లైంగిక వేధింపులు

స్త్రీలపై జరిగే అత్యాచారాలన్నింటిలో పైకి కనబడకుండా ఎన్నో సార్లు, మరల మరలా ఆమెపై జరిగే అతిహేయమైన అత్యాచారం ఈ ‘లైంగికపరమైన వేధింపులు, దీనిని ఆంగ్లములో సెక్సువల్ హెరాస్మెంట్ అని అంటారు కన్నార్పకుండా చూడడం, సైగలు చేయడం, తాకడం లేదా అసభ్య కరమైన వ్యాఖ్యానాలు చేయడం వంటి ‘సెక్స్’ పరమైన అనుచితమైన ప్రవర్తనను లైంగిక వేధింపులు అని వ్యవహరించ వచ్చు .భారత రాజ్యాంగంలో అధికరణం 14, 15 ప్రకారం మహిళలకు పురుషులతో సమానంగా ప్రాథమిక హక్కులు కల్పించబడ్డాయి. అయితే వారిపై జరిగే లైంగిక వేధింపులు ఈ హక్కులను ఉల్లంఘిస్తునట్లే అని ఈ చట్టం గుర్తించింది. అలాగే ఆర్టికల్‌ 21 ప్రకారం ఎటువంటి వేధింపులు లేని, సురక్షితమైన వాతావరణంలో స్త్రీలు తమకు నచ్చిన వృత్తి లేక వ్యాపారం చేసుకునే హక్కు కల్పించబడింది.

పని ప్రదేశంలోె లైంగిక వేధింపులు

మార్చు

స్త్రీలపై అత్యాచారానికి పాల్పడినా, శారీరక సంబంధం పెట్టుకొమ్మని బలవంతం చేసినా, వారితో అశ్లీల పదజాలం వాడినా, అశ్లీలంగా ఎటువంటి సైగలు చేసినా, అశ్లీల చిత్రాలు తీసినా, చూపించినా, శారీరకంగా గాని మానసికంగా గాని వారిని ఎటువంటి లైంగిక ఇబ్బందులకు గురిచేసినా అవి లైంగిక వేధింపుల క్రిందికి వస్తాయి,

సుప్రీంకోర్టు మార్గదర్శకాలు

మార్చు

1997 లో ‘విశాఖ’ కేసు పేరిట పని స్థలంలో వేధింపులకు సంబంధించి సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలను వెలువరించింది.[1]

  • పనిచేసే ప్రదేశం యజమాని గానీ.. బాధ్యతాయుతమైన వ్యక్తి గానీ సదరు సంస్థలో లైంగిక వేధింపులు నిరోధించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి.
  • సుప్రీంకోర్టు నిర్ధేశించిన ప్రకారం లైంగిక వేధింపులంటే ఏమిటి..? అనే అంశాన్ని సంస్థలో అందరికీ తెలిసేలా చేయాలి. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లు ఉద్యోగులకు పంపిణీ చేయాలి.
  • లైంగిక వేధింపులు నిషేధిస్తూ.. క్రమశిక్షణకు సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ను సంస్థ ఏర్పాటు చేసుకోవాలి.
  • క్రమశిక్షణను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలి.
  • ఉద్యోగినులు ప్రశాంతంగా పనిచేసుకోవడానికి అవసరమైన వాతావరణాన్ని కల్పించాలి.
  • వారి పని గురించి, విరామం గురించి, ఆరోగ్య పరిస్థితుల గురించి యాజమాన్యం పట్టించుకోవాలి.
  • సంస్థలో ప్రతికూల వాతావరణం లేకుండా చూడాలి.
  • ఈ మార్గదర్శకాల స్థానంలో సరైన శాసనం వచ్చేంత వరకూ వీటిని అమలు చేయాలి.

