రీచ్‌స్టాగ్ దహనం
1933 ఫిబ్రవరి 27 న, అడాల్ఫ్ హిట్లర్ జర్మనీ ఛాన్సలర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన నాలుగు వారాల తరువాత, బెర్లిన్‌లోని జర్మనీ పార్లమెంటు నివాసమైన రీచ్‌స్టాగ్ భవనం తగలబడింది. డచ్ కౌన్సిల్ కమ్యూనిస్టు అయిన మారినస్ వాన్ డెర్ లుబ్బే ఈ నేరం చేసాడని, కమ్యూనిస్టు ఆందోళనకారులు ఈ పని వెనుక ఉన్నారనీ హిట్లర్ ప్రభుత్వం పేర్కొంది. ఒక సంవత్సరం పాటు జరిగిన విచారణ తరువాత జర్మనీ కోర్టు, వాన్ డెర్ లుబ్బే ఒక్కడే స్వతంత్రంగానే ఈ పని చేసాడని నిర్ణయించింది. అగ్ని ప్రమాదం జరిగిన మరుసటి రోజు, రీచ్‌స్టాగ్ ఫైర్ డిక్రీని ఆమోదించారు. జర్మనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు కుట్ర చేస్తున్నారని చెప్పడానికి నాజీ పార్టీ ఈ మంటలను ఒక దృష్టాంతంగా చూపింది. ఆ విధంగా నాజీ జర్మనీ స్థాపనలో ఈ అగ్ని ఒక కీలకమైన మలుపైంది.
రాత్రి 9:00 గంటల తరువాత, బెర్లిన్ అగ్నిమాపక కేంద్రానికి వచ్చిన అలారం కాలే, అగ్నిప్రమాదం గురించి వచ్చిన తొలి ఫిర్యాదు.[1] : 26–28 పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వచ్చే సమయానికి, ప్రధాన ఛాంబర్ ఆఫ్ డిప్యూటీస్ మంటల్లో చిక్కుకుపోయింది. పోలీసులు భవనం లోపల క్షుణ్ణంగా శోధించారు. వాన్ డెర్ లుబ్బేను నిందితుడుగా ఆరోపించారు. అతన్ని అరెస్టు చేశారు. ఆ వెంటనే మరో నలుగురు కమ్యూనిస్టు నాయకులను కూడా అరెస్టు చేసారు. పౌర స్వేచ్ఛను నిలిపివేయడానికీ, జర్మనీ కమ్యూనిస్ట్ పార్టీతో "నిర్దాక్షిణ్యమైన పోరాటం" చేసేందుకూ అత్యవసర డిక్రీని జారీ చేయాలని అధ్యక్షుడు పాల్ వాన్ హిండెన్‌బర్గ్‌ను హిట్లర్ కోరాడు.[2] డిక్రీ జారీ చేసిన తరువాత, కమ్యూనిస్టు పార్టీ పార్లమెంటరీ ప్రతినిధులందరితో సహా అనేక మంది కమ్యూనిస్టులను ప్రభుత్వం పెద్దయెత్తున అరెస్టు చేసింది. ప్రధాన ప్రత్యర్థి అయిన కమ్యూనిస్టులు లేకపోవడంతో పార్లమెంటులో వారి సీట్లు ఖాళీ అయిపోయాయి. నాజీ పార్టీ బహుళత్వ స్థితి నుండి మెజారిటీ సాధించింది. తద్వారా హిట్లర్ తన అధికారాన్ని పదిలపరచుకున్నాడు.
