్రయత్నం చేస్తాడు. చివరికి వేరే ఋణధృవం సుబ్బారావుకి దొరికి అతని మరదలికి ఇచ్చి చేయడం వైపుకు మలుపు తిరుగుతుంది ఇతివృత్తం. ఆంధ్రాబ్యాంకు వారు కోరగా రాసిన కథ కావడంతో శ్రీగోపాళోపనిషత్తు అను ప్రమాదోధీమతామపి ఆంధ్రాబ్యాంకు ప్రస్తావనతో ముగుస్తుంది. ఇతివృత్తం కేవలం రాధ గోపాలాల మధ్య చిన్న సరదా ఇతివృత్తం.[1]
కథల జాబితా
మార్చు- లహరి
- రాధమ్మ బాకీ
- కుమార సంభవం
- చుట్టాలొచ్చారు
- తిమింగిలగిలం
- శ్రీగోపాళోపనిషత్తు అను ప్రమాదోధీమతామపి
పాత్రలు
మార్చుకథామాలికలో ముఖ్య పాత్రలు:
- గోపాలం: కథానాయకుడు
- రాధ: కథానాయిక.
- మీసాల రావు ఉరఫ్ జి.వి.మూర్తి: ఉపకథానాయకుని పాత్ర.
- సుబ్బలక్ష్మి: ఉపకథానాయిక.
- అప్పారావు ఉరఫ్ తుకారాం: అప్పుల కోసం వచ్చి కథ మలుపు తిప్పిపోయే పాత్ర
- భీమశంకరం: గోపాలం తండ్రి
- గోపాలం బామ్మ
- శంకరరావు: రాధ గోపాలాల కొడుకు
శైలి-శిల్పం
మార్చురాధాగోపాలాల కథల్లో కాలక్రమంలో కొత్త దంపతుల ప్రణయకలహాలు, చుట్టాలరాక, పుత్రోదయం వంటివి వస్తూంటాయి. కొడుకు పుట్టినపుడు భార్యప్రేమను పంచుకోబోవడం వంటి మనోవైజ్ఞానిక విశ్లేషణ సీరియస్ గా కనిపించకుండానే చేస్తారు రమణ. చుట్టాలొచ్చారు కథలో చిట్టెమ్మ గారి వంటి పెద్దతరం వాళ్ల ఆప్యాయతతో పాటు, లౌక్యం కూడా చిత్రీకరించారు.
స్పూనరిజం వంటి విచిత్ర భాషాప్రయోగాలెన్నో ఈ కథల్లో చేశారు రచయిత. "బ్రూసు ఏడుసార్లు సాలెగూడు కట్టాడు" అంటూ బ్రూసు కథని తిరగేసి చెప్పడం ఆ విధమైన శైలికి చక్కని ఉదాహరణ. కెమేరాభాషగా పిలిచే మరో రకం శైలి కూడా ఆయన పండించారు. రాధమ్మ బాకీ కథలో రాధ స్కూలుకు వెళ్లే నాటి విషయాలు చెప్తూ "నేను నా దారిన స్కూలు కెళ్ళేదాన్ని. ఈయనేమో రోజూ కిళ్ళీ కొట్టుదగ్గర హాజరుగా కనపడేవారు. ఎలక్ట్రిక్ స్తంభాలూ, పోస్టుడబ్బా, గంట స్తంభం, నల్లపిల్లవాడూ వరసగా కనపడేవారు" అంటుంది. ఆ సంభాషణ కెమేరాభాషగా పరిగణిస్తారు.[2]
ప్రాచుర్యం
మార్చుఈ కథలు వివిధ పత్రికల్లో, కథల సంకలనాల్లో పలుమార్లు పునర్ముద్రితమయ్యాయి.