లైంగిక వేధింపుల చట్టం

మార్చు

ఈ చట్ట ప్రకారం 'అన్యాయానికి గురైన మహిళ' అనగా ఒక మహిళ వయస్సుతో నిమిత్తం లేకుండా పని చేసే ప్రదేశంలోనైనా, ఆమె ఉంటున్న నివాసంలోగాని, దగ్గరగాని లైంగిక వేధింపులకు గురైన వారిగా నిర్వచించబడింది (ఎస్‌.2 (ఎ) ). అలాగే 'ఉద్యోగి' అనగా ఏ వ్యక్తికైనా శాశ్వతంగా గాని, తాత్కాలికంగా గాని, కొంత సమయానికి గాని, రోజువారీ వేతనానికి గాని, నేరుగా గాని, మధ్యవర్తి ద్వారా గానీ నియమించబడినవారై, ఏదైనా సంస్థలో పని చేసేవారని నిర్వచించబడింది (ఎస్‌.2 (ఎఫ్‌) ). ఈ చట్టం వ్యవసాయ కార్మికులకు, ఇంటి పనివారికి కూడా రక్షణ కల్పిస్తున్నది. లైంగిక వేధింపులను అరికట్టడం లేక వేధింపులకు గురైన వారి సమస్యలను పరిష్కరించే బాధ్యత కేంద్ర, రాష్ట్ర, ప్రైవేటు సంస్థలపై ఉంది. 'పని ప్రదేశం' అనగా ఏదైనా ప్రభుత్వ కార్యాలయం, ప్రభుత్వరంగ సంస్థ, ప్రైవేటు సంస్థ, ప్రభుత్వ, పైవేటు కర్మాగారం, విద్యాసంస్థ, ప్రభుత్వ, ప్రైవేటు అనుబంధ సంస్థ, సొసైటీ, ట్రస్టు, ఎన్‌జివో, సేవలందించే సంస్థ, ఆసుపత్రి, వినోదాన్ని అందించే సంస్థ (ఎంటర్‌టైన్‌మెంట్‌, టీవీలు, సినిమా సంస్థలు), ఆరోగ్య, ఆర్థికపరమైన సేవలందించే ప్రదేశం, అలాగే పైన పేర్కొన సంస్థ అందించే సదుపాయాలు, ఉద్యోగి తన వృత్తికి సంబంధించి సందర్శించే ఏ ప్రదేశమైనా, సందర్శనార్థం ఉపయోగించే రవాణా సదుపాయాలు, ఇంటి పనివారికి వారు పని చేసే నివాసాలు వంటివిగా నిర్వచించబడింది (ఎస్‌.2 (ఓ) ). (ఎస్‌. (3) ) చట్టంలోని సెక్షన్‌-3 ప్రకారం ఏ ఒక్క మహిళ కూడా తాను పనిచేసే ప్రదేశంలో లైంగిక వేధింపులకు గురికాకుండా ఉండాలి. అది వారి ముఖ్యమైన హక్కు. స్త్రీలు తాము పనిచేసే ప్రదేశంలో ఇతరులచే వారి పని పట్ల పక్షపాత ధోరణి ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా చూపడం గాని, అవమానపరచడం గాని, వారి పనిలో అనవసరంగా తలదూర్చడం గాని, వారి ఆరోగ్యంపై ప్రభావం చూపే విధంగా ప్రవర్తించడం గాని, పని నుంచి తొలగిస్తామని బెదిరించడం వంటి చర్యలు గాని లైంగిక వేధింపుల కిందికే వస్తాయి. చట్టం ప్రకారం లైంగిక వేధింపులకు గురైన స్త్రీ ఎవరిపైన ఫిర్యాదు చేస్తుందో వారు ప్రతివాది అవుతారు (రెస్పాడెంట్‌ (ఎస్‌.2 (ఎం) ). అయితే ఈ ప్రతివాది మహిళ కాకూడదని లేదు. విశాఖ కేసు తీర్పు అనంతరం లైంగిక వేధింపుల నిర్వచనంలో మరిన్ని