వన పర్వము చతుర్థాశ్వాసము

(వన పర్వము చతుర్ధాశ్వాసము నుండి దారిమార్పు చెందింది)


చతుర్ధాశ్వాసం

మార్చు

పాండవులు నరనారాయణులు నివసించిన స్థానంలో కొన్ని దినములు గడిపారు. ఒకరోజు ధర్మరాజు తమ్ములతో ఇలా అన్నాడు. " అర్జునుడు మనలను విడిచివెళ్ళి అయిదు సంవత్సరాలు గడిచాయి. దివ్యాస్త్రాలతో అతను వచ్చే సమయం ఆసన్నమైంది " అని చెప్పాడు. పాండవులు అర్జుని కోసం ఉత్తర దిక్కుగా ప్రయాణం సాగించారు. వారంతా మాల్యవంతము అనే పర్వతం చేరుకున్నారు.

ద్రౌపది భీమసేనుని పంచవర్ణ పుష్పములు కోరుట

మార్చు

ఒక రోజు ద్రౌపది భీమసేనుడు ఆ పర్వత సానువులలో విహరిస్తున్నారు. అప్పుడు పంచ వర్ణములు కలిగిన పువ్వు గాలిలో ఎగురుతూ వారి ముందు పడింది. ద్రౌపది ఆ పువ్వులను చూసి ముచ్చట పడి భీమసేనుని అలాంటి పువ్వులు మరికొన్ని తీసుకు రమ్మని కోరింది. భీముడు ఆ పువ్వు వచ్చిన దిక్కుగా వెళ్ళాడు. పువ్వులను వెదుకుతూ భీముడు కుబేరుని నివాసానికి వెళ్ళాడు. అక్కడ కాపలా ఉన్న యక్ష, రాక్షస భటులు భీముని అడ్డగించారు. భీముడు వారితో యుద్ధం చేసాడు. ఆ యుద్ధంలో కుబేరుని సేనాని, ప్రియ మిత్రుడైన మణిమంతుడు మరణించాడు. ఆ విషయాన్ని భటులు కుబేరునికి తెలిపారు. ఇంతలో ద్రౌపది వలన విషయం తెలుసుకున్న ధర్మరాజు సోదరులను తీసుకుని ద్రౌపదీ సమేతంగా అక్కడికి చేరుకున్నాడు. వారు కుబేరుని మందిర సమీపంలో చనిపోయిన యక్షులు, మణిమంతుని భీకరంగా కనపడుతున్న భీముని చూసారు. కుబేరుడు జరిగినది భటుల వలన తెలుసుకుని అక్కడకు వచ్చి ధర్మరాజాదులను చూసి ధర్మరాజుకు నమస్కరించి " ధర్మరాజా! నా మిత్రుడు మణిమంతుని నీ సోదరుడు భీముడు చంపాడని చింతించ వలదు. అతడు శాపవశాత్తు మరణించాడు. మీరు ఈ ప్రాంతంలో హాయిగా ఉండండి. నాసేవకులు మీకు సేవలు చేస్తారు. మీరు పదిహేను దినములపాటు ఆర్ష్టిషేణాశ్రమంలో నివసించండి. మీ తమ్ముడైన అర్జునుని నేను ఇంద్రసభలో చూసాను. అర్జునుడు మీ వద్దకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు " అన్నాడు.

అర్జునుని రాక

మార్చు
దస్త్రం:Coming of Arjuna from Heaven.jpg
అర్జునుని రాక

కుబేరుని మాట ప్రకారం ధర్మరాజాదులు ఆర్ష్టిషేణాశ్రమం చేరుకున్నారు. ఒకరోజు వారికి ధౌమ్యుడు మేరుపర్వతం చూపించి " ధర్మజా! అది మేరుపర్వతం దానిని దిక్పాలకులు కావలి కాస్తుంటారు. మేరువు చుట్టూ సూర్యుడు చంద్రుడు, నక్షత్రమండలం ప్రదక్షిణం చేస్తంటారు. ఈ పర్వతం మీద త్రిమూర్తులు కొలువు తీరి ఉంటారు " అని చెప్పాడు. ఇంతలో మాతలి తోలుతున్న రథం మీద అర్జునుడు వచ్చాడు. అర్జునుడు రాగానే ధౌమ్యుడు, ధర్మరాజు, భీములకు నమస్కరించాడు. ఇంతలో ఇంద్రుడు అక్కడకు వచ్చి " ధర్మరాజా! నీ తమ్ముడు అర్జునుడు చాలా గొప్పవాడు. ఎన్నో దివ్యాస్త్రాలు సంపాదించాడు. నివాత, కవచులను వధించాడు. దేవతలకు మేలు చేసాడు " అని చెప్పి ధర్మరాజుకు అర్జునుని అప్పచెప్పి ఇంద్రలోకం వెళ్ళాడు. ధర్మరాజు అర్జునునితో " అర్జునా! నీవు పరమశివుడు, ఇంద్రుడు, వరుణుడు, అగ్నిదేవుడు మొదలగు వారిని మెప్పించి ఎన్నో దివ్యాస్త్రాలను సాధించావు అని ఇంద్రుడు చెప్పాడు. ఆ వివరాలను మాకు వీనుల విందుగా చెప్పు " అని అడిగాడు. అర్జునుడు ఈవిధంగా చెప్పసాగాడు " అన్నయ్యా ! నేను నీ ఆదేశం మేరకు హిమవత్పర్వతానికి వెళ్ళాను. నాకు ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో కనిపించి శివుని గురించి తపస్సు చెయ్యమని ఆదేశించాడు. నేను చేసిన తపస్సుకు మెచ్చి శివుడు కిరాతుడి రూపంలో దర్శనం ఇచ్చాడు. నాతో యుద్ధం చేసి నా శౌర్యం మెచ్చి నాకు పాశుపతాస్త్రం అనుగ్రహించాడు. తరువాత ఇంద్రాది దేవతల వలన అనేక దివ్యాస్త్రాలు పొందాను. అందుకు ప్రతిగా ఇంద్రుడు నన్ను నివాతకవచులను చంపి దేవతలకు మేలు చేకూర్చమన్నాడు. నాకు దేవదత్తము అనే శంఖాన్ని బహూకరించాడు.

నివాతకవచులు

మార్చు

నేను మాతలి రథం తోలగా రథం ఎక్కి నివాతకవచుల దగ్గరికి వెళ్ళాను. వారు సముద్రంలో ఉన్న నగరంలో ఉన్నారు. నేను శంఖాన్ని పూరించాను. అది విని రాక్షసులు నా మీదకు యుద్ధానికి వచ్చారు. వారికి నాకు మధ్య ఘోర యుద్ధం జరిగింది ఇంతలో దేవతల సారధి మాతలి స్పృహతప్పి పడిపోయాడు. ఇది చూసి రాక్షసులు మా మీద బాణప్రయోగం చేసారు. నేను స్వయంగా రధాన్ని నడుపుతూ వారితో యుద్ధం చేసాను. వారు తిమిర బాణాన్ని వేసారు. లోకమంతా చీకటి అయింది. అది చూసి మాతలి పెద్దగా అరిచాడు. ఎవరూ ఎవరికీ కనిపించలేదు. నేను దేవేంద్రుడు ఇచ్చిన సూర్యాస్త్రాన్ని ప్రయోగించాను. చీకటి తొలగి వెలుగు వచ్చింది. నేను నా గాండీవం నుండి అస్త్రప్రయోగం చేసాను. ఆబాణములకు రాక్షసులు అందరూ మరణించారు. ఆ విధంగా నేను రాక్షసులను జయించి దేవలోకం వెళుతూ మార్గ మధ్యంలో నేను హిరణ్య పురం చూసాను. అందులో పౌలోమ, కాలకేయులు అనేరాక్షసులు నివసిస్తున్నారు. వారు దేవతలచే చంపబడ్డారు అని నాకు మాతలి చెప్పాడు. నేను ఆ పురానికి వెళ్ళాను. నన్ను చూసి దేవేంద్రుడు అనుకుని రాక్షసులు నన్ను చుట్టు ముట్టారు. మా మధ్య ఘోరయుద్ధం జరిగింది. వారు నాతో మాయా యుద్ధం చేయసాగారు. వారు వారి పట్టణంతో సహా ఆకాశానికి ఎగిరి అక్కడి నుండి యుద్ధం చేయసాగారు. నేను శివుని స్మరించి పాశుపతాన్ని ప్రయోగించాను. ఆ అస్త్రానికి రాక్షసులంతా మరణించారు. ఆ తరువాత నేను దేవలోకానికి వచ్చి ఇంద్రునితో జరిగినది వివరించాను. ఇంద్రుడు నాతో " అర్జునా ! నీ కోసం నీ సోదరులు ఎదురు చూస్తున్నారు. నీ విజయ వార్తలు వినటానికి ఉవ్విళ్ళూరుతున్నారు " అని చెప్పి మాతలితో నన్ను ఇక్కడికి పంపించాడు " అని అర్జునుడు చెప్పాడు. అర్జునుని విజయగాధలు విని ధర్మరాజాదులు సంతోషించారు. ధర్మరాజు " అర్జునా! నీకు దేవతలు ఇచ్చిన అస్త్రాలు మాకు చూపించు " అన్నాడు. అర్జునుడు ప్రయోగించి చూపడానికి ఉద్యుక్తుడు కాగా అక్కడకు వచ్చిన నారదుడు " అర్జునా! అవి దివ్యాస్త్రాలు. ఆ అస్త్రాలు లక్ష్యం లేకుండా ప్రయోగించకూడదు. అలా ప్రయోగిస్తే అవి మూడు లోకాలను దహించగలవు " అని చెప్పాడు. నారదుని ఆదేశం మేరకు అర్జునుడు అస్త్ర ప్రయోగాన్ని ఆపి వేసాడు. తరువాత ధర్మరాజు తన సోదరులతో అక్కడ పది మాసాలు గడిపాడు. తరువాత దేవఋషి రోమశుడు దేవలోకం వెళ్ళాడు. తరువాత పాండవులు బదరీ వనంలోని సుబాహు పురం వచ్చి అక్కడి నుండి ఘతోత్కచుని తన పరివారంతో సహా పంపి వేసారు. తరువాత వారు హిమవత్పర్వతము లోని అనేక ప్రదేశములు దర్శిస్తూ ఒక సంవత్సరం గడిపారు.

