రావి రంగారావు కవిత్వాన్ని ప్రజలచెంతకు తీసుకెళ్ళటం ఒక ఉద్యమంగా భావించి కవిత్వం రాస్తున్నారు, పిల్లలతో యువకులతో కొత్తవారితో కవిత్వం రాయిస్తున్నారు. అందరికి బాగా అర్ధం అయ్యేలా ఉండటంతోపాటు ఆలోచించుకొనేవారికి అందులో ఎంతో లోతైన భావం ఉండేలా రాయటం ప్రత్యేకత. వేమన స్ఫూర్తిగా తీసుకొని "మినీకవిత" ఒక కొత్త ప్రక్రియగా నిలదొక్కుకొనటానికి విశేషకృషి చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఉత్తమ మినీకవితల సంకలనాలు ప్రచురిస్తున్నారు. "మినీ కవిత పితామహుడు"గా ప్రఖ్యాతి గాంచారు. పాతిక సంవత్సరాలకు పైగా వచ్చిన మంచి మినీకవితల్ని సేకరించి దాదాపు 500 మంది కవుల 1227 మినీకవితలు ప్రచురించారు.

  పద్యంతో పాటు ఆధునిక సంక్షిప్త కవితా ప్రక్రియలదాకా రంగారావు కవిత్వం రాసారు.

పద్య సంపుటాలు : అమృత వృక్షం, రావి శతకం వీరు రాసిన పద్య గ్రంధాలు. సామాజిక అంశాలను పద్యాలలో చక్కగా పలికించారు.

" మనసు సుమపేశలంబైన మానవునకు/ పిచ్చివాడని లోకంబు పేరు పెట్టు/
కడు దృఢంబయ్యె నేని రాక్షసుడు, అసలు/ మనసు లేనట్టి వాడెపో మంచివాడు"... ఇలా సాగుతాయి వీరి పద్యాలు.
  రేజరులో సూర్యుడు, ముఖంపుల్ల, కలలో కవిత, కుంకుడు కాయ...వీరి వచన కవితా సమ్పుటాలు. "వావిలాల గోపాలకృష్నయ్యలాంటిది నా కవిత్వం" అన్నారు రంగారావు. కవిత్వం అంటే సరళంగా ఉంటూనే ఆలోచించే వారికి లోతైన భావాలు పండాలని రావి ఉద్దేశం. "సూర్యుళ్ళ గెలుపు" అనేది వీరి దీర్ఘ వచన కవితా సంపుటి. మానవత ప్రాతిపదికతో వీరు కవిత్వం రాస్తున్నారు. అవినీతి వ్యతిరేకత కూడా వీరి ప్రధాన అంశం.పర్యావరణ పరిరక్షణ,హేతువాదం,స్త్రీ సంక్షేమ భావాలు,కార్మిక అనుకూల ధోరణులు వీరి కవితా వస్తువులు.
  గుడ్ మార్నింగ్, గుండె దీపాలు, ఎన్నికల చెణుకులు, వెలుతురు వేళ్ళు... వీరి మినీకవితల సంపుటాలు." అసెంబ్లీని/ చేపల మార్కెట్ అన్నారు/నిజమే/చేపలు నాయకులకు/కంపు ప్రజలకు"...ఇలా సాగుతాయి వీరి మినీకవితలు. "అగ్గిపెట్టె" అనే పేరుతో ఇంగ్లీషు, హిందీ, తెలుగు భాషలలో మినీకవితల సంపుటి ప్రచురించారు. దీనికి విశేషమైన ప్రాచుర్యం లభించింది. స్పష్టత, సూటిదనం,సంక్షిప్తత, సరళత, వ్యంగ్యం వీరి మినీకవితలలో కనిపించే విశిష్ట లక్షణాలు.
  మినీకవిత శిల్పసమీక్ష, మినీ కవితలలో మెనీ భావాలు అనే గ్రంధాలు మినీకవిత గురించి రాసిన సాహిత్య వ్యాసాల సంపుటాలు.

" పిల్లలో కవితా రచనా నైపుణ్యాలు" అనే అంశం గురించి పి. హెచ్.డి.చేశారు. ఈ గ్రంధానికి ఎంతో గుర్తింపు లభించింది. " రావి పొడుపు కథలు" అనే పేరుతో పిల్లలకోసం మంచి పొడుపు కథలు సొంతంగా రచించారు.

  "కవితా లోచనం" పేరుతో వీరు రాసిన సాహిత్య వ్యాసాల సంపుటిలో కవిత్వ తత్వంపై అనేక సొంత అభిప్రాయలు వెలువరించారు. 

మచిలీపట్నం, సాహితీమిత్రులు అనే సంస్థ స్థాపించి గత 28 సంవత్సరాలుగా సాహిత్య కార్యక్రమాలు క్రమంగా క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు.