లిన్లీ బొవ్మర్

పిండ శస్త్రచికిత్స తట్టుకున్న శిశువు

లిన్లీ హోప్ బొవ్మర్ (Lynlee Boemer) గర్భస్థ దశలో పిండ శస్త్రచికిత్సను విజయవంతంగా తట్టుకుని జన్మించిన ఒక పాప. సెక్రో-కాక్సిజ్యల్ టెరటోమ (Sacrococcygeal teratoma) అనే వెన్నెముక కణితి వలన ఈమెకు పిండ శస్త్రచికిత్స చేయవలసి వచ్చింది.

నేపథ్యం

మార్చు

యు.ఎస్‌లోని టెక్సస్ రాష్ట్రంలోగల లూయిస్‌విల్‌లోని (Lewisville) జెఫ్ బొవ్మర్ (Jeff Boemer), మార్గరెట్ హాకిన్స్ బొవ్మర్ (Margaret Hawkins Boemer) దంపతులకు 2015లో కవలలు పుట్టబోతున్నట్లు తెలిసింది. ఐతే రెండో త్రైమాసికంలోపే ఒక శిశువు గర్భంలోనే మృతి చెందినట్లు తెలిసింది.[1]

మార్గరెట్ 16 వారాల గర్భవతిగా ఉన్నప్పుడు, కడుపులో మిగిలిన శిశివుకి సెక్రో-కాక్సిజ్యల్ టెరటోమా అనే వెన్నెముక కణితి ఉన్నట్లు అల్ట్రాసౌన్డ్ స్కెనింగ్ ద్వారా తెలిసింది. ఈ కణితి బాగా పెరగడంతో బిడ్డకూ, కణితికీ కలిపి రక్తం సరఫరా చేసేందుకు గుండె సామర్థ్యం సరిపోని పరిస్థితి ఎదురైంది. ఇది ఇలా కొనసాగితే బిడ్డ గర్భంలోనే మృతి చెందే అవకాశం ఉంది. ఈ పరిస్థితిలో వైద్యులు ఆమెను గర్భస్రావం చేయించుకోమన్నారు. లేదా అరుదుగా విజయవంతమయ్యే పిండ శస్త్రచికిత్స చేయించుకోవచ్చని చెప్పారు. మార్గరెట్ శస్త్రచికిత్సకు మొగ్గు చూపింది.[2]

శస్త్రచికిత్స

మార్చు

మార్గరెట్ 23 వారాలు, 5 రోజుల గర్భవతిగా ఉన్నప్పుడు[3] హ్యూస్టన్‌లోని టెక్సస్ చిల్డ్రన్స్ హాస్పిటల్ వైద్యులు శస్త్రచికిత్సకు సిద్ధపడ్డారు. అప్పటికి గర్భస్థ శిశువు బరువు 0.53 కేజీలు. అప్పటికి కణితీ, బిడ్డ యొక్క మిగతా శరీరం దాదాపు సమాన పరిమాణంలో ఉన్నాయి. బిడ్డ బతికే అవకాశం 50% అని అంచనా వేసారు.[2]

శస్త్రచికిత్సలో 20 మంది పైగా వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఇద్దరు శస్త్రచికిత్స నిపుణులూ, శిశు మత్తు వైద్యుడూ, శిశు హృద్రోగ వైద్యుడూ, మాతృ-పిండ నిపుణులూ, ఎందరో నర్సులూ పాల్గొన్నారు. [4] శస్త్రచికిత్స నిపుణులు ఒలయింక ఒలాటొయి, డెరల్ కస్ (Darrell Cass)లు.

5 గంటల పాటు సాగిన ఈ శస్త్రచికిత్సలో[3] మార్గరెట్ పొట్టనీ, గర్భాశయాన్నీ కోసి, గర్భస్థ శిశువు కింది భాగాన్ని బయటకు లాగి కణితిని వీలైనంతవరకు తొలగించారు.[5] ఈ 5 గంటలలో పిండం మీద శస్త్రచికిత్స చేసే సమయం 20 నిమిషాలు.[6]

శిశువుని తిరిగి గర్భాశయంలో పెట్టి, కాన్పు వరకూ పటిష్ఠంగా ఉండేలా గర్భాశయాన్ని తిరిగి కుట్టారు.[5]

శస్త్రచికిత్స జరిగినంత సేపూ బిడ్డ గుండె దాదాపుగా ఆగిపోయింది. శిశు హృద్రోగ వైద్యుడు గుండె పనితీరు ప్రభావం బిడ్డపై పడకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నాడు.[2]

ప్రసవం, తరువాతి విశేషాలు

మార్చు

శస్త్రచికిత్స తరువాత 13 వారాలు మార్గరెట్‌ను మంచం పట్టున విశ్రాంతిలో ఉంచి, ఆ తరువాత దాదాపుగా నెలలు నిండాక (36 వారాలు పూర్తయ్యాక[6]), జూన్ 6, 2016న శస్త్రచికిత్స ద్వారా కాన్పును వైద్యులు పూర్తి చేసారు.[2][5][7] సుమారు 2.5 కేజీల బరువుతో శిశువు పుట్టింది.