అంశాలు చేర్చబడ్డాయి. ఒకటి కంటే ఎక్కువ అసభ్యకర చర్యలు, ప్రవర్తన అనగా శారీరక సంబంధం కొరకు బలవంతం, అశ్లీల పదజాలం వాడటం, అశ్లీల సినిమాలు, చిత్రాలు చూపించడం మొదలైనవి (ఎస్‌.2 (ఎస్‌) ). చట్టంలో అధ్యాయం 2, 3 ప్రకారం ఏదైనా సంస్థలో 10 మందికి మించి ఉద్యోగులు ఉంటే ఆ సంస్థ లైంగిక వేధింపుల సమస్యల పరిష్కారానికి సరైన యంత్రాంగాన్ని రూపొందించాలి. ఇటువంటి సంస్థలలో 'అంతర్గత ఫిర్యాదుల కమిటీని' ఏర్పాటు చెయ్యాలి. ఆ కమిటీకి ఒక సీనియర్‌ స్థాయిలో ఉన్న మహిళ అధ్యక్షత వహించాలి. ఇంకా ఇద్దరు ఉద్యోగులు కమిటీలో ఉండాలి. అందులో ఒకరు ఎన్‌జివో అయివుండాలి (ఎస్‌.4). 10 కంటే తక్కువ మంది ఉద్యోగులు ఉన్న అన్ని సంస్థలలో పనిచేసే మహిళల కోసం జిల్లా అధికారి 'స్థానిక ఫిర్యాదుల కమిటీని' ఏర్పాటు చెయ్యాలి. ఆ జిల్లా అధికారి ఇటువంటి కమిటీకి అధ్యక్షత వహించాలి. ఈ అధికారి ప్రతి బ్లాక్‌లోనూ, తాలూకాలోనూ, తహసిల్‌లోనూ, మున్సిపల్‌ వార్డు/డివిజన్‌లోనూ ఒక నోడల్‌ అధికారిని నియమించాలి. వారు ఈ లైంగిక వేధింపులకు సంబంధించి ఫిర్యాదులు స్వీకరించి వారంలోగా స్థానిక ఫిర్యాదుల కమిటీకి పంపాలి (ఎస్‌.5Ê6). లైంగిక వేధింపులకు గురైనవారు ఆ ఘటన జరిగిన మూడు నెలల లోపు పైన చెప్పబడిన కమిటీలకు ఫిర్యాదు చెయ్యాలి. ఒకవేళ వరుస ఘటనలు జరిగితే చివరి ఘటన జరిగిన మూడు నెలల లోపు ఫిర్యాదు చెయ్యాలి. వేధింపులకు గురైన మహిళే ఫిర్యాదు చెయ్యాలి. ఒకవేళ ఆమె మానసికంగా గానీ, శారీరకంగా దెబ్బతినో లేక మరణించిన ఎడల ఆమె తరపున ఇంకెవరైనా ఫిర్యాదు చెయ్యవచ్చు (ఎస్‌.9). ఈ ఫిర్యాదుపై పైన పేర్కొన్న కమిటీలు విచారణ చేసే ముందు వేధింపునకు గురైన మహిళ అభ్యర్థన మేరకు ఈ సమస్యను విచారణ లేకుండా పరిష్కరించేందుకు ఇరువర్గాల మధ్య రాజీ కుదర్చడానికి చర్యలు తీసుకొనవచ్చును (సెక్షన్‌10). అయితే ఈ పరిష్కార క్రమంలో ఆర్థికపరమైన లావాదేవీలుండకూడదు. ఒకసారి ఫిర్యాదు ఈ విధంగా పరిష్కరింపబడితే కమిటీలు ఆ విషయాన్ని రాతపూర్వకంగా ఆయా యాజమాన్యాలకు తెలియజెయ్యాలి. ఆ కాపీలను ఫిర్యాదుదారునికి, ప్రతివాదికి అందజెయ్యాలి. తదుపరి ఏ విధమైన విచారణ ఆ ఫిర్యాదుపై చేపట్టరాదు. సమస్య పై విధంగా పరిష్కారం కాని పక్షంలో విచారణ చేపట్టి, ప్రాథమిక విచారణలో తప్పు జరిగిందని తేలితే వారం రోజుల లోపు ఈ కేసును స్థానిక పోలీసు