1933 ఫిబ్రవరిలో, బల్గేరియన్లు జార్జి డిమిట్రోవ్, వాసిల్ తనేవ్, బ్లాగోయ్ పోపోవ్‌లను అరెస్టు చేసారు. లీప్జిగ్ విచారణ సమయంలో వారు కీలక పాత్రలు పోషించారు. దీనిని "రీచ్‌స్టాగ్ దహనం విచారణ" అని కూడా పిలుస్తారు. వాళ్ళు సీనియర్ కొమింటెర్న్ ఆపరేటర్లని ప్రష్యన్ పోలీసులకు తెలుసు గానీ, ఎంత సీనియర్లనేది తెలియదు. పశ్చిమ ఐరోపాలోని కొమింటెర్న్ కార్యకలాపాలన్నిటికీ డిమిట్రోవ్ అధిపతి. రీచ్‌స్టాగ్ అగ్ని ప్రమాదానికి బాధ్యత ఎవరిదనేది, ఓ చర్చాంశంగా, ఓ పరిశోధనాంశంగా మిగిలిపోయింది.[3] ఈ చర్యకు కొమింటెర్నే కారణమని నాజీలు ఆరోపించారు. అయితే, ఆర్కైవ్ ఆధారాల ప్రకారం కొంతమంది చరిత్రకారులు, ఈ దహనం నాజీలే ప్లాను చేసి జరిపిన దొంగచాటు ఆపరేషనని భావించారు.[4][5] దగ్ధమైన భవనం 1961 వరకు అలాగే ఉండిపోయింది. 1961 నుండి 1964 వరకు పాక్షికంగా మరమ్మత్తులు చేసారు. 1995 1999 మధ్యకాలంలో పూర్తిగా పునరుద్ధరించారు. నాజీ శకం నాటి అన్యాయమైన తీర్పులను ఎత్తివేయడానికి 1998 లో ప్రవేశపెట్టిన చట్టం ప్రకారం 2008 లో జర్మనీ, వాన్ డెర్ లుబ్బేకు మరణానంతరం క్షమాభిక్ష ప్రసాదించింది.
పూర్వరంగం
మార్చు1932 నవంబరు నాటి జర్మన్ సమాఖ్య ఎన్నికల తరువాత, నేషనల్ సోషలిస్ట్ వర్కర్స్ (నాజీ) పార్టీకి మెజారిటీ లభించలేదు; ఈ ఎన్నికల్లో కమ్యూనిస్టులు బాగా బలపడ్డారు. 1933 జనవరి 30 న అడాల్ఫ్ హిట్లర్, ఛాన్సలరుగా, సంకీర్ణ ప్రభుత్వానికి అధిపతిగా ప్రమాణ స్వీకారం చేశాడు. రీచ్‌స్టాగ్‌ను రద్దు చేసి, పార్లమెంటుకు మళ్ళీ ఎన్నికలు జరపాలని జర్మనీ అధ్యక్షుడు పాల్ వాన్ హిండెన్‌బర్గ్‌ను హిట్లర్ కోరాడు.[a] ఎన్నికలకు నిర్ణయించిన తేదీ 1933 మార్చి 5. హిట్లర్ లక్ష్యం మొదట జాతీయ స్థాయిలో మెజారిటీ పొందడం, తన స్థానాన్ని పదిలపరచుకోవడం, కమ్యూనిస్టుల అడ్డు తొలగించుకోవడం. ప్రెసిడెంటు తలచుకుంటే, లేదా అతన్ని ఎవరైనా కోరినా అతను ఛాన్సలర్‌ను తొలగించవచ్చు. ఎనేబులింగ్ యాక్ట్‌ను ఆమోదింపజేసుకుని హిట్లర్, చట్టబద్ధంగా ప్రజాస్వామ్యాన్ని రద్దు చేయాలని భావించాడు. ఎనేబులింగ్ యాక్ట్ అనేది - పార్లమెంటు (రీచ్‌స్టాగ్) ప్రమేయమే లేకుండా డిక్రీ ద్వారా చట్టాలను ఆమోదించే అధికారాన్ని ఛాన్సలర్‌కు ప్రసాదించే ప్రత్యేక చట్టం. ఈ ప్రత్యేక అధికారాలు నాలుగేళ్లపాటు అమలులో ఉంటాయి. ఆ తర్వాత వాటిని పునరుద్ధరించుకోవచ్చు. వీమార్ రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 48 ను ఉపయోగించి, అత్యవసర సమయాల్లో ప్రెసిడెంటు డిక్రీ ద్వారా పాలించవచ్చు.[6] ఎనేబులింగ్ యాక్ట్ లోని అపూర్వమైన అంశం ఏమిటంటే ఈ అధికారాలు ఛాన్సలరుకు లభిస్తాయి. ఎనేబులింగ్ చట్టాన్ని తీవ్రమైన అత్యవసర సమయాల్లో మాత్రమే అమలు చెయ్యాలి. 1923-24లో అధిక ద్రవ్యోల్బణాన్ని అంతం చేయడానికి ప్రభుత్వం ఈ ఎనేబులింగ్ యాక్ట్‌ను ఉపయోగించింది. దీన్ని వాడిన సందర్భం అప్పటివరకూ అదొక్కటే. ఎనేబులింగ్ యాక్ట్‌ను ఆమోదించాలంటే రీచ్‌స్టాగ్‌లో మూడింట రెండొంతుల మెజారిటీ ఓటు అవసరం. 1933 జనవరిలో నాజీలకు 32% సీట్లు మాత్రమే ఉన్నాయి.