నహుషుడు

మార్చు

ఒకరోజు భీముడు వేట నిమిత్తం హిమాలయ శిఖరం మీదకు వెళ్ళాడు. అక్కడ ఒక కొండచిలువ భీముని ఆహారంగా పట్టుకుంది. అది భీముని తన శరీరంతో చుట్టేసింది. భీముని బలం ఆ కొండచిలువ బలం ముందు చాలలేదు. భీముడు ఆశ్చర్యపడి " నా వంటి బలవంతుని ఇలా బంధించే శక్తి నీకు ఎలా వచ్చింది? నీవు వరప్రసాదివా? " అని అడిగాడు. ఆ కొండచిలువ భీమునితో ఇలా పలికింది " భీమసేనా ! నేను నహుషుడు అనే మహారాజును. ఒకప్పుడు దేవేంద్ర పదవిని అధిష్టించాను. కాని ఒక మునివరుని శాపం వలన సర్పరూపం దాల్చాను " అని దుఃఖించాడు. ఇంతలో భీమసేనుడు కనపడలేదని కలత పడి ధర్మరాజు అతడిని వెతుకుతూ వచ్చాడు. కొండచిలువ బంధించి ఉన్న భీముని చూసి " ఆహా ఏమి కాల మహిమ? అపరిమిత బలము కలిగిన భీముడు ఒక పాము చేతిలో బందీకృతుడు కావడమా? " అనుకున్నాడు. ధర్మరాజు కొండచిలువను చూసి " అయ్యా ! నీవు ఎవరు? రాక్షసుడివా దేవతవా చెప్పు. నేను పాండురాజు పుత్రుడను. నా పేరు ధర్మరాజు. నీవు నా తమ్ముని కేవలం ఆహారం కొరకు పట్టు కుంటే అతడిని విడిచిపెట్టు. నేను నీకు తగినంత మృగ మాంసం సమకూరుస్తాను " అన్నాడు. ధర్మజా! నేను నీ వంశంలో పుట్టిన వాడను. నా పేరు నహుషుడు. నేను ఇంద్రుడితో సమానుడను. ఐశ్వర్య గర్వంతో వివేకం లేక సప్త ఋషులతో పల్లకి మోయించుకుని వారిని అవమానించాను. ప్రత్యేకంగా అగస్త్యుడిని అవమానించిన కారణంగా అతడు నన్ను పాముగా పడి ఉండమని శపించాడు. ఆ శాపప్రభావంతో ఇక్కడ సర్పరూపంలో పడి ఉన్నాను. నా శాపవిమోచనం కొరకు నాకు పూర్వజన్మ స్మృతి ఉండేలా అనుగ్రహించమని వేడుకున్నాను. అగస్త్యుడు కరుణించి నా ప్రశ్నలకు ఎవరు సమాధానం చెప్తారో వారి వలన శాపవిముక్తి కలుగుతుందని చెప్పాడు. ఆ మహానుభావుని కొరకు నిరీక్షిస్తూ ఇలా పడి ఉన్నాను. నీకు శక్తి ఉంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పి నీ తమ్ముని విడిపించుకో.

నహుషుని ప్రశ్నలు

మార్చు

ధర్మరాజు " అయ్యా! నీవు అడిగే ప్రశ్నలకు విజ్ఞులైన బ్రాహ్మణులు మాత్రమే చెప్పగలరు నాకు సాధ్యమా? అయినా ప్రయత్నిస్తాను. అడుగు " అన్నాడు. కొండచిలువ రూపంలో ఉన్న నహుషుడు మొదటి ప్రశ్న ఇలా వేసాడు.ఏ గుణములు కలవాడు బ్రాహ్మణుడు? అతను తెలుసుకోదగిన విషయమేమిటి? " అని అడిగాడు. జవాబుగా ధర్మరాజు " సత్యము, క్షమ, దయ, శౌచము, తపము, దానము, శీలము మొదలైన గుణములు కలిగిన వాడు బ్రాహ్మణుడు. సుఖము దుఃఖముల ఎడల సమబుద్ధి కలిగి ఉండటమే అతను తెలుసుకోదగిన ఉత్తమ విద్య " అన్నాడు. నహుషుని రెండవ ప్రశ్న " శూద్రుడు పైన చెప్పిన గుణములు శూద్రునిలో కనిపిస్తే అతను బ్రాహ్మణుడు అని పిలువ బడతాడా? అలా అయితే కుల విభాగములు ఎందుకు? అధికులు హీనులు అనే వివేకం అపార్ధం కాదా? ధర్మరాజు " మహాత్మా! ఏకారణం చేతనైనా వర్ణసంకరం ఏర్పడినప్పుడు ఎవరు ఏ వర్ణమునకు చెందిన వారు అని తెలియజేయుటకు స్వాయంభువమనువు ఒక పరీక్ష పెట్టాడు. సత్యమూ మొదలగు గుణములు కలిగిన శూద్రుడు ఉత్తమమైన శూద్రుడు కాగలడు కాని బ్రాహ్మణుడు కాగలడా? అదే విధంగా సత్యమూ మొదలగు గుణములు లేని వాడు బ్రాహ్మణుడు కాగలడా? కనుక ఒక వ్యక్తి గుణములు నిర్ణయించుటకు అతని గుణశీలములు ముఖ్యము. గుణశీలములు కలవాడు ఇంకా ఉత్తముడు కాగలడు. గుణశీలములు లేనివాడు వాటిని కాపాడుకోలేడు. కనుక ధనాన్ని రక్షించటం కంటే గుణశీలములు కాపాడుకోవడం ఉత్తమం " అని జవాబిచ్చాడు. నహుషుని మూడవ ప్రశ్న " పరులకు అపకారం చేసి, అసత్యములు చెప్పి కూడా అహింసను కఠినంగా ఆచరించినవాడు ఉత్తమ గతులు పొందగలడు. అహింస అంత పవిత్రతను ఎందుకు పొందింది? " అని అడిగాడు. ధర్మరాజు " దానం చెయ్యడం, ఇతరులకు ఉపకారం చెయ్యడం, సత్యం పలకడం, అహింసను పాటించడం అనేవి నాలుగు ఉత్తమ ధర్మములు కాని వాటిలో అహింస విశేషమైంది. దేవతా జన్మ, జంతుజన్మ, మానవజన్మ అనునవి మానవునికి కలుగు జన్మలు. దానము మొదలగు కర్మలు ఆచరిస్తూ అహింసా వ్రతం ఆచరించువాడు దైవత్వాన్ని పొందుతాడు. సదా హింస చేయువాడు జంతువుగా పుడతాడు. అందుకని అహింస పరమ ధర్మంగా పరిగణించ బడుతుంది " అని జవాబిచ్చాడు. ఈ సమాధానం విని నహుషుడు భీముని వదిలాడు. తన అజగర రూపం వదిలి దివ్యమైన మానుషరూపం పొందాడు. తరువాత ధర్మరాజు భీముని తీసుకుని తమ కుటీరానికి తీసుకువెళ్ళాడు.

శ్రీకృష్ణ సత్యభామల విజయం

మార్చు
దస్త్రం:Krishna and Satybhama meet Pandavas in forest.jpg
శ్రీకృష్ణ సత్యభామల విజయం

శరత్కాలంలో దక్షిణదిశగా అగస్త్య నక్షత్రం కనిపించింది. శరదృతువులో పాండవులు సరస్వతీ నదిలో స్నానం చేస్తూ కొంత కాలం గడిపారు. తరువాత కామ్యకవనం చేరారు. కామ్యకవనానికి శ్రీకృష్ణుడు పాండవులను చూడటానికి సత్యభామా సమేతుడై వచ్చాడు. ఆ సమయంలో చిరంజీవి అయిన మార్కండేయ మహర్షి కూడా వారిని చూడటానికి వస్తున్నట్లు వర్తమానం అందింది. ధర్మరాజు శ్రీకృష్ణుని సాదరంగా ఆహ్వానించి సత్కరించాడు. శ్రీకృష్ణుడు ధర్మరాజుని చూసి " ధర్మజా ! కౌరవులు నిన్నూ, నీ సోదరులను, భార్యనూ ఎన్నో బాధలకు గురిచేసారు. ధర్మం నీ పక్షంలో ఉన్నది. నీకు విజయం తధ్యం. అంధక, వృష్ఠి, బోజక మొదలగు భూపతులు నీ పక్షాన ఉన్నారు. ఈ సామ్రాజ్యానికి నీవే చక్రవర్తివి కాగలవు చింతింపకుము " అని అనునయంగా చెప్పాడు. ధర్మరాజు " దేవా ! అరణ్యవాస కాలం చాలా వరకు గడచి పోయింది. అలాగే అజ్ఞాత వాసం పూర్తి చేసి మా ధర్మం తప్పకుండా మా రాజ్యాన్ని మేము జయిస్తాము. నీ దయ మా మీద ఉంటే మాకు చాలు. భారం అంతా నీ మీద మోపుతున్నాను " అన్నాడు. శ్రీకృష్ణుడు అక్కడే ఉన్న ద్రౌపదిని చూసి " అమ్మా! ద్రౌపదీ నీ కుమారులు యాదవరాజకుమారులతో కలసి సంతోషంగా ఉన్నారు. అస్త్రశస్త్ర విద్యలు అభ్యసిస్తున్నారు. నా చెల్లెలు సుభద్ర తన కుమారుని కంటే నీ కుమారుల మీద ఎక్కువ ప్రేమ చూపిస్తుంది. వారిని గురించి నీవు చింత పడవద్దు " అని ఓదార్చాడు.

