రామాయణ విషవృక్షం ముఖచిత్రం.

రామాయణ విషవృక్షం గ్రంథం రామాయణంపై మార్క్సిస్టు ధృక్పథంతో రంగనాయకమ్మ వ్రాసిన విమర్శనాత్మక గ్రంథం.[1] రామాయణం భూస్వామ్య సంస్కృతికి ప్రతీక అని రచయిత్రి ఈ గ్రంథంలో నిరూపించే ప్రయత్నం చేసింది. ఈ గ్రంథం వామపక్ష, హేతువాద, మార్క్సిస్టు వర్గాలలో మంచి ఆదరణ పొందింది.

ఈ గ్రంథం వాల్మీకి రామాయణంపై ఆధారితమైనది. ఇది వాల్మీకి రామయణంలోని కాండాల వరుసక్రమాన్ని యధాతధంగా పాటిస్తుంది. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కిందకాండ, యుద్ధకాండ, సుందరకాండ, ఉత్తరకాండ. వాల్మీకి రామాయణం ఏడు అధ్యాయాలుగా వెలువడగా, విషవృక్షము మూడు భాగాలుగా వెలువడింది. ఒక్కొక్క భాగము దాదాపు 700 పేజీల పుస్తకము. అదే విధంగా వాల్మీకి రామాయణం 2,400 శ్లోకాలతో కూడుకున్నదైతే, రామయణ విషవృక్షం 16 పెద్ద కథలు, వాటికి అనుబంధంగా 11 వ్యాఖ్యానాలతో, విమర్శకు మద్దతుగా సంస్కృత మూలాన్ని ఉదహరిస్తూ 600 పాదపీఠికలతో కూడిఉన్నది.

రంగనాయకమ్మ ఈ గ్రంథ రచనకై తెలుగు లిపిలో ప్రచురితమైన రెండు సంస్కృత మూల గ్రంథాల యొక్క సహాయం తీసుకొన్నది. వీటిలో శ్లోకాలకు ప్రతిపదార్ధాలతో పాటు, తెలుగులో టీకాతాత్పర్యాలు ఇవ్వబడినవి. ఈ రెండు గ్రంథాలు 1900-1955ల మధ్య గట్టుపల్లి శేషాచార్యులు, చదలవాడ సుందరరామశాస్త్రులచే రచించబడి శశిలేఖ ముద్రాక్షరశాల (చెన్నై), వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్ వారిచే ప్రచురించబడినవి.

ముఖ్యపాఠ్యం కాకుండా రామాయణ విషవృక్షానికి 1, 2 భాగాలకు పొడువాటి ముందుమాటలునూ, మూడవ భాగానికి చివరలో పెద్ద ఉపసంహార పాఠ్యమున్నూ ఉన్నాయి. ఈ మూడు భాగాలు మూడు సంవత్సరాలు వరుసగా 1974, 75, 76లలో వెలువడ్డాయి. ఇవి అనేక మార్లు పునర్ముద్రించబడ్డాయి కూడా. 200 వరకు మొదటి భాగం ఏడుసార్లు, రెండవ భాగం ఆరుసార్లు, మూడవ భాగం నాలుగుసార్లు ముద్రించబడ్డాయి.[2]

ఇవి కూడా చూడండి

మూలాలు