లిథియం అయాన్ బ్యాటరీ

లిథియం అయాన్ బ్యాటరీ అనేది మళ్ళీ మళ్ళీ రీచార్జ్ చేసుకోగల బ్యాటరీ. వీటిని సాధారణంగా తేలికపాటి ఎలక్ట్రానిక్ పరికరాలు, ఎలక్ట్రిక్ వాహనాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. సైన్యం అవసరాల్లోనూ, ఏరోస్పేస్ రంగాల్లోనూ వీటి అవసరం బాగా పెరుగుతోంది.[1] మొదటి లిథియం అయాన్ ప్రోటోటైప్ బ్యాటరీని 1985 లో అకీరా యోషినో కనుగొన్నాడు. ఈయన అంతకు మునుపు 1970, 80 దశకాల్లో జాన్ గుడినఫ్, స్టాన్లీ విట్టింగ్హాం, రషీద్ యజామి, కొయిచి మిజుషిమా చేసిన పరిశోధనలను ఆధారం చేసుకున్నాడు.

బ్యాటరీల్లో లిథియం అయాన్లు డిశ్చార్జి సమయంలో ఋణ ఎలక్ట్రోడ్ నుంచి ఎలక్ట్రోలైట్ ద్వారా ధన ఎలక్ట్రోడ్ వైపు ప్రయాణిస్తాయి. చార్జింగ్ సమయంలో ఇందుకు వ్యతిరేక దిశలో ప్రయాణిస్తాయి. లిథియం అయాన్ బ్యాటరీల్లో ధన ఎలక్ట్రోడ్ వైపు లిథియం మూలకాన్ని, ఋణ ఎలక్ట్రోడ్ వైపు గ్రాఫైటు మూలకాన్ని వాడతారు. ఈ బ్యాటరీల్లో శక్తి సాంద్రత ఎక్కువగా ఉండి, తక్కువ మెమరీ ఎఫెక్ట్, వాడకపోయినా దానంతట అదే డిశ్చార్జి అయ్యే స్వభావం తక్కువగా కలిగి ఉంటాయి. కానీ ఇవి మండే స్వభావం కలిగిన ఎలక్ట్రోలైట్లు కలిగి ఉండటం వలన, ఒక్కోసారి ప్రమాదకరంగా పరిణమించవచ్చు. ఈ బ్యాటరీలు పాడైనా, లేదా సరైన పద్ధతుల్లో చార్జింగ్ చేయకపోయినా మండిపోవచ్చు, లేదా పేలిపోవచ్చు. ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ శాంసంగ్ తన గెలాక్సీ నోట్ 7 ఉత్పత్తులను ఈ బ్యాటరీ సమస్యల వల్ల రీకాల్ చేయవలసిన అవసరం ఏర్పడింది. అలాగే బోయింగ్ 787 విమానాల్లో కూడా ఈ బ్యాటరీలకు సంబంధించి పలు దుర్ఘటనలు జరిగాయి.

చరిత్ర

మార్చు

లిథియం బ్యాటరీలను మొదటగా ఎం. స్టాన్లీ విట్టింగ్‌హాం అనే బ్రిటిష్ రసాయన శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. ఈయన ప్రస్తుతం బింగ్యాంటన్ విశ్వవిద్యాలయంలో పని చేస్తున్నాడు. ఈయన స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో పని చేస్తుండగా దీని మీద తన పరిశోధన ప్రారంభించాడు. 1970 దశకం మొదట్లో ఈయన డైసల్ఫైడ్ పొరల్లో లిథియం అయాన్లను భద్రపరచడం ఎలాగో కనుక్కొన్నాడు.[2] తర్వాత ఎక్సాన్ కంపెనీలో చేరి ఈ పరిశోధనకు మెరుగులు దిద్దాడు.[3]

మూలాలు

మార్చు
  1. Ballon, Massie Santos (14 October 2008). "Electrovaya, Tata Motors to make electric Indica". cleantech.com. Archived from the original on 9 May 2011. Retrieved 11 June 2010.
  2. "Charging Up the Development of Lithium Batteries".
  3. Whittingham, M. S. (1976). "Electrical Energy Storage and Intercalation Chemistry". Science. 192 (4244): 1126–1127. Bibcode:1976Sci...192.1126W. doi:10.1126/science.192.4244.1126. PMID 17748676. S2CID 36607505.