మార్కండేయ మహర్షి రాక

మార్చు

ఒకరోజు మార్కండేయ మహర్షి పాండవుల దగ్గరకు వచ్చాడు. ధర్మరాజు శ్రీకృష్ణాదులతో మహర్షికి అతిథి సత్కారాలు చేసాడు. ధర్మరాజు మార్కండేయ మహర్షితో " ఓ మహర్షీ మేము ఎప్పుడూ ధర్మం తప్పి చరించ లేదు. మేము ఈ విధంగా బాధలు పడుతున్నాము. దార్తరాష్ట్రులు అధర్మ వర్తనులు అయినా పాపకార్యాలు చేస్తూనే సకల సౌఖ్యాలు అనుభవిస్తున్నారు. ఈ విపరీతానికి కారణం ఏమిటి? మనుషులు తాము చేసిన కర్మల ఫలాన్ని ఈ లోకంలోనే అనుభవిస్తారా? లేక ఈ లోకం లోను పరలోకంలోను అనుభవిస్తారా? ఈ విశ్వకర్త అయిన ఈశ్వరుని చూడని వాడు కర్మఫలం అనుభవించడా? ఈ దేహంతోనే కర్మలు వెడలి పోతాయా ? నాకు ఇవన్నీ వివరంగా తెలుపగలరా? " అని అడిగాడు.

కాలధర్మాలు

మార్చు

మార్కండేయ మహర్షి ఈ విధంగా చెప్పాడు. " ధర్మజా! తొలుత ప్రధమ కల్పంలో అత్యంత నిర్మలమైన శరీరాలను సృష్టించాడు. ఆ ప్రకారం పుట్టిన మానవులు మహా సత్వగుణ సంపన్నులు, సత్యం పలికే వారు, సత్యవ్రతులై ఉన్నారు. జ్ఞాన సముపార్జన చేసారు, స్వేచ్ఛగా జీవించారు. దేవతల మార్గంలో పయనించారు. అధిక శ్రమ లేకుండా ఎక్కువ ఫలితాన్ని పొందారు. ధర్మం తప్పకుండా చరించారు. వారికి మత్సరం వంటి దుర్గుణాలు లేవు. అధిక సంతానవంతులై వేల సంవత్సరాలు జీవించారు. కాలక్రమేణా వారిలో కామము, లోభము, మదము, మాత్సర్యము లాంటి దుర్గుణాలు ప్రవేశించాయి. దేవతలు వారిని వదిలి వేసారు. మానవులలో బలం క్షీణించింది. సంపదలు తొలగి పోయాయి దరిద్రులు అయ్యారు. చేసిన కర్మలకు సత్ఫలితాలు రావడం తగ్గింది. రోగగ్రస్తులు అవడం మొదలైంది. మానవులకు దేవుని మీద నమ్మకం సన్నగిల్లి నాస్తికులు అయ్యారు. ఒకరంటే ఒకరికి పడటం లేదు. పాపాలు చేస్తున్నారు. నరకానికి పోతున్నారు. జంతు జన్మలు ఎత్తుతున్నారు. ఈ సంసారంలో తిరుగుతూ జనన మరణ చక్రంలో పడి సతమౌతున్నారు.

పాపుణ్యాలు ఫలితాలు

మార్చు

ఈ విధంగా మానవులు చేసే పుణ్యం పాపం మరణానంతరం కూడా నశించవు. వారి పాపపుణ్యములు నశించక వాసనలుగా వారి వెంట వెళతాయి. కొందరు వారు చేసిన పాపపుణ్యములకు ఈ జన్మలోనే ఫలితం అనుభవిస్తారు. కొందరు స్వర్గం లోనూ, నరకం లోనూ అనుభవిస్తారు. కొందరికి ఈ లోకంలోనూ పరలోకంలోనూ సుఖం ఉండదు. కొందరు ఎక్కువ ధనం సంపాదిస్తారు. కాని మోహం లోభం కలిగి స్వసుఖాలకు మాత్రమే ధనం ఉపయోగిస్తారు. ఇంద్రియ సుఖాలకు మాత్రమే వెచ్చిస్తారు. పుణ్యకార్యాలు చెయ్యరు. ధర్మజా! నీవు ఎక్కువ పుణ్యకార్యాలు చేసావు. వేదాధ్యయనం, తీర్ధయాత్రలు చెయ్యడం లాంటి పుణ్యకార్యాలనేకం చేసావు. ధర్మవర్తివి కనుక ఈ లోకంలో కష్టాలు అనుభవించినా పరలోక సుఖం లభిస్తుంది. ఎల్లవేళలా ధర్మకార్యాలు చేస్తూ, ధర్మాచరణచేస్తూ, ధర్మబద్ధంగా అర్జిస్తూ, ధర్మబద్ధంగా వివాహం చేసుకుని సంతానం పొందిన వారు ఇహలోక, పరలోక సుఖాలను అనుభవిస్తారు. ఎల్లప్పుడూ అసత్య వచనం పలుకుతూ ఇంద్రియ లోలులై చరిస్తూ, శుచి శుభ్రం లేకుండా, నాస్తికులై అపరాధాలు చేసే వారు ఇహలోకంలోనూ పరలోకంలోనూ దుఃఖం అనుభవిస్తారు. ధర్మజా ! మీరు దేవతాంశలతో జన్మించారు. మీరు ధర్మం తప్పకుండా చరించి శత్రువులను జయిస్తారు. భూభారాన్ని తగ్గిస్తారు. ఎన్నో యజ్ఞ యాగాదులు చేసి దేవత్వాన్ని పొందుతారు " అని మార్కండేయమహర్షి చెప్పాడు.

బ్రాహ్మణ ప్రభావం

మార్చు

ధర్మరాజు మార్కండేయుని బ్రాహ్మణ ప్రభావం గురించి చెప్పమని కోరాడు. మహర్షి " ధర్మనందనా! పూర్వం హైహవ వంశోద్భౌడైన దుంధుమారుడు అనే రాజు వేట నిమిత్తం అడవిలో తిరుగుతూ ఒకచోట జింక చర్మాన్ని ఉత్తరీయంగా కట్టుకున్న బ్రాహ్మణుని చూసి అది మృగమనుకుని బాణంతో కొట్టాడు. తరువాత తాను చంపినది బ్రాహ్మణుడిని అని తెలుసుకుని దుఃఖించాడు. వంశ పెద్దలను వెంటపెట్టుకుని తార్క్షుడు అనే ముని దగ్గరకు వెళ్ళి పరిహారం చెప్పమని అడిగాడు. ఆ మహాముని చిరునవ్వుతో తన కుమారుని పిలిచి " ఇతడేనా మీ రాజు చంపిన బ్రాహ్మణుడు " అని అడిగాడు. హైహవులు ఆశ్చర్యపడి " మహాత్మా! ఈ ముని కుమారుడు మా మహారాజు చేతిలో చనిపోయాడు కదా మరలా ఎలా బ్రతికాడు? " అని అడిగారు. అందుకు ఆ ముని " మేము కొన్ని నియమాలు పాటిస్తాము. అన్నీ పనులూ సకాలంలో చేస్తాము. నియమిత ఆహారం తీసుకుంటాము. శాంతితో జీవిస్తాము. సత్యాన్ని మాత్రమే పలుకుతాము. బ్రహ్మచర్యం పాటిస్తాము. అతిధులను సత్కరిస్తాము . అందువలన మాకు మృత్యు భయం లేదు, రోగాలు రావు. కనుక మీరు నిశ్చింతగా వెళ్ళండి " అన్నాడు. వారు మునికి నమస్కరించి వెళ్ళారు. బ్రాహ్మణ ప్రభావం అంతటి మహోన్నతమైంది " అన్నాడు.

బ్రాహ్మణ క్షత్రియ స్వరూపములు

మార్చు

ఆ తరువాత మార్కండేయుడు " ధర్మజా! నీకు బ్రాహణ క్షత్రియ స్వరూపాలను గురించి చెప్తాను విను అని చెప్ప సాగాడు. పూర్వం అత్రి మహర్షి తపస్సు చేసు కోవడానికి అడవికి పోతూ భార్యను పిలిచి " నేను తపస్సు చేసుకోవడానికి వెళుతున్నాను. నీవు నీ పుత్రుల వద్ద ఉంటావా? నాతో వస్తావా? " అని అడిగాడు. అందుకు ఆమె " నాధా! పుత్రుల పోషణకు తగిన ఏర్పాటు చేయకుండా మీరు వెళ్ళడం ధర్మం కాదు. కనుక మీరు వైన్యమహారాజును అడిగి కొంత ధనం తీసుకు రండి " అన్నది. అది విని అత్రి వైన్యమహారాజు దగ్గరికి వెళ్ళి దగ్గరకు వెళ్ళాడు. ఆసమయంలో వైన్యమహారాజు అశ్వమేధయాగం చేసి బ్రాహ్మణులకు దానధర్మాలు చేస్తున్నాడు. అత్రి ఆయన దగ్గరకు వెళ్ళి " రాజా ! నీవు బ్రహ్మదేవునితో సమానుడవు. ఇంద్రునితో సమానుడవు. నీవు సమస్త జనులకు ఈశ్వరుడవు. నీకు అన్ని ధర్మములు తెలియును. నీతో సమానమైన రాజు ఈ భూమి మీద లేడు. అందరూ ఋషులు నిన్ను పొగుడుతారు " అన్నాడు. అక్కడే ఉన్న గౌతమ మహర్షి ఇది విని ఆగ్రహించి " కేవలం ధనం కోసం మానవమాతృడైన రాజును ఇంద్రుడు, బ్రహ్మదేవుడు, ఈశ్వరుడు అని పొగడటం తగునా? " అని అన్నాడు. అత్రి " ఏది యుక్తము ఏది యుక్తము కాదు అని తెలియకుండా మాట్లాడ వద్దు. నీతివంతుడై, పరాక్రమ వంతుడై, నిర్మలుడై సమస్త లోకాన్ని పాలించే రాజు ధర్మానికి మూలం అటువంటి రాజును ప్రశంసించడం నాకు తగదా? " అని బదులు చెప్పాడు. గౌతముడు " కేశములు తెల్లబడినంత మాత్రాన నీవు జ్ఞానివి కాదు. సభలో జ్ఞానవృద్ధులకు మాత్రమే విలువ కదా " అన్నాడు. అత్రి గౌతముల వాదన విన్న కశ్యపుడు అనే మహాముని విని " అయ్యా ! ఈ వివాదం మనం తీర్చలేము. సనత్కుమారుడు అనే మహామునిని అడుగుదాము " అన్నాడు.