ఎన్నికల ప్రచారంలో నాజీలు, జర్మనీ కమ్యూనిస్టు విప్లవం అంచున ఉందని ఆరోపిస్తూ, కమ్యూనిస్టులను ఆపడానికి ఏకైక మార్గం ఎనేబులింగ్ యాక్ట్ ఆమోదించడమేనని ప్రచారం చేసారు. ప్రచారంలో నాజీలు ప్రజలకిచ్చిన సందేశం సూటిగానే ఉంది: ఎనేబులింగ్ యాక్ట్ ఆమోదించడానికి అవసరమైనన్ని సీట్లను మాకు ఇవ్వండి అని. ఎనేబులింగ్ యాక్ట్ కు వ్యతిరేకంగా వోటేసే వారి సంఖ్యను తగ్గించడానికి హిట్లర్, ఎన్నికలయ్యాక, కొత్త పార్లమెంటు ఏర్పడే లోపు జర్మనీ కమ్యూనిస్టు పార్టీని నిషేధించాలని ప్రణాళిక వేసాడు. (ఆ సమయంలో దానికి 17% సీట్లున్నాయి)
అగ్ని
మార్చు1933 ఫిబ్రవరి 27 న రాత్రి 9:00 గంటల తరువాత, బెర్లిన్ అగ్నిమాపక విభాగానికి రీచ్‌స్టాగ్ తగలబడుతోందని సందేశం వచ్చింది. అగ్నిమాపక సిబ్బంది గట్టి ప్రయత్నాలు చేసినప్పటికీ, భవనం చాలావరకూ దగ్ధమైపోయింది. 11:30 గంటలకు మంటలను ఆపగలిగారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు శిథిలాలను పరిశీలించినప్పుడు, 20 కట్టల దహనశీల పదార్థాలు కాలిపోకుండా ఉన్నట్లు గుర్తించారు. మంటలు సంభవించిన సమయంలో, హిట్లర్ జోసెఫ్ గోబెల్స్‌తో కలిసి బెర్లిన్‌లోని గోబెల్స్ అపార్ట్‌మెంట్‌లో విందు చేస్తున్నాడు. మంటల గురించి గోబెల్స్‌కు అత్యవసర ఫోన్ కాల్ వచ్చినప్పుడు, అతను దానిని మొదట "కట్టు కథ"గా భావించి వదిలేశాడు. రెండవ కాల్ తరువాత మాత్రమే అతను హిట్లర్‌కు ఈ వార్త గురించి చెప్పాడు.[7] ఇద్దరూ గోబెల్స్ అపార్ట్మెంట్ నుండి బయలుదేరి కారులో రీచ్స్టాగ్ వద్దకు వెళ్ళారు. అప్పటికి మంటలను ఆర్పుతున్నారు. అక్కడ, ప్రష్యా వ్యవహారాల మంత్రి హెర్మన్ గోరింగ్ వాళ్ళను కలిసాడు. అతడు హిట్లర్‌తో "ఇది కమ్యూనిస్టుల దౌష్ట్యం. కమ్యూనిస్టు నిందితుల్లో ఒకరిని అరెస్టు చేశారు." అని చెప్పాడు. హిట్లర్ ఈ అగ్నిని "దేవుడిచ్చిన సంకేతం"గా వర్ణించాడు. కమ్యూనిస్టుల తిరుగుబాటు ప్రారంభానికి ఇది సంకేతం అని పేర్కొన్నాడు. మరుసటి రోజు, ప్రీస్సిస్చే ప్రెస్డియెన్స్ట్ (ప్రష్యన్ ప్రెస్ సర్వీస్) "ఈ దహన చర్య, జర్మనీలో బోల్షివిజం చేసిన అత్యంత భయంకర ఉగ్రవాద చర్య " అని నివేదించింది. వోసిస్చే జైటంగ్ వార్తాపత్రిక, "జాతికీ దేశానికీ ప్రమాదం గతంలో ఉంది, ఇప్పుడూ ఉంది అని ఈ ప్రభుత్వం భావిస్తోంది" అని తన పాఠకులను హెచ్చరించింది.