స్టేషన్‌కు పంపించాలి. ఐపిసి సెక్షన్‌ 509 క్రింద దానితోపాటు అవసరానుసారం ఇతర సెక్షన్ల క్రింద కేసు నమోదు చెయ్యాలి. ఒకవేళ (సెక్షన్‌10) ప్రకారం ప్రత్యర్థి రాజీ మార్గంలో పరిష్కారానికి అంగీకరించకపోతే అదే విషయాన్ని ఫిర్యాదుదారు కమిటీలకు తెలియజేసినా కమిటీ విచారణ మొదలుపెట్టి కేసును పోలీసులకు అప్పజెప్పవచ్చు (సెక్షన్‌ 11). మొత్తం విచారణ క్రమంలో ప్రత్యర్థి తన వాదనను వినిపించుకునే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. ఐపిసి సెక్షన్‌ 509 క్రింద ప్రతివాది తప్పు చేసినట్లు రుజువైతే, వారు ఫిర్యాదుదారునికి నిర్ణీత మొత్తంలో డబ్బు చెల్లించమని ఆదేశించవచ్చు. విచారణ క్రమంలో ఏ వ్యక్తినైనా హాజరుపరచి విచారణ చేయడానికి, ఎటువంటి దస్త్రాలైనా పరిశీలించడానికి ఈ ఫిర్యాదు కమిటీలకు సర్వాధికారాలు ఉన్నాయి. ఈ విచారణ 90 రోజుల లోపు పూర్తి చెయ్యాలి. ఈ విచారణ క్రమంలో ఫిర్యాదుదారు లిఖితపూర్వక అభ్యర్థన మేరకు ఆమెనుగాని, ప్రతివాదినిగాని బదిలీ చెయ్యడం లేక లైంగిక దాడులకు గురైన (ఫిర్యాదుదారు) మహిళకు మూడు నెలల సెలవు ఇవ్వడం లేక ఆమెకు ఇతర ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టాలని ఫిర్యాదు కమిటీలు ఆయా యాజమాన్యాలకు సూచించవచ్చు. ఈ సూచనలను యాజమాన్యాలు అమలు పరచవలసిందే. విచారణ పూర్తయిన పది రోజుల్లో కమిటీలు తమ నివేదికను యాజమాన్యానికి లేదా జిల్లా అధికారికి సమర్పించాలి. అలాగే ఫిర్యాదుదారునికి, వారి ప్రత్యర్థికి కూడా ఈ నివేదిక అందుబాటులో ఉంచాలి. ఒక వేళ కమిటీల విచారణలో నిందితుడు తప్పుచేసినట్లు రుజువైతే అతని ఉద్యోగ నియమనిబంధనల ప్రకారం అతనిపై చర్యలు తీసుకునేలా లేక ఇతరత్రా అనగా వేతనంలో కోత విధించి ఆ సొమ్మును ఫిర్యాదుదారునికి అందజేసేలా చర్యలు తీసుకొమ్మని కమిటీలు ఆయా యాజమాన్యాలకు సూచనలివ్వవచ్చు. వాటిని యాజమాన్యాలు 60 రోజుల లోపు అమలు పరచాలి (సెక్షన్‌13). ఒక వేళ ఎవరైనా ఒకరిపై ద్వేషం, పగతో ఉద్దేశపూర్వకంగా ఫిర్యాదుచేసినా లేక ఫోర్జరీ చేసిన పత్రాలతో ఫిర్యాదు చేసినట్లు రుజువైతే ఆ ఫిర్యాదుదారునిపై చర్యలు తీసుకునే అవకాశం కూడా ఈ చట్టం కల్పించింది. ఈ చట్టం సమాచార హక్కు చట్టానికి భిన్నంగా ఈ విచారణలలో ఫిర్యాదుదారుని, ప్రతివాది సాక్ష్యాలు, చిరునామాలు, గుర్తింపు, కమిటీల సూచనలు, విచారణా క్రమం పత్రాలు, నివేదికలు