సనత్కుమారుని తీర్పు

మార్చు

తరువాత అందరూ సనత్కుమారుని దగ్గరకు పోయి అత్రి గౌతముల వాదన వివరించారు. సనత్కుమారుడు " అత్రి నిజమే చెప్పాడు. ఈ భూమి సమస్తము తన భుజస్కందాల మీద మోసే సుక్షత్రియుడు అందరిని కాపాడే ప్రభువు. కనుక శత్రువులను సంహరించి అందరిని కాపాడే రాజే ఈశ్వరుడు, బ్రహ్మ. రాజు జనులందరికి పూజ్యుడు. అతని రక్షణలో సజ్జనులు, మునులు తమ తమ విధులు చక్కగా నెరవేర్చగలరు. అందరూ అతని ఆజ్ఞాబద్ధులే. రాజే సామ్రాట్టు, విరాట్టు అదృష్టాన్ని జయించిన వాడు. సత్యసంధుడు, ధర్మాత్ముడు, సక్రమంగా పాలించేవాడు అని వేదాలలో వర్ణించారు. పూర్వం అధర్మమునకు భయపడి బ్రాహ్మణులు తమ తేజస్సును రాజులయందు నిక్షేపించారు. అప్పటి నుండి బ్రాహ్మణ్యం వలన క్షాత్రం ప్రవర్తిసుంటుంది. కనుక బ్రాహ్మణ్యము క్షాత్రము ఒక దానిని ఒకటి ఆశ్రయించుకుని ఉన్నాయి. సూర్యుడు చీకటిని తరిమినట్లు క్షత్రియుడు బ్రాహ్మణులను సేవించి తేజోవంతుడై అధర్మాన్ని అణచి ధర్మాన్ని నిలబెడతాడు కనుక క్షత్రియుడు అధికం అని చెప్పవచ్చు " అన్నాడు. అప్పుడు వైన్యమహారాజు అత్రికి కావలసినంత ధనం ఇచ్చాడు.

సరస్వతీ గీత

మార్చు
దస్త్రం:Tarkya is guided by Sarswathi.jpg
తార్క్ష్యునికి బోధిస్తున్న సరస్వతీ దేవి

ఆ తరువాత మార్కండేయ మహర్షి " సరస్వతి గీత గురించి చెప్పడం ప్రారంభించాడు. పూర్వం తార్క్ష్యుడు అనే మహాముని సరస్వతీ దేవిని ఆరాధించాడు. సరస్వతీ దేవి ప్రత్యక్షంకాగానే తార్క్ష్యుడు ఆమెను కొన్ని ప్రశ్నలు అడిగాడు " అమ్మా! మానవుడు ఆచరించ వలసిన ధర్మం ఏది? మానవుడు ఏవిధంగా పుణ్యాత్ముడై పుణ్య లోకాలకు వెళతాడు? " అని అడిగాడు. సరస్వతీదేవి ఈ విధంగా జవాబిచ్చింది. " ఎన్నో వేదములు చదివిన బ్రాహ్మణుడు ఎన్నో యజ్ఞాలు చేసి పుణ్యకార్యాలు చేసి స్వర్గానికి వెళతాడు. మంచి పాలు ఇచ్చే ఆవును దానంగా ఇచ్చే బ్రాహ్మణుడు కూడా స్వర్గానికి పోతాడు. ఆవు శరీరం పై ఎన్ని రోమాలు ఉంటాయో అన్ని సంవత్సరాలు స్వర్గంలో ఉంటాడు. మంచి కోడె ఎద్దును దానం చేసిన వాడికి పది ఆవులను దానము చేసిన పుణ్యం లభిస్తుంది. వస్త్రదానం చేసిన వాడు చంద్రలోకం పోతాడు. బంగారం దానం చేసిన వాడు స్వర్గలోకం చేరతాడు. ఏడు సంవత్సరాలు అగ్నిదేవుని నేతితో ప్రీతిగా హోమం చేసిన వాడు తన పదునాలుగు తరాల పితృ దేవతలతో స్వర్గానికి పోతాడు. ఎల్లప్పుడూ శుచిగా ఉంటూ నిరంతరం అగ్ని హోత్రం చేసిన వాడు గోలోకం చేరతాడు. ఎందుకంటే అగ్నిహోత్రం నా స్వరూపం. సకల యజ్ఞ సంభారాలు నాకు సంబంధించినవే. నేను అగ్నిహోత్రం ముఖంనుండి పుట్టాను. నేను విద్వాంసులందరి సందేహం తీర్చగలను. ఎల్లప్పుడూ వేదం చదువుతూ దాన ధర్మములు చేయు తపోధనులు శోకము అనేది తెలియకుండా ఎక్కడ నివసిస్తారో నేను అక్కడ నివసిస్తాను. యజ్ఞ యాగాదులు చేసిన పుణ్యాత్ములు మరణానంతరం నా లోకానికి చేరగలరు " అని సరస్వతి చెప్పింది " అని ధర్మరాజుకు చెప్పాడు.

వైవస్వత మనువు

మార్చు

ధర్మరాజు మార్కండేయుని " వైవసత్వ మనువు ఏ విధంగా ప్రభావితుడైయ్యాడు " అని అడిగాడు. మార్కండేయుడు " ధర్మజా! చాక్షుస మన్వంతరంలో వైవసత్వుడు పది వేల సంవత్సరాలు తపస్సు చేసాడు. ఒకరోజు వైవసత్వుడు ఒక జలాశయంలో స్నానం చేసి ఒడ్డున ఉండగా ఒక చేప తీరానికి దగ్గరగా వచ్చి " అయ్యా ! ఈ జలాశయంలో నా కంటే బలవత్తరమైన జలచరములు ఉన్నాయి. నన్ను వేరే చోటికి తీసుకు పో. నీకు నేను ఉపకారం చేస్తాను " అని అడిగింది. వైవసత్వుడు ఆ చేపను తీసుకు వెళ్ళి ఒక బావిలో విడిచిపెట్టాడు. ఆ చేప పెద్దది అయింది " అయ్యా! నాకు ఈ బావి చాలడం లేదు వేరే ప్రదేశానికి తీసుకు వెళ్ళు అని అడిగింది.అది విని వైవసత్వుడు ఆచేపను మరింత పెద్ద బావిలో విడిచిపెట్టాడు. కొన్నాళ్ళకు ఆ బావి కూడా చాలలేదు. ఆ చేప కోరిక మేరకు దానిని ఒక మడుగులో వదిలి వేసాడు. కొద్ది రోజులకు ఆ మడుగు కూడా చాలకపోవడంతో దానిని సముద్రంలో వదిలి వేసాడు. ఆ చేప వైవసత్వుని చూసి " అయ్యా! కొద్ది రోజులలో ప్రళయం రాబోతుంది. అన్ని సముద్రాలు కలవబోతున్నాయి . దీనిని మన్వంతర సంధి అంటారు. నీవు ఒక ఓడను నిర్మించు అందులో అన్ని రకాల ధాన్యాలు, ఔషధాలు నింపు. సప్తఋషులతో కలసి ఆ ఓడ ఎక్కి నన్ను తలచుకో. నేను నీకు మేలు చేస్తాను " అని చెప్పింది. వైవసత్వుడు అలాగే ఒక ఓడను నిర్మించి ధాన్యాలతోను విత్తనాలతోనూ నింపి సప్తఋషులతో సముద్రాన్ని చేరాడు. ఆ చేపను మనసులో తలిచాడు. ఇంతలో ఆ చేప వచ్చింది. ఆచేప తలపై ఒక కొమ్ము ఉంది. ఆ ఓడ తాటిని తన కొమ్ముకు తగిలించుకుని సముద్ర మధ్యానికి తీసుకు వెళ్ళింది. ఆ తరువాత కుంభవృష్టి కురవడం మొదలై సముద్రాలన్నీ ఏకం అయ్యాయి. భూమి జలమయం అయ్యింది. ఆ చేప అనేక వేల సంవత్సరాలు ఆ ఓడను లాగుతూ ఉంది. ప్రళయం అంతరించింది. ఆ చేప వైవసత్వుని సప్తఋషులను చూసి "అయ్యా! ప్రళయ కాలంలో నేను మిమ్మల్ని కాపాడాను. ఈ వైవసత్వుడు మరలా సృష్టి కొనసాగించగలడు " అని చెప్పింది " అని ధర్మరాజుతో చెప్పాడు.