1933 ఫిబ్రవరి 27 న రీచ్‌స్టాగ్ అగ్నిప్రమాదం జరిగిన సమయంలో వాల్టర్ జెంప్ బెర్లిన్ అగ్నిమాపక విభాగానికి అధిపతిగా ఉన్నాడు. ఈ సంఘటనలో అగ్నిమాపక పనులను వ్యక్తిగతంగా దగ్గరుండి చూసుకున్నాడు.[8] నాజీలకు ఈ అగ్నిఘటనలో ప్రమేయం ఉన్నట్లుగా సాక్ష్యాలను సమర్పించినందుకు గాను అతన్ని తొలగించారు.[9] ఘటన గురించి అగ్నిమాపక దళానికి తెలియజేయడంలో ఆలస్యం జరిగిందనీ, తన వద్ద ఉన్న వనరులను పూర్తిగా ఉపయోగించుకోకుండా అడ్డుకున్నారనీ జెంప్ నొక్కిచెప్పాడు.
అధికార దుర్వినియోగం ఆరోపణలపై 1937 లో జెంప్‌ను అరెస్టు చేశారు. అతడు అప్పీలు చేసుకున్నప్పటికీ, అతన్ని జైల్లో వేసారు. 1939 మే 2 న అతణ్ణి జైల్లోనే ఎవరో గొంతు పిసికి చంపేసారు.[10]
రాజకీయ పరిణామాలు
మార్చుఅగ్నిప్రమాదం జరిగిన మరుసటి రోజు, హిట్లర్ కోరిక మేరకు, అధ్యక్షుడు హిండెన్‌బర్గ్ వీమార్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 48 ను ఉపయోగించి రీచ్‌స్టాగ్ ఫైర్ డిక్రీపై సంతకం చేశాడు. రీచ్‌స్టాగ్ ఫైర్ డిక్రీ జర్మనీలో పౌర స్వేచ్ఛను నిలిపివేసింది. హెబియస్ కార్పస్, భావ ప్రకటనా స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ, కలిసి ఉండే స్వేచ్ఛ, బహిరంగంగా గుమిగూడే హక్కు, పోస్టు టెలిఫోన్ల గోప్యత వీటిలో ఉన్నాయి . నాజీ పాలనా కాలంలో ప్రజలకు ఈ హక్కులను తిరిగి ఇవ్వలేదు. నాజీలతో "స్నేహపూర్వకం"గా లేవని భావించే ప్రచురణలను నిషేధించడానికి నాజీలు ఈ డిక్రీని ఉపయోగించారు. రీచ్‌స్టాగ్ అగ్నిప్రమాదంలో మారినస్ వాన్ డెర్ లుబ్బే తాను ఒక్కణ్ణే, స్వతంత్రంగానే వ్యవహరించాననీ పేర్కొన్నప్పటికీ, హిట్లర్ తన అత్యవసర అధికారాలను పొందిన తరువాత, జర్మనీని స్వాధీనం చేసుకునే కమ్యూనిస్టుల కుట్రకు ఇది మొదలని ప్రకటించాడు. నాజీ పార్టీ వార్తాపత్రికలు ఈ కల్పిత "వార్తను" ప్రచురించాయి. ఇది జర్మనులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. పౌరులను కమ్యూనిస్టుల నుండి మరింత దూరం చేసింది. దీనికి తోడు, దహనకాండ తరువాతి రోజుల్లో వేలాది మంది కమ్యూనిస్టులను, జర్మను కమ్యూనిస్టు పార్టీ నాయకులతో సహా, నిర్బంధించారు. రీచ్‌స్టాగ్ అగ్నిప్రమాదంలో కమ్యూనిస్టుల గురించి రుడాల్ఫ్ డీల్స్‌తో మాట్లాడిన హిట్లర్, "ప్రజలు మాకు మద్దతుగా ఎలా నిలబడతున్నారో ఈ మానవాధములకు అర్థం కావడం లేదు. వాళ్ళ ఎలుక బొరియల్లోకి ప్రజల ఉత్సాహం వినిపించదు." అని అన్నాడు.[11] ఎన్నికల్లో కమ్యూనిస్టుల భాగస్వామ్యాన్ని కూడా అణచివేయడంతో (కమ్యూనిస్టులు గతంలో 17% ఓట్లు సాధించారు), 1933 మార్చి 5 న జరిగిన ఎన్నికలలో నాజీలు 33% నుండి 44% వరకు తమ వాటాను పెంచుకోగలిగారు. దీంతో నాజీలు, వారి మిత్రపక్షమైన జర్మన్ నేషనల్ పీపుల్స్ పార్టీ (8% ఓట్లను గెలుచుకుంది) లకు సంయుక్తంగా రీచ్‌స్టాగ్‌లో 52% మెజారిటీ లభించింది.