ఏవీ కూడా బయట పెట్టడానికి వీలులేదు (సెక్షన్‌ 16). ఎవరికైనా ఫిర్యాదుల కమిటీల సూచనలపై అభ్యంతరాలున్నా లేక వారి సూచనలు ఎవరైనా అమలు పరచని ఎడల (సెక్షన్‌ 17) వారు కోర్టునుగాని, ట్రిబ్యునల్‌నుగాని ఆశ్రయించవచ్చు. మహిళలు తాము పనిచేసే ప్రదేశంలో నిర్భయంగా తమ విధులను నిర్వర్తించేందుకు వీలైన వాతావరణాన్ని కల్పించడం, బయట నుంచి వచ్చేవారి నుంచి రక్షణ కల్పించడం, లైంగిక వేధింపులకు పాల్పడితే వారికి పడే శిక్షలు, వాటి పర్యవసానాలను తెలిపే పట్టికలను లేదా గోడ పత్రికలను పని ప్రదేశంలో ప్రదర్శించడం వంటి బాధ్యతలు యాజమాన్యం చేపట్టాలని ఈ చట్టం సూచిస్తున్నది. లైంగిక వేధింపుల వల్ల జరిగే నష్టాలపై అవగాహన కల్పిస్తూ వర్క్‌షాపులు నిర్వహించడం, ఫిర్యాదుల కమిటీలకు కావాల్సిన సదుపాయాలు కల్పించడం, విచారణకు అవసరమయ్యే సమాచారాన్ని అందించడం, లైంగిక వేధింపులకు పాల్పడిన వారిపై ఉద్యోగపరంగా కఠిన చర్యలు తీసుకునేలా నిబంధనలు రూపొందించడం మొదలగు చర్యలు కూడా యాజమాన్యమే చేపట్టాలి (సెక్షన్‌ 19). ప్రభుత్వం కూడా ఈ చట్టం అన్ని చోట్లా సక్రమంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలి. దీనిపై వార్షిక నివేదికలు రూపొందించాలి. యాజమాన్యాలు ఈ చట్టం సూచించినట్లుగా కమిటీలు ఏర్పరచక పోయినా, దోషులపై చర్యలు తీసుకోక పోయినా వారు శిక్షార్హులు (సెక్షన్‌ 26). వేధింపులకు గురైన మహిళగాని లేక ఈ కమిటీలు సూచించిన వ్యక్తులు ఫిర్యాదు చేసినప్పుడు మాత్రమే ఈ చట్ట పరిధిలో శిక్షార్హమైన ఏ నేరం పైనైనా న్యాయస్థానం విచారణ చేపట్టవచ్చు (సెక్షన్‌ 27). ఈ చట్టం స్త్రీలు పని చేసే ప్రదేశాలలో వారిపై లైంగిక వేధింపులను అరికట్టడానికి, అదే సమయంలో ఈ చట్టాన్ని దుర్వినియోగ పరుస్తూ తప్పుడు ఫిర్యాదులను అరికట్టడానికి మధ్య సమతుల్యాన్ని సాధించడానికి ప్రయత్నిస్తుంది. అలాగే ఒక ప్రక్క ఫిర్యాదుల కమిటీలకు విస్తృతాధికారాలు ఇస్తూ రాజీమార్గం ద్వారా ఫిర్యాదులను పరిష్కరించడానికి అవకాశాన్ని కల్పిస్తున్నది.http://www.prajasakti.in/index.php?srv=10301&id=1183532

మూలాలు

మార్చు
  1. https://nakalalaprapancham.wordpress.com/tag/%E0%B0%B2%E0%B1%88%E0%B0%82%E0%B0%97%E0%B0%BF%E0%B0%95-%E0%B0%B5%E0%B1%87%E0%B0%A7%E0%B0%BF%E0%B0%82%E0%B0%AA%E0%B1%81%E0%B0%B2%E0%B1%81/