కల్పాంతం

మార్చు

ధర్మరాజు మార్కండేయుని " మహర్షీ ! నీవు చిరంజీవివి ఎన్నో ప్రళయాలు చూసావు. ఈ చరాచర జీవరాశుల సృష్టి స్థితి లయలను ఎన్నో సార్లు చూసావు. ఈ లోకాలు ప్రళయకాలంలో ఎలా ఉంటాయి " అని అడిగాడు. మార్కండేయుడు " ధర్మజా! నూవు అడిగిన ఈ ప్రశ్నకు సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపమని చెప్ప బడుతున్న శ్రీకృష్ణుని అనుమతితో సమాధానం చెబుతున్నాను. సావధానంగా వినుము " అని చెప్పసాగాడు. " కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అని నాలుగు యుగములు. ఇవి పన్నెండు వేల దివ్య సంవత్సరములు. ఈ నాలుగు యుగములు క లసి ఒక మహా యుగం అని పిలువబడతాయి. ఇలాంటి మహా యుగాలు వెయ్యి కలిస్తే బ్రహ్మదేవునికి ఒక పగలు ఔతుంది. అలాంటి బ్రహ్మదివసము ఆఖరున నూరు సంవత్సరాల వరకు తీవ్ర అనావృష్టి ఏర్పడుతుంది. సూర్యుడు తీవ్రంగా ఉంటాడు. విపరీతమైన గాలులు వీస్తాయి. అంతలోనే మేఘాలు కమ్ముకుంటాయి. ఉరుములు మెరుపులతో విపరీతంగా వర్షం కురుస్తుంది. నదులు సముద్రాలు నిండి పోతాయి. అనావృష్టి అంతరించి అతి వృష్టి వస్తుంది. భూభాగమంతా జలమయం ఔతుంది. గాఢాంధకారం భూమండల మంతా వ్యాపిస్తుంది. ఇంతలో బ్రహ్మ ఆజ్ఞ మేరకు ఆ మేఘాలను విపరీతమైన గాలి వీచి చెదరగొడతాయి. బ్రహ్మదేవుడు అప్పుడు ఆ ఘోరమైన నీటి మధ్య పద్మంపై నిద్రిస్తాడు. ఈ విధంగా కల్పాంతం ఔతుంది. ఇలాంటి కల్పాలు ఎన్నో గడిచాయి. ఇక ముందు ఎన్నో రానున్నాయి.

వటపత్రశాయి

మార్చు
దస్త్రం:Bala Mukunda.jpg
మర్రి ఆకు మీద చిన్ని బాలుని వలె పడుకుని ఉన్న నీల మేఘశ్యాముడైన శ్రీ మహావిష్ణువు

ధర్మజా! ఈ కల్పాంతంలో నేను దిక్కుతోచక తిరిగాను. జలప్రళయంలో పెద్ద మర్రి చెట్టు కనపడింది. ఆ మర్రి ఆకు మీద నీల మేఘశ్యాముడైన శ్రీ మహావిష్ణువు చిన్ని బాలుని వలె పడుకుని ఉన్నాడు. ఈ మహాప్రళయంలో ఈ చిన్ని బాలుడు ఎలా ఉన్నాడా అని ఆశ్చర్య పోయాను. నేను ఆ బాలుని దగ్గరగా పోయాను. ఆ బాలుడు నన్ను చూసి నవ్వుతూ " మహానుభావా ! నీకు విశ్రాంతి లేక అలసి పోయి ఉన్నావు. నా దేహంలో ప్రవేశించి కొంచెం విశ్రాంతి తీసుకో " అంటూ తన నోరు తెరిచాడు. నేను ఆ నోట్లోకి బలవంతంగా నెట్టబడ్డాను. ఆ బాలుని నోట్లో గంగ లాంటి మహానదులూ, మేరు పర్వతం లాంటి పర్వతాలు, సముద్రాలు, నగరాలు, జనపదాలు, ప్రజలు, పశుపక్ష్యాదులూ, సువిశాల భాగాలూ సూర్య చంద్రులూ, నక్షత్ర సముదాయాలు, అనంతాకాశం, ఇంద్రాది దేవతలు, యక్ష, రాక్షస, కిన్నెర, కింపురుషులు, విద్యాధరులు, సమస్త దేవతా సమూహములు, సమస్త జగములు అన్నీ నేను ఆ చిన్ని బాలుని ఉదరంలో చూసాను. అక్కడ నేను నూరు సంవత్సరములు తిరిగాను. తరువాత నాకు నాకు భయం వేసింది. అప్పుడు ఆ బాలుడు వదిలిన గాలికి నేను బయటకు విసిరి వేయబడ్డాను. తిరిగి మర్రి చెట్టు ఆకు పై పవళింంచి ఉన్న ఆ బాలకుని చూసాను. ఆ బాలుడు నన్ను " మహాత్మా! నా ఉదరములో విశ్రాంతి తీసుకున్నావా? " అని అడిగాడు. నేను ఆ బాలునికి నమస్కరించి దేవా ! నీ ప్రభావం వలన సమస్త లోకములు నీ ఉదరంలో చూసాను. నీ మాయ అర్ధం కావడంలేదు. నీవా చిన్న బాలుడివి. నీ ఉదరంలో సమస్త లోకాలున్నాయి. ఈ జల ప్రళయం ఏమిటి ? దేవా ! నీవు నా భ్రాంతిని తొలగింపుము " అని అడిగాను.

నారాయణ తత్వం
మార్చు

మార్కండేయునికి నారాయణుడు తనను గురించి వివరించ సాగాడు. " మహాత్మా ! జలమును నారములంటారు. అందుకే నన్ను నారాయణుడంటారు. ఈ లోకమును నేనే సృష్టిస్తాను. నేనే పోషిస్తాను. నేనే నాలో లయం చేసుకుంటాను. బ్రహ్మ, ఇంద్రుడు, కుబేరుడు తదితర దేవతలందరూ నా అంశలే. నాకు భూమి పాదం, అగ్ని ముఖం, సూర్యచంద్రులు నేత్రాలు, ఆకాశం శిరస్సు. ఈ అద్భుతమైన ఆకారంలో నేను భాసిల్లుతాను. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు యజ్ఞయాగాదులతో నన్ను ఆరాధిస్తారు. ప్రళయకాలంలో ఈ భూమిని యజ్ఞవరాహావతారంతో ఉద్ధరించింది నేనే, ఈ భూమండలాన్ని భరిస్తున్నది నేనే. అగ్ని రూపంలో సముద్ర జలాలను త్రాగి వర్ష రూపంలో విడిచి పెడతాను. సృష్టి ఆరంభంలో నేను నా ముఖం నుండి, భుజముల నుండి, తొడలనుండి, పాదముల నుండి నాలుగు వర్ణాలను సృజిస్తాను. ప్రళయకాలంలో వీటన్నిటినీ నాలో లయం చేసుకుంటాను. అహంకారం విడిచి క్రోధం లేక ఎల్లప్పుడూ సత్యం పలుకుతూ కోరికలను జయించి అసూయకు లోబడక ఆత్మ జ్ఞానం పొందిన వారు అయిన ఋషులు ఎల్లప్పుడూ నన్ను ఆరాధిస్తుంటారు. ఈ జగత్తులో ఉండే గ్రహములు, గాలి, వర్షము అన్నీ నేనే. సప్త సముద్రాలను నేను పడకగా అమర్చుకుని పడుకుంటాను. మహర్షీ ! సత్యము పలకడమూ, తపము, అహింస, జ్ఞానము మొదలగు సాత్విక గుణములు నా స్వరూపాలు. ఆలాగే కోరికలూ, కోపం, ద్వేషం, అసూయ, తామసము, అజ్ఞానం అన్నీ నేనే. ఈ జగత్తులో కనిపించునదీ, కనిపించనిదీ అంతా నేనే. ధర్మానికి హాని కలిగి అధర్మం పెరిగినప్పుడు కృూరాత్ములు, రాక్షస ప్రవృత్తి కలిగిన వారు విజృంభించి ధర్మాత్ములు, సజ్జనులు హీనత పొందినప్పుడు నేను వారి ఇండ్లలో జన్మించి ధర్మమును నిలుపుతాను. నేను కృత, త్రేతా, ద్వాపర, కలి యుగాలలో వరుసగా శ్వేత, రక్త, నీల, పసపు వర్ణాలతో చరిస్తూ ధర్మ స్థాపన చేస్తాను. ఆ కాలచక్రాన్ని నేను అవిశ్రాంతంగా నడుపుతాను. లయ కాలమందు నేను కాల యముడినై నాలో లీనం చేసుకుంటాను. ముల్లోకాలను సృష్టించు బ్రహ్మదేవుడు నాలో సగభాగమే . నా పేరు నారాయణుడు. నేను శంఖ చక్ర గదా ధారినై బాలుని రూపంలో ప్రళయకాల మందు వేయి సంవత్సరాలు యోగ నిద్రలో ఉంటాను. ఈ కల్పాంతం చూసి నీవు భయపడతావని నా ఉదరంలో ఉంచాను. ఇక నీ ఇచ్చ వచ్చిన చోటికి వెళ్ళ వచ్చు . ఇక బ్రహ్మదేవుడు మేలుకుని ఈ లోకాలను సృష్టిస్తాడు " అని చెప్పి బాలకుడు మాయం అయ్యాడు. ఇది నేను కనులార చూసినాను. ఆ బాలుడే శ్రీకృష్ణుని రూపంలో మీకు సఖుడై ఉన్నాడు. ఈ నాడు నన్ను దయతలచి నాకు దర్శనం ఇచ్చాడు. ఈ మహానుభావుని దర్శనం వలన నేను గతస్మృతులు గుర్తుకు వచ్చి మీకు చెప్పగలిగాను " మార్కండేయుడు ధర్మారాజుకు తనకు నారాయణుడు వివరించిన విషయాలు చెప్పాడు.

