వక్షోజాల స్వీయ పరీక్ష
వక్షోజాల స్వీయ పరీక్ష (Breast self-examination) : మహిళలు ఎవరికి వారే తమ రొమ్ములను స్వయంగా పరీక్షించటం అనేది రొమ్ము క్యాన్సర్ ను తొలిదశలోనే వెంటనే గుర్తించటానికి చక్కని మార్గం. క్యాన్సర్ సమస్య వయస్సుతో సంబంధం లేకుండా వస్తుంది, కనుక, అన్ని వయస్సుల మహిళలు తమ రొమ్ముల స్వీయ పరీక్ష ప్రతి నెలా చేయాలి. ప్రతినెలా రుతుచక్రం తర్వాత ఈ పరీక్ష జరపటం ఉత్తమం, ఎందుకంటే, ఆ సమయంలో రొమ్ములు మృదువుగా ఉండి, గడ్డలు ఏవైనా ఉంటే సులువుగా కనుక్కొనే అవకాశం ఉంటుంది. ముట్లు ఆగిపోయిన (రుతుక్రమం నిలిచిపోయిన) మహిళలు, హిస్టరెక్టమీ (పిల్లల సంచి తొలిగింపు) ఆపరేషన్ జరిగిన మహిళలు, రుతుక్రమం నెలనెలా వరుసగా జరగని మహిళలు, తమకు అనుకూలమైన సమయాన్ని ఎంచుకోవాలి.
స్వీయపరీక్ష విధానం
మార్చుదీనికి అవసరమైన సామాగ్రి: ఒక దిండు, ఒక అద్దం.
- మొదటి మెట్టు
రొమ్ములో మార్పులు ఏమైనా ఉన్నదీ లేనిదీ తెసుసుకోవాలి. మొదటి భంగిమలో మీ రెండు చేతులను పైకి ఎత్తండి. రెండో భంగిమలో మీ చేతులను తుంటిపై పెట్టండి. మూడో భంగిమలో మీ రెండు చేతులను స్వేచ్ఛగా మీ ముందు భాగంలో వేలాడేటట్లు వదిలేయండి. ఈ మూడు భంగిమలను అద్దంలో చూస్తూ ఒక్కో రొమ్ములో ఈ క్రింద పేర్కొన్న మార్పులను గమనించండి.
రొమ్ము ఆకారం, సైజు, కుదురు లేదా ఆకృతి, రొమ్ముపైన చర్మం రంగు వివర్ణం కావటం / కంది పోవటం లేదా సొట్టలుపడటం, బొడిపెలు / గడ్డలు, పుండ్లు లేదా చర్మం పొలుసు బారటం, చనుమొనల నుంచి పాలు కారటం లేదా చనుమొనలపై పగుళ్లు ఏర్పడటం, రొమ్ముపై సొట్టలు, కురుపులు లేవటం.
- రెండవ మెట్టు
- మంచంపై వెల్లకిలా పడుకోండి. మీ రొమ్ములో గడ్డలేమైనా ఉన్నాయో ప్రతి అంగుళాన్ని పరీక్షించి, వెతకండి.
ఎడమ వైపు రొమ్ముకు కుడి చెయ్యిని, కుడివైపు రొమ్ముకు ఎడమ చెయ్యిని ఉపయోగించండి.
- మీ చేతి మధ్యన మూడు వేళ్ల కొసభాగాలతో రొమ్ము పై గట్టిగా అదుముతూ బొడిపెలు, గడ్డలు ఏమైనా తగులుతున్నాయా గమనించండి.
- చనుమొనలతో సహా మీ రొమ్ము ప్రాంతం మొత్తం పరీక్షించటానికి వీలుగా మీరు చేసే పరీక్షను వృత్తాకారంలో గానీ, పై నుంచి కిందకు గానీ చేయండి.
- మీ పరీక్షను రొమ్ము గ్రంధులు ఉన్న చంక క్రింది వరకు విస్తరించండి.
- చనుమొనలకు అటు, ఇటు భాగాలపై మీ చేతిని తాకుతూ, కదిలిస్తూ రొమ్ము ప్రాంతం మొత్తాన్ని మీరు తడిమి చూడాలి.
- మెడ ఎముక కింద, దాని చుట్టూతా తడిమి, గడ్డలు, బొడిపెలు ఏమైనా తాకినట్లు అనిపిస్తుందా గమనించండి.
- చేతిని మార్చి ఇంకో వైపు రొమ్మును కూడా పైన పోర్కొన్న విధంగా పరీక్షించండి.