నాజీలు మెజారిటీ పొందినప్పటికీ, వారు తమ లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. ఆ ఎన్నికల్లో 50–55% ఓట్లను గెలుచుకోవడమే ఆ లక్ష్యం. ఈ కారణంగా తమ తదుపరి లక్ష్యమైన 'ఎనేబులింగ్ చట్టం ఆమోదింపజేసుకుని తద్వారా హిట్లర్‌కు డిక్రీ ద్వారా పాలించే హక్కును సాధించడం' అనేది కష్టసాధ్య మవుతుందని నాజీలు భావించారు. దీన్ని సాధించాలంటే మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం. అయితే, నాజీలకు అనుకూలంగా అనేక ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనవి -కమ్యూనిస్టు పార్టీని అణచివేయడం, జాతీయ భద్రతాంశాలను నాజీలు సమర్థంగా ఉపయోగించుకోవడం. అంతేకాకుండా, సోషల్ డెమోక్రటిక్ పార్టీకి (ఎనేబులింగ్ యాక్ట్‌కు వ్యతిరేకంగా ఓటు వేసే ఏకైక పార్టీ) చెందిన కొంతమంది డిప్యూటీలను నాజీ ఎస్.ఎ అరెస్టు చేయడం, బెదిరింపులు చెయ్యడం వంటివి చేసి, వాళ్ళు రీచ్‌స్టాగ్‌లో తమ కూచోకుండా నిరోధించారు. పర్యవసానంగా, తుది ఓటు లెక్కింపులో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ప్రాతినిధ్యం తగ్గిపోయింది. మితవాద జర్మన్ నేషనల్ పీపుల్స్ పార్టీ, సెంటర్ పార్టీ, ఇంకా అనేక చిన్నచిన్న మధ్యతరగతి పార్టీల మద్దతుతో ఎనేబులింగ్ చట్టాన్ని 1933 మార్చి 23 న సులభంగా ఆమోదింపజేసుకున్నారు. ఈ చట్టం మార్చి 27 న అమల్లోకి వచ్చింది. హిట్లర్ జర్మనీకి నియంత అయ్యాడు.
కాలిపోయిన రీచ్‌స్టాగ్ భవనానికి ఎదురుగా కొనిగ్‌స్ప్లాట్జ్కు ఆవల ఉన్న క్రోల్ ఒపెరా హౌస్, తరువాతి 12 సంవత్సరాల పాటు పార్లమెంటు భవనంగా పనిచేసింది.
విచారణ
మార్చురీచ్స్టాగ్కు నిప్పంటించారనే ఆరోపణలపై మారినస్ వాన్ డెర్ లుబ్బే, ఎర్నెస్ట్ టోర్గ్లర్, జార్జి డిమిట్రోవ్, బ్లాగోయి పోపోవ్, వాసిల్ తనేవ్‌పై 1933 జూలైలో అభియోగాలు మోపారు. సెప్టెంబరు 21 నుండి 1933 డిసెంబరు 23 వరకు, లీప్జిగ్ లో విచారణ జరిగింది. జర్మన్ సుప్రీంకోర్టు (రైఖ్స్‌గెరిట్) న్యాయమూర్తులు విచారణకు అధ్యక్షత వహించారు. ఇది జర్మనీ లోని అత్యున్నత న్యాయస్థానం. న్యాయమూర్తి, సుప్రీంకోర్టు నాల్గవ శిక్షా గదికి చెందిన నాల్గవ క్రిమినల్ కోర్టు న్యాయమూర్తి డాక్టర్ విల్హెల్మ్ బుంగర్. భవనాన్ని తగలబెట్టి, ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేసినట్లు నిందితులపై అభియోగాలు మోపారు.