కలియుగ ధర్మం

మార్చు

ధర్మరాజు కలియుగంలో కలిగే ధర్మహాని గురించి వివరించమని మార్కండేయ మహర్షిని అడిగాడు. మార్కండేయ మహర్షి " ధర్మనందనా ! కృతయుగంలో ధర్మం నాలుగు పాదాలతో నడుస్తుంది, త్రేతాయుగంలో మూడుపాదాలతో నడుస్తుంది, ద్వాపరయుగంలో రెండు పాదాలతో నడుస్తుంది. కలియుగంలో ఒక్క పాదంతో నడుస్తుంది. ధర్మం క్షీణిస్తుంది. అధర్మం రాజ్యమేలుతుంది. నరులు సత్యం చెప్పరు. మానవుల ఆయుష్షు క్షీణిస్తుంది, విద్యలు క్షీణిస్తాయి. విద్యా హీనత వలన మోహం కలుగుతుంది. మోహము వలన లోభము, లోభము వలన కామము, కామము వలన క్రోధం, క్రోధం వలన వైరం ఇలా ఒక దాని వెంట ఒకటి వస్తుంది. వైరం వలన వర్ణ భేధం కలుగుతుంది. వర్ణ భేదము వలన వర్ణసంకరం జరుగుతుంది. హింస ప్రబలుతుంది. బ్రాహ్మణుడు తన ధర్మాలైన జపము, తపము, నియమము, స్వాధ్యాయము విడుస్తారు. శూద్రులు తపస్సు చేస్తారు. జనపదాలు కౄరమృగాలతో నిండి పోతాయి. అరాచకం ప్రబలుతుంది. రాజులు దుష్టులౌతారు. రాజ్యాధికారం నశిస్తుంది. క్షత్రియులు తమ ధర్మాలైన క్షాత్రము, తేజము, శౌర్యము విడిచి పెట్టి సేవకా వృత్తి అవలంబిస్తారు. పంటలు సరిగా పండవు. చెట్లకు, కాయలు, పూలు, పండ్లు సరిగా కాయవు. బ్రాహ్మణుడు తన ధర్మాన్ని వదిలి వ్యాపారం, వ్యవసాయం చేస్తాడు. నాస్తికులు ప్రబల మౌతారు. దేహ సంరక్షణయే ప్రధానము అనుకుంటారు. పాపం, పుణ్యమూ అనే మాటలకు విలువ ఉండదు. వానలు సకాలంలో కురవవు. విత్తనాలు తాలుగా ఉంటాయి. కొనుగోలు అమ్మకాలు మోసపూరితమౌతాయి. తాకట్టుఆ పెట్టిన ఆభరణాలు అపహరిస్తారు. సాధు చరితులు, సజ్జనులు రోగపీడితులౌతారు. అధర్మ వర్తనులు దీర్ఘాయువులై భోగభాగ్యాలు అనుభవిస్తారు. పనికిరాని పంటలు ఎక్కువ ఔతాయి. మానవులలో వివాహేతర సంబంధాలు ఎక్కువ ఔతాయి. పితృ కార్యాలలో అర్పించిన పిండములు ఒకరివి మరొకరు తింటారు. దైవకార్యాలు పితృకార్యాలు కాలానుగుణంగా జరగవు. బ్రాహ్మణులు హేతువాదులౌతారు. వేదాలను నిందిస్తూ పూజలు వ్రతములు విడనాడి దుర్మార్గులు ఔతారు. బంధువులను, దీనులను, దుర్భలులను, దీనులను మోసగించి వారి ఆస్తులను అపహరిస్తారు. తల్లి తండ్రులను, కన్నపిల్లలను చంపు వారిని, విచ్చలవిడిగా ప్రవర్తించు వారిని ప్రజలు పూజిస్తారు. వారి ధనానికి ఆశపడి బ్రాహ్మణులు వారిని ఆశ్రయిస్తారు. ప్రజలను రక్షించి భూమి పాలించ వలసిన ప్రభువు వారి ధనాన్ని దోచుకుంటాడు. స్త్రీలను, ధనాన్ని, భూములను హరిస్తారు. రాజులు వారిలో వారు కలహించి యుద్ధాలు చేసుకుంటారు. అందువలన ప్రజా క్షయం ఔతుంది. కొడుకులు తండ్రులను అవమానిస్తారు. భార్యలు భర్తలను అవమానిస్తారు. భార్యాభర్తలు పరస్పరం కలహిస్తారు. ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు ప్రవర్తిస్తారు. దేవకార్యం, పితృకార్యం నడవవు. వేదాధ్యయనం అంతరిస్తుంది. ఈ భూమి మొత్తం దుర్జనులతో నిండి పోతుంది. పదహారు ఏండ్లకే నూరేళ్ళు నిండుతాయి. ఏడెనిమిదేళ్ళకే స్త్రీలు సంతానవతులౌతారు. దానం చేసే వాళ్ళు ఉండరు. ప్రజలు ఒకరిని ఒకరు దోచుకుంటారు. అన్ని తెలిసిన జ్ఞానులు సైతం అధర్మంగా ప్రవర్తిస్తారు. అన్నాన్ని ధనం కోసం అమ్ముకుంటారు. బ్రాహ్మణులు వేదాన్ని అమ్ముకుంటారు. స్త్రీలు మానాన్ని ధనానికి అమ్ముకుంటారు. శూద్రులు అత్యంత బలవంతులై ఇతరులను సంహరిస్తారు. బ్రాహ్మణులు దిక్కు తోచక నాలుగు దిక్కులకు పారిపోతారు. దోపిడీదారులు, దొంగలూ ప్రజల ధన, ప్రాణాలను దోచుకుంటారు. ప్రజలు అడవులలో తలదాచుకుంటారు. శూద్రులు వేదాంతవిషయాలు వివరిస్తుంటే బ్రాహ్మణులు వింటుంటారు. బ్రాహ్మణులు ధైర్యం వీడి శూద్రులకు సేవకులై చేయరాని పనులు చేస్తారు. కలియుగంలో దేవాలయాలు, పవిత్రమైన ఆశ్రమాలు, బ్రాహ్మణ గృహాలు పాడై పోతాయి. అడవులను ధ్వంసం చేస్తారు. వ్యభిచారం, మద్యపానం ప్రబలి పోతాయి. శిష్యుడు గురువును లక్ష్యపెట్టడు. గురువు శిష్యుడిని మోసం చేస్తాడు. కరవు కాటకాలు ఏర్పడతాయి. ప్రజలలో భయం ఏర్పడుతుంది. కలియుగంలో క్రమంగా ధర్మం క్షీణించి అధర్మం వర్ధిల్లుతుంది.

కల్కి అవతారము

మార్చు

ఇలా కలియుగం ఆఖరి దశకు చేరగానే శంబళ గ్రామంలో కల్కి అవతరిస్తాడు. అతని పేరు విష్ణుయశుడు. అతనికి సంస్మరణ చేతనే సకల వేదాలు, శాస్త్రాలు అవగతమౌతాయి. అతను సార్వభౌముడౌతాడు. అతడు అధర్మవర్తనులను సంహరించి ధర్మం నిలబెడతాడు. ఆ పై అశ్వమేధయాగం చేస్తాడు. అతను నిలిపిన ధర్మం అనుసరించి బ్రాహ్మణులు తమ ధర్మం నిర్వర్తిస్తారు. కృతయుగం ఆరంభమౌతుంది. ధర్మం నాలుగు పాదాల విలసిల్లుతుంది. దేవాలయాలు ఆశ్రమాలు పూర్వవైభవం సంతరించుకుంటాయి. సకాలంలో వానలు కురుస్తాయి. పంటలు సమృద్ధిగా పండుతాయి. ప్రజల ఆయుష్షు వృద్ధి చెందుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. తిరిగి కాలచక్రం మొదలౌతుంది. " కనుక ధర్మనందనా ! నీవు బ్రాహ్మణులను అవమానించకు వారికి ఇష్టం వచ్చినవి చేయుము. సమస్త భూతముల యందు దయకలిగి ఉండు. ప్రజలను కన్నబిడ్డలవలె పాలించు. పాపాత్ములను శిక్షించు. అజ్ఞానం ప్రబలకుండా చూడు. అహంకారం వదిలి పెట్టు. ఎల్లప్పుడూ సత్యమే చెప్పు. నీవు భరతవంశ సంజాతుడవు నీకు అన్నీ తెలుసు. ప్రాజ్ఞుడవు నీకు చెప్పవలసిన పని లేదు " అన్నాడు. ధర్మరాజు " మహాత్మా! మీరు ఆనతిచ్చిన ప్రకారం నేను లోభం, మత్సరం లేకుండా ప్రవర్తిస్తాను. ధర్మం ఆచరిస్తాను " అన్నాడు.

