లింగమగుంట తిమ్మన్న సులక్షణసార మనుగ్రంథము ను రచియించెను. ఇతడు యజ్ఞవల్క్యబ్రాహ్మణుడు; కాశ్యపగోత్రుడు; లక్ష్మయ్యకును తిమ్మాంబకును జన్మించిన పుత్రుడు. ఈకవి యించుమించుగా తెనాలిరామకృష్ణ కవితో సమకాలికుడు. ఇతడు తనకు భట్టరు చిక్కాచార్యుడు గురు వైనట్లీ క్రిందిపద్యమున వ్రాసికొని యున్నాడు -

సీ. శ్రీవైష్ణవహితుండ జిక్కయభట్టరుశిష్యుడ గవితావిశేష శేష
తులితసర్వార్యుపౌత్రుడ లక్ష్మణయకు దిమ్మాంబకు సుతుడ బెద్దనకు మార

[ 236 ]

నకు రామకవివరునకు ననుజన్ముడ నారామకవి చెప్పినట్టిమహిత
మత్స్యపురాణ వామనపురాణాది సత్కవితలకెల్ల లేఖకుడ వృద్ధ
కుండికాతీరలింగమకుంటనామ
పట్టణస్థితికుడ సౌభాగ్యయుతుడ
నాదిశాఖాప్రవర్తన నమరువాడ
గాశ్యపసగోత్రుడను దిమ్మకవిని నేను.

ఇందు జెప్పబడిన భట్టరు చిక్కాచార్యులే తనకు గురువై నట్లు తెనాలి రామకృష్ణకవియు పాండురంగమహాత్మ్యమున నీక్రిందిపద్యమున జెప్పుకొనియున్నాడు.


క. వాక్కాంతాశ్రయభట్టరు | చిక్కాచార్యులమహాత్ముశ్రీగురుమూర్తిన్
నిక్కపుభక్తి భజించెద | నిక్కావ్యకళాకలాప మీడేఱుటకున్.

రామకృష్ణునితోడి సమకాలీను డగుటచేత లింగమగుంట తిమ్మకవి 1620 వ సంవత్సర ప్రాంతములం దున్నవాడు. ఇతడు వృద్ధదశలో కాకునూరి యప్పకవి కాలములో సహిత ముండియుండవచ్చును. ఇతడు బహులక్ష్యలక్షణగ్రంథములను శోధించినవాడు. అప్పకవి యుదాహరించిన పెక్కు పద్యము లీసులక్షణసారమునందును గానబడుచున్నవి. "గడియలోపల మూడుకండ్రికలై త్రాడు ధర గూలదిట్టె మేధావిభట్టు" ఇత్యాదిసీసపద్యములను దానిక్రింద నప్పకవీయములో నుదాహరింపబడిన "సాళువ పెదతిమ్మమహీపాలు" డిత్యాది సమస్త పద్యములును సులక్షణసారమునందు కనవచ్చుటయేకాక శరభాంకుడు పద్యము మొదల చకారమును, 6 వ చోట హకారమును, 11 వ చోట కకారమునుంచి డిల్లీపట్టణమును దిట్టిన చాటుధారయని యీక్రిందిపద్య మొకటి యదికముగా నుదాహరింపబడి యున్నది-

ఉ. చాపముగా నహార్యమును జక్రిని బాణముగాగ నారిగా
బావదొరం బొనర్చి తలపం ద్రిపురంబుల గాల్పవే మహో

[ 237 ]

ద్దీపితతీవ్రకోపమున దేవత లెల్ల నుతింప నాటివిల్
పాపపుడిల్లిమీద దెగ బాపగదే శరభాంకనిదగమా.

తిమ్మకవి సులక్షణసారమున తనను గూర్చియు డనప్రజ్ఞాదికమును గూర్చియు నిట్లు చెప్పుచున్నాడు-

క. లక్షణశాస్త్రము లెల్ల బ|రీక్షించుట గొంతకొంత యెఱిగినవాడన్
లాక్షణికానుగ్రహత సు|లక్షణసారం బొనర్తు లక్ష్యము లమరన్.


గీ. గొంద ఱెంచులక్షణమును గొంద ఱెంచ
రందఱును నెంచినవికొన్ని యవియు నవి ము
దొరయగా గూర్చి కవిసమ్మతులను వ్రాయు
దొకటి కొకటికి సంస్కృతాంధ్రోక్తు లెనయ.
గీ. గ్రంథసామగ్రి గలుగుట బ్రతిపదమున
కన్నిలక్షణములువ్రాయు దనిన నందు
గ్రంథవిస్తార మగుగాన గవితసూత్ర
మెన్నిటను దేలిపడు నన్ని విన్నవింతు.

ఈకవి తన అన్నయయిన రామకవిచేసిన మత్స్యవామపురాణములు లభింపలేదు. ఈకవిచే నుదాహరింపబడిన తూద్రకరాజచరిత్రము, అనిరుద్ధచరిత్రము, ఆదినారాయణచరిత్రము మొదలయిన తెలుగుకావ్యములు సహిత మిప్పుడు కొన్ని గానరావు. ఇప్పుడు ముద్రితమైయున్న సులక్షణసారమునకును యముద్రితపుస్తకమునకును మిక్కిలి వ్యత్యాసము కనబడుచున్నది. కవిసర్పగారుడము, శ్రీధరఛందస్సు, కవిగజాంకుశము, వాదాంగదచూడామణి, ఆంధ్రశబ్దచింతామణి, సర్వలక్షణశిరోమణి, సర్వలక్షణసారసంగ్రహము, గోకర్ణఛందస్సు. ఉత్తమగండఛందస్సు, భీమనఛందస్సు, అధర్వణఛందస్సు, అనంతఛందస్సు, కావ్యచింతామణి, కావ్యాలంకారచూడామణి, ఛందోదర్పణము, ఆంధ్రభాషాభూషణము అను తెనుగులక్షణగ్రంథముల నుండి యీసులక్షణసారమునం దనేక లక్షణములు చేకొనబడినవి. కవిత్వరీతిని జూపుటకయి లక్షణగ్రంథములనుండి పద్యములను జేకొనుట న్యాయము కాకపోయినను సులక్షణసారమునుండి రెండుపద్యముల ఉదహరించడమైనది.

మ. వినుమీరీతియటంచు గావ్యకరుడై వెల్లంకి తాతప్ప చె
ప్పినసూత్రంబులు కల్లగా గనబడెన్ వీక్షింప నెట్లన్నచో
మునుదీర్ఘంబులపై ఱకారములకే పూర్ణస్థితప్రజ్ఞ గా
దనియెన్ లింగమగుంట తిమ్మకవి నే దర్కింతు నిప్పట్టునన్.
చ. అనుచు నదేమొకో మును రయంబున లక్షణసారసంగ్రహం
బెనయ వచించె జిత్రకవిపెద్దన లెస్సవువోడు వోడృ శ
బ్దనయతగానరో వినరో దద్ఘను లెంతయు ధన్యు లయ్యు మే
ల్గన భ్రమ గాంతు రాత్మల నొకానొక చోట బరాకు గ్రమ్మగన్.

మూలాల జాబితాసవరించు

ఆంధ్ర కవుల చరిత్రము (1949) రచించినవారు కందుకూరి వీరేశలింగం పంతులు