లీప్జిగ్ విచారణకు విస్తృతంగా ప్రచారం లభించింది. రేడియోలో ప్రసారం చేసారు. నేరారోపణ లన్నిటి లోనూ కమ్యూనిస్టులు దోషులుగా తేలుతుందని ప్రజలు భావించారు. అయితే, విచారణ ముగిసాక, వాన్ డెర్ లుబ్బే మాత్రమే దోషిగా కోర్టు తేల్చింది. అతని తోటి ముద్దాయిలు దోషులు కాదని తేలింది. 1934 లో, వాన్ డెర్ లుబ్బేకు జర్మన్ జైలు ఆవరణలో శిరచ్ఛేదం చేసారు. 1967 లో, వెస్ట్ బెర్లిన్ లోని ఒక న్యాయస్థానం 1933 నాటి తీర్పును రద్దు చేసింది. వాన్ డెర్ లుబ్బేకు విధించిన శిక్షను, అతడి మరణానంతరం, ఎనిమిది సంవత్సరాల జైలు శిక్షగా మార్చింది. 1980 లో, మరొక కోర్టు తీర్పును రద్దు చేసింది, కాని దానిని రద్దు చేసింది. 1981 లో, పశ్చిమ జర్మనీ న్యాయస్థానం వాన్ డెర్ లుబ్బేకు విధించిన 1933 నాటి శిక్షను రద్దు చేసింది. పిచ్చి అనే కారణంతో అతన్ని నిర్దోషి అని తేల్చింది. ఆ తరువాత ఈ తీర్పును రద్దుసారు. అయితే, నాజీ జర్మనీ కాలంలో దోషులుగా తేలిన ఎవరైనా అధికారికంగా దోషులు కాదనే 1998 నాటి చట్టం ప్రకారం 2008 జనవరిలో అతనికి మరణనంతర క్షమాభిక్ష లభించింది. నాజీ జర్మనీ నాటి చట్టాలు "న్యాయం యొక్క ప్రాథమిక ఆలోచనలకు విరుద్ధంగా ఉన్నాయి" అనే ఆలోచన ఆధారంగా ఈ చట్టం, నాజీల కాలంలో నేరాలకు పాల్పడిన వ్యక్తులకు క్షమాభిక్షకు అనుమతిస్తుంది.[12]
వాన్ డెర్ లుబ్బే శిరచ్ఛేదం
మార్చువిచారణలో వాన్ డెర్ లుబ్బే దోషిగా నిర్ధారణైంది. అతడికి మరణశిక్ష విధించారు. అతని 25 వ పుట్టినరోజుకు మూడు రోజుల ముందు, 1934 జనవరి 10 న, గిలెటిన్ తో (ఆ సమయంలో సాక్సోనీలో అది ఆచారం; మిగతా జర్మనీలో గొడ్డలితో నరికేవారు) శిరచ్ఛేదం చేసారు. రీచ్‌స్టాగ్‌ను తగలబెట్టి అధికారాన్ని చేజిక్కించుకునే కమ్యూనిస్టు కుట్రలో వాన్ డెర్ లుబ్బే ఒక భాగమని నాజీలు ఆరోపించగా, తమపై నేరాన్ని రుద్ది తమను నిందించడానికి నాజీలు చేసిన కుట్రలో వాన్ డెర్ లుబ్బే భాగమని కమ్యూనిస్టులు ఆరోపించారు. వాన్ డెర్ లుబ్బే మాత్రం, జర్మన్ కార్మికవర్గ పరిస్థితికి నిరసనగా తాను ఒంటరిగానే, స్వతంత్రంగానే వ్యవహరించానని పేర్కొన్నాడు.[13]
గోరింగ్ వ్యాఖ్యానం
మార్చుది రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ థర్డ్ రీచ్ లో విలియం ఎల్. షైరర్ ఇలా రాశాడు: నూరెంబర్గ్ విచారణల్లో జనరల్ ఫ్రాంజ్ హాల్డర్ సమర్పించిన ఓ అఫిడవిట్లో, గోరింగ్ తానే ఆ నిప్పు పెట్టానని చెప్పుకున్నాడని పేర్కొన్నాడు: "1943 లో ఫ్యూరర్ పుట్టినరోజున జరిగిన విందులో ఫ్యూరర్ చుట్టూ ఉన్న జనం రీచ్‌స్టాగ్ భవనం దగ్ధమవడం వైపు, ఆ భవనపు కళాత్మక విలువల వైపూ సంభాషణను మరల్చగా గోరింగ్ ఆ సంభాషణలోకి దూరి, 'రీచ్‌స్టాగ్ భవనం గురించి నిజంగా తెలిసింది నాకు మాత్రమే, ఎందుకంటే దానికి నిప్పు పెట్టింది నేనే కాబట్టి' అని అనడం నా చెవులతో విన్నాను. ఇలా అంటూ అతడు తొడ గొట్టాడు ".[14] 1945, 1946 ల్లో నూరెంబర్గ్ విచారణలో క్రాస్ ఎగ్జామినేషన్ సమయంలో హాల్డర్ అఫిడవిట్‌ను గోరింగ్‌కు చదివి వినిపించగా, అతను దాన్ని ఖండించాడు.[15] : 433