పరీక్షిత్తు వృత్తాంతము

మార్చు

ధర్మరాజు " మహర్షీ ! బ్రాహ్మణ ప్రభావం గురించి వివరించండి " అని అడిగాడు. మార్కండేయుడు " పూర్వకాలంలో పరీక్షిత్తు అనే రాజు అయోధ్యను పాలిస్తుండేవాడు. ఆ రాజు అడవిలో వేటాడుతూ ఒక సుందరిని చూసి మోహించి " ఓ సుందరీ ! నీ వెవరు? ఈ అడవిలో ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావు? " అని అడిగాడు. అందుకు ఆ యువతి " నేను అవివాహితను. తగిన వరుని కోసం వెతుకుతున్నాను " అన్నది. అందుకు ఆ రాజు తనను వివాహమాడమని కోరాడు. అందుకు ఆమె అంగీకరించింది. కాని తనను జలవిహారానికి ఎప్పుడూ తీసుకు వెళ్ళకూడదని కోరింది. అందుకు అంగీకరించి ఆమెను వివాహమాడి రాజధానికి తీసుకు వెళ్ళాడు. ఒకరోజు వారు ఉద్యానవనంలో విహరిస్తున్న సమయంలో రాజు కొలనులో స్నానం చేస్తూ ఆమెను కూడా పిలిచాడు. ఆమె అలాగే కొలనులో దిగి అదృశ్యం అయింది. వెంటనే రాజు భటులను పిలిచి ఆ కొలనులోని నీటిని బయటకు పోయించాడు. కొలను అడుగున అసంఖ్యాకంగా కప్పలు ఉన్నాయి. ఆ కప్పలే తన భార్యను మాయం చేసి ఉంటాయని భావించాడు. వెంటనే లోకంలోని కప్పలన్నిటినీ నాశనం చెయ్యమని ఆజ్ఞాపించాడు. సేవకులు రాజు చెప్పినట్లే కప్పలను వెతి వెతికి చంపడం మొదలు పెట్టారు. కప్పల నాయకుడు ఒక మహర్షి రూపంలో రాజు వద్దకు వచ్చి కప్పలను చంపవద్దని అర్ధించాడు. అందుకు రాజు " అవి నా ప్రేయసిని మింగేసాయి అందుకే చంపుతున్నాను " అన్నాడు. కప్పల నాయకుడు " మహారాజా! నేను కప్పల దొరను. ఆమె నా కూతురు. ఆమె నీ లాగే చాలా మందిని మోసం చేసింది " అన్నాడు. పరీక్షిత్తు " ఐతే ఆమెను తెచ్చి నాకు అప్పగించు " అని రాజు చెప్పాడు. ఆ కప్పలదొర తన కూతురును అక్కడకు పిలిపించి ఆమెతో కప్పల నాయకుకుడు " ఎంతో మంది రాజులను మోసగించావు కనుక నీకు పుట్టే బిడ్డలు దుర్మార్గులు, మోసగాళ్ళు ఔతారు " అని శపించాడు. తరువాత వారికి శలుడు, నలుడు, వలుడు అనే ముగ్గురు కుమారులు జన్మించారు. తరువాత ఆ రాజు శలునికి రాజ్యం అప్పగించి తపోవనాలకు వెళ్ళాడు.

వామదేవుడు
మార్చు

ఒకరోజు శలుడు వేటకు వెళ్ళాడు.ఒక మృగం అతని బాణం దెబ్బ తిని పారిపోయింది. రాజు సారధితో ఆ మృగాన్ని వెంటాడమని చెప్పాడు. సారధి రాజా ఆ మృగం చాలా వేగంగా పరుగెత్తింది. మనం ఎంత వేగంతో రథం నడిపినా దానిని చేరలేము. మన గుర్రాలు వామ్య జాతికి చెందినవి అయితేనే ఆ మృగాన్ని పట్టగలము. అలాంతి గుర్రాలు వామదేవుడు అనే మహర్షి దగ్గర ఉన్నాయి " అని అన్నాడు. వెంటనే ఆ రాజు వామదేవుని వద్దకు వెళ్ళి " మునీంద్రా! నేను ఒక మృగాన్ని కొట్టాను. అది దెబ్బతిని పారి పోయింది. ఆ మృగాన్ని పట్టుకోడానికి నీ అశ్వములను ఇవ్వు " అని అడిగాడు. వామదేవుడు " రాజా! ఆ గుర్రాలను తీసుకు వెళ్ళి నీపని కాగానే నాకు తిరిగి ఇవ్వు " అన్నాడు. అలాగే అని చెప్పి శలుడు ఆ అశ్వములను తీసుకు వెళ్ళి మృగాన్ని పట్టుకుని రాజధానికి వెళ్ళాడు. ఇంత వేగం కలిగిన గుర్రాలు రాజుల వద్ద ఉండాలి కాని ఆ మునికి వీటితో పని ఏమి? అనుకుని వాటిని తన వద్దనే ఉంచుకున్నాడు. ఎన్ని రోజులకు రాజు తన గుర్రాలను తిరిగి ఇవ్వక పోవడంతో వామదేవుడు తన శిష్యుడు ఆత్రేయుడిని ఆ గుర్రాలను తీసుకు రమ్మని రాజు వద్దకు వెళ్ళాడు. ఆత్రేయుడు రాజు వద్దకు వెళ్ళి " రాజా! మీరు నా గురువుగారైన వామదేవుని దగ్గర ఉన్న అశ్వములను తీసుకుని తిరిగి ఇవ్వలేదు. వాటిని స్నేహపూర్వకంగా ఇస్తే నేను వాటిని తీసుకు వెళతాను " అన్నాడు. అందుకు శలుడు కోపించి " ఆయన పంపడం నీవు రావడం చాలాబాగుందిలే వెళ్ళు " అన్నాడు. ఆ త్రేయుడు ఆ విషయం తన గురువుకు చెప్పాడు.

శలుడి గర్వభంగము

మార్చు

వామదేవుడు ఆగ్రహించి రాజు వద్దకు వచ్చాడు. " రాజా! నీకు ఇది తగదు. నీవు అప్పుగా తీసుకున్న గుర్రాలను తిరిగి ఇవ్వు. నీ పని అయింది కదా. అప్పుగా తీసుకున్న సొమ్ము తిరిగి ఇవ్వక లోభంతో అలాగే ఉంచుకోవడం పాపం కదా. అలాంటి పాపం చేసిన వాళ్ళూ నరకానికి పోతారు " అన్నాడు. శలుడు " అయ్యా ! విప్రులకు గుర్రాలు ఎందుకు కావాలంటే రెండు ఎద్దులను ఇస్తాను తీసుకుపో. అవి నచ్చక పోతే కంచరగాడిదలను ఇస్తాను కానీ గుర్రాలను మాత్రం ఇవ్వను. ఊరికే ఆశలు పెట్టుకోవద్దు " అన్నాడు. వామదేవుడూ " రాజా ఇది అధర్మం. విప్రుల సొమ్ము తీకుని ఇవ్వననడం, పాపం కాదా " అన్నాడు. శలుడికి కోపం వచ్చింది. " ఈ బ్రాహ్మణుని పట్టి బంధించి శూలాలతో పొడిచి చంపండి " భటులకు ఆజ్ఞాపించాడు. వామ దేవుడికి కోపం వచ్చింది. అతని ముఖం నుండి ఎందరో రాక్షసులు పుట్టుకు వచ్చి రాజును భటులను చంపారు. శులుడు చనిపోయిన తరువాత నలుడు రాజయ్యాడు. వామదేవుడు నలుని దగ్గరకు వచ్చి " రాజా మీరు ధర్మ పరులు నాగుర్రాలను నాకు ఇప్పించండి " అని అడిగాడు. నలునికి కూడా కోపం వచ్చింది " ఈ బ్రాహ్మణుడిని చంపటానికి విషం పూసిన బాణం తెప్పించండి " అని భటులను ఆజ్ఞాపించాడు. అందుకు వామదేవుడు నవ్వి " రాజా! అంతఃపురంలో ఉన్న నీ కుమారుని అది చంపగలదు జాగ్రత్త " అని హెచ్చరించాడు. అంతలో అంతఃపరం నుండి హాహాకారము చేస్తూ చనిపోయిన రాజకుమారుని తీసుకు వచ్చారు. అది చూసి నలుడు కోపంతో ఒళ్ళు మరచి " అహంకారంతో మాట్లాడుతున్న ఈ బ్రాహ్మణుని నేనే సంహరిస్తాను " అని విల్లు ఎక్కు పెట్టాడు కాని అతని రెండు చేతులు విల్లు బాణం స్తంభించి పోయాయి. రాజుకు గర్వం దిగి పోయింది. ప్రజలను చూసి " నా గర్వం అణిగి పోయింది బ్రాహ్మణశక్తి ముందు నా శక్తి పనికిరాదని తెలుసుకున్నాను వామదేవుడికి నమస్కరిస్తున్నాను " అన్నాడు. వామదేవుడు ప్రసన్నమై రాజకుమారుని బ్రతికించి నలుని యధాస్థితికి తీసుకు వచ్చాడు. నలుడు గుర్రాలను వామదేవుడికి తిరిగి ఇచ్చాడు. ధర్మరాజా బ్రాహ్మణుల మహిమ అలాంటిది అని మార్కండేయుడు చెప్పాడు.