వాళ్ళ అమ్మమ్మా, నానమ్మల పేర్లు కలిపి లిన్లీ హోప్ బొవ్మర్‌గా పేరు పెట్టబడ్డ ఈ శిశువుకి 8 రోజుల వయసులో మరొక శస్త్రచికిత్స చేసి, కణితిలో మిగతా భాగాన్ని తొలగించారు.[2][5]

రెండో శస్త్రచికిత్స తరువాత ఆరోగ్యంగా ఉన్న లిన్లీకి వీపు, కాళ్ళూ, మొల కండరాలకు కొంత ఫిజియోథెరపీ అవసరం అయింది.[8]

జూన్ 2023 నాటికి ఏడేళ్ళు నిండిన లిన్లీ ఆరోగ్యంగా ఉంది.[5]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Baby Lynlee 'born twice' after life-saving tumour surgery" [ప్రాణాలు కాపాడిన కణితి శస్త్రచికిత్స అనంతరం 'రెండు సార్లు పుట్టిన' లిన్లీ పాప] (in ఇంగ్లీష్). బిబిసి న్యూస్. 24 October 2016. Retrieved 26 October 2024. Mrs Boemer had originally been expecting twins, but lost one of her babies before the second trimester. [మిసెస్ బొవ్మర్ కవలలు పుడతారని అనుకుంటుండగా, రెండో త్రైమాసికం లోపే ఒక శిశువుని కోల్పోయారు.]
  2. 2.0 2.1 2.2 2.3 2.4 "Baby Lynlee 'born twice' after life-saving tumour surgery" [ప్రాణాలు కాపాడిన కణితి శస్త్రచికిత్స అనంతరం 'రెండు సార్లు పుట్టిన' లిన్లీ పాప] (in ఇంగ్లీష్). బిబిసి న్యూస్. 24 October 2016. Retrieved 26 October 2024.
  3. 3.0 3.1 "Baby 'born twice' doing well after miracle surgery" [అద్భుతమైన శస్త్రచికిత్స తరువాత 'రెండు సార్లు పుట్టిన' బిడ్డ బాగుంది]. World (in ఇంగ్లీష్). 24 October 2016. Retrieved 27 October 2024.
  4. Stacy Weiner (29 June 2023). "The tiniest patients: Operating inside the womb" [అతి చిన్న రోగులు: గర్భం లోపల శస్త్రచికిత్స]. news. AAMC (in ఇంగ్లీష్). Retrieved 27 December 2024. On the day of the surgery, more than 20 providers participated, including two surgeons, maternal-fetal specialists, several nurses, a pediatric cardiologist, and a pediatric anesthesiologist [శస్త్రచికిత్స జరిగిన నాడు ఇద్దరు శస్త్రచికిత్స నిపుణులూ, మాతృ-పిండ నిపుణులూ, చాలా మంది నర్సులూ, ఒక శిశు హృద్రోగ వైద్యుడూ, శిశు మత్తు వైద్యుడితో సహా 20 మందికి పైగా వైద్య సిబ్బంది పాల్గొన్నారు.]
  5. 5.0 5.1 5.2 5.3 5.4 Stacy Weiner (29 June 2023). "The tiniest patients: Operating inside the womb" [అతి చిన్న రోగులు: గర్భం లోపల శస్త్రచికిత్స]. news. AAMC (in ఇంగ్లీష్). Retrieved 27 December 2024.
  6. 6.0 6.1 Susan Scutti (20 October 2016). "Meet the baby who was born twice" [రెండు సార్లు పుట్టిన బిడ్డను చూడండి]. Health. CNN (in ఇంగ్లీష్). Retrieved 27 October 2024.
  7. "Lynlee's Life Medical Fund" [లిన్లీ జీవిత వైద్యనిధి]. gofundme (in ఇంగ్లీష్). n.d. Retrieved 27 December 2024.
  8. Hakim Kasami (c. 2016). "The baby who was born twice - this is the chilling story of her mother!" [రెండు సార్లు పుట్టిన బిడ్డ — ఇది ఆమె తల్లి యెుక్క వణుకు పుట్టించే కథ]. Telegraph (in ఇంగ్లీష్). Retrieved 27 December 2024.