జర్మను కమ్యూనిస్ట్ పార్టీ నిర్వహించిన "ఎదురు విచారణ"
మార్చు1933 వేసవిలో, జర్మన్ కమ్యూనిస్ట్ ఎమిగర్స్ ఆధ్వర్యంలో లండన్లో న్యాయవాదులు, ప్రజాస్వామ్యవాదులు, ఇతర నాజీ వ్యతిరేక బృందం ఒక ఎదురు విచారణ నిర్వహించింది. ఈ విచారణకు చైర్మన్, బ్రిటిష్ లేబర్ పార్టీ న్యాయవాది డిఎన్ ప్రిట్ కెసి. ముఖ్య నిర్వాహకుడు కెపిడి ప్రచార చీఫ్ విల్ మున్జెన్‌బర్గ్. బెల్జియానికి చెందిన పీట్ వెర్మీలెన్, స్వీడన్ కు చెందిన జార్జ్ బ్రాంటింగ్; విన్సెంట్ డి మోరో-గియాఫెరి, ఫ్రాన్స్‌కు చెందిన గాస్టన్ బెర్గరీ; ప్రగతిశీల ఉదారవాద పార్టీ ఫ్రీ-థింకింగ్ డెమోక్రటిక్ లీగ్ తరపు న్యాయవాది, నెదర్లాండ్స్ పార్లమెంటు సభ్యుడు బెట్సీ బక్కర్-నార్ట్; డెన్మార్క్‌కు చెందిన వాల్డ్ హెవిడ్ట్; అమెరికాకు చెందిన ఆర్థర్ గార్ఫీల్డ్ హేస్ లు ఇతర న్యాయమూర్తులు.[1] : 120
ఈ విచారణ 1933 సెప్టెంబరు 21 న ప్రారంభమైంది. ఒక వారం పాటు సాగింది. ముద్దాయిలందరూ నిర్దోషులనీ, అసలు దోషులు నాజీ పార్టీ ప్రముఖుల్లోనే ఉన్నారనీ తేల్చింది. ఈ విచారణ మీడియా దృష్టిని బాగా ఆకర్షించింది. సర్ స్టాఫోర్డ్ క్రిప్స్ ప్రారంభ ప్రసంగం చేశాడు. ఈ మాక్ విచారణలో గోరింగ్‌ను దోషిగా తేల్చారు. సంభవనీయమైన సినేరియోలన్నిటినీ పరీక్షించడానికి ఇది వర్క్‌షాపుగా ఉపయోగపడింది. ప్రతివాదుల ప్రసంగాలను ముందే తయారు చేసారు. హేస్, మోరో-గియాఫేరి వంటి చాలా మంది "న్యాయమూర్తులు" "విచారణ" వద్ద వాతావరణం చూస్తే ఇది షో ట్రయల్ లాగా ఉందని ఫిర్యాదు చేశారు. సత్యాన్ని పరిగణనలోకి తీసుకోకుండా, "సరైన" తీర్పు ఇవ్వాలంటూ మున్జెన్‌బర్గ్ నిరంతరం "న్యాయమూర్తులపై" తెర వెనుక ఒత్తిడి తెస్తూ ఉన్నాడని ఆరోపించారు. "సాక్షుల్లో" ఒకరు, ఒక ఎస్.ఎ వ్యక్తి. అతడు ముసుగు ధరించి కోర్టులో హాజరయ్యాడు. నిజంగానే ఎస్.ఎ నిప్పంటించిందని అతడు చెప్పాడు. వాస్తవానికి, ఈ "ఎస్.ఎ మనిషి" జర్మన్ కమ్యూనిస్టు వార్తాపత్రిక రోట్ ఫహ్నే సంపాదకుడైన ఆల్బర్ట్ నార్డెన్. మరో ముసుగు సాక్షి, వాన్ డెర్ లుబ్బే మాదకద్రవ్యాల బానిస అని, స్వలింగ సంపర్కుడనీ, అతను ఎర్నెస్ట్ రోహ్మ్ ప్రేమికుడనీ, నాజీ డూప్ అనీ పేర్కొన్నాడు. హేస్ ఈ సాక్ష్యాన్ని "అంతగా నమ్మదగినది కాదు" అని అభివర్ణించాడు.