ఇంద్రద్యుమ్నుడు

మార్చు

ధర్మరాజు మార్కండేయునితో అయ్యా " అయ్యా! మీరు చిరంజీవులు కదా మీ కంటే వయసులో పెద్ద వారున్నారా? " అని అడిగాడు. మార్కండేయుడు " ధర్మజా! పూర్వం ఇంద్రద్యుమ్నుడు అనే రాజు ఉండే వాడు. అతను చేసిన పుణ్యం కారణంగా చాలా కాలం స్వర్గ సుఖాలు అనుభవించాడు. పుణ్యం క్షీణించడం వలన అతనిని తిరిగి భూలోకానికి వెళ్ళమన్నారు. అతడు నా దగ్గరకు వచ్చి " మహర్షీ నేనెవరో మీకు తెలుసా? " అని అడిగాడు .అందుకు నేను " అయ్యా! మీరెవరో నాకు తెలియదు. హిమాలయాలలో నాకన్నా వయసులో పెద్ద వాడు ఉన్నాడు. అతని పేరు ప్రవార కర్ణుడు అనే గుడ్లగూబ. దానిని అడుగుము " అని చెప్పాను. ఇంద్రద్యుమ్నుడు నన్ను కూడా తనతో రమ్మన్నాడు. నేనే వృద్ధాప్యంతో రాలేనని చెప్పాను. అతను గుర్రం రూపం ధరించి నన్ను తీసుకు వెళ్ళాడు. ఆ గుడ్లగూబను కృడా నన్ను ప్రశ్నించినట్లే ప్రశ్నించాడు. ఆ గుడ్లగూబ కూడా " అయ్యా! నేను నిన్ను ఎరుగను కానీ ఇంద్రద్యుమ్నం అనే కొలనులో నాడీజంఘుడు అనే కొంగ ఉంది. దానికి తెలిసి ఉంటుంది అన్నది. ఇంద్రద్యుమ్నుడు నన్ను గుడ్ల గూబను తీసుకుని నాడీ జంఘుడిని వద్దకు తీసుకు వెళ్ళి నన్ను అడిగినట్లే అడిగాడు. అందుకు నాడీ జంఘుడు " అయ్యా ! నేను కూడా ఎరుగను నా కంటే పెద్ద వాడైన అకూపారుడు అనే తాబేలుకు తెలిసి ఉండచ్చు. దానిని అడగచ్చు " అన్నది. ఇంద్రద్యుమ్నుడు నన్ను, గుడ్లగూబను, కొంగను, తాబేలు వద్దకు వచ్చాడు. తాబేలును కూడా నన్ను అడిగినట్లే అడిగాడు. ఆ తాబేలు " అయ్యా! నేను ఎరుగక పోవడం ఏమిటి. ఆయన మహాత్ముడు గుణవంతుడు ఆయన నన్ను ఎన్నో ఆపదల నుండి కాపాడాడు. ఆయన ఎన్నో యజ్ఞాలు చేసాడు బ్రాహ్మణులకు ఆవులను దానాలు చేసాడు. ఆ యన దానాలు చేసిన ఆవుల గిట్టల రాపిడితోనే ఈ మడుగు ఏర్పడింది " అని చెప్పింది. తాబేలు చెప్పిన మాటలకు దేవతలు స్వర్గం నుండి విమానం తీసుకు వచ్చి " అయ్యా! మీరు పుణ్యాత్ములు మీకు శాశత స్వర్గలోక ప్రాప్తి లభించింది " అని చెప్పారు. ఇంద్రద్యుమ్నుడు " అయ్యా నా మాట ప్రకారం వీరంతా నా వెంట వచ్చారు వీరిని వారి వారి స్వస్థలాలలో వదిలి వస్తాను " అని చెప్పి అందరిని వారి వారి స్థలాలలో దింపి వచ్చి స్వర్గానికి వెళ్ళాడు.

దుంధుమారుడు

మార్చు

ధర్మరాజు మార్కండేయినితో " మహర్షీ! మీ కన్నా వయసులో పెద్దల గురించి చెప్పారు అలాగే ఇక్ష్వాకు వబ్శంలో జన్మించిన కువలయాశ్వునికి ఆ పేరెలా వచ్చిందో వివరించండి " అని అడిగాడు. అందుకు మార్కండేయుడు " ఉదంకుడనే మహర్షి విష్ణువుని గురించి తపస్సు చేసాడు. అతని తపస్సుకు మెచ్చి విష్ణుమూర్తి " ఏమి కావాలో కోరుకో" అని అడిగాడు . ఉదంకుడు " దేవా! నీవు ప్రత్యక్షం కావడం కంటే వేరే వరం ఎందుకు. సదా నా మనస్సు నీపై లగ్నం అయ్యేలా వరమిస్తే అదే చాలు. అన్నాడు. విష్ణువు " ఉదంకా ! నీకు జ్ఞానం సిద్దిస్తుంది అలాగే నీ వలన ఒక మహత్కార్యం సిద్దిస్తుంది. లోకకంటకుడైన దుంధుడు అనే రాక్షస సంహారానికి నీవు సహకరిస్తావు. ఇక్ష్వాకు వంశంలో పుట్టిన కువలయాశ్వునికి నా చేత ప్రసాదించబడిన యోగబలానికి నీ ప్రయత్నం తోడైతేనే సంహరింపబడగలడు. నీవు అతనిని సమాయత్తం చేసి ఈ కార్యం నెరవేర్చి లోకాలకు మేలు కలిగించు " అని చెప్పి మాయమయ్యాడు. ఉదంకుడు తన తపస్సు కొనసాగించాడు. ధర్మజా ! కువలయాశ్వుడు ఇక్ష్వాకు వంశంలో జన్మించిన వాడు. ఇక్ష్వాకు కుమారుడు అనసేనుడు. అతడి కుమారుడు పృధుడు. అతడి కుమారుడు విషగ్వుడు. అతడి కుమారుడు ఆర్దుడు. అతడి కుమారుడు యవనాశ్వుడు. అతడి కుమారుడు శ్రావస్తుడు. అతడి కుమారుడు బృహదశ్వుడు. బృహదశ్వుని కుమారుడూ కువలయాశ్వుడు. కువలయాశ్వునికి ఇరవై ఒక్క వేల కుమారులు ఉన్నారు అందరూ మహా బలవంతులు విలు విద్యలో ఆరితేరిన వారు. బృహదశ్వుడు కువలయాశ్వునికి రాజ్యం ఇచ్చి తపోవనాలకు వెళ్ళాలని అనుకున్నాడు.

ఉదంకుడి కోరిక

మార్చు

ఆ తరుణంలో ఉదంకుడు బృహదశ్వుని వద్దకు వెళ్ళి " రాజా! నీవు అడవులలో ఉండి తపమాచరించే కంటే ప్రజా రక్షణ చేస్తూ రాజ్య పాలన చేయడం మేలు కదా! అలాగైతేనే సాధువులైన మాకు మేలు అధికం. మధుకైటబుల కుమారుడు దుంధుడు మా ఆశ్రమ సమీపంలో తపస్సు చేస్తున్నాడు. దుంధుడు బ్రహ్మదేవుని మెప్పించి వరాలు పొందాడు. అతడు విడిచేగాలికి రేగే ధూమం వలన మేము అనేక అవస్థలు పడుతున్నాము. కనుక నీవు దుంధుడిని సంహరించి మమ్ములను రక్షించాలి అన్నాడు. విష్ణుమూర్తి కూడా ధుంధుడిని సంహరించడానికి యోగబలం అందిస్తానని చెప్పాడు. నీవు ఆరాక్షసుని సంహరించి మాకు రక్షణ కలిగించాలి " అని కోరాడు. బృహదశ్వుడు " మహాత్మా! దుంధుడిని సంహరించడానికి నా కుమారుని పంపుతాను. నాకు తపో వనాలకు వెళ్ళడానికి అనుజ్ఞ ఇవ్వండి " అని కోరాడు. ఉదంకుడు అందుకు అంగీకరించాడు. ఉదంకుని కోరిక ప్రకారం బృహదశ్వుడు కువలయాశ్వుని ధుంధుడిని సంహరించమని పంపాడు. విష్ణుమూర్తి తన యోగశక్తిని కువలయాశ్వునిలో ప్రవేశ పెట్టాడు. కువలయాశ్వుడు ఇసుక తిన్నెలను తవ్వించి అక్కడ నిద్రిస్తున్న రాక్షసుని నిద్ర లేపారు. అతడు వదిలిన గాలి అగ్నిజ్వాలలై కువలయాశ్వుని ముగ్గురు కుమారులు తప్ప అందరినీ చంపింది. కువలయాశ్వుడు ఆ రాక్షసునితో ఘోరంగా యుద్ధం చేసి చివరిగా బ్రహ్మాస్త్రం ప్రయోగించి రాక్షసుని సంహరించాడు. అప్పటి నుండి కువలయాశ్వుడు దుంధుమారుడుగా పిలువబడ్డాడు. అప్పుడు, ఉదంకుడు, దేవతలు, మహర్షులు కువలయాశ్వుని వరం కోరుకొమ్మని అడిగారు. కువలయాశ్వుడు " మహాత్ములారా ! నాకు ఎల్లప్పుడూ విష్ణు భక్తి, బ్రాహ్మణభక్తి, దానం చేసే శక్తి అనుగ్రహించండి " అని వేడుకున్నాడు. అతను కోరిన వరాలు ప్రసాదించి అందరూ తిరిగి వెళ్ళారు.

మధు కైటబులు

మార్చు
దస్త్రం:Death of Madhu Kaitabha.jpg
మధు కైటబుల వధ

కువలయాశ్వుని వృత్తాంతంలో మధుకైటబుల ప్రస్తావన రాగానే ధర్మరాజు మార్కండేయుని మధుకైటబుల గురించి చెప్పమని కోరాడు. మార్కండేయుడు ధర్మరాజుతో " ధర్మరాజా! ముల్లోకాలు జలమయమై ఉండగా విష్ణుమూర్తి ఆది శేషునిపై నిద్రిస్తూ యోగ నిద్ర లో ఉన్నాడు. కొంత కాలానికి మధుకైటబులనే రాక్షసులు విజృంభించి దేవతలను బాధించి చివరకు విష్ణువు నాభి నుండి ఉద్భవించిన బ్రహ్మదేవుని కుడా బాధించారు. బ్రహ్మదేవుని ఆక్రందనతో యోగనిద్ర నుండి మేల్కొన్న విష్ణువు మధుకైటబుల ఆగడాలను విన్నాడు. విష్ణువు మధుకైటబులను చూసి "మధుకైటబులారా! మీ బలపరాక్రమాలకు మెచ్చాను. ఏమి వరం కావాలో కోరుకోండి " అని అడిగాడు. అందుకు వారు గర్వంతో "మేమే నీకు వరాలు ఇస్తాం ఏమి కావాలో కోరుకో " అని చెప్పారు. విష్ణుమూర్తి మధుకైటబులారా! నేను వరాలు కోరుకుంటున్నాను ఆడిన మాట తప్పక నాచే మృత్యువును పొంది లోకాలకు ప్రీతి కలిగించండి " అన్నాడు. అందుకు వారు "దేవా! మేము ఆడిన మాట తప్పము మేము ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధం అయితే జలం లేని చోట మమ్ములను సంహరించండి " అన్నారు. ఆ సమయంలో ముల్లోకాలు జలమయమై ఉన్నాయి కనుక విష్ణువు వారిని తన తొడపై కూర్చుండబెట్టి చక్రాయుధంతో సంహరించాడు.

మూలాలు

మార్చు

బయటి లింకులు

మార్చు