జర్మను కమ్యూనిస్టులకు ఈ ఎదురు విచారణ చాలా విజయవంతమైన ప్రచార సాధనంగా పనికొచ్చింది. మున్జెన్‌బర్గ్ తన పేరుతో, ది బ్రౌన్ బుక్ ఆఫ్ ది రీచ్స్టాగ్ ఫైర్ అండ్ హిట్లర్ టెర్రర్ అనే పుస్తకం ప్రచురించాడు. అది బాగా అమ్ముడుపోయింది. రీచ్‌స్టాగ్‌ను తగలబెట్టడం, దీనిపై కమ్యూనిస్టులపై నిందించడం నాజీలు చేసిన కుట్ర అని ఈ పుస్తకంలో ఆరోపించాడు. (మున్జెన్‌బర్గ్ రాసిన ఇతర పుస్తకాల మాదిరిగానే, దీనికి కూడా నిజమైన రచయిత అతడు కాదు. చెకోస్లోవాక్ కమ్యూనిస్ట్ ఒట్టో కాట్జ్.[16] చేత ఈ పుస్తకాన్ని రాయించాడు) ది బ్రౌన్ బుక్ విజయం తరువాత కాట్జ్ చేతనే రాయించిన ది సెకండ్ బ్రౌన్ బుక్ ఆఫ్ ది రీచ్స్టాగ్ ఫైర్ అండ్ హిట్లర్ టెర్రర్ అనే మరొక బెస్ట్ సెల్లర్ పుస్తకాన్ని 1934 లో మున్జెన్‌బర్గ్ ప్రచురించాడు.
ఇవి కూడా చూడండి
మార్చునోట్స్
మార్చు- ↑ జర్మనీ ప్రెసిడెంటు భారత రాష్ట్రపతి లాగానే దేశాధినేత, దేశంలోనే అత్యున్నత స్థాయి పదవి. దేశ పార్లమెంటు (బుండెస్టాగ్), రాష్ట్రాల ప్రతినిధులూ కలిసి ప్రెసిడెంటును ఎన్నుకుంటారు. రెండవ అత్యున్నత స్థాయి పదవి బుండెస్టాగ్ ప్రెసిడెంటు. లోక్‌సభ స్పీకరు వంటిది. మూడవ అత్యున్నత స్థాయి పదవి ఛాన్సలరు- ప్రభుత్వాధినేత. ఇది భారతదేశ ప్రధానమంత్రి పదవికి సమానమైనది. ఛాన్సలరును బుండెస్టాగ్ ఎన్నుకుంటుంది.
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 Tobias, Fritz (1964). The Reichstag Fire. Putnam.
- ↑ Holborn, Haljo (1973) Republic to Reich: the Making of the Nazi Revolution
- ↑ DW Staff (27 February 2008). "75 Years Ago, Reichstag Fire Sped Hitler's Power Grab". Deutsche Welle. Retrieved 12 August 2013.
- ↑ Paterson, Tony (April 15, 2001). "Historians find 'proof' that Nazis burnt Reichstag". The Sunday Telegraph.
- ↑ Shirer, William (2011). The Rise and Fall of the Third Reich. Simon and Schuster. p. 192.
There is enough evidence to establish beyond a reasonable doubt that it was the Nazis who planned the arson and carried it out for their own political ends.
- ↑ Botwinick, Rita (2004). A History of The Holocaust: From Ideology to Annihilation. New Jersey: Peason. pp. 90–92.
- ↑ Schirer, William L. (1991). The Rise and Fall of the Third Reich. London: Mandarin. pp. 191–192. ISBN 0-7493-0697-1.
- ↑ Pinkney, David H. (1964). A Festschrift for Frederick B. Artz. Duke University Press. pp. 194.
- ↑ Delp, Alfred (2006). Advent of the heart: seasonal sermons and prison writings, 1941-1944. Ignatius Press. pp. 177.
- ↑ Lentz, Harris M. (1988). Assassinations and executions: an encyclopedia of political violence, 1865-1986. McFarland. pp. 74.
- ↑ Gellately, Robert (2001). Backing Hitler: Consent and Coercion in Nazi Germany. Oxford University Press. p. 18. ISBN 978-0-19-160452-2.
- ↑ Connolly, Kate (12 January 2008). "75 years on, executed Reichstag arsonist finally wins pardon". The Guardian. London. Retrieved 1 May 2008.
- ↑ biography by Martin Schouten "Rinus van der Lubbe 1909-1934" (1989)
- ↑ Shirer, William (1959). The Rise and Fall of the Third Reich. New York: Touchstone. p. 193.
- ↑ "Nuremberg Trial Proceedings". March 18, 1946. Volume 9.
- ↑ Costello, John (1988). Mask of Treachery. London: William Collins & Sons. p. 296.